ప్రఖ్యాత కన్నడ రచయిత, కర్ణాటక రాష్ట్ర కవి కువెంపు పూర్ణచంద్ర తేజస్వి తండ్రి. 8 సెప్టెంబర్ 1938లో షిమోగా జిల్లాలోని కుప్పలి గ్రామంలో తేజస్వి జన్మించారు. ప్రకృతి, వ్యవసాయం పట్ల ఆసక్తిగల తేజస్వి డిగ్రీ పూర్తి కాగానే, చిక్‌మగ్‌ళూరు జిల్లాలోని ముదిగేరెలో కాఫీ ఎస్టేట్ కొనుక్కుని అక్కడే స్థిరపడ్డారు. తన తండ్రి ఛాయల్లోంచి బయటపడి స్వంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నారు. కన్నడ సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో వారు రచనలు చేశారు. కవిత్వం, కథలు, నవలలు, యాత్రా సాహిత్యం, నాటకాలు, సైన్స్ ఫిక్షన్ మొదలైన రచనలు ఎన్నో చేశారు. వారికి సాహిత్యంతో పాటు చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, తత్త్వశాస్త్రంలో కూడా మంచి ప్రవేశముంది. వారు 5 ఏప్రెల్ 2007 నాడు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు.
కటిక దారిద్ర్యంతో, పర్యావరణానికి అనుగుణంగా జీవించే ఎందరో సంచారజీవుల జన జీవితాన్ని వారి కథలు తెలియచేస్తాయి. సస్య విజ్ఞాని, కీటక శాస్త్రజ్ఞుడు (ఏంటమాలజిస్టు) ‘ప్రొఫెసర్ కర్వాలొ’కు తేనె పెంపక కేంద్రాలలో పని చేసే పల్లెటూరి బైతు మందణ్ణ శిష్యడంటే రచయత నమ్మలేకపోతాడు. మందణ్ణ విశ్వంలో అగోచర రహస్యాల్ని తెల్సుకోనేది, సాధించేది ఎంతో వుందని ప్రొఫెసర్ నమ్మడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మందణ్ణలో వున్న అవలక్షణాలు, ప్రొఫెసర్ అమాయకత్వం పట్ల రచయితకు చిన్న చూపు వున్నప్పటికీ, వారితో సన్నిహితంగా తిరుగుతూ వారి గొప్పతనాన్ని అంచెలవారిగా తెలుసుకోవడం, ఒక పరిశోధనాత్మక కథనాన్ని మరిపిస్తుంది. ముఖ్యంగా మందణ్ణకు తేనె తేనెటీగలు – తేనెటీగల పెంపకంపై వున్న అవగాహన, అంకితభావం మనకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఆ గ్రామం పక్కన వున్న అడవి, అడవికి సంబంధించిన పరిజ్ఞానం మందణ్ణకు పుష్కలంగా వుండడం, అడవి జంతువులు, కీటకాలకు సంబంధించిన అతని అవగాహన చూసి ముచ్చట పడిన ప్రొఫెసర్ మందణ్ణను చేరదీస్తాడు. మందణ్ణ నిరుద్యోగం, పెళ్ళికై చేసే ప్రయత్నాలు, పెళ్ళి తర్వాత అత్తగారింటి వారితో వచ్చిన చిక్కులు, పోలీసులు పట్టుకోవడం వాటన్నింటి నుండి మందణ్ణను కాపాడుకోవడానికి ప్రొఫెసర్, రచయిత చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా వుంటాయి.
