[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]


[వైనతేయ డిగ్రీ పూర్తవుతుంది. హాస్టల్ ఖాళీ చేసి నంద్యాలకు వచ్చేస్తాడు. కర్నూలు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బి.ఇడికి, తెలుగు పండిట్ కోర్సుకు, రెంటికి దరఖాస్తు చేస్తాడు. బి.ఎడ్లో సీటు వస్తుంది. దస్తగిరిసారు సూచన మేరకు కాలేజీ హాస్టల్లోనే ఉంటాడు. హరికథా ప్రోగ్రాములు అడపాదడపా వస్తూనే ఉంటాయి. క్రమంగా హరికథలకు ఆదరణ తగ్గుతూండడం గమనిస్తాడు వైనతేయ. ఈ కళారూపాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా మలచాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడే జనాదరణ పొందుతున్న ‘వ్యక్తిత్వ వికాసం’ సబ్జెక్టు అతన్ని ఆకర్షిస్తుంది. పాశ్చాత్య దృక్పథంతో కాకుండా, భగవద్గీతలోని, ప్రబంధాలలోని, కావ్యాలలోని క్యారెక్టర్లను విశ్లేషిస్తూ, ఒక హరికథను రూపొందించుకుంటాడు. కర్నూలు బిర్లా టెంపుల్లో హరికథ చెప్పే అవకాశం వస్తుంది. ‘వ్యక్తిత్వశిల్పం’ అన్న హరికథను గానం చేస్తానని నిర్వాహకులకు చెప్తే, వారు అంగీకరిస్తారు. దస్తగిరిసారు హార్మోనియం, రామళ్లకోట నుండి జయరాములు తబలా సహకారం అందించడానికి వచ్చారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ప్రఖ్యాత న్యాయవాది శ్రీమాన్ ఉప్పులూరి విశ్వేశ్వరశాస్త్రి గారు రాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ‘తిమ్మయ్య’ గారు కూడా వచ్చారు. రామాయణ భారతాల లోని పాత్రల లక్షణాలూ, కాళిదాసు ‘శాకుంతలమ్’ నుంచి ఉదంతాలు చెప్తూ, మధ్యలో భగవద్గీతని ఉటంకిస్తూ హరికథని అద్భుతంగా చెప్తాడు వైనతేయ. పెద్దలందరూ అభినందిస్తారు. తిమ్మయ్య గారు వచ్చే నెలలో ఒంగోలు తమ కాలేజీ వార్షికోత్సవం ఉందనీ, వైనతేయ అక్కడ కూడా ఇదే థీమ్‌తో హరికథ చెప్పాలని కోరుతారు. సరేనంటాడు వైనతేయ. తాను చదివిన సాహిత్యం నుండి ఎన్నో దృష్టాంతాలను సేకరించుకుని వాటిని వ్యక్తిత్వ వికాసానికి అనుగుణంగా మార్చుకుని ‘వ్యక్తిత్వశిల్పం’ హరికథలు చెప్పసాగాడు. – ఇక చదవండి.]
వైనతేయ బి.ఎడ్ పూర్తయింది. అప్పటికింకా డి.ఎస్.సిలు రాలేదు. జిల్లా పరిషత్ హైస్కూళ్లల్లో టీచర్ల నియామకాలు ఎప్పుడు చేపడతారో అని ఎదురుచూడసాగాడు. ఎవరనుకుంటున్నారు? దస్తగిరిసారు!
ఈలోపు టి.టి.డి వారు, ‘శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్’ (SVBC) అని ప్రారంభించారు. దానిలో ‘సాదనీరాజనం’ అనీ కార్యక్రమం ప్రసారం చేస్తున్నారు. సంగీత కచేరీలు, నృత్యప్రదర్శనలు, అప్పుడపుడు హరికథలు కూడా ప్రత్యక్షప్రసారం అయ్యేవి.
దానికి కళాకారులు దరఖాస్తు చేసుకోవాలి. వారి వారి నేపథ్యాన్ని, సాధించిన విజయాలను పరిగణించి, సెలెక్షన్ కమిటీ, వారిని ఆహ్వానిస్తుంది. హేమాహేమీలకు మాత్రమే అవకాశం దొరికే గొప్ప పోగ్రామది.
