(తతః ప్రవిశతి లేఖ మలఙ్కరణస్థగికాం ముద్రితా మాదాయ సిద్ధార్థకః)
(తతః=ఆ మీదట,లేఖం=ఉత్తరాన్నీ, ముద్రితాం+అలఙ్కరణ+స్థగికాం=ముద్ర వేయబడిన నగల పేటికను, ఆదాయ=తీసుకుని, సిద్ధార్థకః+ప్రవిశతి=సిద్ధార్థకుడు వస్తున్నాడు.)
హీ హీమణహే హీమణహే. (ఆశ్చర్య మాశ్చర్యమ్.)
ఆశ్చర్యం, ఆశ్చర్యంగా, ఉంది.
బుద్ధిజలణి జ్ఝరేహిం
సించంతీ దేసకాలక ల సేహిం
దంసిస్సది కజ్జఫలం
గురుఅం చాణక్కనీదిలదా. – (1)
(బుద్ధిజలనిర్ఝరై స్సిచ్యమానా దేశకాలకలశైః
దర్శయిష్యతి కార్యఫలం గురుకం చాణక్యనీతిలతా.)
దేశ+కాల+కలశైః=ప్రదేశం, వేళ అనే కుండలతో, బుద్ధిజల+నిర్ఝరైః=బుద్ధి అనే నీటి వెల్లువలతో, సిచ్యమానా=తడుపబడుతున్నదై, చాణక్య+నీతి+లతా=చాణక్యుడు ప్రయోగించే నీతి అనే లత, గురుకం=అధికమైన, కార్యఫలం=తలపెట్టిన పని అనే పండును, దర్శయిష్యతి=చూపించగలదు.
ఆర్య.
రూపకం – ‘బుద్ధి అనే జలం’, ‘దేశకాలాలనే కలశాలు’, ‘పని అనే పండు’, ‘నీతి అనే లత’ అంటూ ఒకదాని వెంట ఒకటిగా రూపకాలంకారాలు చెయ్యడం గమనించదగ్గది. (విషయ్యభేద తాద్రూప్య రఞ్జనం విషయస్య యత్ రూపకం తత్త్రిధాధిక్య న్యూనత్వానుభయోక్తిః అని కువలయానందం).
తా గహీదో మఏ అజ్జ చాణక్కేణ పుఢమలిహిదో అమచ్చరక్ఖసస్స ముద్ధాలంఛిఓ ఆఅం లేహో, తస్స జెవ్వ ముద్దాలంఛిఆ ఇఆం ఆహరణ పేడిఆ, చలిదోహ్మి కిల పాడలిఉత్తం. జావ గచ్ఛామి. (పరిక్రమ్యావలోక్య చ) కహం ఖవణఓ ఆఅచ్ఛది. జావ సే అసఉణభూదం దంసణం మహ సంమదమెవ్వ. తా ణపడిహరామి.
(తస్మాద్గృహీతో మ యార్యచాణక్యేన, ప్రథమలేఖితో ఽమాత్య రాక్షసస్యముద్రాలాఞ్ఛితోఽయం లేఖ, స్తస్యైవ ముద్రాలాఞ్ఛితేయ మాభరణ పేటికా. చలితో ఽ స్మికిల పాటలిపుత్రమ్. యావద్గచ్ఛామి… … కథం! క్షపణక ఆగచ్ఛతి. యావ ద స్యాశకున భూతం దర్శనం మమ సమ్మత మేవ. తస్మాన్న పరిహరామి.)
