[రాజీవ్ – నందినిని పెళ్ళి చేసుకోకపోతే, తాను నందినికి అండగా ఉంటానంటాడు రవీందర్. పెళ్ళి విషయంలో రాజీవ్‌కి, రవీందర్ వాదన జరుగుతుది. ఈ పెళ్ళి తన పరువు కోసం చేస్తున్నాడు రవీందర్ అంటాడు రాజీవ్. బామ్మకి వృద్ధాశ్రమంలో ఉండడం ఇష్టమైనా, ఎందుకు ఒప్పుకోవడం లేదని రాజీవ్ రవీందర్‌ని అడుగుతాడు. అది తన కుటుంబ వ్యవహారమనీ, వాదనలాపి, పెళ్ళికి సిద్ధం కమ్మని హెచ్చరిస్తాడు రవీందర్. పెళ్ళి ఆపడానికి రాజీవ్ ప్లాన్ వేస్తాడు. ఆ విషయం నందినికి చెప్పాలనుకుంటాడు. ఇక చదవండి.]
లోపల నందిని తయారవుతోంది.
‘నందినీ’ అని పిలిచాను…. వినిపించలేదు అనుకుంటా…
‘నందినీ’ అని మరోసారి గట్టిగా పిలిచాను.
నందిని ఒక్కసారి ఉలిక్కిపడింది. చుట్టూ వెతుకుతోంది.
“ఇక్కడ….ఇక్కడ…… పైకి చూడు.”
తల పైకెత్తి చూసింది. “రాజీవ్ ఎంటిది….?! ఎవరైనా చూస్తే? ముందు చెప్పేది విను…..!”
“నేను సతీష్‌తో మాట్లాడాను.”
“ఏంటి!” నందిని ఆశ్చర్యపోయింది.
“నేను చెప్పేది జాగ్రత్తగా విను… నేను సతీష్‌ని హాలు వెనుకగోడ అవతలకు బండిని తీసుకురమ్మన్నాను… మనిద్దరం ఎలాగైనా అక్కడికి వెళదాం… నువ్వు సతీష్‌తో వెళ్ళిపో. నేను ఏదో బస్సు పట్టుకొని హైదరాబాదుకి వెళ్ళిపోతాను. సరేనా?”
నందిని నోరెళ్ళబెట్టి వింటోంది….
నేనంతా చెప్పాక….. ఒక్కసారి తల విదిలించింది.
“నీకేమన్నా పిచ్చా? అలా ఎలా? నా వల్ల కాదు… మా నాన్న పరువేం కావాలి? అయినా నేను వస్తానని నువ్వు ఎలా అనుకున్నావ్? సతీష్‌ని మరిచిపోయానని నీకు చెప్పాను కదా?”
“లేదు.. లేదు.. విషయం సతీష్ కాదు. సతీష్‌తో వెళితే…. నీ లైఫ్ గురించి ఆలోచించు. నిన్ను నువ్వు చంపుకుని ఎవ్వర్ని ఉద్ధరిస్తావు?”
నందిని మొహం చిట్లించింది.
“అంటే ఏంటి?”
“అయినా ఇప్పుడవన్నీ చెప్పే సమయం లేదు. చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు బయలుదేరు నందినీ. నువ్వు నేను చెప్పినట్టు చేయి… అంతే…”
“చచ్చినా చేయను…. నేను నీతో రాను అంటే రాను… రాను… రాను… రాను….” నందిని తేల్చి చెప్పింది.
“ఇంత కష్టపడి ప్లాన్ చేశాను… ఇప్పుడు ఇలా అంటే ఎలా నందిని?”
“చూడు… అక్కడ పెళ్ళి మండపం సిద్ధంగా ఉంది. ఆశీర్వదించడానికి అందరూ వచ్చారు. గంటలో తన కూతురి పెళ్ళి వైభవంగా జరుగుతుందని ఆశగా మా నాన్న ఎదురుచూస్తున్నారు. ఆ ఆశలు ముక్కలు చేసి, నలుగురిలో ఆయన పరువుతీసేంత, స్వార్థపరురాలిని కాను. ఆయన పరువుపోతే చచ్చిపోతాడు. నువ్వు వచ్చి పెళ్ళిపీటలు మీద కూర్చుంటావా? లేదా? అది నీ ఇష్టం. కాని నేను మాత్రం ఆ పీటల మీద వెళ్ళి కూర్చోవడం ఖాయం….” నందిని పట్టుదలగా అంది.
“నా మాట ఒక్కసారి విను నందిని……..!”
