[అనుపమ యేలూరిపాటి గారు రచించిన ‘విడుదల’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


2000 సంవత్సరం. జులై నెల.
సాయంత్రం ఆరు గంటలయ్యింది. ఎండాకాలం కనుక, అప్పుడే అస్తమించదలచుకోని సూర్యుడు భగభగా మండుతున్నాడు. చేతికున్న 20 ఏళ్ళ వయసున్న తోలు గడియారంలో టైం చూసుకొని, ఆ రోజుకి చేయాల్సిన పెయింటింగ్ పని పూర్తిచేసి, గ్లోవ్స్ తీసి పడేసి, వేసుకున్న ఏప్రన్ తీసి, ఇంకా పెయింట్ వేయని ఒక తలుపుకి దాన్ని తగిలించి, కాంట్రాక్టర్ దగ్గర గత రెండు వారాల కూలి డబ్బులు 300 డాలర్లు తీసుకొని లెక్కపెట్టుకొని చొక్కా జేబులో దాచుకొని, మూలనున్న ఖాళీ లంచ్ బాక్స్ చేతపట్టుకొని, రూముకి బయలుదేరాడు గంగారామ్.
శుక్రవారం సాయంత్రం పని ముగించుకున్నాక ఇలా అందిన జీతం డబ్బుతో బర్గర్ తినటం అలవాటు చేశాడు హోసే. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే అతనికి ఎవరైనా తన పేరు స్పెల్లింగ్ చూసి ‘జోస్’ అని పిలిస్తే మాత్రం కోపం అంత ఎత్తున వచ్చేది. తన భాష తనకి గొప్ప అని, ‘మెహీకో’ లో ‘జే’ అక్షరాన్ని ‘హ’ అని పలుకుతారని, జోస్ అనేస్తే ఎందుకు పలకాలి అని గొడవచేసేవాడు. తను ఇండియా నుంచి వచ్చినట్టే, మెక్సికో నుంచి బ్రతుకుతెరువు కోసం కోటి ఆశలతో అమెరికా వచ్చి, భార్యాబిడ్డలకి దూరమై, దేశం కాని దేశంలో ఉంటూ, వీసా కాలం చెల్లిపోవటంతో, జైలుశిక్షకి భయపడి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయలేక, పోనీ ఇక్కడైనా నిశ్చింతగా ఉండలేక, ఈ త్రిశంకుస్వర్గంలో రోజులు లెక్కపెట్టుకుంటూ ఉండేవాడు తనలాగే.
ఎవరో దయతలచి ఒకరిద్దరు బిల్డింగ్ కాంట్రాక్టర్లకి వీళ్ళని పరిచయం చేశారు. వాళ్ళు చెప్పిన పని చేస్తూ, రెండు వారాలకి ఒకసారి జీతం తీసుకుంటూ, ఇంటికి వారానికి ఒక కాల్ చేసి గబగబా ఐదు నిముషాల కాలింగ్ కార్డుతో కబుర్లన్నీ హడావుడిగా మాట్లాడేవారు. సరైన మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోవటంతో ఎప్పుడు ఏ అనారోగ్యం వచ్చి పడుతుందో అని భయపడుతూ, జాగ్రత్తగా ఇద్దరూ కాలం వెళ్ళదీసేవారు.
హోసేకి ఆ భయం మరీ ఎక్కువగా ఉండేది. ఆ భయానికి తగినట్టే తీరని అనారోగ్యమూ వచ్చింది. పేదవాళ్ళ క్లినిక్‌లో చూపించుకున్నా, డాక్టర్ ఏమీ చేయలేకపోయారు. పదిహేనేళ్ళనుంచి కలసిమెలసి గడిపిన నేస్తాన్ని దూరం చేసుకొని, గంగారామ్ రెండు నెలలక్రితం ఒంటరివాడు అయ్యాడు.
హోసే కాలంచేశాక గంగారామ్ పనిలో జోరు తగ్గింది, నడకలో వేగం తగ్గింది. తనతో మెహీకో కబుర్లు చెప్పేవాళ్ళు లేరు, తన ఇండియా కబుర్లు వినేవాళ్ళు లేరు. బర్గర్ కింగ్ దగ్గర ఆగి ఒక బర్గర్, ఒక సోడా కొనుక్కుని రూము వైపుకి నెమ్మదిగా నడుస్తున్నాడు. దారంతా చెట్ల నీడ. గార్డెన్ స్టేట్ కదా? ఈ వృక్షసంపదకి తోడు జంతుసమృద్ధి. అడపాదడపా జింకలు, రాకూన్లు, బీవర్లు, అలాంటి మరెన్నో చిన్నచిన్న వన్యజాతులు దారికి అడ్డంపడుతూ తిరిగే ప్రాంతం. దారిలో అలాంటి జంతువుల కోసం అటూ ఇటూ చూస్తూ, కిశోర్ కుమార్ పాడిన పాత హిందీ పాటలు పాడుకుంటూ నడవటం అలవాటు తనకి.