వైనతేయ దానికి దరఖాస్తు చేసుకొన్నాడు. ‘కుచేలోపాఖ్యానం’ అతడు ప్రతిపాదించిన సబ్జెక్టు. ‘వ్యక్తిత్యశిల్పం’ అనుకున్నాడు గాని, అటువంటి వేదికపైన సాంప్రదాయకమైన యితివృత్తమే మంచిదని ‘కుచేలోపాఖ్యానం’ ప్రతిపాదించాడు.
ఆరు నెలలు గడిచాయి. వైనతేయకు స్కూల్ అసిస్టెంటుగా సెలెక్షన్ వచ్చింది. ప్రతిభ, రిజర్వేషన్ రెండూ ఉన్నాయి. ఇక అడ్డేముంది? అతన్ని బనగానిపల్లె జడ్.పి. హైస్కూలుకు ఇంగ్లీష్ స్కూలు అసిస్టెంట్‌గా నియమిస్తూ జిల్లా విద్యా శాఖాధికారి గారు ఉత్తర్వులు ఇచ్చారు.
దస్తగిరిసారు దగ్గరికి వెళ్లాడు వైనతేయ, ఆ అపాయింట్మెంట్ ఆర్డరు తీసుకొని. ఆయన కళ్లల్లో ఆనందదీపాలు! శిష్యున్ని అక్కున చేర్చుకున్నాడు. ఆయనకు, కాశించీ అమ్మకు పాదాభివందనం చేశాడు. తర్వాతే అమ్మానాన్నల దగ్గరికి వెళ్లాడు.
ఆనాటి స్కేళ్ల ప్రకారం అతనికి ఇరవైరెండు వేలు జీతం వస్తుందని దస్తగిరిసారు చెప్పినట్లు వారికి చెప్పాడు. “నాయనా, నేను బనగానిపల్లెలో జాయినయి, మంచి యిల్లు తీసుకుంటా. నీవు, అమ్మ, ఇంక హోటల్లో పని మానేయండి. మీరు నా దగ్గరే ఉండాల!”
కోనేటయ్య నవ్యాడు! “ఊరికే తిని కూర్చుంటే పొద్దెట్ల పోతాదిరా నాయనా!” అన్నాడా శ్రమజీవి. వారిద్దరికీ ఇంకా అరవై ఏండ్లు నిండలేదు. యాభైల్లోనే ఉన్నారు.
తిరుపాలమ్మ అన్నది – “వాడొక్కడూ తిండీ తిప్పలు కోసరం అవస్తలు పడాల్నా యేమన్నానా? చేసినన్ని రోజులు చేసినాము. ఇంక వాన్నిడిచిపెట్టి ఉండేది లేదు!”
బనగానిపల్లె హైస్కూలు జిల్లా లోని పెద్ద స్కూళ్ళల్లో ఒకటి. దాదాపు వేయిమంది పిల్లలు. ఇరవై ఎనిమిది మంది టీచర్లు. ఎనిమిది మంది బోధనేతర సిబ్బంది. పురాతన భవనం, బ్రిటిష్ కాలం నాటి కట్టడం.
బనగానిపల్లె పెద్ద ఊరే. బేతంచెర్ల కంటే పెద్దది. నంద్యాల కంటే చిన్నది. ఒకప్పుడు నవాబుల సంస్థానం. వారి కోట శిధిలాలు కూడా ఉన్నాయి. బనగానిపల్లె సంస్థానం భారత్‌లో విలీనం కావడానికి ఇష్టపడలేదని చాలామం౦దికి తెలియదు. సర్దార్ వల్లభాయి పటేల్ బెదిరిస్తే గానీ నవాబు దారికి రాలేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆరు నెలలకు సంస్థానం భారత రిపబ్లిక్లో విలీనమైంది.