తస్మాత్=అందువల్ల, ఆర్య+చాణక్యేన=పూజ్యులైన చాణ్యక్యుని చేత, ప్రథమ+లేఖితః=తొలుత వ్రాయించబడిన, అమాత్యరాక్షసస్య+ముద్రాలాఞ్ఛితః=(దానిపై) రాక్షసమంత్రి ఉంగరం ముద్ర వేయడబడిన, అయం+లేఖ=యీ ఉత్తరమూ; తస్య+ఏవ+ముద్రాలాఞ్ఛితా=ఆ మంత్రి ఉంగరం ముద్రతోనే ఉన్న, ఇయం+ఆభరణ+పేటికా=ఈ నగల పెట్టీ, గృహీతః+మయా=తీసుకున్న నేను (నా చే), పాటలిపుత్రమ్+చలితః+అస్మి+కిల=పాటలీపుత్రానికి ప్రయాణమయ్యాను కదా! యావత్+గచ్ఛామి=ఎంతలో వెడతాను!… (పరిక్రమ్య=ముందుకు నడిచి, అవలోక్య+చ=చూసి) కథం=ఎలాగా? క్షపణకః (జీవసిద్ధిః)+ఆగచ్ఛతి=సన్న్యాసి వస్తున్నాడే! యావత్+అస్యః+అశకున+భూతం+దర్శనం=ఎంతలో, అపశకునం వంటి వీడి దర్శనం, మమ+సమ్మతం+ఏవ=నాకు ఆమోదయోగ్యమే. తస్మాత్=అందువల్ల, న+పరిహరామి=తప్పించుకోను.
(ప్రవిశ్య)
అలహంతాణం పణమామి జే దే గంభీల దాఏ బుద్ధీఏలో
ఉత్త లేహిం లోయ సిద్ధిం మగ్గేహిం గచ్ఛంది. – (2)
(అర్హతానాం ప్రణమామి యే తే గమ్భీరతయా బుద్ధేః
లోకోత్తరై ర్లోకేసిద్ధిం మార్గైర్గచ్ఛన్తి॥)
బుద్ధేః+గమ్భీరతయా=మేధాశక్తి లోతైనది కావడం చేత, లోకోత్తరైః+మార్గైః=లోకోత్తరమైన మార్గాలలో, లోకే+సిద్ధిం+గచ్ఛన్తి=ఈ లోకంలో ముక్తిని పొందుతారో, యే+తే+ఆర్హతానాం=అట్టి అర్హతులకు (బౌద్ధమార్గ పుణ్యచరితులకు) ఎవరున్నారో వారికి, ప్రణమామి=నమస్కరించుచున్నాను.
క్షపణకుడు ఆర్హతుల మానసిక ఔన్నత్యం చెప్పి – నమస్కరిస్తున్నాడు. ఆర్హతుల అభిప్రాయం – మోక్షం గురించి ఏమంటే – “నీటిలోకి ముంచి విడిచిన సొరకాయ బుర్ర ఎలాగైతే ఒక్కసారిగా పైకి ఎగురుతుందో – పైకి వెళ్తుందో – అలాగ – సాధకుడు ఇహ సంబంధ వాంఛల్ని దాటి, పైకి ప్రయాణించడాన్ని మోక్షంగా భావిస్తారు” – అని వ్యాఖ్యాత ఢుండిరాజు వివరించాడు (జల నిమజ్జత ముక్తాలాబువచ్ఛశ్వదుత్ప్లుత్యోర్థ్వగమన మేవ ముక్తిరిత్యార్హతానంమతమ్).
భదంత వందామి. (భదన్త, వన్దే.)
భదన్త=స్వామీ, వన్దే=నమస్కరిస్తున్నాను.
సావగా, ధమ్మసిద్ధీ హోదు. (నిర్వర్ణ్య) సావగా, పత్థాణసమువ్వహణే క అవ్వవసాఅం విఅ తుమం పక్ఖామి. (శ్రావక, ధర్మసిద్ధిర్భవతు. శ్రావక, ప్రస్థానసముద్వహనే కృత వ్యవసాయ మివ త్వాం పశ్యామి.)
శ్రావక=శిష్యా, ధర్మసిద్ధిః+భవతు=బౌద్ధ ధర్మం నీకు ఫలించుగాక! (నిర్వర్ణ్య=పరీక్షగా చూసి), శ్రావక=శిష్యా, ప్రస్థాన+సముద్వహనే=ప్రయాణ (ప్రయోజనం) నెరవేర్చడంలో, త్వాం=నిన్ను, కృత+వ్యవసాయం=ప్రయత్నం చేసిన వాణ్ణిగా, పశ్యామి=చూస్తున్నాను.
కహం భదంతో జాణాది? (కథం భదన్తో జానాతి?)
భదన్తః+కథం+జానాతి=స్వామి ఎలా గ్రహించగలిగారు?
