[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘సత్సంగత్వే నిస్సంగత్వం!’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]


బోళా శంకరుడు కోలా సత్యనారాయణ రాకతో ఆనాటి సత్సంగానికి వింత శోభ వచ్చింది. ఎప్పుడూ సంసారం గొడవే గానీ సత్సంగం వూసెత్తని బెల్లంకొండ వెంకటరమణ మూర్తి, సుబ్బలక్ష్మి దంపతులు కూడా ఆనాటి సత్సంగానికి వింత ఆకర్షణ!
దక్షిణామూర్తి వటవృక్షము ఎదురుగా వున్న మామిడి చెట్టు మీద వున్న కోకిల మధురంగా, శృతి శుభ్రంగా కూస్తుంది. ఆ దగ్గరలోనే గోవుల్ని మేపుతున్న పల్లా వీరబాబు కోకిల గానానికి కోరస్ పాడుతున్నాడు. స్వామిని సద్విద్యానంద సరస్వతి వచ్చి వారి ఆసనంలో ఆశీనులయ్యారు. గణేశ స్తోత్రం, శాంతి ప్రార్థనలతో ప్రారంభమయిన సత్సంగం ప్రశ్నోత్తరాల కార్యక్రమం. సభ్యుల సందేహాలకు మాతాజీ, నేనూ, మా సువర్ణలక్ష్మీ సందేహ నివృత్తి చేస్తున్నాము.
“అరిషడ్వర్గము, షడూర్ములు అంటే ఏమిటి?” రొంగల భారతమ్మ ప్రశ్న.
“కామము, క్రోధము, లోభము, మోహము, మధము, మాత్సర్యములు అరిషడ్వర్గాలు: ఆకలీ దప్పిక, శోకము, మోహము, వార్దక్యము, మరణములు షడూర్ములు” సువర్ణలక్ష్మీ.
“భయం అంటే ఏమిటి?” బ్రహ్మచారిణి శ్రీ లక్ష్మీ చైతన్య ప్రశ్న.
“ఒత్తిడి యొక్క ఉత్పత్తి భయం, అది నీ మనసు చేసే మాయ” చెప్పారు సువర్ణ లక్ష్మీ.
“జగత్తు అంటే ఏమిటి? ఎందుకు దాన్ని మిథ్య అంటారు?” నూలు నారాయణ ప్రశ్న
“ఏది వున్నట్టుగా కనిపిస్తుందో దానిని నీవు చూస్తావు. తాడులో పామునూ, నీ ఎదుట నున్న ఈ నామ రూప ప్రపంచాన్నీ కూడా, దాన్ని నీవు నిజమని నమ్ముతావు. ఆ పామూ నీదే, ఆ జగత్తు నీదే! నీ లోపల వున్న దానినే నీవు బయట చూస్తున్నావు. వెలుతురులో తాడులో పాము లేదని గ్రహిస్తావు. నీలో జ్ఞానం ఉదయిస్తే నీవు తప్ప రెండోది ఏది లేదనీ, ఈ జగత్తు కూడా ఆ పాము లాంటిదే అని గ్రహిస్తావు. అందుకే అందరూ జ్ఞానం కోసం సాధన చెయ్యాలి” వివరించాను.
“ఒకరిని ఒకరు మోసం చేసుకోవడానికే ఈ జగత్తు వున్నదా?” సుబ్బలక్ష్మి ప్రశ్న.
“మోసం అనే మాట ఈ జగత్తులో లేదు. అది నీ మనసు లోనే వుంటుంది. నిన్ను నీవు తప్ప మరెవరూ మోసం చేయలేరు. ఎలా అన్న ఎరుక కలగడానికి సాధన చెయ్యాలి” సువర్ణలక్ష్మీ జవాబు.
“నీటిలో వుండే చేపకు దాహం వేస్తుందా?” బెల్లంకొండ వెంకటరమణ మూర్తి ప్రశ్న.
“షుగర్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు డయాబెటిక్ కాకూడదా?” ఎదురు ప్రశ్న వేసాను.
“అందరినీ ప్రేమించడం అంటే ఏమిటి?” సువర్ణ లక్ష్మీ ప్రశ్న.
