[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘సుస్వరాల ఆస్వాదనలో..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


చెదరని చిరునవ్వుల సాక్షిగా
ఆటపాటలతో హుషారైన
సందళ్ళ నడుమ
చిన్నారుల కేరింతలు..
ఆమని రాకకు స్వాగతం పలుకుతూ
కోయిలమ్మల కుహు.. కుహూ.. రాగాలు..
కురుస్తున్న వానలకు
పారుతున్న సెలయేళ్ళు చేస్తున్న
గలగలల చిరు సవ్వళ్ళు..
నయన సుమనోహరమైన
నాట్యంతో ఆకట్టుకుంటున్న
నర్తకి కాలి సిరిమువ్వల నాదాలు..
ఊపిరి లీనమైన పిల్లనగ్రోవి పలికే
అనురాగ గమకాలు..
ఎద వీణను మీటుతున్న
అనుభూతుల సుస్వరాలు ఆలకిస్తున్న హృదయం..
ఆనంద భరితం!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.