***
“పెద్దయ్యా… పెద్దయ్యా… పెళ్ళికొడుకు, అమ్మగారు లేచిపోయారండి….” రాహుల్ పరిగెత్తుకుంటూ వచ్చి రవీందర్‌కి చెప్పాడు.
రవీందర్ ఒక్క క్షణం నివ్వెరపోయాడు. కోపంగా చుట్టూ చూసాడు. గదిలో ఎవ్వరు లేరు .
“వాళ్ళు వెళ్లి ఎంత సేపు అయ్యింది?”
“ఇదిగో ఇప్పుడే అయ్యా.”
“అయితే ఎక్కువ దూరం వెళ్లి ఉండరు. మన తొందరగా వెళ్ళితే పట్టుకోవచ్చు. సరే ఈ విషయం ఎవ్వరికి తెలీదు కదా?”
“తెలియదయ్య” రాహుల్ హామీ ఇచ్చాడు.
గోడకి కూడా చెవులుంటాయ్ ……….!
“హలో అన్నా! పెళ్లి కూతురు ఎవరితోటో జంప్ అంట.”
“వెరీ గుడ్!”
“నెక్స్ట్ ఏం జరుగుతుంది తమ్ముడు?”
“పెళ్లికూతురి తండ్రి ఆమెని పట్టుకోవడానికి వెళ్ళుతున్నారు.”
“మనం రాజీవ్ గాడిని పట్టుకొని తందామా?”
“నో! మనది ప్రపంచ ప్రేమికుల సంఘం. ఇప్పుడు నా రివెంజ్ కాదు ఇంపార్టెంట్. ప్రేమ రెస్క్యూ ఇంపార్టెంట్”
“ఏం చెయ్యాలి అన్నా?”
“ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు.”
“ఒరేయ్! ఎవర్రా మీరంతా? నన్నెoదుకు కట్టేస్తున్నారు?” రవీందర్ అడిగే లోపే ఒకడు నోట్లో గుడ్డలు కుక్కేసాడు.
రవీందర్ గింజుకుంటున్నాడు. లాభం లేదు.
“హలో హలో! పెళ్లికూతురు జంపు. పెళ్లి ఆగిపోయింది. మీరంతా ఇంటికి వెళ్లొచ్చు.”
హాల్లో ఒక్క నిమిషం అంతా నిశ్శబ్దం.
తరువాత మెల్లమెల్లగా గుసగుసలు మొదలయ్యాయి… అవి పెద్దవై… అరుపులయ్యాయి… అందరూ తేరుకునే లోపలే అరుపులు కాస్తా పెడబొబ్బలు అయ్యాయి.
ఉన్నటుండి “పెళ్ళికూతురు లేచిపోయింది. ప్రేమే గెలిచింది…” అని ఎవరో గట్టిగా అరుస్తున్నారు.
అసలు అరుస్తున్నవారు ఎవరో కూడా తెలియదు. వాళ్ళలో ముగ్గురు అబ్బాయిు, ఇద్దరు అమ్మాయిు ఉన్నారు.
“ప్రేమికులు వర్ధిల్లాలి. ప్రేమ వివాహం వర్ధిల్లాలి…”
“ఏం జరిగింది?” అరుపులకు నందిని బయటకు వచ్చింది.
అందరు నందినిని చూసి ఆశ్చర్యపోయారు.
“ఏంటి నువ్వూ లేచిపోలేదా?” ఆ గ్రూప్‌లో ఒకడు అడిగాడు.
“లేదే?” నందినికి అర్థం కాలేదు.
“ఏం భయం లేదు! మీ నాన్నను మేం కట్టేసాము. నువ్వు హ్యాపీగా లేచిపో.”
“ఏంటి? అయ్యో! కట్టేశారా? ఎక్కడ? ఎందుకు?” నందినితో పాటి అందరు కంగారు పడిపోయారు.
“ఆ రాజీవ్ గాడి నుంచి నిన్ను కాపాడి నీ ప్రేమని గెలిపించడానికి వచ్చాం.”
“మా నాన్న ఎక్కడ?” నందిని కోపంగా అడిగింది.
“నీకు అడ్డురావొద్దని మేమే కట్టేసాం. నువ్వు లేచిపో.”
“పిచ్చిపిచ్చిగా ఉందా? మా నాన్న ఎక్కడ?” నందిని ఏకంగా కొట్టడానికి వచ్చేసింది.
రవీందర్‌కు కట్లు విప్పేసరికి ఒళ్ళంతా నొప్పితో నీరసం వచ్చేసింది.
“ఎవర్రా మీరంతా?”
“మేము ప్ర ప్రే సంఘం”
“అదేంట్రా?”
“ప్రపంచ ప్రేమికుల సంఘం”.
