[జె. శ్యామల గారి ‘సాహిత్యంలో స్వప్న సృజన!’ అనే రచనని అందిస్తున్నాము.]
‘కల’ రెండక్షరాల మాటే కావచ్చు కానీ అది ఓ అద్భుతం.. అది ఓ వి‘చిత్రం’. అసలు కలలు కనని మనిషే ఉండడేమో. కలలలో మంచి, చెడు.. రెండు రకాలు ఉన్నాయి. చెడ్డ కలలనే ‘పీడ కలలు’గా వ్యవహరిస్తుంటాం. మంచి కల అయితే ఆనందిస్తాం.. పీడకల అయితే ఎక్కడ నిజమవుతుందో అని కలవరపడడం నిజం. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని భావిస్తుంటారు. పగటి నిద్ర చేటు అని, పనిలేని వారే పగటి కలలు కంటూ కాలం వ్యర్థం చేస్తుంటారని భావించడమూ కద్దు. మరి నిత్య జీవితంలో ఇంత ప్రాముఖ్యత ఉన్న కలలు సాహిత్యంలో సాక్షాత్కరించే తీరును అవలోకిస్తే..
రామాయణంలో భరతుడి కల, త్రిజట స్వప్నము ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ఒకటి పీడ కల అయితే, మరొకటి సీతకు శుభాన్ని, రావణుడికి, లంకకు అశుభాన్ని సూచించే కల. రామాయణంలో కథాపరంగా ముందు భరతుడి కలే వస్తుంది కాబట్టి దాని గురించి ముందుగా..
దశరథుడు శ్రీరామ పట్టాభిషేకం ప్రకటించిన సమయానికి భరతుడు అయోధ్యలో లేడు. తాత గారి వద్ద ఉన్నాడు. అదే రోజు రాత్రి భరతుడికి ఓ పీడకల వచ్చింది. దాంతో భరతుడెంతో కలత చెందాడు. ఏమి ఆపద రానున్నదో అని వ్యాకులపడుతుంటే యువరాజు స్నేహితులు కారణం అడగగా తన కలను వివరిస్తాడు. ఆ కలలో తండ్రి దశరథుడు పర్వతం మీద నుంచి కింద పడిపోయి, పేడతో నిండిన పెద్ద బిలంలో పడిపోయారని.. అందులో తేలుతూ, నూనెను దోసిళ్లతో తాగుతున్నారని, ఆ తర్వాత నూనెని ఒంటినిండా పూసుకుని, తలని కిందకి వాల్చేసి కనిపించారని, అంతేగాక ఆశ్చర్యకరంగా ఎండిపోయి భూమిలా ఉన్న సముద్రం, భూమి మీద పడిపోయిన చంద్రుడు, బద్దలైన భూమి, గాడాంధకారం చూసానని చెప్పాడు. అంతేగాక, రాజుగారి గజానికి ఉండే దంతం విరిగిపోయింది, దశరథుడు ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్ర చందనం, ఎర్ర మాలలు ధరించి, ఒక ఇనుప పీటపై కూర్చుని పూజ చేసుకుంటుండగా ఎక్కడినుంచో నలుపు, ఎరుపు వస్త్రాలు ధరించిన స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వసాగారని, ఆపైన దశరథుడు గాడిదలు పూన్చిన రథం ఎక్కగా, ఆ స్త్రీలు ఆయన మెడలో పాశాలు వేసి, ఆ రథాన్ని ఈడ్చుకుంటూ వెళ్తున్నట్లు కనిపించిందని చెప్పాడు.
ఇలా తెల్లవారుజామున ఎవరైనా గాడిదల రథం మీద కూర్చున్నట్లు కనిపిస్తే, వారు చితి మీద ఉండగా, ఆ శరీరం కాలిపోతుంటే ఆ ధూమాన్ని కొద్ది రోజులలోనే చూడవలసి వస్తుందని, అందుకే తనకు, తండ్రిపై బెంగగా ఉందని, తన మీద తనకు అసహ్యం వేస్తున్నదని, ఏదో ప్రమాదం జరిగిందనిపిస్తోందని భరతుడు చెప్పాడు.