ఒకసారి తేనె పెట్టె లోపల వెలుగులు విరజిమ్ముతూ తిరిగే గ్లోవార్మ్ అనే పురుగును మందణ్ణ చూసాడు. తేనె పుట్టలోని తేనెను జుర్రుకునే శంఖం పురుగును కవచం లోంచి లాగి గ్లోవార్మ్ అవడం చూసి ప్రొఫెసర్‌కు చెబుతాడు. ఈ కీటకాన్ని ఇంతవరకు ఎవరూ కనుగొనలేదని ప్రొఫెసర్ గుర్తిస్తాడు. నార్వే గ్రామం పక్కనున్న ఘోరారణ్యంలో ఎగిరే తొండ వుందని మందణ్ణ గమనించి ప్రొఫెసర్‌కు చెబుతాడు. ఈ ఎగిరే తొండ చరిత్ర పూర్వయుగాలకు సంబంధించినదని, దాదాపుగా దాని జాతి అంతరించిపోయిందని భావిస్తున్న దశలో దాని ఉనికిని తెలియజేసిన మందణ్ణను వెంటబెట్టుకుని ప్రొఫెసర్ అడవిలోకి వెళతాడు. వారి వెంట రచయిత, ఇంటి పనివాడు ప్యారడు, కవి అనే పెంపుడు కుక్క, ఫోటోగ్రాఫర్ ప్రభాకర్, చెట్లు ఎక్కడంలో వంట చేయటంలో నేర్పరియైన బిర్యాని కరియప్పలతో కలిసి ఎగిరే తొండ అన్వేషణలో పడతారు. చివరకు ఎగిరే తొండను చూస్తారు. ఫోటోలు తీస్తారు. పట్టుకోబోయి విఫలమవుతారు. వాళ్ళు అన్వేషణ సఫలమయిందనే సంతృప్తితో వాళ్ళను చూపిస్తూ కథ ముగుస్తుంది. కథల సంపుటిలో వేసినప్పటికీ ఇది ఒక నవలయనే చెప్పాలి. సాహసయాత్రను మరిపించే వారి అన్వేషణలతో కూడిన కథనం హాస్య, వ్యంగ్య, చతురోక్తులతో వుండి ఆద్యంతం ఆసక్తి గొలుపుతూ ఆనందింప జేస్తుంది.
“వెంకడి నాగస్వరం” అనే కథలో పాములు పట్టే వెంకడి నైపుణ్యం గురించి రచయిత ఎంతగా చెప్పినా అతని మిత్రులు నమ్మరు. సరికదా అతడి అమాయకత్వాన్ని ఎత్తి చూపి ఆట పట్టిస్తారు. నాగస్వరానికి పాములు రావనీ, వాళ్ళే పాములను దొడ్లో వదిలి తిరిగి పట్టకుంటారనీ, కనికట్టు విద్యతో మాయ చేస్తారనీ, వాళ్ళిచ్చే మందులు పొడులు విషాన్ని తగ్గించవని చెబుతారు. అవన్ని నమ్మక రచయిత వెంకడ్ని రకరకాలుగా పరీక్షించాకా, వాడు మోసగాడని నిర్ధారించలేకపోతాడు. వెంకడి భార్య ఆకస్మిక మరణానికి, వెంకడు ఎంతగా తల్లడిల్లి ఏడ్చినా జనం నమ్మరు సరికదా వాడే హంతకుడని నిర్ధారిస్తారు. కాని ఆమె మరణానికి గల అసలు రహస్యాన్ని రచయిత కనుక్కోవడమే కొసమెరుపు. దిగ్భ్రమను కలిగించే ముగింపు గల ఈ కథలో పాముల గురించి, పాముల వాళ్ళ జీవితాల గురించి వివరంగా తెలియజెప్పిన విధానం బాగుంది. ‘ప్రొఫెసర్ కర్వాలొ’లో కనిపించిన కరియప్ప, వెంకడు పాత్రలు ఆ నవలలో తమకు అన్యాయం చేశారని వచ్చి రచయితతో గొడవ పెట్టుకోవడం ఈ కథకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
“అవనతి” (పతనం) కథలో శిల్పి సూరాచారి గుడి కట్టడానికి వచ్చి అది రద్దయిపోగా, అదే ఊర్లో వుండిపోవాల్సి వస్తుంది. దూరపు బంధువైన వాసాచారి తన కూతురు యశోదనిచ్చి పెండ్లి చేస్తాడు. దాంతో ఆ ఊరు విడిచి వెళ్ళలేకపోతాడు. బతకడానికి బొమ్మలు చేయడం ఒక్కటే సరిపోదు. వడ్డీ వ్యాపారం, వెంకానాయుడి గారి బాకీ వసూళ్ళు, పెళ్ళి సంబంధాలు, ఎద్దుల వ్యాపార దళారీగా పని చేసినా ఏవీ గిట్టుబాటు కాదు. అవే కాకుండా ఊరివాళ్ళ జబ్బులకు తెలిసీ తెలియని వైద్యం చేసే పని కూడా పెట్టుకుంటాడు. ఆ ఉళ్ళూ వాళ్ళ మూర్ఖత్వం, మూఢనమ్మకాలకు వంత పాడుతు డబ్బు చేసుకునే విధానం గురించి ఇందులో చెబుతారు. మనుషుల పతనం గురించి ఈ కథ వివరిస్తుంది.