“ఎందుకొచ్చారు?”
“రాజీవ్ గాడు నాతో పెట్టుకున్నాడు, నాకు నచ్చలేదు. పెళ్లి ఆపేద్దామని వచ్చాను.”
రవీందర్‌కి అంతా అయోమయంగా ఉంది. ఇంతలో ఒక వ్యక్తి రవీందర్ దగ్గరకు వచ్చాడు.
“సతీష్… నువ్వా?” నందిని అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. అందరూ సతీష్ వైపు తిరిగారు.
“సార్… నాకు జరిగింది ఏమిటో తెలియదు. కాని నాకు తెలిసింది చెబుతాను. నాకు రాజీవ్ ఈరోజు పొద్దున ఫోన్ చేసి… నందినిని వచ్చి తీసుకువెళ్ళమన్నాడు.”
“ఏం జరుగుతోంది ఇక్కడ?” రవీందర్ గర్జించాడు.
“నీ కోసం సతీష్ ఎందుకు వచ్చాడు?” రవీందర్ కళ్ళు ఎర్రగా మారాయి.
“మరి నువ్వు సతీష్ వెళ్ళిపోదామనుకుంటే… నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మరి రాజీవ్ ఏమయినట్టు?” శంకరంతో పాటే అక్కడ ఉన్న అందరికి అయోమయంగా, గందరగోళంగా ఉంది.
“నాన్నా మీతో కొంచెం మాట్లాడాలి.”
అందరూ నందని వైపు తిరిగారు.
“మీరందరూ కాస్త ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. సతీష్, నీకు రాజీవ్ ఏం చెప్పాడో తెలియదు. కాని నేను నీతో రావడానికి సిద్ధంగా లేను… నాన్నకి నచ్చని పని నేను ఎప్పటికి చెయ్యలేను”
“మరి?”
“నాన్నా, నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. చూడు…. నేను సతీష్‌ని ప్రేమించాను, కాని నీ అంత కాదు. నిన్ను ఎదిరించి సతీష్‌తో వెళ్లిపోయే పని కలలో కూడా చెయ్యను. అలాగని నువ్వు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోలేను. ఏదైనా నువ్వు ఒప్పుకున్నాకే నాన్న, నాకు అందరికంటే నువ్వే ముందు. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం నాన్న. నువ్వే నా హీరో. కాని ఒక్క విషయం! ప్రతి కూతురుకి తన తండ్రే తన మొదటి హీరో అవ్వాలనుకుంటుంది కాని కూతురిని అడ్డు పెట్టుకొని తండ్రి హీరో అవుతాననంటే ఎలా నాన్నా?” నందిని మాటలు ఆపేసి… తన చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తుంది.
రవీందర్ నందిని దగ్గరకు వచ్చి తల నిమిరాడు.
“సరేమ్మా… ఏడవకురా తల్లీ… నీకు నచ్చినట్టు చేయి. అసలు రాజీవ్ ఏడి?”
ఉన్నట్టుండి రాహుల్ సంగతి గుర్తొచ్చింది.
“ఓరేయ్ రాహుల్…. ఇటు రారా…. మధ్యలో ఎవరూ మాట్లాడకండి.” రవీందర్ అందరిని హెచ్చరించాడు.
రాహుల్ దగ్గరకొచ్చి చేతులు కట్టుకుని నిలుచున్నాడు.
“అసలు ఏం చూసి… అలా వాగావురా? అమ్మాయి ఇక్కడే ఉంది కదా”
“నేను మీకు అప్పటినుంచి అదే చెబుదాం అనుకుంటున్నాను…. పెద్దయ్య.”
“మరి త్వరగా చెప్పి చావు…!”
“నేనంది. పెళ్ళికొడుకు… అమ్మాయిగారు కాదు. పెళ్ళికొడుకు, అమ్మగారు లేచిపోయారు.”
“అమ్మగారా?! ఏ అమ్మగారు?!”
“మన అమ్మగారు….. అంటే అదే మీ అమ్మగారు.”
“మా అమ్మా?…” రవీందర్ కళ్ళు తేలేసి.. నోరెళ్ళబెట్టాడు. ఒక్క నిమిషంలో తేరుకొని..
“అమ్మ లేచిపోవడం ఏంట్రా నీ బొంద. అసలేం జరిగిందో సరిగ్గా చెప్పలేదో తాట తీస్తా…”
“ఏం లేదు పెద్దయ్యా… నేను చెత్త పారేయటానికి హాలు వెనక్కి వెళ్ళాను. అప్పుడు అక్కడ…”
“బామ్మా జాగ్రత్త పట్టుకో…. మెల్లగా మెల్లగా…” అంటూ నేను బామ్మను గోడ ఎక్కించాను.
