[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]


తృతీయ సర్గ
తస్మిన్నవసరే ఘారాసారం వర్పతి వాసవే।
నౌకామారూహ్య భూపాలో నిరగాజ్జన చిన్తయా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 26)
ఇంద్రుడు భూమిపై ధారాపాతంగా వర్షం కురిపిస్తున్న సమయంలో ప్రజల బాగోగులు, రక్షణ గురించి చింతితుడైన రాజు నౌకలో బయలుదేరాడు.
పశ్యజ్జలాంతరే మగ్నాం కృషిం కృశతరః శుచా।
జనకారుణ్య పుణ్యాత్మా విచార పతిః స్థలమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 27)
శోకంతో దుర్బలురైన ప్రజల పట్ల దయాభావం వల్ల, నీట మునిగిన పంటలను చూస్తూ రాజు చింత్రాక్రాంతుడయ్యాడు
జైనులాబిదీన్ దయాగుణాన్ని, జాలిని, సాటి మనిషి బాధతో సహానుభూతిని పొందటాన్ని శ్రీవరుడు ‘జనకారుణ్య పుణ్యాత్మా’ అన్నాడు.
ప్రాకృతిక వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రజలను పరామర్శించటం, సానుభూతి వ్యక్తపరచటం, వారికి సహాయాన్ని అందించటం ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలోనూ ఆనవాయితీనే.
దుష్టాని యాని ఘోశేషు గహనత్వాన్న జూతుచిత్।
స్థానాని తాని భూపాలో నౌకారూఢో వ్యలోకయత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 28)
నౌకారూఢుడైన రాజు పాలు అమ్మేవారి ఇళ్ల కోసం చూశాడు. అవన్నీ జలమయమై ఉన్నాయి.
ప్రతాపశిఖినే వాథ శోషితో గాన్మిత్తైర్దినైః।
శాంతిం క్రూరో జలాపూరః సన్నివారే సమాగతః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 29)
రాజు ప్రతాపాగ్ని వల్ల అయినట్టు కొన్ని రోజులలో వరద నీరు తగ్గి, ఎండిపోయింది భూమి.
ఇలాంటి అతిశయోక్తులని ఆధారం చేసుకుని ప్రాచీన భారతీయ కావ్య సాహిత్యాన్ని విమర్శిస్తారు. పొగడ్తలు తప్ప, మరేముంటాయని ఈసడిస్తారు.
రాజు వరద నీటిలో పడవ ప్రయాణం చేస్తూ, వరద నీటిలో మునిగిన ప్రాంతాలను సందర్శించాడు. వరద బాధితులను పరామర్శించాడు. తరవాత కొన్ని రోజులకు వరద నీరు వెనక్కు తగ్గింది. భూమిలో ఇంకిపోయింది. భూమి ఎండిపోయింది. ఇది మామూలుగా జరిగేదే. కానీ మామూలుగా జరిగేదాన్ని అసాధారణంగా, భిన్నంగా చెప్పటమే కవిత్వం.
వరద బాధితులను జైనులాబిదీన్ పరామర్శించాడు. వరద నీరు తగ్గిపోయింది. భూమి ఎండిపోయింది. ఈ సంఘటనను జైనులాబిదీన్ ప్రతాపంతో ముడిపెట్టి, ఆయన శౌర్యాగ్ని వల్ల నీరు ఆవిరైంది, భూమి ఎండిపోయిందని చమత్కారంగా చెప్పాడు శ్రీవరుడు. మనం ఓ పనికి వెళ్తుంటాం, ఎవరో ఎదురొస్తారు. మన పని అనుకున్న దానికన్నా ముందు అవుతుంది. ‘నువ్వు ఎదురొచ్చావు, పనయింది’ అని అంటాం ఆ వ్యక్తితో. దైవ దర్శనం చేసుకుంటాం. వెంటనే అంతవరకూ కాని పని పూర్తవుతుంది. ‘అంతా దైవ దర్శనం మహిమ’ అనుకుంటాం. ఇదీ అలాంటిందే.
ఇలా అనుకోవటం మన నిత్య జీవితంలో ఒక భాగం. కానీ ఇది అలవాటు లేని విదేశీయులకు ఇదంతా భట్రాజుతనం, అతిశయోక్తులుగా అనిపిస్తుంది. మొత్తం కావ్యాన్ని పనికిరాదని పక్కనబెట్టడానికి ఒక సాకు దొరుకుతుంది.