“టైలర్ తుక్కోజిరావ్” బట్టల వ్యాపారి కొడుకు. నమ్మిన సిద్ధాంతాల వల్ల తండ్రి తెచ్చిన సంబంధాన్ని తిరస్కరించి, అదర్శ వివాహం చేసుకుంటాడు. తండ్రి ఆస్తిని వదులుకుని, బట్టలు కుట్టే వృత్తిని నమ్ముకుని కొత్త కాపురం పెడతాడు. అతడి బట్టలు కుట్టే నైపుణ్యం వల్ల కొద్ది కాలంలోనే బిజీ టైలర్‌గా పేరు తెచ్చుకుంటాడు. చాలా కాలానికి అతనికి కొడుకు పుడతాడు. కొడుకుపై ఎంత ప్రేమ వున్నా, వాడు పెరుగుతున్న కొలది ధ్యాస అంతా వాడీ మీదే పెట్టాల్సి రావడంతో చేసే పనులలో అవక తవకలు జరిగి క్రమంగా అతడి వృత్తి దెబ్బతింటుంది. పిల్లవాడి మూలంగా భార్యాభర్తల మద్య పొట్లాటలు జరుగుతాయి. వారిద్దరి మద్య అధిపత్య పోరాటాలు వల్ల పిల్లవాడ్ని పట్టించుకోరు. చివరకు తాము చేసిన తప్పులను గుర్తించి నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవడం ద్వారా వారికి కనువిప్పు కలుగుతుంది.
చినరావురులో పురుషులు సారాయి, తంబాకులకు దాసులై ఎముకలెండి వున్నా, మహిళలు మాత్రం ఏ దురలవాట్లకు బలి అవకుండా ఎంతో దేహ సౌష్టవం, సౌందర్యంతో వుంటే – వేరే వూరి వాళ్ళు వాళ్ళను చూసి తత్తరపడేవారు. అయినప్పటికీ వారెవరూ అనైతిక మార్గాలు తొక్కింది లేదు. ఆ ఊరిలోని మగాళ్ళు ఎంత సౌమ్యులో, ఆ స్త్రీలు మాత్రం గడుగ్గాయిలే. భర్తల చేతగానితనాన్ని తిట్టిపోసే భార్యను ఏమి చేయలేక ‘గయ్యాళి ముండల ఊరు ఇది’ అని తిట్టుకుంటారు. ఊళ్ళో అనవసర పంచాయితీ పెట్టి తమాషా చూసి మొగుళ్ళ మీద, ఆడాళ్ళు విరుచుకుపడి తిట్టి, చితకబాదిన సంఘటనను చదివి తెలుసుకోవాలే తప్ప వివరించలేము. ‘చినరావూరు గయ్యాళులు’ అని పిలిపించుకునే ఆ మహిళల నిజాయితీకి, ధైర్యానికి, మంచితనానికి మనం ముగ్ధులం కాక తప్పదు.
అడవిని, సంచార జీవులను, అడవి పక్కన వున్న గ్రామాల పరిస్థితిని, అక్కడ ప్రజల జీవన పోరాటాన్ని తేజస్వి కథలు వివరిస్తాయి. ప్రకృతి వర్ణన, మానవ మనస్తత్వ చిత్రణ వారి ప్రత్యేకతలు. కథలన్నింటిని వ్యంగ్య ధోరణిలో చిత్రకరించిన విధానం బాగుంది. పూర్ణచంద్ర తేజస్వి రచనలన్నింటిని తెలుగులోకి తెస్తున్న ఘనత శాఖమూరు రామగోపాల్ గారికే దక్కుకుంది. వీరి అనువాద తీరు విలక్షణమైనది. తెలుగు – కన్నడ భాషల మధ్య సమన్వయం ఇందులో కనిపిస్తుంది. వస్తురీత్యా, శిల్పరీత్యా తప్పకుండా చదవాల్సిన పుస్తకమిది.
***
ప్రొఫెసర్ కర్వాలొ మూలం: పూర్ణచంద్ర తేజస్వి, అనువాదం: శాఖమూరు రామగోపాల్ ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్, విజయవాడ. పేజీలు: 301, వెల: ₹ 350.00 ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌజ్ వారి అన్ని శాఖలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™