నా చేతిలో ఉన్న రెండు బ్యాగులు గోడకి అవతల పారేశా…
నేను గోడ ఎక్కాను… చుట్టూ ఎవరు చూడటంలేదని నిర్ధారించుకొని… అటువైపు దూకాను.
మళ్ళీ చుట్టూ చూస్తూ బామ్మను దింపాను.
“త్వరగా… త్వరగా… ఎవరైనా చూస్తారు. పెద్ద గోల అవుతుంది.” బామ్మ తొందర పెట్టింది.
“సరే సరే… పద పద ….” నేను కంగారుపడ్డాను.
కాసేపు పరిగెత్తాక……
“అమ్మా! నేనింక నడవలేను రా….” బామ్మ రోడ్డుమీద కూర్చుండి పోయింది.
నేను కాసేపు బామ్మ పక్కన కూర్చుండి పోయాను.
“అవున్రా… ఈ వయసులో ఇలా దిక్కమాలిన పని చేస్తున్నాను. వాడు అర్థం చేసుకుంటాడంటావా?”
“ఎందుకర్థం చేసుకోడు బామ్మా! నీవు చేయి పట్టుకు నడిపిస్తే… నడిచాడు. నువ్వు మాట నేర్పిస్తే… నేర్చుకున్నాడు. నీ మనసును ఆమాత్రం అర్థం చేసుకోలేడా?”
“హు…. హమ్మ….. హ…. ఆ ఆ ఆ … అయ్యబాబోయ్! ఇంత బరువున్నావేంటి?….”
“పరిగెత్తు… పరిగెత్తు…” బామ్మ నన్ను అదిలించింది.
“ఆ…ఆ … నేను నిన్ను ఎత్తుకుని… నీ బ్యాగు మోస్తుంటే… దర్జాగా ఎక్కి బానే ప్రోత్సాహం ఇస్తున్నావు.”
“ఎందుకు రా… అంత కోపం?” బామ్మ జాలిగా అంది.
“కోపమా? తనది కాకపోతే… హనుమకొండ వరకు దేకమన్నాడట… నీలాంటోడే ఒకడు.”
“ఏంటో! నా ఖర్మ ఇలా తగలడింది… మొదట్లో నిన్ను పరిగెత్తించి… పరిగెత్తించి కొడదాం అనుకున్నా… కానీ ఇప్పుడు చూడు…”
“అమ్మో నావల్ల కాదు…” నేను బామ్మను కిందకు దింపాను… ఆయాసంతో ఊపిరి ఆడటం లేదు.
“అవును! నీ బ్యాగు ఏంటి ఇంత బరువుంది?”
“అదా….. లేచిపోతున్నా కదరా! డబ్బు, నగలు తెచ్చుకున్నా రా…”
“ఏంటి? డబ్బు, నగలా? ఎందుకు?”
“ఎందుకేంట్రా? ఎన్ని సినిమాల్లో చూడలేదు… అమ్మాయిులు లేచిపోయేటప్పుడు డబ్బు నగలు తెచ్చుకుంటారు.”
నాకు చిర్రెత్తుకొచ్చింది.
“బామ్మా!… అది అమ్మాయిలు లేచిపోయేటప్పుడు… అమ్మమ్మలు లేచిపోయేటప్పుడు కాదు.”
“అదిగో ఏదో బస్సులాగా ఉంది ఆపు…ఆపు…”
“బాబు…. ఈ బస్సు హైదరాబాదుకి పోతుందా?”
“పోతుంది…” కండక్టర్ మమ్మల్ని వింతగా చూస్తూ సమాధానం ఇచ్చాడు.
నేను, బామ్మ బస్సెక్కెశాం….
వచ్చి సీట్లో కూర్చున్నాను.
కిటికిలోంచి బయటకు చూసి… ఫ్లైట్ ఒక్క రెక్క కనిపిస్తోంది. టైం చూసా… ఫ్లైట్ బయలుదేరటానికి ఇంకా అరగంట టైం ఉంది.