సావగా, కిం ఎత్త జాణిదవ్వం? ఏసో దే మగ్గా దేసకుసలో సఉణో కరగదో లేహో అ సూఅది. (శ్రావక, కి మత్ర జ్ఞాతవ్యమ్? ఏష తే మార్గా దేశకుశలః శకునః కరగతో లేఖ శ్చ సూచయతి.)
శ్రావక=శిష్యా, అత్ర+కిమ్+జ్ఞాతవ్యమ్=ఇందులో గ్రహించడానికి ఏం ఉంది? ఏషః+తే+మార్గాదేశ+కుశలః+శకునః=ఈ నీ మార్గం చూపే శకునం గమనించీ – కరగత+లేఖః+చ=చేతిలో ఉత్తరాన్నీ (చూసీ), సూచయతి=సూచనగా గ్రహించాను (నీ శకునం, నీ చేతిలో ఉత్తరం సూచిస్తున్నాయి).
జాణిదం భదం తేణ. దేసంతరం పత్థిదోహ్మి, తా కహేదు భదంతో కీదిసో అజ్జ దివసోత్తి. (జ్ఞాతమ్ భదన్తేన। దేశాన్తరం ప్రస్థితోఽస్మి। తస్మాత్ కథయతు భదన్తః కీదృశోఽద్య దివస ఇతి॥)
భదన్తేన+జ్ఞాతమ్=స్వామివారు గ్రహించారు (గ్రహింపబడినది). దేశాన్తరం=వేరే దేశాన్నుద్దేశించి, ప్రస్థితః+అస్మి=బయలుదేరాను. తస్మాత్=అందువల్ల, అద్య+దివస+కీదృశః+ఇతి=నేటి దినం (తిథి, వార, నక్షత్రాది విషయాలలో) ఎటువంటిదో అని, భదన్తః+కథయతు=స్వామివారు చెప్పాలి.
(విహస్య) సావగ, ముండి అముండో ణక్ఖత్థా ఈ పుచ్ఛసి. [(విహస్య) శ్రావక, ముణ్డితముణ్డో నక్షత్రాణి పృచ్ఛసి!]
(విహస్య=నవ్వి), శ్రావక=శిష్యా, ముణ్డిత+ముణ్డః=బోడితల వాడిని, నక్షత్రాణి+పృచ్ఛసి=నక్షత్రాది శుభాలను అడుగుతున్నావు!
భదంత, సంపదం వి కిం జాదం? క హేహి. పత్థాణస్స జఈ అణుకూలం భవిస్సది, తదో గమిస్సం. (భదన్త సామ్ప్రత మపి కిం జాతమ్? కథయ, ప్రస్థానస్య య ద్యనుకూలం భవిష్యతి తదా గమిష్యామి.)
భదన్త=స్వామీ, సామ్ప్రతం+అపి+కిం+జాతమ్=ఇప్పుడు మాత్రం ఏమైంది? ప్రస్థానస్య=ప్రయాణానికి,యది+అనుకూలం+భవిష్యతి=అనుగుణంగా ఉన్నట్లయితే, తదా+గమిష్యామి=అప్పుడు వెడతాను.
సావగ, ణ సంపదం ఏదస్సిం మలఅకేదుకడఏ అణుకూలం భవిస్సది. (శ్రావక, న సామ్ప్రత మేతస్మిన్ మలయకేతుకట కేఽనుకూలం భవిష్యతి.)
శ్రావక=శిష్యా, సామ్ప్రతం=ఇప్పుడు, ఏతస్మిన్+మలయకేతు+కటకే=మలయకేతువు విడిది ప్రదేశంలో, అనుకూలం+న+భవిష్యతి=అనుకూలంగా ఉండదు.
భదంత, క హేహి కుదో ఏదమ్? (భదన్త కథయ కుత ఏతత్?)
భదన్త=స్వామీ, కుత+ఏతత్+కథయ=ఇలాగున ఎందుకో చెప్పు.
