[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]


నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
తృతీయాశ్వాసము:
సంధ్యాసమయ చంద్రోదయ శోభ
429.
కం.:
ఘర్మపు వేళల దైత్యుడు
నిర్మల కేళీ విలాస నిలయము నందున్
శర్మోద్దీపితుడగుచును
కూర్మిని తన సతుల తోడ గూడి సుఖంచెన్
430.
చం.:
దినకర స్పర్శ సోకని గతిన్ గుబురొప్పిన నీడలందు, నా
మని, తమ సౌరభంబులను మత్తిలు షట్పద రాశి గ్రోలగాన్
తనిసిన పూల తేనె పొద తావుల, మల్లెల తీవలందు, తా
మనిశము రెక్కలార్చు వర హంసల శీతల కరంబులన్
దనుజ విభుండు రాజిలె నిదాఘపు తీవ్రత గేలి చేయుచున్.
431.
కం:
అహములు దీర్ఘము లయ్యెను.
అహమది వికటించు దైత్యనాథుని కనుచున్
సహియింపడనుచు రయమున
అహపతి పడమటను క్రుంగెనప్పుడు భీతిన్
432.
కం.:
రవి తేజము చూసిన కను
లివి, ఇతరుల చూడవంచు నిందీవరముల్
నవపత్రములను ముడిచెను
రవళించెడు సొంపు తప్పి, రవి యుడుగ నటుల్
433.
సీ:
నక్షత్ర కుసుమాల నలధరించిన యభము
రంగస్థలము వోలె రాజిలంగ
కాలమనెడు సూత్రధారి పట్టిన తెర
పగిది, చంద్రు నటన పారజూడ
సకల దిక్పతు లెల్ల సంధ్యానురక్తులై
నాటకంబును జూడనరుగుదెంచి
రనగ సంజకాంతి రాగంపు కెంజాయ
అలముకొనియె అంబరంబు నందు
తే.గీ.:
నాల్గు దిక్కుల వ్యాపించు నలుపదెల్ల
చక్రవాకపు జంటల సాంద్ర విరహ
కీలల పొగలట్లు నిలువ నిశియు
తమము గ్రమ్మగ వ్యాపించె యమితమగుచు
434.
ఉ.:
వేచెడు జార చోరులకు పెన్నిధి యట్ల తమంబు నిండె, ధీ
రోచిత సూర్య పీఠము సరోజ రిపుండధిరోహ రక్తుడై
వేచను సంధి కాలమున, బ్రీతులు కాగ యధర్మ వర్తనుల్
నీచులు, శిష్టరాజితమ నీతిపథంబల కెగ్గు కల్లగాన్
435.
ఉ.:
తూరుపు దిక్కు కాంతముఖ తోయజమందున తోచె తెల్పు యా
నీరజవైరి గర్భమున నిండ కపోలము పాలిపోవు నా
తీరున దోచె చీకటుల త్రెంచెడు చంద్రుని కాన్పు చేయగా
తారక లెల్ల గూడె తమదైన విధిన్ నెరవేర్చ బోవుచున్
436.
మ.:
శశిబింబం బుదయించె మెల్లగ నిశా సంపూర్ణ ఫాలంబునన్
వెసదిద్దన్ కనిపించు రాగ తిలకం బేయన్న చందంబునన్
నిశి గుర్విందల గుత్తి తూర్పు సతికిన్ మేలైన కాన్కన్ యొసం
గ, సముద్రంబున తెల్ల ఏన్గు నుదుటన్ కన్పట్టు సిందూరమై
రసికాగ్రేసరు లెల్ల బొంగ కలువల్ రంజిల్లు విప్పారగన్
437.
సీ.:
ఎగబ్రాకె చంద్రుండు ఎత్తైన చేతుల
దెసల కొమ్మల తార కుసుమములను
కోయనుత్సహించు కోరిక యన్నట్లు
తేజోవిరాజుడై తెలిసెనపుడు
వెన్నెల ప్రవహించి పెను పాలకడలట్లు.
అన్ని దిక్కుల ముంచ నందు శశియు
పాము చుట్టను బోలు పానుపు వలె నుండ
మచ్చ తోచెనపుడు మాధవునిగ
438.
