[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
11.
అకటా! చుట్టుముట్టినదీ భువిని ఓ దుర్విధి
భీకర కరాళ నృత్యము చేయుచున్నది మిత్తి బొబ్బలెడుతున్నది
అకటా, తలతిరుగు వార్తలే వినవచ్చుచున్నవి నిత్యము
ఇక ముగింపెన్నడో దీనికి – మంకుతిమ్మ
12.
వీరలదేమి మానవులో! దానవులో! భూమాత తృప్తి
కొరకు కార్చరు కన్నీరు; రుధిరమును చిందించుచున్నారు,
మరుగు చున్నవవి పగల ధగధగల పొగలు, పరగ
అరుగైనాదా ఈ భువి కసాయి ఇంట – మంకుతిమ్మ
13.
పురుష స్వాతంత్య్ర్యము లభించిన పరిణాము, మి
ద్ధరణి కనుదినము రక్తాభిషేచనమా!
కరవాలములను పూమాలలుగ ద్రిప్పిన నవి
సౌరభాల వెదజల్లేనా – మంకుతిమ్మ
14.
నడచు నేల యొక్కటే, కన్పడు గగనమొకటె
గుడుచు ఆహారమొకటె, త్రాగు నీరును యొకటె, పీల్చి
విడుచు గాలియు నొకటె – మరి నరజాతి కెందుకే
ర్పడినో ఈ వైషమ్యములు – మంకుతిమ్మ
15.
మట్టిగొట్టుకపోయె సనాతన భక్తి శ్రద్ధలు
పుట్టక పోయె అధునాతన నమ్మకములు
కొట్టుక లాడుచున్నదీ లోకము, పాడుబడ్డ కొంపలో
కుంటి గ్రుడ్డి తిరుగాడి నట్టున్నది – మంకుతిమ్మ
16.
ప్రేతమువలె, ఇలను విడువ లేక, పరము చేరలేక
సతతమై, విలవిల లాడుచున్నదీ భువి,
అంతరించె సనాతన ధర్మము, జనించ లేదు నూతనము
అంత్యమెప్పుడో ఈ అమోమయమునకు – మంకుతిమ్మ
17.
నాటి సాగర మథనమందు జనించిన సుధ
నేటి ఈ కలహములకు పలుకుచున్నదా నాంది,
నాటి హాలాహలమును మింగిన ఆ శివుడే నేడును నుండగ
నేటి ఈ కలహములకు భయపడనేల మంకుతిమ్మ
18.
నదీ తరంగాల పగిది పొరలాడు చున్నదీ జీవము
మొదలు తుదిలేదు, నిలుకడ లేదు,
బ్రదుకు చావు లవేమి? సుధ, విషంబులవేమి?
ఉదక బుద్బుదంబులివి – మంకుతిమ్మ
19.
చేరి, గాలియది మట్టి బెడ్డలోదూరి మరలిరాక
నరుని రూపముగ మారకున్న నయ్యది మంటి బెడ్డయే
కొరగాని ధూళి దూసరమీ బదుకు
అరయ విషామృతము లొక్కటే కదా – మంకుతిమ్మ
20.
చిల్లర దేవతలకు చేతులెత్తి మొక్కెదవు
కల్లలు నేర్చి చతురోపాయముల చదరంగ మాడెదవు
చాలవా తండులములు పిడికెడు కుక్షింభరత్వమునకు
చాలదా తుండు గుడ్డ నీ మానరక్షణకు – మంకుతిమ్మ
(ఇంకా ఉంది)

శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
2 Comments
కోడీహళ్ళి మురళీమోహన్
“మంకుతిమ్మన కగ్గ” పద్యాలు చాలా బాగున్నాయి. వీటిని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తున్న కల్లూరు జానకీరామారావుగారికి అభినందనలు. అనువాదం చక్కగా ఉంది.
సత్యనారాయణ రాజు
ఇది అనువాదం లేదు, అచ్చమైన తెలుగు కావ్యంలా ఉంది. ‘అరుగైనాదా ఈ భువి కసాయి ఇంట’, ‘పాడుపడ్డ ఇంటిలో కుంటి గ్రుడ్డి తిరుగాడినట్టున్నది’ – ఎంత గొప్ప వ్యక్తీకరణలు!