“ఎవరినీ ద్వేషించక పోవడం!” సద్విద్యానంద సరస్వతి.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగించి సమస్యలు – పరిష్కారాల కార్యక్రమం చేపట్టాము.
అప్పుడు లేచి నిలబడ్డారు కోలా సత్యనారాయణ. నిలబడి సమస్య చెప్పడం ఆయన సంస్కారం!
“అయ్యా! రెడ్డి గారూ! నాది ఒక చిన్న సమస్య. నేను నా కాళ్ళ శక్తితో ఈ నేల మీద నిలబడ్డానా? లేక.. ఈ భూమి నన్ను నిలబెడుతుందా?” ప్రశ్నించి కూర్చున్నారు కోలా వారు.
నాకు మైండ్‌లో బాంబ్ బ్లాస్ట్ అయినట్టయి మాతాజీ వైపు చూసాను. మాతాజీ చిన్నగా నవ్వి “చెప్పండి” అన్నారు సానుభూతితో!
ఇలాంటి ఒక అద్భుతమైన ప్రశ్న ఎదురవుతుందని ఎప్పుడూ వూహించలేదు మేము.
“ఇది సింపుల్‌గా జవాబు చెప్పగలిగే ప్రశ్న కాదు. ఇది భౌతిక శాస్త్రం, శరీర శాస్త్రం, తత్త్వ శాస్త్రాలను సమన్వయ పరచి జవాబు చెప్పాలి. అసలు ఇలాంటి ప్రశ్న అడగాలని ఎందుకనిపించిందో చెప్పండి ముందు?” ఎదురు ప్రశ్న వేశాను.
“చిన్నప్పుడు నేను చాలా బలంగా వుండేవాడిని. బాడీ బిల్డింగ్ చేసి కండలు పెంచాను. నేను పాలిటెక్నిక్ చదిన మూడు సంవత్సరాలు నన్ను ‘మిస్టర్ పాలిటెక్నిక్’ గా కీర్తించారు. ఈ జగత్తును నేను జయించాను, నాకిక తిరుగు లేదని విర్రవీగాను. ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. నా భార్య కాలం చేసింది. నేను ఈ ఆశ్రమానికి చేరాను. పూటకు గుప్పెడు మాత్రలు మింగుతూ ఎనభైవ వడిలో పడ్డాను. యవ్వనంలో పెంచిన కండలు లేవు. నడవడానికి కర్ర సాయం అవుతుంది. ఒకప్పటి నా ఆకారం ఫోటోలలో మాత్రమే వుంది. ఈ మధ్య బాత్ రూంలో జారిపడ్డాను. చేతికి ఈ సిమెంటు కట్టు అలంకారంగా వచ్చింది. అప్పుడు నాకు అనుమానం కలిగింది. ఈ భూమి మీద నేను నిలబడ్డానా? లేక ఈ భూమి నన్ను నిలబెడుతుందా? అని. అందుకే అడిగాను దయ చేసి వివరించి నా అనుమానం తీర్చండి” అంటూ అడిగారు కోలా సత్యనారాయణ.
“ఓకే! మొదటి విషయం ప్రతి మనిషీ కూడా ఈ భూమి మీద తన స్వశక్తితో నిలబడ్డానని భ్రమ పడుతుంటాడు! భూమి తనను నిలబెడ్తుందని అనుకోడు. భూమికే గనుక ఆ గురుత్వాకర్షణ శక్తి లేకుంటే మనిషే కాదు, ప్రతి జీవి శూన్యంలో వ్రేలాడుతూ వుండాల్సిందే. భూమి తన ఆకర్షణ శక్తితో ప్రతి జీవిని తనపై నిలబడనిస్తుంది, నడవనిస్తుంది, గెంతులు కూడా వేయనిస్తుంది. కానీ మనిషి తన కాళ్లపై తాను నిలుచున్నానని, నడుస్తున్నానని, గెంతులు వేస్తున్నానని భ్రమ పడుతుంటాడు! ఈ విషయం భౌతిక శాస్త్రం స్పష్టపరుస్తోంది. ఇక రెండో విషయం మనిషి పసితనంలో తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకుంటాడు. పడతూ – లేస్తూ పరుగు నేర్చుకుంటాడు. వయస్సు వచ్చే కొలదీ ఈ చర్య లో ‘ధృతి’ (steadiness) పెరుగుతుంది. ఉదాహరణకు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకొనేటప్పుడు అనేక సార్లు క్రింద పడతాడు. ఆ విద్యలో ‘ధృతి’ పెరిగాక చక్కగా సైకిల్ బ్యాలన్స్ చేయగలుగుతాడు. నడకా, పరుగూ కూడా అలాగే!
