మేము బ్రెజిల్ నుండి ఈక్వెడార్, అక్కడి నుండి Galápagos ద్వీపాలకి వెళ్ళాము. బ్రెజిల్ నుంచి ఈక్వెడార్ 3,195 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈక్వెడార్ నుంచి గలపాగోస్ దీవులు సుమారు 700 మైళ్ళ దూరంలో ఉన్నాయి.
మేము బ్రెజిల్ నుంచి ఈక్వెడార్కి ఎర్లీ మార్నింగ్ ఫ్లయిట్ తీసుకున్నాం. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో సామాన్లు తీసుకుంటూ ఎమిగ్రేషన్ వద్ద తెలుసుకున్నాం – హైదారాబాద్ నుంచి బ్రెజిల్ దాదాపు 13,700 కిలోమీటర్లు ప్రయాణించామని. బ్రెజిల్లో 1800 కిలోమీటర్లు తిరిగాం. రావటం పోవటం దాదాపు 36,000 కిలోమీటర్లు. రెండు రోజుల ప్రయాణం మాకు.
ఈక్వెడార్‌లో రాత్రి తొమ్మిది గంటలకు దిగాము. అక్కడి నుంచి మేము బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్‌కి కార్ తీసుకున్నాము. కారు పోతూ పోతూ ఉంది కాని అడ్రెస్ దొరకలేదు. మేము ఆ గెస్ట్ హౌస్ ఓనర్ ఫోన్ నెంబరు ఇచ్చాము స్పానిష్‌లో మాట్లాడుకోమని. మొత్తానికి రాత్రి పదిన్నర గంటలకి ఆ యింటికి చేరాము. చిమ్మ చీకటి ఆ యింటికి చేరేసరికి.
ఆ మూడంతస్తుల ఇల్లు చెక్కతో కట్టినది. బయటంతా అడవిలా వుంది. రాత్రంతా బిక్కుబిక్కుమని ఆ వుడెన్ హౌస్‌లో వున్నాము.
ఆ మూడంతస్తుల మేడలో పై నుంచి క్రింది వరకు ఎవ్వరూ లేరు. మేము ఇద్దరమే. అక్కడే ఔట్ హౌస్‌లో ఓనర్స్ ఉన్నారు.
మేమేదో దెయ్యాల కొంపకి వచ్చిన ఫీలింగ్. ఏంటీ డోర్ కొట్టుకుంటోంది అని భయం, అది గాలికి కొట్టుకున్నా సరే. కానీ, బాగా ప్రయాణ బడలికతో ఆదమరిచి నిద్రపోయాము. ప్రొద్దున్న 7 గంటలకి లేచాము. కిటికీ లోండి బయటకి చూస్తే సూర్యోదయం. ఆ యింటి చుట్టూ bell shape పువ్వులు విరబూసి వున్నాయి. ఎంత అందంగా ఉన్నాయో చెప్పలేను. వారు ఇద్దరు భార్యాభర్తలు ఇదే పనిగా అక్కడ ఉన్న అన్నీ శుభ్రం చేస్తూ, ఒక బొమ్మరిల్లు లాగా తీర్చిదిద్దుకున్నారు.
క్రింది అంతస్తులో బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళాము. ప్రతి చిన్ని చిన్ని వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టి ఉన్నాయి. వారి ఇంటిని ఎంతో అపురూపంగా, కళాత్మకంగా తీర్చిదిద్దుకున్నారు.
ఆ యిల్లు ఒక మ్యూజియం లాగా వుంది. చుట్టూ అన్ని చూపించిన తర్వాత మా సామాను కూడా క్రిందకి దించి ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేశారు గలపాగోస్ దీవులకి వెళ్ళడానికి. అయితే మేము తిరిగి వచ్చేడప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పి సగం సామాను అక్కడే పెట్టేసి ఎనిమిది రోజులకి సరిపోయే బట్టలు తీసుకుని గలపాగోస్ దీవులకు వెళ్ళాము.