అతడు భయపడ్డట్లుగానే ఆ తర్వాత దుస్సంఘటనలు.. కైక కోరరాని వరాలు కోరడం, రాముడి వనవాసం, దశరథుడి మరణం.. జరగడం తెలిసిందే.
ఇక త్రిజట స్వప్నము.. అశోకవనంలో సీతకు కావలిగా ఉన్న రాక్షస వనితలలో వృద్ధురాలు త్రిజట. ఒకరోజు రాక్షస వనితలు, సీతను తమ మాటలతో, బాధిస్తూ, బెదిరిస్తూ ఉండగా త్రిజట వచ్చి, వారిని మందలించి, దూరంగా పొమ్మని గద్దిస్తూ, తనకో కల వచ్చిందని ఇలా వివరిస్తుంది.. ‘తెల్లటి దంతపుటేనుగు, ఆకాశంలో వేయి హంసలు లాగే పల్లకి, శ్వేత వస్త్రాలు ధరించిన రాముడు, లక్ష్మణ సమేతంగా కనిపించారు. సీత అందమైన తెల్లటి చీరె ధరించి, పాల సముద్రంలో, రాముడితో ఉండగా చూశాను. నాలుగు దంతాల కొండలాగా ఉన్న ఏనుగుపై రామలక్ష్మణులు వెళ్ళటం చూశాను.. చంద్రముఖి సీతాదేవి భద్రజాతి ఏనుగుపై కూర్చుని, లంకపై ఆకాశాన ఉన్నట్లు చూశాను.. సూర్యకాంతితో విరాజిల్లే పుష్పక విమానంలో రామలక్ష్మణులు, ఉత్తర దిశగా సీతతో వెళ్ళడం కనిపించింది. ఇది నిజమవుతుందనిపిస్తోంది’ అంది. అంతేకాదు, రావణుడు ఒంటికి నూనె పూసుకుని, నూనె తాగుతూ, మెడలో గన్నేరు పూదండలతో, ఎర్ర గంధం పూసుకుని, నూనె తాగుతూ, గాడిదలు కట్టిన రథం మీద పోతూ, కింద.. బురదలో పడిపోయాడు. ..కాళి అనే స్త్రీ ఎర్రని గుడ్లతో.. రాక్షస రాజును దక్షిణ దిక్కుగా ఈడ్చుకు పోవడం చూశాను.. అంటూ మరెన్నో వివరాలు చెపుతుంది. అది విని రాక్షస స్త్రీలు భయపడితే, సీత మనసుకు ఊరట కలిగింది. ఆ తర్వాత త్రిజట కల నిజమయింది కూడా.
ఇక భాసుడు రచించిన ‘స్వప్న వాసవదత్త’ నాటకం ప్రత్యేకమైంది. ఇందులో ఉదయన మహారాజుకు, వాసవదత్తతో వివాహమైనా, రాజకీయ కారణాల వల్ల అతడు మరొక రాకుమారిని వివాహం చేసుకోవలసి ఉందని, అందుకు మంత్రి యౌగంధరాయణుడు ఒక యుక్తి పన్నుతాడు. దాని ప్రకారం వాసవదత్త అగ్నిప్రమాదంలో మరణించినట్లుగా నటించి, అంతఃపురంలోనే అజ్ఞాతంగా ఉంటుంది. ఉదయనుడికి మాత్రం ఇవేవీ తెలియవు. ఓ రోజు ఉదయనుడు, ప్రియ పత్ని వియోగంతో బాధపడుతూ ఉద్యానవనంలో విశ్రమిస్తాడు. అంతలో అతడికి నిద్రపడుతుంది. ఆ నిద్రలో వాసవదత్త అక్కడికి వచ్చినట్లు కల.. అయితే ఆ సమయంలో వాసవదత్త నిజంగానే అక్కడికి వస్తుంది. కలగంటూ పలవరిస్తున్న ఉదయనుడు ఆమె చేయి పట్టుకుంటాడు. ఆమె వదిలించుకు వెళుతుంది. ఊహించని పరిణామాలతో ఉత్కంఠగా సాగి, నాటకం సుఖాంతం అవుతుంది. కలలో కనిపించిందనుకున్న వాసవదత్త చివరకు నిజంగానే ప్రత్యక్షం కావడం వల్లనే నాటక నామం ‘స్వప్న వాసవదత్తం’ అయింది.
