(టాఠాజీ గోషా చేతిని పట్టుకుని ఇంట్లో ప్రవేశిస్తారు. టాఠాజీ…… తొడుగుకున్నారు. కాస్తంత గాభరాగా ఉన్నారు. గోషా ముఖంపైన కూడా గాభరా కనిపిస్తోంది.)
టాఠాజీ : శారికా… శారికా….
శారిక : (పరిగెట్టి వచ్చి) చెప్పండి….
టాఠాజీ : శిబన్ ఏడీ?
శారిక : శిబన్……
టాఠాజీ : మొత్తం ప్రదేశం అంతటిలో కర్ఫ్యూ పెట్టేరుట…. లోపల కన్యాకదల్లో గుళ్లు పేలుతున్నాయన్నారు. శిబన్ ఏడీ?… అసలు వచ్చాడా? లేదా?
శారిక : శిబన్, చమన్తో వెళ్లేడే? సాయంత్రం కాకముందే ఇద్దరూ వెళ్లిపోయారు. ఈపాటికి… (గాభరా పడుతుంది)
టాఠాజీ : గోషా నాకు పెద్దమ్మ ఇంటి గుమ్మం దగ్గర కనిపించబట్టి …. వాడిని తీసుకురాగలిగాను… కాని రావటానికి చాలా ఇబ్బంది పడ్డాం….. (గోషా భయంతో ఉన్నట్లే ముందుకు వస్తాడు. శారిక అభిమానంగా అతడి చేతిని పట్టుకుంటుంది. ఇద్దరూ లోపలికి వెళ్తూండగా, టాఠాజీ కూడా తలుపును భద్రంగా మూసి లోపలికొస్తారు.) ఎక్కడి కెళ్లి ఉంటారు చెప్మా వీళ్లిద్దరూ? రాత్రవుతున్నా…. ఇంటి గురించి బెంగే లేదు కదా వీడికి? ఇప్పుడు వెతుక్కుంటూ ఎక్కడికని పోవటం?
శారిక: వచ్చేస్తాడు లెండి… మీరు మరీ అంత కంగారు పడకండి… వస్తూనే ఉంటాడు లెండి… (రెండు వైపులా కొద్ది క్షణాల పాటు నిశ్శబ్దం ఉంటుంది) రండి, వడ్డించేస్తాను. అప్పటికీ మీరు తినేసి కూర్చుందురు గాని!
టాఠాజీ : నాకు ఆకలిగా లేదమ్మా… నువ్వు, గోషా తినెయ్యండి. (కంగారుగా) గోషాకి తినిపించెయ్యి.
గోషా : ఉహుఁ! నేనేం తినను.
శారిక : (కోపంగా ఉన్నట్లు నటిస్తూ) అన్నం తినవూ?
గోషా : శిబన్ బాబాయ్తోనే తింటాను….
శారిక : లేదు నాన్నా….. వాళ్ళొచ్చేసరికి ఆలస్యం కావచ్చు… నువ్వు రా…!
గోషా: ఉహుఁ! ఆలస్యమయితే ఆలస్యంగానే తింటాను! కాని బాబాయ్తోనే తింటాను.
శారిక : గోషా!
గోషా : (మొండిగా) ఒద్దన్నాను కదా! ఒద్దు… అంతే (ఆ క్షణంలోనే తలుపు తట్టిన చప్పుడు కావడంతో అంతా ఉలిక్కి పడతారు. శారిక తొందరగా అడుగులు వేస్తూ తలుపు వైపు వెళ్ల బోతూండగా, టాఠాజీ తనని పట్టుకు ఆపేస్తారు.)
శారిక : (కంగారుగానే ఉన్నా, టాఠాజీకి ధైర్యం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో) ఉండండి తలుపు తీస్తాను. బహుశా శిబన్ అయుంటాడు.
టాఠాజీ : ఒద్దు! నువ్వుండు – నేను తీస్తాను…
గోషా: (అమాయకంగానైనా కంగారు పడుతున్న కంఠస్వరంతో) ఒక వేళ ఎవరయినా తుపాకీ పట్టుకున్న వాళ్లయితే…?
(గోషా మాటలు విన్న టాఠాజీ, శారిక ఇద్దరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డట్లవుతారు. గోషా నిల్చుండి పోయాడు. శారిక అతడి దగ్గర కెళ్లి భయపడవద్దన్నట్లు అదుముకుంటుంది.)
టాఠాజీ : (తనలో తనే మాట్లాడుకుంటున్నట్లు) ఎప్పటిదాకా తియ్యకుండా ఉండగలను? తలుపు తెరవక పోయినా మరో దారిలోంచి లోపలకు రాకుండానే ఉంటారా? వచ్చినవాళ్లు?… (టాఠాజీ తిరిగి తలుపువైపు వెళ్లబోతూ ఉంటే, శారిక ఆయనను ఆపుతుంది)
శారిక : (లోతుకుపోయిన గొంతుకతో) ముందు ఆ కన్నంలోంచి చూద్దాం! (అంటూ ఉండగానే గొంతుక పూడుకు పోతుంది. టాఠాజీ ముందుకు వెళ్లి బైటకు చూస్తారు. ఆగి, ఏదో ఆలోచిస్తారు. శారిక కంగారు పడుతూ) ఎవరు టాఠాజీ?
టాఠాజీ : (ఒణికిపోతూ) ఏమో, ఎవరో ఉన్నారు!… మొహం కనిపించటం లేదు. శరీరమే కానొస్తోంది. (శారిక గజ-గజ ఒణికి పోతుంది. గోషాను తన శరీరానికి మరింత దగ్గరగా హత్తుకుంటుంది. కాని గోషా తనను తాను విడిపించుకుంటాడు.)
గోషా: తల లేకపోతే తుపాకీ ఎలా పేల్చడగలడు? (శారికను భయం నీడలు పూర్తిగా కమ్మేశాయి.)
టాఠాజీ : (భయపడినా ధైర్యం కూడదీసుకున్న…… గొంతుకతో) తలెందుకు ఉండదు? చీకట్లో కనిపిస్తుందా? (టాఠాజీ ముందుకు వెళ్లి ఒణుకుతున్న చేతుల్లో ధైర్యాన్ని కూడదీసుకుని, తలుపు తెరిచేస్తారు. తలుపు తెరుచుకోగానే కంగారు పడుతున్న శిబన్, రొప్పుకుంటూన్న స్థితిలో ఇంట్లో కొస్తాడు.)
శిబన్ : టాఠాజీ…. చమన్…
శారిక : (అరిచినట్లు) ఏమయింది?… ఏమయింది చమన్కి?
శిబన్ : (తనను తాను అపుకుంటున్నట్లు) చమన్ – చమన్ని … వాళ్లు తుపాకీ గుండేసి పేల్చేశారు. వాళ్లు…
శారిక : (గట్టిగా అరుస్తుంది) చమన్… (రంగస్థలం పైన కుప్పకూలి పోతుంది. టాఠాజీ, శిబన్, గోషా – ముగ్గరూ శారికను చూస్తూ మెల్లమెల్లగా, మొహాలపైన భయపు ఛాయలు కనిపిస్తుండగా రంగస్థలం పైనుండి తప్పుకుంటారు. వాళ్లు వెళ్లిన తరవాత శారిక మెల్ల-మెల్లగా లేస్తుంది. స్క్రీను పైన మళ్లీ చీనార్ చెట్టునీడ కనిపిస్తుంది. శారిక చెట్టు నీడ నుండి దూరం జరిగేక, రంగస్థలంపైన కాంతి ప్రసరిస్తుంది.)
(Flash back సమాప్తం)
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™