వార్ధక్యo వచ్చాక, అంటే అరవై దాటాక అదే ‘ధృతి’ తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ చిన్నప్పటిలా తప్పటడుగులు పడతాయి. కర్ర వూతం కావాల్సి ఉంటుంది. అప్పటికి శరీరంలో ప్రతీ అవయవమూ ముఖ్యంగా ఎముకలు బలహీనపడి వుంటాయి. కాలు జారిపడి పోవడం, ఎముకలు విరిగి పడిపోతూ వుంటారు. రికవరీ శాతం చాలా తక్కువ!
ఇక పోతే మూడవ విషయం తత్త్త్వ శాస్త్రానికి చెందింది. ప్రతీ మనిషీ తన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు తన సొంతం అనుకుంటాడు! తన చేతులు భగవంతుని చేతులనీ, తన కాళ్ళు భగవంతుని కాళ్లనీ, అవి తనకు గత కర్మ ఫలాలు అనుభవించడానికి ఇవ్వబడ్డాయని భావించడు. ‘సహస్ర శీర్షా పురుష: సహస్రాక్ష సహస్ర పాత్’ అంటూ పురుష సూక్తంలో వేదం చెప్పిన విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు. భగవంతుడు ఎక్కడో వైకుంఠం లోనో, కైలాసం లోనో వుంటాడని, అతనికి వేయి శిరస్సులు, వేయి కాళ్ళూ చేతులు ఉంటాయనీ అనుకుంటాడే గానీ ఈ జగత్తులో వున్న ప్రతి కాలు, ప్రతి చేయి ఆ భగవంతునివేనని భావన చెయ్యడు! తనకూ దేవుడికీ మద్య పెద్ద అగాధాన్ని సృష్టి చేసుకుంటాడు. నా శిరస్సు భగవంతుడిది, నా కాళ్ళూ చేతులూ, ప్రతీ అవాయవమూ ఆ దేవ దేవుడివి. నేను ఆ పరమేశ్వరుని ప్రకటన రూపాన్ని అని తెలుసుకొని జీవిస్తే ఎంత బావుంటుందో! అదే మోక్షం అంటే! ఆలోచించండి! అందరూ ఆ దిశగా భావించడానికి అలవాటు పడి జీవిస్తే ఇక జీవితంలో భయం గానీ, బాధ గానీ ఎక్కడ వుంటాయి? అదే క్షణంలో నీవు ముక్తుడవయి పోతావు. తెలుసుకో మనిషీ.. తెలుసుకో..” అంటూ నా వివరణ ముగించాను చాలా ఉద్వేగంగా!
ఆ వివరణకు మాతాజీతో పాటు అక్కడ వున్న అందరూ మనస్ఫూర్తిగా అభినందించారు!
బెల్లంకొండ వెంకటరమణ మూర్తి దంపతుల వైపు చూసి “మీ సమస్య ఏంటి చెల్లెమ్మా?” అంటూ అడిగాను సుబ్బలక్ష్మిని.
“ఏమి చెప్పమంటారు అన్నయ్యా! యీయన గారితో వేగలేక చస్తున్నాను” అంది బెల్లంకొండను చూపిస్తూ.
“అంటే బావ ఇబ్బంది పెడుతున్నాడా?” అడిగాను.
“మామూలుగా కాదు ఒకటే నస! నా వంటి మీద ఉన్న నగలు తప్పించి మిగిలినవి బ్యాంక్ లాకర్లో వున్న నగలన్నీ అమ్మేస్తానన్నారు” సుబ్బలక్ష్మి.
“ఎందుకట?” అడిగాను.
“ఆశ్రమంలో అన్నదానానికి విరాళంగా కట్టేస్తానని బెదిరిస్తున్నారు” సుబ్బలక్ష్మి.
“మంచి పనేగా! అయినా నీ దగ్గర ఏం నగలున్నాయ్?” అడిగాను.