బనగానిపల్లెలో ముస్లింల జనాభా ఎక్కువే. హైస్కూలు హెడ్మాస్టరు సయ్యద్ మహమ్మద్ అజాం గారు. వైనతేయ హరికథా కళాకారుడుగా ఆయనకు, స్టాఫ్‌కు తెలుసు.
శిష్యునికి యిల్లు వెదికి పెట్టడానికి దస్తగిరిసారు వచ్చాడు. ఆ ఊర్లో ఆయన స్నేహితుడు కంబాలరెడ్డి అని ఉన్నాడు. ఆయనకు బస్టాండులో పండ్ల అంగడి ఉంది. బనగానిపల్లె మామిడి పండ్లకు ప్రసిద్ధి. వీరబ్రహ్మేంద్ర స్వామివారు సజీవంగా తిరుగాడిన ఊరది.
కోవెలకుంట్లకు పోయే దారిలో, నవాబుపేట అనే వీధిలో ఇల్లు దొరికింది. ఇంటిముందు కొంచెం ఖాళీ స్థలం వదిలారు. కాంక్రీటు మిద్దె! ముందుగా హాలు. దాన్ని పడసాల ఉంటారు కర్నూలు జిల్లాలో. ఒక పక్క, కుడి వైపున, ఒక రూము. ఎడమవైపున వంటిల్లు, దానిలోనే దేవుని గూడు. వెనక వైపు వారపాగా దింపారు. దింపిన మేరకు గచ్చు చేశారు. పెరడు చిన్నదే. కాని లెట్రిన్ ఒకమూల, బాత్ రూం ఒక మూల, దూరంగా ఉన్నాయి. ఇల్లు మెయిన్ రోడ్డు మీదే ఉంది. కాని స్కూలుకు దూరం. స్కూలు రెండు మైళ్ళుంటుంది.
ఇంటి బాడుగ పన్నెండు వందలు. కరెంటు ఛార్జీ వంద. ఇంట్లోనే కొళాయిలు. మంచినీళ్ళు హంద్రీ నది నుంచి సరఫరా అవుతాయి. హంద్రీనదికి ఉపనది కుందు (కుముద్వతి) అనే ఏరు ఆ ప్రాంతంలో పారుతుంది. ఆ ప్రాంతాన్ని ‘రేనాడు’ అంటారు. ఫాక్షనిస్టుల అడ్డా అది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, స్థానిక నాయకడు ఏ పార్టీలో ఉంటే, అది గెలుస్తుంది.
మంచిరోజు చూసి పాలు పొంగించారు. కోనేటయ్య, తిరుపాలమ్మ ఉన్న సామాన్లు ఒక మినీ వ్యానులో తీసుకొని వచ్చారు. కాశింబీ, దస్తగిరిసారు వచ్చి సామాన్లు సర్దినారు.
గురుశిష్యులిద్దరూ బజారుకు వెళ్లి నాలుగు కుర్చీలు, రూములోకి ఒక నవారు మంచము, హాలు, రూములోకి ఫాన్లు తెచ్చారు. అప్పుడు గ్యాస్ స్టవ్‌లు వచ్చాయి. హెచ్.పి. గ్యాస్ కనెక్షన్ రెండు రోజుల్లో వచ్చింది. ఇంకా అవసరమైన స్టీలుగిన్నెలు, కుక్కరు అన్నీ తెచ్చుకున్నా రు. డబ్బు సారే పెట్టాడు.
“నీ జీతం వచ్చింతర్వాత ఇద్దువుగానిలే!” అన్నాడు.
స్కూలుకు వెళ్లి రావడానికి ఒక సైకిలు కొంటానన్నాడు వైనతేయ.
“నా స్కూటరిస్తా తీసుకోరా! ఈ మధ్య, వయసయిపోతుండ్లా, డ్రయివింగ్ చేస్తుంటే కొంచెం అట్లా ఇట్లా అయితుంది.” అన్నాడు సారు. ఆయనకింకా ఏడెనిమిదేండ్లు సర్వీసుంది.
ఆయనకు తన మీద ఉన్న ‘కన్సర్న్’ కు కదిలిపోయాడు శిష్యుడు!
