వారిజాక్షుని తోడ వయ్యారి సీతకు
కళ్యాణ మది నాకు కనుల విందు
బుగ్గన చుక్కతో పురుషోత్తమునిగని
సిగ్గుగ నవ్వెడి సిరిని జూసి
వాల్జడ బరువుల వైదేహి దెసగాంచి
అల్లరి దాచెడి హరిని జూసి
పరవశించు మదిని పట్టతరము గాదు
మహదానుభవమది మాట గాదు
కలిమి యొసగు సుఖములన్ని కాకు జేసి
కోటి జన్మల పుణ్యము కుదువబెట్టి
మనసులోననుప్పొంగగ మధుర గంగ
తనివి తీర జూడ దలతు తాపమణగ
శ్రీ వల్లీ రాధిక చక్కని కథా రచయిత్రి. లోతైన తాత్వికతకు నిత్య జీవితంలోని సంఘటనల ద్వారా సరళంగా ప్రదర్శిస్తారు. ‘తక్కువేమి మనకూ’, ‘స్వయం ప్రకాశం’, ‘హేలగా… ఆనంద డోలగా..’ వీరి పేరుపొందిన కథల సంపుటాలు.