గలపాగోస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి అక్కడే వుండి మూడు రోజులు అన్నీ చూశాము.
ఈక్వెడార్ లో భూమధ్యరేఖ వెళ్తుంది. అక్కడ ఈ భూమధ్యరేఖపై వారొక కట్టడం కట్టారు. అక్కడ ఒక గ్లోబ్‌కి ఉత్తర ధృవము, దక్షిణ ధృవం ఉంటాయి. ఈ భూమధ్యరేఖని ముట్టుకున్నప్పుడు ఎంతో సంతోషంతో ఎగిరి గంతేశాను. ఆ రేఖని అంటుకున్న సంతోషంలో నేను మా వారు కలిసి దాని చుట్టూ తిరిగాము.
ఈక్వెడార్ గురించి ఒక విశేషమేమంటే ఇంగ్లీషులో Ecuador అంటే స్పానిష్‌లో equator అని అర్థం. స్పానిష్‌లో దీని అధికారిక నామము República del Ecuador. అంటే ఆంగ్లంలో ‘Republic of the Equator’ అని అర్థం. తనకున్న భౌగోళిక లక్షణాల ప్రకారం పేరు పెట్టబడిని ప్రపంచంలోని ఏకైక దేశం ఈక్వెడార్ మాత్రమే.
ఈక్వెడార్ ముఖ్య పట్టణం Quito. Quito నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఒక స్పెషల్ లాడ్జ్ వుంది. దాని పేరు Mashpi Lodge. ఇది సముద్రమట్టం నుంచి సుమారు 3,200 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ‘Choco Rainforest’ మధ్యలో వుంది. Rainforest (వర్షారణ్యం) చూడడం వేరు, మామూలు అడవులు చూడడం వేరు. ఈ Rainforest లో ప్రతి రోజూ వర్షం కురుస్తుంది. ఇది అత్యంత కీకారణ్యం. Amazon Rainforest. ఇది 3000 ఎకరాలలో విస్తరించి ఉన్న లాడ్జ్. ఇక్కడ 400 రకాల పక్షులు, ఎన్నో రకాల కోతుల జాతులు వున్నాయి.
ఇక్కడ ఆకాశంలోని మబ్బులు తాకిపోతూ వుంటాయి. ఇక్కడ బుకింగ్ చేసుకోవాలంటే, ఒక సంవత్సరం పడుతుందట. ఎంతో వింతైన విశేషాలతో వున్నదట ఈ హోటల్. సంవత్సరానికి 57 గదులే అద్దెకిస్తారట.
కానీ ఇప్పుడీ దేశంలో కరోనా కరాళ నృత్యం చేసింది. దేశంలో ఎక్కడ చూసినా శవాల గుట్టలు. ఎంతమంది చనిపోయారో, ఒక్కరోజే కరోనా సోకినావారు 11వేల మందికి పైగా ఉన్నారు. 576 మంచి చనిపోయారని చెప్తున్నా, 7500 మందికి పైనే చనిపోయి ఉంటారని అంచనా. 11 మార్చ్ నుంచి 20 ఏప్రిల్ వరకు 9000 మంది చనిపోయారట. అన్ని శవాలని భద్రపరచటానికి పెట్టెలు లేక, అట్ట పెట్టెలలో వుంచుతున్నారు. వీధుల్లో ఎన్నో మృతదేహాలు, మునిసిపల్ సిబ్బంది సేకరించలేకపోతున్నారట. ఎంత దారుణం! 3000 మంది కరోనా లక్షణాలతో ఇళ్ళల్లోనే ప్రాణాలు కోల్పోయారట. ఎంతో మంది శవ పేటికలను ఇంటి ముందు పెట్టుకుని తమకి ఖననం చేయడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
ఈక్వెడార్కి స్పెయిన్ నుంచి ఎంతో మంది వెళ్తారు. ఇటలీలో జరిగిన కరోనా విధ్వంసానికి భయపడి స్పానిష్ వారు ఈక్వెడార్ వారితో కలిసి తిరగడంతో ఈక్వెడార్ కరోనాతో అట్టుడికిపోయింది. దక్షిణ అమెరికా మొత్తంలో మృతుల సంఖ్య ఈక్వెడార్‌లోనే అత్యధికంగా వుంది. నిజంగా మళ్ళీ ఓ ప్రయాణీకుడిగా ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే ఇంకొక నాలుగు సంవత్సరాలు పడ్తుండవచ్చు, నిర్భయంగా, నిస్సంకోచంగా వెళ్ళడానికి.