జైనులాబిదీన్ ‘ప్రతాపాశిఖ’ వల్ల నీరు ఆవిరై, భూమి ఎండిపోయిందట. శ్రీవరుడి పద ప్రయోగాలు ఎంతో ఆనందం కలిగిస్తాయి. అలాగని అతి కఠినాలు, జటిలముకావు. సరళమూ, సులభంగా అర్థమయ్యే పదాలే వాడతాడు శ్రీవరుడు. భారతీయ కావ్యాలను విశ్లేషించే సమయంలో గుర్తుంచుకోవాల్సి విషయం ఏంటంటే భారతీయ స్వజనకారులకు ‘రసం’ అత్యంత ప్రధానమైన అంశం. ఎటువంటి దాన్నయినా రసమయంగా చెప్పాలని ప్రయతిస్తారు. ఇది అర్థం కాని రసవిహీన మనస్సులు, రసరహిత మెదళ్లు, రస శూన్య విమర్శలతో సృజనాత్మక ప్రతిభను తప్పు పడతారు. చలకన చేస్తారు. అంధుడికి రంగులు ఏమి తెలుసు? తెలిసిందంతా నలుపే!
అథాచిరేణ తద్వర్షే దానోత్కర్పాదివ ప్రభోః।
హర్షమన్వభవన్ సర్వం పక్కయా శాలిసంపదా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 30)
రాజు దానగుణ ప్రభావం వల్ల అన్నట్టు, కొద్ది రోజులలో చాలా బాగా పండిన పంటలను చూసి ప్రజలు ఆనంద పరవశులయ్యారు.
మానవ జీవితంలోని గొప్పతనం ఇదే.
వరదలు ముంచెత్తుతాయి. ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవిస్తుంది. మళ్లీ వరదలు వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. అయినా మళ్ళీ ప్రజలు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. ప్రమాదం ఏమీ లేనట్టే వ్యవహరిస్తారు. మళ్ళీ వరదలు వస్తాయి. సర్వం నాశనమవుతుంది. మళ్ళీ అవకాశం చిక్కగానే ప్రజలు అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. శ్రీవరుడు ప్రదర్శిస్తున్నది ఇదే.
వరదలు వచ్చాయి. నీరు అన్నిటినీ ముంచెత్తింది. కొన్నాళ్లకు నీళ్లు వెనక్కు వెళ్లాయి. మళ్ళీ పంటలు పండాయి. సంతోషం వెల్లి వెలిసింది. వరద తాలూకూ విషాద జ్ఞాపకాలు మరుగున పడ్డాయి.
ప్రజాచంద్ర కలావృద్ధయై కశ్మీరేంద్ర పయోనిధిః।
తూర్ణం పూర్ణాత్మతాం ప్రాప దయాపీయూష భూషణః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 31)
పౌర్ణమి రోజు సముద్రం నీరు సమృద్ధమైనట్టు, ప్రజల ఆనందం చూసి రాజు హృదయం ఆనందంతో నిండిపోయింది.
ప్రజల కష్టం తన కష్టంగా, ప్రజల ఆనందం తన ఆనందంగా భావించే జైనులాబిదీన్ నిండు మనసు గురించి చెప్తున్నాడు శ్రీవరుడు.
ఈ శ్లోకంలో జైనులాబిదీన్ లక్షణాలను వర్ణించేందుకు వాడిన పదాలు చక్కగా అనిపిస్తాయి. ఆనందం కలిగిస్తాయి. ‘కశ్మీరేంద్ర పయోనిధి’, ‘దయాపీయూష భూషణ’. ఈ శ్లోకంలో వాడిన ‘పూర్ణాత్మ’ పదాన్ని తరువాత శ్లోకంలో వివరించాడు శ్రీవరుడు.
ఆత్మేవ కశ్చిత్ సుకృతీ క్షితీశః
ప్రజా ప్రియాస్య ప్రకృతిర్యథైవ।
తత్సౌరఖ్య వృద్ధయా సుఖితా యదాస్తే
తదీయ దుఃఖేన చ దుఃఖ యుక్తః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 32)
రాజు ఆత్మ. ప్రజలు శరీరం. రాజు ఆనందిస్తే ప్రజల ఆనందం పెరుగుతుంది. రాజు దుఃఖిస్తే ప్రజలు దుఃఖిస్తారు. అలాగే ప్రజలు సుఖంగా ఉంటే రాజు ఆనందిస్తాడు. ప్రజల దుఃఖం రాజు దుఃఖం. అందుకే ప్రజలు సంతోషంగా ఉండటం వల్ల రాజు ఆత్మ సంతోషంతో నిండిపోయింది.
భారతదేశంలో ‘రాజు’ ఆలోచనకు చక్కని నిర్వచనం.
