ఆ రోజుల్లో పిల్లలు ఎంత తెలివిగా వుండేవారో, అంతకు రెట్టింపు అమాయకంగానూ వుండేవారు. ఇప్పటి పిల్లలు పుట్టుకతోనే తెలివి మీరిపోతున్నారు. కానీ ఒకప్పుడు పిల్లలు ఎంత ఎదిగినా ఒక్కోసారి చాలా అమాయకంగా ప్రవర్తించేవారు. అలాంటి పిల్లల్లో సిరిచందన ఒకరు. అమ్మానాన్నలకు గారాల కూతురు. అన్నయ్యలిద్దరికీ ముద్దుల చెల్లెలు. తాతయ్యా నానమ్మలకు సిరి అంటే ప్రాణం. అందరూ ముద్దుగా ‘సిరీ’ అని పిలుస్తారు. ఆ సిరి కబుర్లు కొన్ని చెప్పుకుందామా?
అప్పుడు సిరికి ఐదేళ్ళుంటాయేమో! బొమ్మలు ముందేసుకుని ఒక్కతే ఆడుకుంటోంది. అక్కడే కూర్చుని నానమ్మ తాతయ్యలు మాట్లాడుకునే మాటలు అప్రయత్నంగానే సిరి చెవిన పడ్డాయి.
“ఏమిటయ్యా, రోజులిట్లా తగలబడ్డాయి? సన్నబియ్యం కిలో 2.50 అట. అర్ధ రూపాయి నుండి ఎంత పెరిగిపోయిందో ధర! ఎప్పుడన్నా విన్నామా కన్నామా ఈ విడ్డూరం?” బాధగా అన్నది నానమ్మ.
“అవునే, అర్ధ రూపాయి కిచ్చే ఎం.ఎల్.ఎ. చుట్టల పాకెట్ ధర అమాంతం రెండు రూపాయలయిందిప్పుడు. రోజు రోజుకీ ధరలిట్లా పెరిగిపోతే మనకు దారేది? దొడ్లో పైసల చెట్టున్నా బాగుండేది కదా!” తాతయ్య జవాబు.
“అంత భాగ్యం కూడానా? ఏదో మధ్య తరగతి బ్రతుకులు మనవి. నెల జీతం మీద బ్రతికేవాళ్ళం. పైసల చెట్టున్నవాళ్ళు మనలాగెందుకుంటారూ?” అని నిట్టూర్చింది నానమ్మ.
“అంతే. అంతేలే” అన్నాడు తాతయ్య.
అన్నీ వింటున్నసిరి చిన్ని బుర్రలో ఒక పెద్ద ఆలోచన మెదిలింది. గబగబా ఏదో చదువుకొంటున్న పెద్దన్నయ్య రాజు దగ్గరికి వెళ్ళింది.
“అన్నయ్యా, పైసల చెట్టుంటుందా?” అని అడిగింది.
సిరి కన్నా రాజు ఏడేళ్ళు పెద్ద. సిరిని ఆటపట్టించడం రాజుకు సరదా.
చెల్లి అడిగిన ప్రశ్నకు నవ్వుతూ, “ఓ, వుంటుందిగా” అన్నాడు తమాషాగా.
“అది చాలా పెద్దగా అవుద్దా?” అడిగింది సిరి.
“చాలా పెద్దగా. మన దొడ్లో వున్న రేగు చెట్టంత పెద్దగా పెరుగుతుంది” చెల్లిని ఆటపట్టించడాని కలాగ అబద్ధం చెప్పాడు రాజు. కానీ సిరి అది నిజమని గాఢంగా నమ్మింది. చకచకా వంటగదిలో కెళ్ళి అమ్మ పోపులపెట్టె తెరిచింది. అందులోని జీలకర్ర డబ్బాలో వున్న రాగి పైసల్లోంచి ఒకటి తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. వాళ్ళ పెరడు మధ్యలో ఒక పెద్ద గంగిరేగు పండ్ల చెట్టుంది. సీజన్లో చెట్టు నిండా పండ్లు నిండి, బాగా పండినవి గాలికి రాలి నేలపైన పడ్తూంటాయి. ఎంత తియ్యగా వున్నా ఇంట్లో చెట్టయ్యేసరికి సిరికీ, అన్నయ్యలకు కూడా పెద్దగా రుచించవు. కానీ చుట్టుపక్కల వాళ్ళంతా ఇష్టంగా తింటారు ఆ చెట్టు పళ్ళను. సిరి తరచుగా ఆ పళ్ళను బ్యాగ్‌లో పోసుకుని స్కూలుకి తీసుకెళ్ళి ఫ్రెండ్స్‌కు యిస్తుంటుంది.