సావగ, ణిసా మేహి। పుఢమం దావ ఎత్థ కడఏ లోఅస్స అణివారిదో ణిగ్గమ ప్పవేసో ఆసీ। దాణీం ఇదో పచ్చాసణ్ణే కుసుమపులే ణ కోవి అముద్దాలంఛిఓ ణిగ్గమిదుం ప్రవేట్ఠుం వా అణుమోదీఅది। తా జది భాఉరాఅణస్స ముద్దాలంచ్ఛిఓ తదో గచ్ఛ విస్సద్ధో, అణ్ణహా చిట్ఠ। మా గుమ్మాహి ఆరిఏహం సంజమి అ కలచలణో రాఅకులం పవేసీఅసి॥
(శ్రావక, నిశామయ, ప్రథమం తావ దత్ర కటకే లోక స్యానివారితో నిర్గమప్రవేశ ఆశీత్। ఇదానీ మితః ప్రత్యాసన్నే కుసుమపురే న కోఽ ప్య ముద్రాలాఞ్ఛితో నిర్గన్తుం ప్రవేష్టుం వాను మోద్యతే। త ద్యది భాగురాయణస్య ముద్రాలాఞ్ఛిత స్తదా గచ్ఛ విశ్రబ్ధోఽన్యథా తిష్ఠ। మా గుల్మాధికారైః సంయమిత కరచరణో రాజకులం ప్రవేశ్యసే॥)
శ్రావక=శిష్యా, నిశామయ=విను, ప్రథమం+తావత్=మొదటగా చెప్పాలంటే – అత్ర+కటకే=ఈ విడిదిలో, లోకస్య=జనానికి, నిర్గమ+ప్రవేశః=రాకపోకలు, అనివారితః+ఆశీత్=అడ్డు లేకుండా ఉండేది. ఇదానీం+ఇతః=ఇప్పటి కాలంలో అయితే, కుసుమపురే+ప్రత్యాసన్నే=పాటలీపుత్రం సమీపిస్తుండగా, అముద్రా+లాఞ్ఛితః=(అనుమతికి) ముద్ర పడనిదే, నిర్గన్తుం+ప్రవేష్టుంవా=బయటకు రావాలన్నా, నగరంలోకి ప్రవేశించాలన్నా, న+కః+అపి+అనుమోద్యతే=ఎవరు కూడా అనుమతింపబడరు. తత్+యది+భాగురాయణస్య+ముద్రా+లాఞ్ఛితః=అయితే, భాగురాయణుడి ముద్ర పడి ఉంటే, తదా+గచ్ఛ=అప్పుడు వెళ్ళు, అన్యథా+విశ్రబ్ధః+తిష్ఠ=అలాగ కాని పక్షంలో స్థిమితంగా కూర్చో (ఆగిపో). గుల్మ+అధికారైః=సైనిక విభాగం అధికారుల చేత, సంయమిత+కర+చరణః=కాళ్ళు చేతులు కట్టివేయబడి, మా+రాజకులం+ప్రవేశ్యసే=రాజకార్యాలయానికి వెళ్ళదగవు.
కిం ణ జాణాది భదంతో అమచ్చరక్ఖసస్స సణ్ణిహిదోత్తి. ఆ అముద్దాలంచ్ఛిదం వి మం ణిక్కమంతం కస్స సత్తీ ణివారేదుం. (కిం న జానాతి భదన్తో ఽమాత్య రాక్షసస్య సన్నిహిత ఇతి. త దముద్రాలాఞ్ఛిత మపి మాం నిష్క్రమన్తం కస్య శక్తి ర్ని వారయితుమ్?)
భదన్తః+కిం+న+జానాతి=స్వామివారికి ఎందుకు తెలియదు? అమాత్య రాక్షసస్య+సన్నిహితః+ఇతి=రాక్షసమంత్రికి దగ్గరవాడని? తత్=ఆ కారణం చేత, మాం=నన్ను, అముద్రా+లాఞ్ఛితం+అపి=ముద్ర లేకపోయినప్పటికీ, నిష్క్రమన్తం=వెళ్తుండగా, నివారయితుమ్=ఆపడానికి, కస్య+శక్తిః=ఎవడికి గుండె ఉంటుంది?(ఎవడాపగల శక్తిమంతుడు?).
(స్వామివారు రాక్షసమంత్రికి ఆప్తులని ఎరుగక, ఆపడానికి ఎవడు సమర్థుడు?)