రాజు వేరు, ప్రజలు వేరు కారు. ప్రజలు శరీరం, రాజు ఆత్మ. శరీరం లేకపోతే ఆత్మకు అస్తిత్వం లేదు. ఆత్మ లేకపోతే శరీరానికి ఉనికి లేదు. రెండూ పరస్పరాశ్రితాలు.
రాజు గొప్పవాడు. అతడి మెప్పు కోసం తపన పడటం, ప్రజల బాగోగులు చూస్తూ, తానేదో గొప్ప పని చేస్తున్నట్టు రాజు గర్వించటం, కాకాలు పట్టటాలు, లంచాలు, బహుమతులు వంటివి భారతీయ సంప్రదాయంలో భాగాలు కావు. ఇవి మధ్యలో వచ్చి చేరిన వికృతులు.
‘ఈ ప్రజలు నేనూ ఒకటే’ అనుకున్న సమాజంలో ఇలాంటి వికృతులుండవు. ‘నేను ప్రజల అధికారిని. భాగ్యవిధాతను. వారి కన్నా భిన్నం. నేను వేరు, ప్రజలు వేరు’ అనుకున్న సమాజంలోనే ఇటువంటి వికృతులు, అహంకారాలు, అధికార వాంఛలు పెచ్చరిల్లుతాయి.
వితస్తోచ్ఛతటే భూపస్తదుపద్రవ శంకయా।
పురం చికీర్పూర్వభ్రామ జయాపీడపురాన్తినే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 33)
భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఉపద్రవాలు సంభవించే వీలుండటం వల్ల, ఎత్తు ప్రాంతంలో జయపీడాపురం దగ్గర మరో నగరాన్ని నిర్మించాలని రాజు ఆలోచించాడు.
అకరేత్ తిలక్ భూమేరలకాదర్పహత్పురమ్।
స జైనతిలక్ నామ నదీతీరోంన్నతస్థలే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 34)
నదీతీరాన ఉన్నత ప్రదేశంలో జైనులాబిదీన్ నూతన నగరం ‘జైన తిలకం’ను నిర్మింప చేశాడు. ఇది భూమికి తిలకం అద్దినట్టుంది.
‘జైనతిలకం’ అన్న నగరం వితస్త నది ఒడ్డున ఉన్న ‘అందర్కాట్’ దగ్గర ఉండేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. కశ్మీరులో ఇప్పటికీ ‘అందర్కాట్’ అన్న పేరున్న వారున్నారు. అయితే, వరదల బారినుండి ప్రజల కోసం ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన ‘జైన తిలకం’ నగరం వరదలలో కొట్టుకుపోయింది.
ఇక్కడ గమనించవలసిందేమిటంటే, వరదలు వచ్చిన తరువాత ప్రజలను, పరామర్శించి, వరద నీరు తీసిన తరువాత మళ్లీ వరద వచ్చే వరకూ ఆ విషయాన్ని వదిలేసే ఆధునిక రాజకీయాలకు భిన్నంగా, వరద నీరు తగ్గగానే ఎత్తు ప్రదేశంలో నగరం నిర్మింపచేశాడు జైనులాబిదీన్. ప్రజలు శరీరం, తాను ఆత్మ అన్న గ్రహింపు ఉన్నవాడు చేసే పని ఇది. శరీరం ఆరోగ్యంగా ఉన్నంతవరకే తమకు అస్తిత్వం అని గ్రహించిన వాడి పని ఇది.
రాజ్ఞో దిద్రుక్షయేవాన్న రాజధానీ రుచిచ్ఛలాత్।
సౌధభిత్తిగతా నూనం చంద్రకాస్తే సుధాసితే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 35)
రాజు భూమికి తిలకంగా నిర్మించిన నూతన భవంతుల్లో వెన్నెల ప్రసరించి గోడలకు వెల్ల వేసిన భావన కలిగించింది. రాజును దర్శించుకునేందుకు నగర దేవత ఎదురు చూస్తున్నట్టనిపించింది.
మూలోత్పాటే దశాస్యోరిర్మమేశేన వివార్థతః।
ఇత్యేవ భిన్నః కైలాసః సౌధవ్యాజాదివాగతః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 36)
ఈ నూతన నగరం కైలాసం లాగా అనిపించింది కైలాస పర్వతాన్ని కదిలించిన రావణాసురుడికి శివుడు వరాలు ఇవ్వటం పట్ల దుఃఖక్రాంత అయి కైలాసం భూమి మీదకు వచ్చినట్లు అనిపిస్తోంది, ఈ నగరం చూస్తూంటే.
చమత్కార భరితమైన వర్ణన.