ఈ ఈక్వెడార్ని చూచినప్పుడు భూమధ్యరేఖ ఇక్కడి నుంచి ప్రయాణించడం విశేషం. పోయిన సంవత్సరం ఉగాండా వెళ్ళినప్పుడు అక్కడి equator ని చూశాను. ఈక్వెడార్ equator అమెజాన్ అడవులలో వుంది. అమెజాన్ అడవులలో అమెజాన్ నది నుంచి వచ్చే నీళ్ళలో Anakonda Cruises వున్నాయి.
నదీ తీరాలలో మా నడకలో భాగంగా ఈక్వెడార్ ముఖ్య పట్టణం క్విటో నుండి మేము రెండు రోజులు cruise తీసుకున్నాము. మమ్మల్ని ఉదయం పికప్ చేసి అమెజాన్ నది వరకు yatcht లో తీసుకెళ్ళారు. అక్కడి నుంచి Tenalu అనే state లో tena అనే ప్రాంతానికి 12 గంటలకి చేరుకున్నాం. అక్కడి నుండి 20 నిమిషాల్లో Misahualli అనే చోటుకి తీసుకెళ్ళారు. అక్కడ ఓ లాడ్జ్‌లో ఉంచారు. వారు ముందుగానే మా అందరికీ ఫుడ్ ఆర్డర్ చేసి ఉంచారు. ఒక గంటలో మా లంచ్ ముగించాము.
ఈ అమెజాన్ నది చుట్టూ ఉన్న అడవలో పడవలో ప్రయాణించాము. 50 రకాల సీతాకోక చిలుకలు సంతతి ఈ అడవిలో వుందట. అలాగే ఎన్నో చెట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవి మెడిసినల్ ప్లాంట్స్. ఈ చెట్లకు ఔషధ గుణాలున్నాయి. ఈ చెట్ల బెరడు, బంక, ఆకులు, ఎన్నెన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. చాలా దట్టమైన అడవులు.
ఇక్కడే అనకొండలు కూడా సంచరిస్తూ వుంటాయి. 10,000 జాతులకు పైనే జీవజాలం వున్న ఈ అమెజాన్ అడవులో ‘అనకొండ’ ప్రసిద్ధి. ఫేమస్ పిక్చర్లో చూస్తాము. ఈ ‘అనకొండ’ జాతి పాములు Orinoco basinలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అది పొడవైన పాములు. 20 అడుగుల పొడవు, 200 పౌండ్ల బరువు వుంటాయి. ఇందులో కొన్ని రకాలు మనిషిని కూడా మింగేస్తాయి. అతి ఆశ్చర్యకరమైన విషయం. అయితే అవి నిజంగా అడవులలో తిరుగుతుండగా మేము చూడలేకపోయాము. అక్కడ కొండజాతులవారు వున్నారు.
ఇక్కడ మేము చాకొలెట్ చెట్లను చూశాము. ఆ చెట్లు ఈక్వెడార్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటాయి. ఇవి పెద్ద, పొడవైన చెట్లు. నీడలో ఎక్కువగా పెరుగుతాయి. చెట్టుకి చాకొలెట్ కాయ కాస్తుందని నాకు అంతకు ముందు తెలియదు. ఇక్కడే మొదటిసారి చూశాను. ఎంతో ఆశ్చర్యపోయాను. ఇక్కడ ఆ కొండజాతివారు చాకొలెట్ని మాకు రుచి చూపించారు. చాలా రకాల చాకొలెట్లు తయారు చేస్తున్నారు.
