ఇది బయోపిక్కుల సీజను. ఈ ప్రసార సాధనాల కారణంగా మనకి చాలా మంది మహానుభావుల గురించి ముందే వివరంగా తెలుసు. లేదూ బయోపిక్కు చూసిన తర్వాత అయినా తెలుసుకునే అవకాశం వున్నది. ఉదాహరణకి మల్లేశం టెడ్ టాక్ ఇదివరకే చూసినవారున్నారు. లేదూ సినెమా చూసిన తర్వాతైనా చూసిన వారున్నారు. నేనైతే తర్వాతే చూశాను. ఇంతకు ముందు అరుణాచలం మురుగునాథన్ వీడియో చూసి చాలా ప్రభావితుడినయ్యాను. అతనిమీద బయోపిక్కు తీస్తున్నారని తెలిసి సంతోషించాను కూడా. Padman వచ్చింది. వ్యాపార చిత్రం లా. అయినా నచ్చింది. ఆ విధంగా అది చాలా యెక్కువమంది ప్రేక్షకులను చేరినందుకు. ఇప్పుడు ఈ చిత్రం సూపర్ 30 రాజస్థాన్ (Kota) లోని ఆనంద్ కుమార్ అనే వ్యక్తి బయోపిక్కు. ప్రతి యేటా IIT-JEE (ఇప్పుడు పేరు మారింది) ఫలితాలు వచ్చినప్పుడు ఆనంద్ కుమార్ బేచిలో యెంతమందికి ర్యాంకులు వచ్చాయి అన్నది కూడా వార్తగా వస్తుంది. అతని గురించి క్లుప్తంగా వ్రాస్తారు. ఇప్పుడు అతని బయోపిక్కు అంటే సహజంగానే నాలో కుతూహలం కలిగింది.


చిల్లర్ పార్టీ, క్వీన్ లాంటి గొప్ప చిత్రాలు అందించిన వికాస్ బహల్ సామర్థ్యం ఇక్కడ కాస్త పలుచనబారినట్లు అనిపిస్తుంది. బహుశా ఇది తీసే సమయంలో కొన్ని వివాదాలలో చిక్కుకోవడం ఆ మానసిక పరిస్థితుల ప్రభావం కావచ్చు. చిత్రం గొప్పగా లేకపోయినా ఆ సబ్జెక్ట్ బలం మీద సినెమా గుర్తుండి పోతుంది. ఆనంద్ కుమార్ గా హృతిక్ యెప్పటిలానే మంచి నటన అందించాడు. అజయ్ అతుల్ ల ద్వయం మంచి నేపథ్య సంగీతం, మంచి పాటలు అందించింది. అమితాభ్ భట్టాచార్య వ్రాసిన పాటలు అంతే బాగున్నాయి. వీరెంద్ర సక్సేనా, పంకజ్ త్రిపాఠి ల గురించి కొత్తగా యేం చెబుతాం గాని, కొత్త కుర్రాడు నందిశ్ సింఘ్ హృతిక్ అన్నగా చిన్న పాత్రే అయినా బాగా చేశాడు.
అనయ్ గోస్వామి చాయాగ్రహం కొన్ని చోట్ల చాలా బాగుంది. అద్భుతమైన స్టిల్ల్ ఫొటోగ్రఫీల్లాంటివి. కాని అనవసరమైన సినెమేటిక్ డ్రామా కారణంగా కొన్నిచోట్ల పలచనబారుతుంది.
వికాస్ బహల్ క్వీన్ లో మనం ఊహించనంత గొప్ప కథనం ఇచ్చాడు. ఆ పాత్ర, ఆ సంఘటనలు అన్నీ మన సినెమాకు కొత్తే. కాని నిజజీవితంలో హీరో అయిన ఆనంద్ కుమార్ కథను తీసుకున్నప్పుడు అతడు సునాయాసంగా గొప్ప కథను ఇవ్వవచ్చు, కాని అలా జరగలేదు. వొక హిందీ వ్యాపార చిత్ర లక్షణాలన్నీ మనల్ను వెక్కిరిస్తాయి. హృతిక్ నటనలో, నిజాయితీలో నమ్మకం వుంది. కాని ఆ సెంటర్ నడపడం కోసం దుస్తులతో సహా అన్నీ అమ్ముకున్న ఆ కుటుంబం, హృతిక్ ను మాత్రం రోజుకో చొక్కాలో చూపించడం వగైరా చిరాకు కలిగిస్తుంది. మరో పక్క ఆ ముప్పై మంది పిల్లల్ని చూడండి. వొక నిజ జీవిత చిత్రణకు సరిపడా సామాను వారు. తెరను అక్షరాలా వెలిగిస్తారు వారు. పీరియడ్ సినెమా గా చూసినా చాలా అశ్రధ్ధ కనిపిస్తుంది. మచ్చుకి వొకటి. మొదటి సారి పిల్లలు ఎంట్రెన్సు ఫలితాలు వచ్చినప్పుడు హృతిక్ వొక గోడకానుకుని నిలబడి వుంటాడు. ఆ గోడ మీద 100/108 ఫోన్ నెంబర్లతో ప్రభుత్వ సేవల పోస్టరు కనిపిస్తుంది. ఆ విధంగా కూడా మనం సినెమాలో పూర్తిగా లీనమవ్వడానికి లేకుండా అడ్డం పడుతుంటాయి ఇలాంటివి.
సరే, వొక తృప్తినిచ్చే సినెమా అనుభవం కోసం కాకపోయినా, వొక మంచి సబ్జెక్ట్ కోసమైనా చూడవచ్చు దీన్ని. మానెయ్యమని అయితే చెప్పను.

సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
2 Comments
Niharika
ఆనంద్ గారిది రాజస్థాన్ కాదు బీహార్ కదా ? “ఒక” అని వ్రాస్తే బాగుంటుంది. వొక బాలేదు.
పరేష్ ఎన్. దోషి
Thank you for your response. Yes he came from Bihar as you rightly said. But he set uphis coaching center in Kota.
ఇక వొక అన్న పదం వ్యాకరణ సమ్మతం కాకున్నా వ్యవహారంలో స్థిరపడింది. నా అలవాటు కూడా అదే.