కోనేటయ్యకు, తిరుపాలమ్మకు ఇదంతా కల మాదిరుంది. రామ్మునిగౌడు వీండ్లు పని మానేసి కొడుకు దగ్గరికి పోతున్నందుకు బాధపడలేదు. పైగా సంతోషించాడు.
“నీ మాదిరి పనోడు నాకు ఏడ దొరుకుతాడు సిన్నాయనా! కాని, వజ్జరం వజ్జరం పుట్టింది మీ కడుపున. పొండి, పోయి అయిగా ఉండండి కొడుకు కాడ!” అన్నాడు.
ఇద్దరికీ బట్టలు పెట్టాడు. కాళ్లకు మొక్కాడు. ఇన్ని రోజులు తన హోటల్లో సేవ చేసినందుకు పదివేల రూపాయలు చేతిలో పెట్టాడు. ఎంత వద్దన్నా వినలేదు. బిర్యానీ మాస్టరు, ఆయన పెండ్లాము వెళ్లిపోతున్నారని, హోటలు సిబ్బంది, రెగ్యులర్ కస్టమర్లు బాధపడ్డారు.
తిరుపాలమ్మకు గ్యాసు స్టవ్ మీద ఎట్లా వంట చేయాలో నేర్పించింది కాశింబీ. జాగ్రత్తలు చెప్పింది. అంతా విని తిరుపాలమ్మ అన్నది గ్యాస్ సిలిండర్‌ను చూస్తూ – “వంటిట్లోనే బాంబు పెట్టుకున్నట్లే గదమ్మా!”
కాశింబీ నవ్వింది! “అదేం లేదులేమ్మా! రెండ్రోజులు పోతే అదే అలవాటయిపోతాది” అంది.
ఆ రోజు కాశింబీనే వంట చేసింది. బుడంకాయ (పుల్ల దోసకాయ) పప్పు, పుండుకూర (గోంగూర) పచ్చడి, మటకాయల (గోరుచిక్కుడు) తాలింపు చేసి, రాములకాయల (టమోటాల)తో చారు చేసింది. ఆ సాయంత్రం సారు, అమ్మ వెళ్లిపోయారు నంద్యాలకు.
వైనతేయ తొలి జీతం అందుకున్నాడు. తల్లిని తండ్రిని తీసుకొని నంద్యాలకు వెళ్లినాడు. గంటన్నర ప్రయాణం అంతే. సారుకు పాంటు, షర్టు, కాశింబీ అమ్మకు చీర తీసుకున్నాడు. సారుకు అరతులం పెట్టి ఉంగరం తీసుకున్నాడు. అప్పుడు బంగారం ధర తులం పన్నెండు వేలుంది. రామ్మునిగౌడిచ్చిన పదివేలు కొడుక్కిచ్చాడు కోనేటయ్య. “ఇలా దుబారా ఖర్చులు చేస్తే ఏం బాగు పడతావురా?” అన్నాడు దస్తగిరిసారు. ఆయన గొంతులో వాత్సల్యం. అంత ఖరీదు పెట్టి తనకు ఉంగరం చేయించకపోతేనేమని కోప్పడ్డాడు.
“మా పాలిటి మద్దిలేటి నరసింహస్వామివి సారు నీవు. మావాడు ఇంతవాడయినాడంటే నీ చలువే. రెడ్డి శేను గుంజుకోకుండా సాయపడితివి. నీ రునం తీర్చుకునేది కాదు” అన్నాడు కోనేటయ్య.
ఆ రోజు చికెను బిర్యాని తాను చేస్తానన్నాడు. పైగా, “పని లేక చేతులు చిమచిమలాడుతుండాయి” అంటుంటే అందరూ నవ్వారు. కోనేటయ్య బిర్యానీ చేస్తే, కాశింబీ ఉద్దివడలు చేసింది. ములక్కాడల పులుసు చేసింది.
రెండు రోజులుండి బనగానిపల్లెకు తిరిగివచ్చారు. ఒకరోజు కోనేటయ్య అన్నాడు కొడుకుతో –
“నాయనా, మన్సికి పనిలేకపోతే శానా మంచిదికాదు. నా మాటిను. నాకు ఏదైనా ఓటల్లో పని చూడు.”
