మంచు దుప్పటి మేలి ముసుగు
పచ్చని కొండలలోకి నీరై జారుకుంది
గజగజమని వణికించే చలికి
వీడుకోలు చెప్పింది ఆమని ఋతువు
హిమపాతానికి జడిసిన దినకరుడు
నిస్సహాయంగా సాగరంలో ఒదిగిపోయాడు
ఆకాశంలో వెలిగే చంద్రునితో
ఊసుపోక మంతనాలు చేస్తున్నాడు
చంద్రుని అందానికి పరవశమై అతడిని
అందుకోవాలని ఎగసి పడుతున్నాయి తరంగాలు
మోడువారిన చెట్లు చిగురించి
మొగ్గలు వేయగానే మురిసి పోయింది ప్రకృతి
విరబూసిన విరులతో తరువులన్ని
భారంగా వంగిపోయాయి
మదినిండుగా మకరందం నింపుకుని
గర్వముతో మిడిసి పడ్డాయి
అందుకోమని భ్రమరాలను ఆశపెడుతున్నాయి
దరిచేరిన భ్రమరాల తాకిడికి
తాళలేక రెక్కలు విరిగి సొమ్మసిల్లి పోయాయి
అరవిరిసిన పూల మొగ్గలు
లోకమెరుగక వింతగా చూస్తున్నాయి
మధువును నింపుకున్న పూల చుట్టూ
చేరిన చిన్నారి హమ్మింగ్ బర్డ్స్ సందడి చేస్తున్నాయి
తళతళ మెరిసే వెండిమబ్బును చూసి
అసూయతో నల్లమబ్బులు కబళిస్తున్నాయి
కురిసిన వాన చినుకుల ధాటికి
మకరందం కోలుపోయిన
పూలు నేల రాలాయి
రాలిన పూలతో చిట్టి ఉడుతలు
గెంతులువేస్తూ ఆటలాడుకుంటున్నాయి
మామిడిపూలను ఆరగించిన కోయిలమ్మలు
గొంతు సవరించుకుని రాగాలు తీశాయి

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.