(భదన్తః+అమాత్య రాక్షసస్య+సన్నిహిత+ఇతి=అని అన్వయము).
సావగా, రక్ఖసస్స పిసాచస్స వా హోహిణ ఉణ అముహాలంఛిదస్స ఇదో ణిక్కమణో హిఓ. (శ్రావక, రాక్షసస్య పిశాచస్య వా భవ. న పున రముద్రాలాఞ్ఛిత స్యేతో నిష్క్రమణోపాయః)
శ్రావక=శిష్యా, రాక్షసస్య+పిశాచస్య+వా+భవ=సాక్షాత్తు రాక్షసమంత్రి పిశాచానివే కా, అముద్రాలాఞ్ఛితస్య=ముద్ర అనేది పడకుండా, ఇతః+నిష్క్రమణ+ఉపాయః+న+పునః=ఇక్కడ నుండి వెళ్ళడానికి ఏ కిటుకూ లేదు గాక లేదు.
భదంత, ణ కుప్య, కజ్జసిద్ధీహోదు. (భదన్త, న కుప్య, కార్యసిద్ధి ర్భవతు.)
భదన్త=స్వామీ, న+కుప్య=కోపగించవద్దు, కార్యసిద్ధిః+భవతు=తలపెట్టిన పని నెరవేరుగాక!
సావగా, గచ్ఛ। హోదు దే కజ్జసిద్ధీ। అహం వి భాఉరాఅణాదో ముద్దం జాచేమి॥ (శ్రావక, గచ్ఛ। భవతు తే కార్యసిద్ధిః। అహ మపి భాగురాయణా న్ముద్రాం యాచే॥)
శ్రావక=శిష్యా, గచ్ఛ=వెళ్ళు. తే+కార్యసిద్ధిః+భవతు=నీవు తలపెట్టిన పని నెరవేరుగాక! అహం+అపి=నేనైతే, భాగురాయణాత్=భాగురాయణుడి నుంచి, ముద్రాం+యాచే=అనుమతి ముద్రను వేడుకుంటాను
(ఇతి నిష్క్రాన్తౌ)
(ఇతి=అని, నిష్క్రాన్తౌ=ఇద్దరూ వెళ్ళిపోయారు)
– ప్రవేశకః –
రెండు అంకాల మధ్య జరిగిపోయిన కథను రెండు గాని, మూడు గాని పాత్రల చేత అనుబంధ ‘లఘు అంకం’గా చెప్పించడం సంస్కృత రూపక సంప్రదాయం. ఇది రెండు రకాలుగా ఉంఛవచ్చు. విష్కంభం – ప్రవేశకం – అని.
విష్కంభం రెండు రకాలుగా ఉండవచ్చు. శుద్ధ విష్కంభం – మిశ్ర విష్కంభం – అని. శుద్ధ విష్కంభంలో, ప్రవేశించిన పాత్రలన్నీ సంస్కృత భాషలోనే సంభాషిస్తాయి. మిశ్ర విష్కంభంలో కొన్ని సంస్కృతం, కొన్ని ప్రాకృతంలో సంభాషిస్తాయి. ప్రవేశకంలో అయితే ప్రవేశించిన పాత్రలన్నీ ప్రాకృతంలోనే ప్రసంగిస్తాయి.
ఇక్కడ సిద్ధార్థకుడు, క్షపణుడు కూడా ప్రాకృత భాషలోనే మాట్లాడారు కనుక ఈ ఘట్టం ‘ప్రవేశకం’ అయింది.
మలయకేతువు తన సైన్యంతో పాటలీపుత్రం ముట్టడికి బయలుదేరి నగరం శివార్లలో శిబిరాలు వేశాడు. అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటైంది. అక్కడ నగరంలో ప్రవేశించడానికీ, బయటకు రావడానికీ భాగురాయణుడు ముద్రాధికారిగా ఉన్నాడు. ఈ కీలక ఘట్టంలో – ఒక లేఖనీ, నగల పెట్టెనీ తీసుకుని సిద్ధార్థకుడు పాటలీపుత్రంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదీ – ఈ అంకానుసంధాన ఘట్టం ప్రత్యేకత.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™