పారిస్ ఒప్పందం సందర్భంగా –
2030 నాటికి కర్బన వాయువుల విడుదలను 30% మించి తగ్గించడానికై కృషి చేస్తానని భారతదేశం వాగ్దానం చేసింది. అమెరికా, ఐరోపా దేశాలు, చైనా వంటి వాటితో పోలిస్తే మన దేశంలో ఉద్గారాలు తక్కువే. అయినప్పటికీ భారతదేశం తన వంతుగా ప్రకృతి పరిరక్షణకు కీలకమైన ఉద్గారాల తగ్గింపుకై కృషి చేయడానికి సంకల్పించింది.
వాగ్దానం లక్ష్యాలను చేరుకోవడానికి ఉద్దేశించి 2015లో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడింది. ఈ ప్రణాళిక – 2005 నాటికి జి.డి.పి.లో పాలుపంచుకుంటున్న రంగాలలో కర్బన ఉద్గారాలు ఏ స్థాయిలో ఉన్నాయో లెక్కగట్టి వాటిని కనీసంగా 30%, వీలైతే, అంతకు మించి తగ్గించాలని సూచించింది.
విద్యుత్ రంగం-2018లో కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యుత్తు విధానాన్ని ప్రకటించింది. దాని ప్రకారం పునరుత్పాదక ఇంధన వనరుల నుండి విద్యుదుత్పత్తికి ప్రాముఖ్యత పెరిగింది. 2019 నాటికే పునరుత్పాదక ఇంధన వనరుల నుండి విద్యుదుత్పాదన సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 2030 నాటికి ఆ సామర్థ్యాన్ని మరింతగా పెంచడం సులభమే. 2030 నాటికి 40% విద్యుదుత్పత్తి పునరుత్పాదక ఇంధనాల నుండి సాధించగలిగితే, లక్ష్యాన్ని చేరగలిగినట్లే.
మరొక వంక 2019 నాటికి ఉద్గారాలకు కారణమౌతున్న శిలాజ ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అవుతున్న 67% విద్యుత్తును 2027 నాటికి 43 శాతానికి తగ్గించాలనీ, జాతీయ విద్యుత్తు విధానం నిర్దేశిస్తోంది. అది కూడా సాధించగలిగితే కొంచెం అటు ఇటుగా శిలాజ ఇంధన వనరుల నుండి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు సాంతం పునరుత్పాదక ఇంధన వనరుల నుండి ఉత్పత్తి చేయబడుతుంది. డయోడ్ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలను కొంతమేర తగ్గించాలనీ యోచన.
అరణ్యాల పెంపకం – 2030 నాటికి 2½ కోట్ల హెక్టార్లకు పైబడిన బంజరుభూములను అడవులుగా రూపొందించ దలచినట్లు జి-20 సదస్సులో మన ప్రధాని ప్రకటించారు. ప్రస్తుత శోషణ సామర్థ్యానికి అదనంగా 250 నుండి 300 కోట్ల టన్నుల కర్బన శోషణ సామర్థ్యం సమకూరేలా అడవులను విస్తారంగా పెంచాలని కార్యాచరణ ప్రణాళిక నిర్దేశిస్తోంది.
2030 నాటికి 250 – 300 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను నియంత్రించాలంటే ప్రస్తుతం ఉన్న శోషణ సామర్థ్యం ఏ మాత్రం సరిపోదు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం మన దేశంలో కార్బన్ సమీకరణ రీత్యా వరుసగా అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సాల తరువాత ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు చివరలో ఉన్నాయి.
రవాణా – జలమార్గాల గుండా రవాణ, మెట్రో వ్యవస్థ ద్వారా రవాణాను అభివృద్ధి చేసే దిశగా కృషి చేయడం కూడా సూచనలలో ఉంది. వంట చెరకు వాడకాన్ని తగ్గించి ఉద్గారాలను కొంతమేర నియంత్రించడమూ ఒక నిర్ణయం. సూర్యశక్తి ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఇంధన వనరు. సౌర, పవన, జల వనరుల నుండి ఇంధన ఉత్పత్తిని చేపట్టినట్లయితే ఉద్గారాల కట్టడి సులభ సాధ్యమే. భూగర్భ వనరులను వెలికి తీసిన కొద్దీ తరిగిపోతాయి. ఈ అద్భుతమైన వనరులు ప్రకృతి వ్యవస్థలోని నియతి, చక్రీయతల కారణంగా నిరంతరం లభ్యం అవుతూనే ఉంటాయి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™