వీటిని cocoa beans అంటారు. ఈ cocoa అనే పదానికి గ్రీకు భాషలో ‘food of gods’ అని అర్థం.
మాకు అక్కడే వాళ్ళ సాంప్రదాయ ఆహారంతో పాటు, ఎన్నో రకాల చాకొలెట్లు రుచి చూపించారు. చాలా బాగుంది.
Yasuni National Park లో గ్రీన్ అనకొండలు ఉంటాయి. మాకు సమయం లేనందువల్ల ఈ ట్రిప్‌ని ఇంతటితో ముగించాము.
అక్కడి నుండి క్విటోలో వున్న అగ్నిపర్వతం చూశాము. ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ వుంది. ఇక్కడే ఒక La Casa del Terror క్విటోలో వుంది. దాన్ని బయటి నుండి చూశాము.
El Panecillo hill చూశాము. ఇక్కడ మ్యూజియం వుంది. అక్కడి నుండి Facade of Church 1905లో కట్టినది చూశాము. ఈ చర్చ్ నిర్మాణం పూర్తవడానికి 160 సంవత్సరాలు పట్టిందట. చాలా మంచి నగిషీ పనితో వున్నది.
తర్వాత క్రిస్టల్ పాలెస్‌కి వెళ్ళాము. దీనిని ఐఫిల్ టవర్ నమూనాలో రూపొందించారు. బెల్జియం నుంచి తెచ్చిన క్రిస్టల్స్‌ని ఒక్కొక్క ముక్కని అలాగే పేర్చి ఈ క్రిస్టల్ పాలెస్‌ని కట్టారట.
ఇక్కడి నుండి ఓల్డ్ టౌన్‌కి వెళ్ళాము. ఇక్కడ చాలా రద్దీగా వుంది. మమ్మల్ని ఈ కార్ డ్రైవర్ లోపలి వర్కు నడిపించి అక్కడి స్పెషల్ వంటకాన్ని తినిపించాడు. మా వారు అన్ని నాన్-వెజ్ పదార్థాలు తిన్నారు. నేను మాత్రం చికెన్, ఒక చిన్ని రోటీలో రోల్ లాగా చేసి ఇచ్చారు, అది తిన్నాను. చాలా రుచిగా వుంది.
రాత్రిపూట వీధులన్నీ తిప్పారు. అన్ని వీధులు బంగారు రంగులో మెరిసిపోయాయి.
అక్కడి నుండి మేము ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాము, బ్రెజిల్ వెళ్ళడానికి. ఎయిర్‌పోర్ట్‌లో ఒక అమ్మాయి నా పక్కన కూర్చుని ఏదో పుస్తకం చదువుతోంది. అదేం పుస్తకమని అడిగాను. “నేను ట్రాన్స్‌లేటర్‌ని. స్పానిష్ నుంచి ఇంగ్లీష్‌కి పుస్తకాలను అనువదిస్తూ వుంటాను. అనువాదకురాలిగా నాకు డబ్బు ఇస్తారు. ఇదే నా జీవనోపాధి” అని చెప్పింది. డబ్బు సంపాదించడానికి ఎన్నెన్నో మార్గాలు కదా! అని అన్పించింది.
ఈక్వెడార్‌లో వున్న మనుషులు చాలా జోవియల్‌గా వున్నారు. వారి మీద స్పానిష్ ప్రభావం చాలా వుంది.
గలపాగోస్ దీవుల గురించి తర్వాత రాస్తాను.
నిర్విరామ విహారిణిగా పేరుపొందిన నర్మద రెడ్డి ఎన్నదగిన స్త్రీ యాత్రికురాలు. ఇప్పటివరకూ ప్రపంచంలోని 169 దేశాలను సందర్శించారు. తమ పర్యటనానుభవాలతో “ఆగదు మా ప్రయాణం”, “కొలంబస్ అడుగుజాడల్లో” అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఉమెన్ ఆన్ గో’ పురస్కారం పొందారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™