[శ్రీ విస్సాప్రగడ వేంకట కృష్ణ సాయి రచించిన ‘వెతుకులాట’ అనే కవితని అందిస్తున్నాము.]


ప్రపంచం ఎరుగని పసితనంలో
ప్రయాస ఎక్కడుంది..
తోడు దొరికిన జంట నడకలో
దూరం ఎక్కడుంది..
మాట పలకని నిశ్శబ్ధంలో
నిగూఢం ఎక్కడుంది..
ఉనికికి దూరమైన ఎండమావిలో
ఊరట ఎక్కడుంది..
కాలాన్ని మింగేసిన ఘడియలో
కదలిక ఎక్కడుంది..
శాశ్వతానికి సొంతమైన శ్వాసలో
మరణం ఎక్కడుంది..
నన్ను మరచిన స్వగతానికి
జననం ఎక్కడుంది..
అలసిపోని ఆగిపోని వెతుకులాటలో
గమ్యం ఎక్కడుంది..

విస్సాప్రగడ వేంకట కృష్ణ సాయి స్వస్థలం ఏలూరు. సర్ సి అర్ అర్ కాలేజ్ లో పట్టభద్రులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొద్ది కాలం పనిచేసి, 1997 లో అమెరికా వలస వెళ్లి బోస్టన్ పరిసర ప్రాంతంలో స్థిరపడ్డారు. వృత్తి రీత్యా సమాచార సాంకేతిక (IT) రంగంలో చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. కాలేజీ రోజుల నుంచి కవితా సాహిత్యం పై మక్కువ. ఏవో చిన్న చిన్న పద కవితలు వ్రాసుకుని బంధువర్గం తోను మిత్రుల తోను పంచుకుని సంతోషపడేవారు. ప్రముఖుల రచనలు చదవడం ఇష్టం. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం మరియు న్యూ ఇంగ్లాండ్ షిరిడి సాయి పరివార్ దేవాలయంలో స్వచ్ఛంద స్వేచ్ఛా శ్రమదానం చేయడం ఇష్టపడతారు.