సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, వడ్డి ఓంప్రకాశ్ నారాయణ రాసిన ‘వెండి చందమామలు’ పుస్తకాన్ని ఇటీవల ప్రముఖ దర్శకుడు, రచయిత వంశీ ఆవిష్కరించారు. ఈ పుస్తకం తొలి కాపీని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి శ్రీ రవిప్రసాద్ పాడి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ, లే-అవుట్ ఆరిస్ట్ సైదేశ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ వంశీ మాట్లాడుతూ, “నాకు తెలిసినంతవరకూ 50, 60, 70లలో వెండితెర నవలలు ఓ వెలుగు వెలిగాయి. వాటిల్లో గురువుగారు ముళ్ళపూడి వెంకట రమణ రాసిన పుస్తకాలు నాకు ఇష్టం. నేను కూడా నాలుగు వెండితెర నవలలు రాశాను. అందులో ‘తాయారమ్మ – బంగారయ్య’ మాత్రం పబ్లిష్ కాలేదు. మిగిలినవి పుస్తక రూపంలో వచ్చాయి. నేను రాసిన వాటిల్లో బాగా పాపులర్ అయ్యింది ‘శంకరాభరణం’ వెండితెర నవల. ఆ పాపులారిటీకి కారణం నేను రాసిన విధానం కాదు, అంత గొప్పగా సినిమా తీసిన మా గురువుగారు విశ్వనాథ్ గారిది. అలాంటి వెండితెర నవలల మీద ఇలాంటి పరిశోధనాత్మక గ్రంథం ఇంతకు ముందు నాకు తెలిసి ఎవరూ రాయలేదు, రాలేదు. ఇప్పుడు పులగం చిన్నారాయణ, మిత్రుడు ఓంప్రకాశ్ నారాయణ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది పుస్తక రూపంలోకి రాకముందు నుండి, వీరు చేస్తున్న పరిశోధన గురించి నాకు తెలుసు. ఎవరెవరి దగ్గర వీరు సమాచారం సేకరిస్తున్నారు? ఎంతగా శ్రమ పడుతున్నారనేది ఓ అవగాహన ఉంది. ఆ మధ్య అమెరికా నుండి కిరణ్ ప్రభ మాట్లాడుతూ, ‘మీ వాళ్ళు వెండితెర నవలలపై మంచి పుస్తకం తెస్తున్నారు. నా దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా వారికి ఇచ్చాను’ అని చెప్పారు. ఈ పుస్తకంలో ఏ వెండితెర నవల ఎవరు రాశారు, ఎప్పుడు అది విడుదలైదనే పట్టిక కూడా ఇచ్చారు. ఇంత చక్కని పుస్తకం మంచి పాపులారిటీని తెచ్చుకుని, వెంటనే రీప్రింట్‌కు రావాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.
రైల్వే ఉన్నతాధికారి, సాహితీ ప్రియులు రవిప్రసాద్ పాడి మాట్లాడుతూ, “సినిమా పబ్లిసిటీలో భాగంగా పాత రోజుల్లో పాటల పుస్తకాలు, గ్రామ్ ఫోన్, ఎల్.పి. రికార్డులు, వెండితెర నవలలు వస్తుండేవి. అలా తెలుగు సినిమా తొలినాళ్ళలో వచ్చిన వెండితెర నవలల నుండి, నిన్న మొన్నటి ‘శ్రీరామరాజ్యం, టెంపర్’ మూవీ వరకూ వచ్చిన వాటిపై పరిశోధన చేసి సీనియర్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, వడ్డి ఓంప్రకాశ్ నారాయణ ఈ ‘వెండి చందమామలు’ పుస్తకం రాయడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఇలాంటి పరిశోధనాత్మక గ్రంథాలు ఇంకా రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పుస్తకం ఎన్నో పునర్ ముద్రణలకు నోచుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ మాట్లాడుతూ, ”తెలుగు సినిమా రంగానికి సంబంధించినంత వరకు ఇటీవల వచ్చిన అరుదైన పుస్తకాల్లో ఒకటిగా ‘వెండి చందమామలు’ నిలబడుతుంది. కారణం ఏమంటే, ఒక తరానికి తీపి జ్ఞాపకంగా, నేటి తరానికి స్మృతిచిహ్నంగా మారిపోతున్న వెండితెర నవలల మీద వచ్చిన పరిశోధనాత్మక గ్రంథం ఇది. ఈ పుస్తకం చదువుతుంటే మనం అరవైల్లోకి, డెబ్భైల్లోకి వెళ్ళిపోతాం. దీనిని ప్రతి ఒక్కరూ కొని చదవండి. మీరు పెట్టిన ప్రతి రూపాయికి విలువనిచ్చే పుస్తకమిది” అని అన్నారు.
