[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘రేపటి సూర్యోదయం కోసం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


పూలు వికసిస్తాయి..
వికసించి వాడిపోతాయి!
మళ్ళీ చెట్టు కొమ్మలు చిగురులు తొడిగి
కుసుమాలు విరబూస్తాయి!
తదుపరి వాడిపోయి రాలిపోతాయి..
ఇది నిరంతర ప్రక్రియ!
కానీ.. నా వేదనాభరిత హృదయం
శోకంతో రగిలిపోతోంది!
నీ వియోగ విరహాగ్ని జ్వాలలు
నా గుండె గోడలపై ఎగిసి పడిన వేళ..
గాయపడిన నా మనసు లోతుల్లో
విషాదం మచ్చ ఏర్పడగా..
దానిని తుడిచేయడం
నావల్ల కావడం లేదు ప్రేయసీ!
అయినా రేపటి సూర్యోదయంపై
అంతులేని నమ్మకాన్ని పెంచుకున్నాను!
నా జీవన శోక సాగరాన్ని దాటి
ఆవలి తీరంలోని
ఆనంద నందనంలో
నీతో కలసి ప్రేమ గీతం
పాడుకుంటానని..
నా శిథిల హృదయం
నీ రాకతో
మహా సౌధమై అలరారుతుందని..
రేపటి సూర్యోదయంపై గొప్ప ఆశ!
ఆ సుమనోహర ఘడియలలో
మన ప్రేమ పూదోట పరవశించి
వసంత పవనాలు వీయగా..
హృదయతంత్రులను మీటి
వలపు గానం వినిపిస్తావు కదూ!

శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.