జైనులాబిదీన్ వితస్త ఒడ్డున ఎత్తయిన ప్రదేశంలో నూతన నగరాన్ని నిర్మించాడు. ఇలా చెప్పటంలో ఎలాంటి ప్రతిభ లేదు. గొప్పతనం లేదు. కేవలం సమాచారం ఇచ్చినట్టుంది. ఓ వార్త రాసినట్టుంది. అంతే.
ఇందుకు భిన్నంగా, ఆ నూతన నగరంపై విరిసే వెన్నెల, రాజు దర్శనం కోసం, ఎదురుచూస్తున్నట్టుంది అనగానే, కళ్ళముందు దృశ్యం కనబడుతుంది. ఆనందం కలుగుతుంది.
కైలాసానికి హాని తలపెట్టిన రావణారుసుడిపై వరాలు కురిపించిన శివుడి పట్ల అలిగి, కైలాసం భూమిపైకి వచ్చిందనిపించేట్టు ఉంది ఆ నగరం అనటంతో ఇంకా గొప్పగా కళ్ళముందు దృశ్యం కనిపిస్తుంది. ‘కైలాసం’ అంతటి అందంగా, అద్భుతంగా, పవిత్రంగా ఉన్నదన్నమాట జైనులాబిదీన్ నిర్మించిన నూతన నగరం.
ఇలాంటి వర్ణనలు, రచనను ఆసక్తికరం చేస్తాయి.
రచన పఠనాన్ని అందమైన అనుభవంగా మలుస్తాయి.
రచనను మరచిపోకుండా గుర్తుండేటట్టు మనస్సులో స్థిరంగా నిలుపుతాయి.
ఇలాంటి వర్ణనాత్మక రచనలు పాఠకుడి ఊహకు పదును పెట్టి, అతడిని సున్నిత మనస్కుడిని చేసి, అతనిలో నిద్రాణ స్థితిలో ఉన్న సృజనాత్మకతను తట్టి లేపుతాయి. ఇది భారతీయ సాహిత్య లక్ష్యం కూడా.
ఇందుకుగా భిన్నంగా చూసిందే రాస్తాం, అనుభవించిందే రాస్తాం, ఊహలు, వర్ణననలు లేకుడా వార్తలు రాయటమే సృజనాత్మకత అన్న ప్రచారంతో ప్రస్తుతం సాహిత్యాన్ని రసవిహీనం చేసి, సృజనాత్మకతను వార్తల రచనలా రూపాంతరం చెందించటం కనిపిస్తుంది. నినాదాలు, సిద్ధాంతాలే సాహిత్యంగా చలామణీఅవుతూ, భారతీయ సాహిత్య సృజన లక్ష్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. అందుకే ఒకప్పుడు సమాజానికి దిశానిర్దేశణం చేసిన సాహిత్యం ఈనాడు దశదిశలేని స్థితికి దిగజారుతోంది.
అందుకనే ఈనాడు కాల్పనిక రచనల కన్నా కాల్పనికేతర రచనలకే ప్రజాదరణ పెరగటం కనిపిస్తోంది.
సమాజంలో సున్నితత్వం, జీవితంలోంచి రసం అదృశ్యమై మనుషుల్లో స్పందన రాహిత్యం, ఉదాసీనతలు, ఉద్విగ్నతలు అధికమవటం కనిపిస్తోంది.
శ్రీవరుడి రాజతరంగిణి సాహిత్యానికీ, సమాజ వ్యక్తిత్వ నిర్మాణానికీ నడుమ ఉన్న అవినాభవ సంబంధాన్ని గ్రహింపచేస్తోంది.
వ్యక్తి తనలోకి చూసుకుంటూ, తనని తాను అర్థం చేసుకోవటమే కాదు, తన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవటం ద్వారా విశ్వరచనలో తన పాత్రను అవగాహన చేసుకునేట్టు చేయటమే కదా సాహిత్యం పరమోద్దేశం!
(ఇంకా ఉంది)

1 Comments
గోనుగుంట మురళీకృష్ణ
జైనులాబిదీన్ సుపరిపాలన గురించి చాలా బాగా వివరించారు ఈవారం రాజతరంగిణి లో. ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా తేట తెలుగులో చెప్పటం ప్రశంసనీయం..రచన విధానంలో కూడా గతంలో కంటే ఇప్పుడు ప్రౌఢిమ కనబడుతున్నది… ఇక్కడ “కాశ్మీరేంద్ర పయోనిధి” అంటే కాశ్మీర దేశ ప్రభువు పాల సముద్రం లో పుట్టిన చంద్రుడు వంటి వాడు (పయస్సు = పాలు)” అనీ, “దయాపీయూష భూషణ ” అంటే దయ అనే అమృతమే అలంకారంగా కలవాడు (పీయూషము =అమృతం)” అని అర్థాలు.