పుస్తక రచయితల్లో ఒకరైన పులగం చిన్నారాయణ మాట్లాడుతూ, “ఇరవై సంవత్సరాలుగా ఫిల్మ్ జర్నలిస్ట్‌గా ఏం సాధించానంటే చెప్పలేను కానీ వంశీ వంటి ప్రముఖ దర్శకుడి స్నేహం దక్కడం గొప్ప అఛీవ్మెంట్గా భావిస్తాను. నంది అవార్డును అందుకున్న నా పుస్తకం ‘ఆనాటి ఆనవాళ్ళు’కు పేరు పెట్టింది ఆయనే. నా జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. ఏది రాసిన, ఏ పని చేసినా ‘కొత్తగా ఉండేట్టు చూడు పులగం’ అంటూ ఆయన విలువైన సలహాలు ఇస్తుంటారు. ఈ ‘వెండి చందమామలు’ పుస్తకం రావడం వెనుక కూడా బీజం వేసింది వంశీ గారే. ఓసారి ఇంటర్వ్యూ కోసం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ‘వెండితెర నవలలపై వ్యాసం రాయమ’ని సూచన చేశారు. అదే ఇప్పుడు పుస్తకంగా వచ్చింది. దీనిని తొలిసారి నేనే సొంతంగా ‘పులగమ్స్’ అనే పేరుతో ప్రచురించాను. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా గురించి శ్రీ వంశీ సీరియల్‌గా రాసిన ‘స్వప్నరాగలీనమ్’ను కూడా ప్రచురించాలనే కోరిక ఉంది. వంశీ గారు అందుకు అనుమతి ఇస్తే అతి త్వరలోనే ఆ పుస్తకాన్ని కూడా ప్రచురిస్తాను” అని అన్నారు.
రచయిత వడ్డి ఓంప్రకాశ్ మాట్లాడుతూ, “మూడు దశాబ్దాలుగా జర్నలిస్టుగా, అందులో దాదాపు ఇరవై యేళ్ళుగా ఫిల్మ్ జర్నలిస్ట్‌గా సాధించింది ఏమిటీ? అని వెనుదిరిగి చూసుకుంటే… గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ కనిపించలేదు. ఓ కథాసంపుటిని, కార్టూన్ల పుస్తకాన్ని వేయడం తప్పితే… సినిమా రంగంతో ఉన్న అనుబంధాన్ని అక్షరీకరించ లేకపోయాననే బాధ ఉండేది. దాన్ని ఈ పుస్తకంతో మిత్రుడు పులగం చిన్నారాయణ కొంత తీర్చాడు. అతని సూచనతోనే గతంలో మేం రాసిన ‘వెండితెర నవల’లకు సంబంధించిన వ్యాసాన్ని మరింత వివరంగా, విస్తారంగా అప్డేట్ చేసి ‘వెండి చందమామలు’ పేరుతో పుస్తకంగా తీసుకు రాగలిగాం. ఇందులో కేవలం వెండితెర నవలల గురించి రాయడమే కాకుండా, ముళ్ళపూడి వెంకట రమణ, శ్రీరమణ, సింగీతం శ్రీనివాసరావు వంటి పెద్దల అభిప్రాయాలను కూడా పొందుపరిచాం. ఇంతవరకూ వచ్చిన వెండితెర నవలల జాబితాను కూడా ఇచ్చాం. అప్పట్లో ఈ పుస్తకం రాయడానికి మాకు ప్రేరణ ఇచ్చింది వంశీ గారే. ఇవాళ ఆయన చేతుల మీదుగా ఈ పుస్తకం వెలువడం ఆనందంగా ఉంది. ఆయనకు, తొలి ప్రతిని స్వీకరించిన రవి పాడి గారికి కృతజ్ఞతలు” అని అన్నారు.
ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభిస్తుంది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™