మనిషి మనిషి మధ్యన
ఏదో తెలియని బంధం
అల్లుకుని ప్రవహిస్తే
దొరుకుతుంది అంతు తెలియని అనుభూతి
కులంతో సంబంధం లేదు
మతంతో ముడి ఉండదు
గుడిసా, బంగ్లానా, దేశమా, విదేశమా
ఎక్కడ ఉంటున్నావన్నది అసలు అక్కర్లేదు
మానసిక అనుబంధం ఒక్కటి చాలు
వరుసలతో పని లేనే లేదు
సంబంధం పేరు ఏదైనా
విడివడని ప్రేమ ఒక్కటి చాలు
నీలో నాలో అందరిలో అదే చేరితే
ఇక లేనిది ఏముంది
నువ్వే ఆలోచించు
ఏ కష్టం ఎవరికి వచ్చినా పంచుకునే వాళ్ళెందరో
ఏమంటావు?
తీయని కట్టివేతకు సిద్ధమేనా?

అనూరాధ యలమర్తి సుప్రసిద్ధ రచయిత్రి. కథలు 250కి పైగా, కవితలు 500కు పైగా, వ్యాసాలు 500కు పైగా రాసారు. నాలుగు నవలలు రచించారు. వెలువరించిన పుస్తకాలు- ప్రేమ వసంతం- నవల, సంసారంలో సరిగమలు (వ్యాసాలు), వెజిటేరియన్ వంటకాలు, చిట్కాల పుస్తకం, విక్టరీ వారి పెద్ద బాలశిక్ష లో మహిళా పేజీలు 100.
శ్రీ చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ సాహితీ వేత్త అవార్డు స్వీకరించారు. గుర్రం జాషువా, కొనకళ్ళ, వాకాటి పాండురంగారావు, పోతుకూచి సాంబశివరావు, సోమేశ్వర సాహితీ అవార్డుల లాంటివి 50కి పైగా అవార్డులు అందుకున్నారు.
ఆంధ్రభూమి దినపత్రికలో వీరి నవల ‘విలువల లోగిలి’ ప్రచురితమైంది. ఇంతకుముందు పచ్చబొట్టు’ సీరియల్ అందులోనే వచ్చింది.