వైనతేయ ఆలోచించాడు. నాయనన్నది నిజమే! వ్యాపకం ఉండాలి. వాళ్లిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వృద్ధాప్య ఛాయలు ఇంకా లేవు. “నాయనా, ఒక పని చేద్దాము. మన యింటి ముందు కొంచెం స్థలం ఉంది కదా! ఇల్లు రోడ్డు మీదికి ఉంది. రోజూ పొద్దున పూట ఉగ్గాని, బజ్జీ, కారందోస చేయండి. పదకొండు గంటలకు అలసంద వడలు వెయ్యండి. టిఫిన్ సెంటరన్నమాట. తక్కువ దరకు ఇద్దాము. సాయంత్రం మాత్రం రెస్టు తీసుకోండి.”
అలా ‘దస్తగిరి టిఫిన్ సెంటర్’ మొదలైంది. అదే టిఫిన్ తిని బడికి వెళ్లిపోయేవాడు. మధ్యాహ్నం వచ్చి అన్నం తిని వెళ్లేవాడు. దస్తగిరి సారు స్కూటరు తెచ్చుకోలేదు. ఆయనకు వయసు మీద పడటం, డ్రయివింగ్ చేయలేకపోవడం అంతా అబద్ధమని, తన సౌకర్యం కోసం అలా చెప్పాడని వైనతేయకు తెలుసు. ఒక హెర్క్యులస్ సైకిలు కొనుక్కున్నాడు.
***
ఒకరోజు నంద్యాల, దస్తగిరిసారు ఇంటి అడ్రసుకు యస్.వి.బి.సి ఛానెల్, తిరుపతి నుంచి రిజిస్టర్డ్ లెటరు వచ్చింది. ఆ అడ్రసే ఇచ్చాడు వైనతేయ దరఖాస్తు ఫారంలో. అందులోని లెటరు చదివి, ఆనందానుభూతికి లోనయ్యాడు. ‘నాదనీరాజనం’ కార్యక్రమంలో పాల్గొనడానికి వైనతేయ ఎంపికయ్యాడు! తేదీ కూడా ఖరారు చేసి పంపారు. వాయిద్య సహకారం కళాకారులు సమకూర్చుకోవలసిందే!
వెంటనే బనగానిపల్లెకు బయలుదేరాడు దస్తగిరిసారు. శుభవార్తను శిష్యుడికి చెప్పాడు.
“సార్, సదాశివశర్మగారికి లెటరు రాద్దాం” అన్నాడు వైనతేయ.
“తప్పకుండా!” అన్నాడు సారు. ఒక ఇన్లాండ్ లెటర్లో విషయం శర్మ గారికి రాసి పోస్టులో పంపారు.
కార్యక్రమం ఇంకా నెల రోజులుంది. పదిరోజుల తర్వాత శర్మ గారి నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. తన ఆశీస్సుల నందజేస్తూ, రెండు రోజులు ముందుగా రమ్మని రాశాడాయన.
స్కూల్లో ఈ విషయం తెలిసి అందరూ అభినందించారు. టీచర్‌గా కూడా వైనతేయ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంగ్లీషు సబ్జెక్టును బాగా బోధిస్తాడని, నాటకీయంగా సన్నివేశాలను ఆవిష్కరించి విద్యార్థులను ఆకట్టుకుంటాడని పేరు వచ్చింది.
కోనేటయ్యకు, తిరుపాలమ్మకు, తనకు, దస్తగిరిసారుకు, కాశించీ అమ్మకు, తబలిస్టు జయరాములుకు కర్నూలు నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ చేయించాడు. కర్నూలులోని టి.టి.డి సమాచార కేంద్రంలో అందరికీ స్వామివారి దర్శనం బుక్ చేసుకున్నారు.