వసంత తిలకము:
ఆ నిండు వెన్నెలను హాయిగ కల్వలెల్లన్
తేనెల్ వహించుచును తేటుల బిల్వ, బ్రీతిన్
రాణించు వాసనల, రాగములుప్పతిల్లన్
ఆనంద భంభరము లాడెను షట్పదంబుల్
439.
సుగంధి:
ఆకసంపు శయ్య మీద నందమైన వస్త్రమున్
సోకు మీర పర్చినట్లు శోభ జూపె చంద్రుడున్
తేకువన్ దిగంగనల్ మదిన్ విశాల ప్రేమ, న
స్తోకమన కౌగిలింత తృప్తి నిత్తురోయనన్
440.
ఉ.:
నీటను ముంచె సర్వమును నీరధి వోలె శశాంకుడప్డు మో
మాటము లేక, చంద్రమణి మార్గము నీరయి సొంపు జూపగా
దీటు చకోర పక్షముల తీర్చిన కల్వల మీద పారుచున్
పాటల గంధులందరికి బాగుగ కామము వృద్ధి చెందగా
441.
కం.:
ఈ విధి వెన్నెల కాయగ
ఏ విధమగు జంకు లేక, ఎల్ల సుఖములన్
వావిరి రాక్షసనాథుడు
కావించెను బానిసలుగ గర్వ సమృద్ధిన్
~
లఘువ్యాఖ్య:
ఈ భాగము అంతా చంద్రోదయ వర్ణనే. పద్యం 430లో మామిడిపూతల గుబురులు, సూర్యరశ్మి సోకనంత దట్టంగా ఉన్నాయట. వాటిలోని మకరందాలను షట్పదులు (తుమ్మెదలు) గ్రోలగా, అవి తనిశాయి (తృప్తి చెందాయి) అని చెప్పారు కవి. పద్యం 431లో పగళ్ళు ఎక్కువ సేపు ఉన్నాయని, హిరణ్యునికి కోపం వస్తుందని సూర్యుడు అస్తమించాడట, సూర్యుని తేజస్సు చూసిన కనులతో ఇక ఇతరుల తేజం చూడలేని పద్మాలు ముడుచుకున్నాయని అన్నారు కవి (పద్యం 432). పద్యం 433లో రాత్రి వర్ణన ఉంది. నక్షత్రాలనే కుసుమాలను ధరించిన ఆకాశం రంగస్థలంలా ఉందట. దిక్పాలురు సంధ్యానురక్తులై నాటకాన్ని చూడడానికి వచ్చారన్నట్లుంది అన్నారు కవి. పద్యం 434లో జారులకు, చోరులకు పెన్నిధిగా, చీకటి వ్యాపించింది. చెడ్డ పనులు చేసేవారు, నీచులు సంతోషించారని అన్నారు కవి. పద్యం 436లో మెల్లగా చంద్రబింబం ఉదయించింది. రాత్రి అనే నుదుట దిద్దిన ఎర్రని తిలకంలా ఉన్నాడు చంద్రుడు. గురవింద గింజల గుత్తిని తూర్పు కాంతకు కానుకనిచ్చినట్లు. తెల్ల ఏనుగు నుదుట సిందూరమేమో అన్నట్లుగా ఉందని అన్నారు కవి. ఈ పద్యంలో రూపకాలంకారం (Metaphor) ఉంది. పద్యం 437 లో చంద్రుడు మెల్లగా ఎగబ్రాకుతున్నాడు. వెన్నెల ప్రవహించి అన్ని దిక్కులను ముంచ సాగిందని అన్నారు కవి. పద్యం 438లో ‘వసంతతిలకము’ అనే వృత్తాన్ని కవి ప్రయోగించారు. దీనిలో చక్కని లయ (Rhythm) ఉంటుంది. కలువలు వెన్నెల్లో హాయిగా, తుమ్మెదలను పిలిచాయి. తమ్మెదలు ఆనందంతో ‘భంభరము’ (ధ్వని) లు చేశాయని అన్నారు. పద్యం 439 సుగంధి అనే వృత్తం. ఇదీ లయ ప్రధానమైనదే.
(సశేషం)

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.