మహాకవి గురజాడ ‘లవణరాజు కల’ అనే పద్య కావ్యం రచించారు. దీనికి మాతృక వాల్మీకి రచనగా భావిస్తున్న ‘యోగ వాశిష్ఠం’ అయినప్పటికీ తన సొంత భావాలకు అనుగుణంగా ఈ కావ్యాన్ని రచించారు గురజాడ. ఇందులో.. లవణ రాజు ఓ రోజు కొలువుతీరి ఉండగా, ఇంద్రజాలికుడు వచ్చి, తన గారడీతో ఓ అద్భుత గుర్రాన్ని సృష్టించి, రాజును దాన్ని స్వారీచేసి చూడమంటాడు. లవణరాజు దానిపై ప్రయాణిస్తూ, అడవిలో పడి, చెట్టు తీగె కిందకు వాలడం వల్ల, ప్రయాణ బడలిక వల్ల నిద్రపట్టడం, అందులో ఓ కల ..
సంధ్యా సమయం. లవణరాజుకు మధురగీతం వినిపించి అటువైపు వెళ్లగా ఓ సుందరి కనిపించింది. ఆమెపై మక్కువతో, ఆమెను వివాహం చేసుకుని ఆ మాలపల్లెలోనే ఉన్నాడు. అంతలో పిల్లనిచ్చిన మామ మరణించాడు. మాలవాడలో పరిస్థితులు విషమించడంతో వారు అడవి చేరి, ఇద్దరూ చితిలో దూకారు. అంతలో లవణరాజుకు మెలకువ వచ్చింది. తన స్వప్న సుందరిని తలుచుకుని, విచారిస్తుండగా, ఆమె నిజంగానే విచ్చేయడం.. అద్భుతం.. ఆశ్చర్యం.. దీనిని గురజాడ ఎంతో కౌశలంతో రచించారు. అస్పృశ్యతా నివారణ లక్ష్యంగా రాసిన కావ్యం ఇది.
భక్త పోతన తన మహా భాగవతంలో యశోదకు, చిన్ని కృష్ణుడు నోరు తెరిచి, పదునాలుగు లోకాలు చూపిన సందర్భంలో యశోదతో..
‘కలయో, వైష్ణవ మాయయో
యితర సంకల్పార్థమో..’
అని పలికిస్తారు.
అన్నమాచార్యుల వారు
‘కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఎల్ల లోకములకు అప్పడగు
తిరువేంకటాద్రీశుగంటి..’
అంటూ పరవశించారు.
ఎన్నో కథల్లో భగవంతుడు, భక్తులకు కలలో కనిపించడం మనకు తెలిసిందే. భక్త రామదాసు కథలో అయితే ఆయనను రక్షించడానికి, రామలక్ష్మణులు తానీషాకు కలలో కనిపించి, కప్పం పైకం చెల్లిస్తారు.
శ్రీకృష్ణదేవరాయలు జైత్ర యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం వెళ్ళినప్పుడు, అక్కడి దైవం ఆంధ్ర మహావిష్ణువు, రాయలకు కలలో కనపడి, ‘దేశ భాషలందు తెలుగు లెస్స కాబట్టి తెలుగులో ప్రబంధ రచన చేయమనడంతో, రాయలు ‘ఆముక్త మాల్యద’ కావ్యాన్ని రచించాడు.
సినీగీత సాహిత్యంలో అయితే కలలకు సంబంధించి పాటలు కోకొల్లలు.
మాయాబజార్ చిత్రంలో..
‘నీవేనా నను తలచినది పాటలో..