‘కుచేలోపాఖ్యానం’ ప్రసిద్ధమైన కథ. స్నేహానికి అంతరాలు ఉండవని నిరూపించే కథ. దానిని ఎలా ఆసక్తికరంగా మలచాలని ఒక ప్రణాళిక తయారుచేసుకొన్నాడు. దస్తగిరిసారుతో చర్చిస్తే,
“బాగుంది. కానీ శర్మగారికి చూపిద్దాం. ఆయన సూచనలు పాటిద్దాం” అన్నాడాయన.
మూడురోజుల ముందే, రాత్రి భోజనాలు చేసి అందరూ కర్నూలు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుంచి బయల్దేరి రాత్రి పన్నెండుబావుకు కర్నూలుకు వస్తుంది. డోన్, గుత్తి, తాడిపత్రి, కడపల మీదుగా తిరుపతికి మర్నాడుదయం ఎనిమిది లోపు చేరుకుంటుంది. ఆ రోజు సకాలానికే వచ్చింది. అందరికీ స్లీపర్ క్లాస్‌లో బెర్తులు రిజర్యు ఐనాయి. వారందరికీ, అలా బెర్తుల్లో ప్రయాణించడం అదే ప్రథమం.
దేవస్థానంలో ‘రాంబగీచా’ అతిథిగృహంలో యస్.వి.బి.సి. వారు వారికి రెండు రూములు ఇచ్చారు. ముందుగా అక్కడికి వెళ్లి సామాన్లు పెట్టుకొని, సా॥ 4 గంటలకు అందరూ ప్రత్యేక దర్శనం క్యూలో ప్రవేశించారు. అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీనివాసుని దివ్య దర్శనం లభించడానికి వారికి నాలుగు గంటలు పట్టింది. ఆ దివ్య దర్శనం అపురూపం!
శ్రీవారి అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనాలు చేసి, రూములకు వెళ్లి విశ్రాంతి తీసుకొన్నారు. మర్నాడుదయం అందరూ ఒక వ్యాన్ మాట్లాడుకుని, బైరాగిపట్టెడ లోని సదాశివశర్మ గారింటికి వెళ్లారు. శర్మ దంపతులు వీరిని సాదరంగా ఆహ్వానించారు.
తమ పాదాలకు ప్రణమిల్లిన వైనతేయను వారు గుండెలకు హత్తుకున్నారు. శర్మగారిలా అన్నారు –
“నాయనా, నీ అభివృద్ధి ‘ఇంతింతై వటుడింతయై’ అన్నట్లుగా సాగుతూంది. ‘నాదనీరాజనం’ ఒక గొప్ప కార్యక్రమం. అందులో అవకాశం రావడం సామాన్య విషయం కాదు. భారతదేశంలోని లబ్ధప్రతిష్ఠులైన, కలైమామణి, పద్మశ్రీ లాంటి పురస్కారాలు పొందిన మహా విద్వాంసులు ఈ వేదికమీద తమ ప్రదర్శన లిస్తారు. ప్రత్యక్ష ప్రసారం కాబట్టి లక్షల మంది దీనిని టీవీలలో చూస్తారు. స్క్రీనింగ్ కమిటీలో నేనూ ఒక సభ్యుడినే. నీవు నా శిష్యుడివన్న సంగతి ఇక్కడి వారికి తెలుసు. నీ సెలెక్షన్ విషయంలో, పక్షపాతం వహించాడన్న అపవాదు రాకుండా, నేను కమిటీ నుంచి తప్పుకున్నాను.”
ఆయన తన గురువైనందుకు తన జన్మధన్యమైందని అనుకున్నాడు వైనతేయ. మర్నాడు సాయంత్రమే ప్రోగ్రాము.
వకుళమ్మగారు అందరికీ అటుకుల ఉప్మా చేసి పెట్టారు.
కుచేలోపాఖ్యానాన్ని తాను ఎలా ‘విభిన్నంగా’ ప్రదర్శించదల్చుకున్నాడో శర్మగారికి వివరించాడు వైనతేయ. ఆయన కొన్ని సూచనలు చేశాడు.
రూములో ముగ్గురూ రిహార్సల్ చేసుకొన్నారు.
(ఇంకా ఉంది)

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.