నాలుగు రోజులనుంచి ఇంట్లో అర్ధరాత్రి టకటకా చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అటకమీద పందికొక్కులు ఉన్నాయేమో అని ఒకటి రెండు బోన్లు పెట్టినా ఏమీ పడట్లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ రూముకి చేరాడు. తాళం తీయబోతుంటే, పెరటివైపునుండి సన్నగా మూలుగులు వినిపించాయి. చుట్టూతిరిగి గది వెనక్కి వెళ్ళి చూశాడు. ఒక నక్క, మూడు నక్కపిల్లలు ఆడుకుంటున్నాయి. ముందు కుక్కపిల్లలు అనుకున్నాడు కానీ, సరిగ్గా చూసేసరికి గుండె ఝల్లుమంది గంగారామ్‌కి. గబగబా వెనక్కి నడుచుకువచ్చి తాళం తీసి, ఇంట్లోకి వెళ్ళి చటుక్కున తలుపు వేసేసుకున్నాడు. అయితే తనకి వినిపించిన చప్పుళ్ళు ఈ నక్కలవి అన్నమాట అనుకుంటూ, వెనుక వైపున్న అద్దపు కిటికీ దగ్గరకు వెళ్ళాడు.
శనాదివారాల్లో ఆ కిటికీ పక్కనే కుర్చీ వేసుకొని పెరట్లో ఆడుకుంటున్న ఆ నక్క కుటుంబాన్ని చూడటమే కాలక్షేపం అయ్యింది. కాస్త అన్నం వండుకోవటం, ఆ కుర్చీలో కూర్చొని తినటం, టీ కాచుకోవటం, ఆ కిటికీలోంచే నక్కల్ని చూస్తూ తాగటం. నిద్రపోయే సమయం తప్ప రోజంతా ఇదే పని. తల్లి లాలన, పిల్లల అల్లరి.. ఏ జాతి జీవులకైనా ఇంతకుమించిన ముచ్చట ఏముంటుంది?
మరో వారం ఇలాగే గడిచింది. పనికి వెళ్ళేవరకు వాటిని చూడటం, పనయ్యి వచ్చాక వాటిని చూడటం. తల్లి ప్రేమ, పిల్లల అల్లరి చూస్తూ తనకే తెలియకుండా నవ్వుకునేవాడు, మురిసిపోయేవాడు. ఎంతసేపు చూసినా తనివితీరని అందం. ఒకరోజు ఉదయం లేచేసరికి నక్కపిల్లల పక్కన తల్లి లేదు. పిల్లలు ఆడుకుంటున్నాయి. ఆహారం కోసం తల్లి వెళ్ళి ఉంటుంది అనుకొని పనికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చేసరికి కూడా పిల్లలే ఉన్నాయి, తల్లి లేదు. ఈసారి నిద్రలో ఉన్నాయి. అర్థరాత్రి మూలుగుతున్న శబ్దం విని, పిల్లల్ని చేరదీయాలనిపించినా, చీకట్లోంచి తల్లి వచ్చి మీద పడుతుందేమో అన్న భయంతో ఆగిపోయాడు.
మర్నాడు ఉదయం కూడా తల్లి రాలేదు. పిల్లలు నీరసించిపోయాయి. గంగారామ్ ధైర్యంచేసి ఒక పళ్ళెంలో పాలు పోసి నక్కపిల్లల దగ్గర పెట్టాడు. ఆకలితో ఉన్న పిల్లలు గటగటా తాగేశాయి. తన దగ్గర బిస్కెట్లు, అన్నం తప్ప ఇంకేం లేవు. అసలు నక్కలు మాంసాహారులు కదా, అన్నం తినవేమో అనిపించింది. మరికొన్ని పాలు పోసి, తల్లి తిరిగిరావాలని కోరుకుంటూ పనికి వెళ్ళాడు కానీ మానసంతా ఈ పిల్లలమీదే ఉంది. సాయంత్రం ఇంటికి వస్తూ, తను శాకాహారి అయినా మూడు చికెన్ బర్గర్లు కొనితెచ్చాడు. మొదటిసారి కనుక కష్టం మీద వాటిని తిని పాలు తాగాయి ఆ పిల్లలు.