లండన్ తిరిగి వెళ్ళేటప్పుడు అమ్మాయిని తీసుకువెళదాం… అనుకున్నా.. కాని అమ్మాయి జ్ఞాపకాన్ని తీసుకువెళుతున్నా…
మాయ తన ప్రేమని వదులుకోవడానికి, నందిని నన్ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోవడానికి, బామ్మ తన ఇష్టాన్ని దిగమింగి… బాధల్ని ఓర్చుకోవడానికి… అన్నిటికి ఒకే కారణం. ఆమె ప్రేమించిన వ్యక్తిని, అతని స్థానం, గౌరవం, పరువు కోల్పోకుండా నిరంతరం కాపాడాలని అనుకోవడం. ఆ స్థానం ఏదైనా కావచ్చు… తండ్రి, కొడుకు, భర్త… ఈ వ్యవస్థలో ఆ మనిషిని నిలబట్టే ప్రయత్నం వాళ్ళ జీవితం ఆఖరి నిమిషం వరకు చేస్తారు.
వారు నమ్మిన బంధానికి కట్టుబడి ఉంటారు. అమ్మ నాకు అర్థం చేయించాలనుకున్న… నాకు ఇన్నాళ్లు అర్థంకాలేని కాంప్రమైజ్ అంటే ఇదేనేమో?
ఏమో?… ఏం చేసినా… అమ్మాయిల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
పక్కన చూసాను. నా పక్క సీటు ఇంకా ఖాళీగా ఉంది.
దేవుడా! నా పక్కన ఏ చెత్తయినా కూర్చునేలా చేయి ఫరవాలేదు…. కానీ అమ్మాయి మాత్రం వద్దు.
కళ్ళు మూసుకొని త్రికరణశుద్ధిగా దేవుడిని ప్రార్థించాను.
కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా
చెత్త! ఓ సారి! చైత్ర…
దిమ్మతిరిగిన కారణంగా మనసులో అనుకోవల్సింది, పైకి అనేశా….. చైత్ర నా వైపు కోపంగా చూస్తూ… వచ్చి నా పక్కన కూర్చుంది.
“అదీ ఏదో పొరపాటున అన్నాను. సారీ చైత్రా!” ప్రాధేయపడ్డాను.
చైత్ర ఏమీ వినకుండా చెవిలో హెడ్‌ఫోన్ పెట్టుకొని… కళ్ళు మూసుకుంది.
కాసేపటికి ఏదో గుర్తొచ్చినట్టు…
“అవును నీ వెనక అమ్మాయిలు పడి చస్తారు. నీ కోసం పెళ్ళి మండపం వదిలి వస్త్తారు అని చెప్పావు? ఏమయింది?” అంది.
నేనేం మాట్లాడలేదు.
చైత్ర చిన్నగా నవ్వింది.
“ఆ రోజు పెద్దపెద్ద మాటలు మాట్లాడావ్…”
“నేనేం గొప్పలు చెప్పలేదు… నిజంగానే ఒక అమ్మాయిని పెళ్ళినుంచి లేపుకుపోయాను తెలుసా?” ధీమాని ప్రదర్శిస్తూ అన్నాను.
“మరి ఏది? కనిపించదే?” చైత్ర ఎగతాళిగా చూట్టూ చూసింది.
“వృద్ధాశ్రమంలో వదిలేశాను.”
“ఏంటి?”
“ఆవిడని వృద్ధాశ్రమంలో వదిలేశాను…” తిక్క, కోపం, అసహనం, ఓటమి, అన్నీ ఉన్నాయి… నా ఆవేదనలో….
నేను చెప్పిన కథ విని…. చైత్ర పడిపడి నవ్వింది. లండన్ చేరేవరకు నవ్వుతూనే ఉంది….
ఎయిర్పోర్ట్ బయటకి వచ్చాం. వస్తామని ఇద్దరు విడిపోయాం. బై చెప్పి నేను వెనకి తిరిగాను….
“రాజీవ్….”
చైత్ర నన్ను పిలుస్తోందా?
“రాజీవ్” ఈసారి కొంచెం గట్టిగా…
వెనక్కి తిరిగాను.
నిజమే, తను నన్ను పిలుస్తోంది.
మరీ నేను కలగన్నట్టు కాకపోయినా ఇంచుమించు అదే ఎక్స్ప్రెషన్తో .
చైత్ర దగ్గరికి వచ్చి… చేయి ముందుకు చాపింది.
“ఫ్రెండ్స్….”
నేను చేయి కలిపా… “ఫ్రెండ్స్…”
(సమాప్తం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
పరిష్వంగం
కాజాల్లాంటి బాజాలు-140: వద్దు వదినా!
సంచిక – పద ప్రతిభ – 33
కశ్మీర రాజతరంగిణి-57
‘కులం కథ’ పుస్తకం – ‘మంచితనానికి కులమేమిటి?’ – కథా విశ్లేషణ-3
భళారే – సినారె
జానేదేవ్-7
కొడిగట్టిన దీపాలు-21
చిరు తవికలు
అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు – రక్తపాశ అనుబంధాలు
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®