ఆ రేగు చెట్టును క్రింది నుంచి పైదాకా చూస్తూ ‘పైసల చెట్టు కూడా ఈ చెట్టంత పెద్దదయితే, ఈ పండ్లలాగే పైసలు కూడా క్రిందపడితే ఎంత బాగుంటుందో? అప్పుడు నానమ్మ బోలెడు బియ్యము కొనవచ్చు. తాతయ్య ఇన్ని ఎం.ఎల్.ఎ. చుట్టలు కొనుక్కోవచ్చు’ చేతులను వెడల్పుగా చాచుతూ అనుకొంది సిరి. చెంబుతో నీళ్ళు తెచ్చి, నేల పైన ఒక చోట పోసి, కర్ర పుల్లతో తవ్వి అందులో పైసా పెట్టి మట్టితో కప్పేసింది. తాతయ్య చేసేప్పుడు చూసిన జ్ఞాపకంతో, చుట్టూ పాదులాగా ఆ మట్టితోనే చిన్నారి చేతులతో నిర్మించింది సిరి. ఆ పాదులో చెంబెడు నీళ్ళు పోసి ‘హమ్మయ్య, ఇంక చెట్టు వచ్చేస్తుంది. చాలా పైసలు కాస్తాయి’ అని నిశ్చింతగా అనుకుని ఆటలో పడిపోయింది.
మర్నాడు పొద్దున్నే పెరట్లోకి పరిగెత్తి, మళ్ళీ ఒక చెంబెడు నీళ్ళు పాదులో పోసింది సిరి. అలాగ ప్రతీ ఉదయం ఆ పాదులో నీళ్ళు పోయడం అలవాటుగా మారింది సిరికి. సాయంకాలం స్కూలు నుండి రాగానే, కాళ్ళయినా కడుక్కోకుండా పాదు దగ్గరికి వెళ్ళి మొక్క వచ్చిందా, లేదా అని పరిశీలించేది.
ఇలాగ ఓ వారం గడిచాక, రోజూ నీళ్ళు పడుతుండడం వల్ల, ఎప్పుడో రాలిపడి భూమిలో మరుగైన రేగు విత్తనం చిన్న అంకురమై పైకి తొంగి చూసింది. అది చూసిన సిరి ఆనందానికి అంతులేదు. ఇంట్లోకి పరిగెత్తి వంట చేస్తున్న అమ్మ చేయి పట్టి లాగుతూ, “అమ్మా, అమ్మా, మన దొడ్లో పైసల చెట్టు వచ్చింది. రా, చూడు” అన్నది. “నానమ్మా నువ్వూ రా, మనింట్లో పైసల చెట్టు పుట్టింది” అంటూ పూజ చేసుకొంటున్న నానమ్మ నానమ్మనూ కేకేసింది. ఇంటి ముందు అరుగుపైన కూర్చుని చుట్ట కాలుస్తున్న తాతయ్యా, హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న నాన్న, బడికి తయారవుతున్న అన్నయ్యలూ సిరి హాడావిడి చూసి పెరట్లోకి వచ్చారు.
ప్రతీరోజూ ప్రొద్దున్నే పక్కపై నుండి లేవగానే పెరట్లోకి పరిగెత్తే సిరిని చూసి ‘బాత్రూమ్ కేమో’ అనుకొని అమ్మ అంతగా పట్టించుకోలేదు. అయితే సిరి ఇప్పుడొక చిన్నారి మొక్కను చూపిస్తూ “దీనికి బోలెడు పైసలు కాస్తాయి అమ్మా. మనం చాలా బొమ్మలూ, క్రొత్త బట్టలూ కొనుక్కోవచ్చు. తాతయ్యకు ఇన్నిన్ని చుట్టలు తేవచ్చు” చేతులతో చూపిస్తూ సంబరంగా చెప్తున్న సిరిని చూసి ఆశ్చర్యపడింది అమ్మ.
బుల్లి బుల్లి ఆకుపచ్చని ఆకులతో, పిల్లగాలికి మెల్లగా తల వూపుతున్న ఆ చిన్ని మొక్కను పరిశీలించిన అందరూ ఫక్కున నవ్వేశారు. అంతా ఎందుకు నవ్వుతున్నారో సిరికి అర్థం కాలేదు. “ఎందుకు నవ్వుతున్నారు?” అన్నది ఉక్రోషంగా.
“ఇది పైసల చెట్టు కాదు సిరీ. రేగుపండ్ల చెట్టు” అని వివరణ ఇచ్చాడు చిన్నన్నయ్య రాము.
బిక్కమొహం వేసింది సిరి. అది చూసి అందరికీ సిరి పైన జాలేసింది.
“పైసల చెట్లుండవు తల్లీ. ఎవరు చెప్పారు నీకు పైసల చెట్లుంటాయని?” సిరిని ఎత్తుకుంటూ లాలనగా అడిగాడు నాన్న.
పెద్దన్నయ్య రాజు వైపు కోపంగా చూసింది సిరి. కొంటెగా నవ్వాడు రాజు. అంతా నవ్వుకొన్నారు.
( మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం)
చల్లా సరోజినీదేవి చక్కని కథా రచయిత్రి. సమకాలీన సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే కథలను “భావ సుధలు” పేరిట సంపుటంగా వెలువరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జ్ఞాపకాల తరంగిణి-73
మరుగునపడ్డ మాణిక్యాలు – 92: ది అపార్ట్మెంట్
పాలమూరు సాహితి అవార్డు – 2023కు కవితా సంపుటాల ఆహ్వానం
గుప్పెడు ఏకాంతం కావాలి!
భయపడకు
రంగుల హేల 22: పరమ సత్యం
పదసంచిక-4
గుప్పెడంత మది
స్థపతీ! ఓ స్థపతీ!
ఫొటో కి కాప్షన్ 26
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®