కలలోనే ఒక మెలకువగా
ఆ మెలకువలోనే ఒక కలగా
కలయో, నిజమో, వైష్ణవ మాయో
తెలిసీ తెలియని అయోమయంలో..’
అందమైన భావ వ్యక్తీకరణ .
గుండమ్మ కథ చిత్రంలో పింగళి వారి పాట..
‘సన్నగ వీచే చల్ల గాలికి
కనులుమూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపుపై ఆ
కలలో వింతలు కననాయే
అవి తలచిన ఏమో సిగ్గాయే..’
నాయక మనః స్థితికి చక్కని అక్షర దర్పణం.
అలాగే డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని ఆత్రేయ గారి గీతం..
‘నీవు లేక వీణ పలుకలేనన్నది
నీవు రాక రాధ నిలువలేనన్నది..
కలలనైన నిన్ను కనుల చూతమన్న
నిదుర రాని నాకు కలలు కూడ రావే..’
కలలకు కూడా దూరమయ్యాననే నాయిక భావన ఎంతో బాగుంటుంది.
ఇక తూర్పు పడమర చిత్రంలో సినారె గారు
‘స్వరములు ఏడైనా. రాగాలెన్నో .. పాటలో
కనులున్నందుకు కలలు తప్పవు
కలలున్నపుడు పీడ కలలు తప్పవు
కలల వెలుగులో కన్నీరొలికే..
కలతల నీడలు ఎన్నెన్నో..’ అంటారు.
ఇవి మచ్చుకే..
ఆధునిక కథలు, నవలల్లో సైతం కలలకు కొదువేమీ లేదు. కలలకు సాధ్యం కానిదేదీ లేదు. అందుకే కొన్ని కథల్లో.. కథంతా నడిచాక, చివరకు అంతా ‘కల’ అని ముగిస్తుంటారు. ఏమైనా సాహిత్యంలో స్వప్న సృజన సాటిలేనిది.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.
9 Comments
Guru Prasad
From J GuruPrasad
Excellent narration by Smt Syamala garu regarding dreams
From J GuruPrasad
GNMURTY
కల గురించి బాగా రాసారు.కలలు కనని వారంటు ఉండరు.చాలా మంది కలల్లో విహరిస్తో ఉంటారు.
కల మీద వ్రాసిన ఈ వ్యాసం కలం బలాన్ని చూపి
రచనా వస్త్రంపై ‘కలం’కాపీ తనాన్ని చూపించింది.రచయిత్రి గారికి అభినందనలు
GNMURTY
కలంకారీ తనాన్ని చూపించింది
Shyamkumar... Nizamabad
సరళం గా ,తీయ ని వ్యాసం.
కొల్లూరి సోమ శంకర్
*ఇది జె. శ్యామల గారి స్పందన*
మీకు నా వ్యాసంనచ్చినందుకు ధన్యవాదాలు శ్యామ్ కుమార్ గారు.
శ్యామల జె
పుట్టి నాగలక్ష్మి
కలల గురించి ఇతిహాస, ప్రాచీన, మధ్య యుగ, భక్తకవుల, వాగ్గేయకారుల కలలను తీసికొని.. సినీ కవుల కలలగీతాలని సమ్మిళితపర్చిన మంచి వ్యాసం. శ్యామల గారికి అభినందనలు
కొల్లూరి సోమ శంకర్
*ఇది జె. శ్యామల గారి వ్యాఖ్య*
మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు పుట్టి నాగలక్ష్మి గారు.
శ్యామల జె
Dr.Chivukula Nagamani
The writer illustrates well how poets, dramatists, composers and lyricists explored limitless possibilities of writing within dream setting for narrative purpose with an impressive selection of dream literature of ancient and modern times including cinema songs. Congratulations to Smt.Syamala.
Dr.Chivukula Nagamani
ఇలపావులూరి వెంకటేశ్వర్లు
మనుషులకు అత్యంత సహజమైన కలల గురించి పురాణాల నుండి సినిమాల వరకు కలుపుతూ చక్కగా వివరించిన రచయిత్రి శ్రీమతి శ్యామల గారికి అభినందనలు