“చాలా వున్నాయి. నెక్లెస్‌లు, హారాలు, పాపిడ బొట్టు, నాగారం, భుజ కీర్తులు, వడ్డాణం, ఉంగరాలు, గాజులు అలా రెండు కేజీల బరువు వున్న నగలు బ్యాంక్ లాకర్లో వున్నాయి” గర్వంగా అంది సుబ్బలక్ష్మి.
“చెల్లాయ్! నీకు వడ్డాణం వుందా? ఎప్పుడూ పెట్టుకొలేదేమి?” బంగార్రాజు.
“వుందన్నయ్యా! మా పెళ్ళి అయిన కొత్తలో మీ బావ కొన్నారు. అప్పట్లో నా నడుము వున్నట్టా, లేనట్టా అన్నంత సన్నగా వుండేది. ఇప్పుడా వడ్డాణం నా మోచేయి పై దండ కడియంగా కూడా సరిపోవటం లేదు. బాంక్ లాకర్లో భద్రంగా దాచాను!” అంది సుబ్బలక్ష్మి.
ఆ మాటలకు చిన్నగా నవ్వుకున్నారు మాతాజీ!
“అదే బావా మా ఇద్దరి సమస్య. లాకర్లో మూలిగే ఆ బంగారం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అమ్మేసి ఏవైనా ధర్మ కార్యాలు చేద్దామంటే మీ చెల్లి ససేమిరా తన నగలు అమ్మడానికి ఒప్పుకోవడం లేదు” అంటూ తన వాదన వినిపించాడు బెల్లంకొండ వెంకటరమణ మూర్తి.
“చూడండి! మీరందరూ నా మాటలు శ్రద్ధగా వినండి. వ్యర్థంగా మూలన పడి వున్న ‘బంగారం’ అమ్మేసి మంచి పనులకు ఉపయోగిద్దా మంటున్నాడు బావ. తన ‘నగలు’ అమ్మడానికి ఎంత మాత్రం వీల్లేదంటుంది చెల్లాయి. అదే గదా వీళ్ళ సమస్య. బావ దృష్టి కోణంలో అది ‘బంగారం’ మాత్రమే. కానీ చెల్లాయి దృష్టి కోణంలో అవి ‘నగలు’. అనేక నామ రూపాలుగా వున్న నగలు. స్త్రీలకు ఎంతో మక్కువైన ఆభరణాలు! ఈ వివాదంలో మీ ఇద్దరికీ అనుకూలమైన పరిష్కారం చాలా కాలం క్రితం స్వామీ చిన్మయానంద మారాజ్ ఇచ్చి వున్నారు! ఆ ప్రకారం చేస్తే మీ సమస్య పరిష్కారం ఔతుంది” చెప్పాను.
“అదేంటో వెంటనే చెప్పు అన్నయ్యా! టెన్షన్ భరించలేక చస్తున్నాను” అంది సుబ్బలక్ష్మి.
“వెరీ సింపుల్ అమ్మా! నీ అభరణాలన్నీ నీ దగ్గరే వుంచేసుకో. బావకు ఇవ్వవద్దు!” అన్నాను కూల్‌గా.
“చాలా థాంక్స్ అన్నయ్యా!” అంది ఉద్వేగంగా.
“కానీ.. నీ నగలన్నీ నీవే అట్టిపెట్టుకొని.. బావకు కావాల్సిన ఆ నగల్లోని ‘బంగారం’ మాత్రం బావకు ఇచ్చి వేసెయ్!” మెల్లగా పేల్చాను బాంబు.
“ఆ!!!” అంటూ స్పృహ తప్పి పడిపోయింది మిస్సెస్ సుబ్బలక్ష్మి బెల్లంకొండ!!!
– స్వస్తి –

2 Comments
P V Prabhakar
The vedantic story ” Satsangatve Nissangatvam” by Sri N V Reddy Garu conveys a powerful message about the importance of satsang in realising life’s truth. It emphasizes that meaningful questioning rather than blind belief is essential for understanding the deeper realities. The writer skilfully blends Upanishadic wisdom with scientific principles leading readers to the concept of Viratpurusha, the supreme God. The story offers valuable insights. Thanks to the writer for sharing a valuable story.
A B Kameshwara Rao
Essence of the story is well explained and some critical points have been dealt with good reasoning
Thank u sir for publishing such useful material