చిన్ని చిన్ని కోరికల రెక్కలతో వాళ్ళని ఆకసపు పడుగూ పేకలను అల్లనివ్వండి
అమాయకపు కోరికల కళ్ళతో వాళ్ళని సప్తవర్ణ కలలని కననివ్వండి
ఈ లేత యెండల పావురాలు తమతో పగటిని తీసుకొచ్చారు ఎటు కావాలో అటు ఎగరనివ్వండి వాళ్ళని
మబ్బులతో చెలిమి వారికి చుక్కలతో చుట్టరికం సరిహద్దుల మధ్య సంచరించడం ఇష్టముండదు వారికి
తమదైన ప్రపంచంలో ఎలాంటి చింతా లేకుండా స్వేచ్చగా తిరుగుతూ గాలివీస్తే వచ్చే ఆ చప్పుళ్ళ పాటలు పంచుతూ తొలకరిలో తడిసిన మట్టి వాసనలు నింపుకున్న వీరిని ఎగరనివ్వండి స్వతంత్రంగా.
శేఖర్ అస్తిత్వ పాటకు వడిగా చేసిన అనువాదం.
కొన్ని సార్లు పనితనం కంటే ప్రయోజనం ఎక్కువ ప్రాధాన్యత కలిగిన చిత్రాలు మన ముందుకొస్తాయి. అలాంటిదే ఈ లఘు చిత్రం “ఉడనే దో”. కొన్ని చోట్ల చిత్రీకరణ, నటన వగైరా అంత బాగా రాలేదు లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు, ఇలాంటి చిత్రాల సమస్త టార్గెట్ ఆడియెన్సునూ దృష్టిలో పెట్టుకోవాల్సి వుంటుంది. ఇవి ఇటు పెద్దవాళ్ళకూ, అటు పిల్లలకూ అర్థం అయ్యి, అందేలా వుండాలి. ముఖ్యంగా పిల్లలకు. వాళ్ళకు చేరకపోతే చిత్రం అపజయం పొందినట్లే. అవును, ఈ చిత్రం చిన్న పిల్లల మీద అత్యాచారాల గురించి. ఇలాంటి చిత్రాలు వచ్చాయి, కానీ ఇంకా రావాల్సిన అవసరం వుంది. ఎందాకా అంటే వాటి అవసరం తీరిపోయేదాకా.
రేవతి ప్రిన్సిపాల్ గా వున్న ఆ అంతర్జాతీయ స్కూల్ లో వో జంట తమ యుగ్ అన్న ఆటిస్టిక్ కొడుకును జేర్పిస్తారు. అంత పెద్ద బడిలో, సంవత్సరం మధ్యలో తమ బిడ్డకు దాఖలా దొరికిందని తల్లి దండ్రులకి సంతోషం. చాలా మంది తల్లిదండ్రులలాగే వాళ్ళిద్దరూ చాలా బిజీగా వుంటారు తమ పనుల్లో. మంచి స్కూల్లో పడేశామన్న ధీమాతో వుంటారు. అదే తరగతిలో వో అమ్మాయి అపర్ణ మీద అక్కడి పనివాళ్ళల్లో వొకడు అత్యాచారం చేసి, ఎవరికీ చెప్పొద్దని అంటాడు. తల్లిదండ్రులతో చెబుదామంటే వాళ్ళు ఆమెకు అందుబాటులో వుండరు, వినరు. బెంగతో అమ్మాయికి జ్వరం వస్తుంది. ఇదంతా గమనిస్తున్న యుగ్ చిన్న పిల్లవాడైనా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే తన మీద కూడా ఇదివరలో మేనమామ అత్యాచారం చేసి వున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన మెడ పట్టీ, దానికి వొక పెపర్ స్ప్రే, ఈలలు కట్టుంటాయి, దాన్ని అపర్ణకు ఇస్తాడు దాన్ని రక్షణ కోసం ఎలా వాడాలో చెబుతూ. స్కూల్ లో మంచి/చెడ్డ స్పర్శ మీద వో ప్రత్యేకమైన క్లాస్ నిర్వహిస్తారు. పేరెంట్ టీచర్ మీట్ లో చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరగకుండా చూస్తామన్న ప్రతిజ్ఞ తీసుకోవడం, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది.
ఇందులో కథ కథగా కంటే అవసరమైన విషయాలన్నీ గుది గుచ్చి చెప్పినట్టుంది. అది ప్రయోజనాన్ని సాధిస్తుంది. పిల్లలకు అందేలాగా వుంది కథనం. అబ్బాయి అమ్మాయి ఇద్దరిమీదా అత్యాచారం జరగడం, వొకటి ఇంట్లో, మరొకటి బడిలో అని చెప్పడం ద్వారా ఆడైనా మగైనా ఈ ప్రమాదానికి, ఇంట్లోనైనా బయటైనా గురి అవుతారని చెప్పడం బాగుంది. అబ్బాయి ఆటిస్ట్ అనీ, అతన్ని ఇతరులతోనే చదువుతున్నట్టుగా చూపడం క్లుప్తంగా నైనా, పెద్ద విషయాన్నే తెలుపుతుంది. అత్యాచారం చేసిన లంకేష్ గా మృదుల్ శర్మ బాగా చేశాడు. ఆరతి బాగ్ది దర్శకత్వం బాగుంది. అమిత్ దసాని సంగీతం బాగుంది.
“హం కో మన్ కీ శక్తి దేనా” (గుడ్డి) పాటతో మొదలైన ఈ చిత్రం చివర్లో “ఉడనేదో” పాటతో ముగుస్తుంది. ఈ పాట చాలా బాగుంది. శేఖర్ అస్తిత్వ వ్రాత, అనురాగ్ కులకర్ణి స్వరం, చిత్రీకరణ అన్నీ బాగున్నాయి.
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™