నడచి వెళ్ళిపోయింది
ఓ మబ్బు తునక
పొడసూపిన
నీరెండ బారినపడకుండా
నిన్నటి కాలాన్ని వెనక్కి తెచ్చుకోలేని
ఈ రోజు ఎలాగైనా సరే
రానున్న రోజుల్లో రాజీలేనిదై
చుక్కచుక్కగ కురిసేందుకు
తల్లి కేంద్రం సంద్రమని
అటుగా వెళ్లింది
వెళ్ళడం వెళ్ళడమే కన్నీరై కురిసింది
గుంపు గా తనలాగే వస్తున్న మబ్బుల విన్యాసాలు
పుడమి చలువగా తెలుసుకున్నవి
అచలాచల చరాచర జగత్తు
మరేదో కాదు
సర్వ సాధారణ భావాలేవీ లేవు
అక్కడ వెదజల్లిన అక్షరాలు సత్య వాక్కు ధీజడిమ వంటి పదాల పోహళింపులే కాదు
జానెడు పొట్టకు మూరెడు పని భారపు సంగతుల నుండి బొట్టు బొట్టుగా కారే
చెమటచుక్కలిప్పుడు
నిరక్షరాస్యత నిర్మూలన కోసం
మొదటి అడుగులా పాదపాదంలో
పాదుకున్న పండ్ల చెట్ల తాలూకు
మట్టి వాసన
అక్షరాస్యత సాధన
తల్లి వేరు భావన
ఎల్లకాలం కలం వీరులు
కాగడాలే
బడిపంతులు నల్లబల్లమీద
కవాతుల కాంతులు
పిడికెడు గుండె నిండా తీవరించిన ఆరాటాలను
ఎన్నింటినో ఏకరువుపెట్టాలనుకుంది ఓ తేజఃకవిత

డా॥ కొండపల్లి నీహారిణి కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు, వక్త. ‘మయూఖ’ అంతర్జాల ద్వైమాసిక సాహిత్య పత్రిక సంపాదకురాలు. ‘తరుణి’ స్త్రీల అంతర్జాల వారపత్రిక సంపాదకురాలు.
కవితా సంపుటులు, కథాసంపుటి, వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలు, యాత్రా చరిత్ర, పరిశోధన గ్రంథం, సంపాదక పుస్తకాలు వంటి 13 పుస్తకాలను ప్రచురించారు. ఇరవై సంవత్సరాలు బోధనా రంగంలో ఉద్యోగం చేశారు.