ఇంకో నెల గడిచింది. తల్లి జాడ లేదు. ప్రమాదమే జరిగిందో, పక్షుల్లాగే నక్కలు కూడా కొంతకాలం చూసి ఇక పిల్లల్ని వదిలేస్తాయో గంగారామ్‌కి తెలియలేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు. తన ఒంటరితనాన్ని పోగొట్టటానికి వచ్చిన బిడ్డలు ఈ మూడూ. మింటు, చింటు, బంటు అని పేర్లు పెట్టుకొని, వీటి కబుర్లే ఇండియాలోని కుటుంబంతో చెప్పేవాడు. ఇండియా కబుర్లు, హోసే బాబాయ్ కబుర్లు నక్కపిల్లలకి చెప్పేవాడు. కాలానికి మళ్ళీ వేగం పెరిగింది. తెల్లవారటం, పొద్దుక్రుంగటం ఏమీ తెలియట్లేదు గంగారామ్‌కి. పనిలో హుషారు పెరిగింది. కిశోర్ కుమార్ పాటలను ఈలవేస్తూ చురుకుగా పెయింట్ చేస్తున్నాడు. నక్కలకి కుక్కల్లా విశ్వాసం ఉండదేమో అని అందరూ హెచ్చరిస్తున్నారు. అయినా గంగారామ్‌కి అవి బిడ్డలు. బిడ్డలనుండి తండ్రి ఏం ఆశిస్తాడు? తనకి వాటితో ఉన్న అనుబంధం చెప్పినా వాళ్ళకి అర్థం కాదులే అని నవ్వుకొని వదిలేశాడు.
ఒకరోజు ఇంటికి వచ్చేసరికి, ముంగిట్లో ఒక వ్యాన్ ఆగి ఉంది. వీసా లేని గంగారామ్‌కి మనసు కీడు శంకించింది. వ్యాన్ లోంచి దిగిన అధికారులు తాము అటవీశాఖ నుంచి వచ్చామని, వన్యమృగ సంచారం గురించి 911 కి చుట్టుపక్కలవారు కంప్లెయింట్ చేశారని, నక్కపిల్లల్ని తీసుకువెళ్ళాలని అన్నారు. గంగారామ్‌కి మొదట నోట మాట రాలేదు. తర్వాత వద్దని వేడుకున్నాడు. నక్కపిల్లల్ని ఉండనిస్తే కలిగే ఇబ్బందులు ఏమిటో, అటవీశాఖ నిబంధనలు ఏమిటో ఆ అధికారులు పూసగుచ్చినట్టు చెప్తున్నా గంగారామ్‌కి అవేమీ వినపడట్లేదు, అర్థం కావట్లేదు. మనసంతా ఆందోళన. గుండెల్లో బరువైన రాయి పడ్డట్టు భరించలేనంత ఆవేదన.
అధికారులు వల వేసి మూడు పిల్లల్ని పట్టారు. వ్యాన్ లోకి వేశారు. వాటిని జాగ్రత్తగా అడవిలో వదులుతామని, క్షేమంగానే ఉంటాయని చెప్తున్నారు. గంగారామ్ మాత్రం చేష్టలుడిగి నుంచుండిపోయాడు. వ్యాన్ కనుచూపుమేర దాటి వెళ్ళిపోయింది. గంగారామ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. తనకే తెలియకుండా తను హృదయవిదారకంగా రోదిస్తున్నాడు.
అప్పగింతలు అయ్యాక తన అల్లుడితో కారెక్కుతూ కిటికీ అద్దం దించి, ‘ఎందుకు నాన్నా, నన్ను పంపేస్తున్నావు?’ అన్నట్టు తనవైపు ఉక్రోషంగా చూస్తూ కళ్ళనీళ్ళు పెట్టిన కూతురికి తనపై ఇంకా బెంగ ఎక్కువ అవ్వకూడదని, కళ్ళలోనే దాచేసిన కన్నీళ్ళు అవి.
తల్లి మరణించిందని కబురందినా, స్వదేశానికి వెళ్ళలేక, గుండెల్లోనే కుమిలిపోతూ, గొంతులో గాంభీర్యాన్ని కనపరస్తూ ఫోన్లో మాట్లాడినప్పుడు అణచుకున్న కన్నీళ్ళు అవి.
“సర్కారీ ఉద్యోగం వచ్చింది నాన్నా” అని కొడుకు ఫోన్లో చెప్తుంటే మనసంతా నిండిన పుత్రోత్సాహం ఇక చోటు చాలక కళ్ళలోంచి కురవబోతే, “శభాష్, మంచి పేరు తెచ్చుకోవాలి” అంటూ, బేలగా అనిపించకూడదు అని మొహమాటంతో ఆపేసుకున్న కన్నీళ్ళు అవి.
“ఎప్పుడు వస్తారు?” అని భార్య దీనంగా అడిగినప్పుడల్లా “జీవితాంతం తోడు ఉంటానని నీ కన్నవారికి మాటిచ్చి, చేయి పట్టుకొని అత్తవారింటికి తీసుకువచ్చి, కొన్నాళ్ళు డబ్బు సంపాదించి తెస్తానంటూ విదేశానికి వచ్చేసి, మళ్ళీ కనిపించకుండా, పిల్లల పెంపకం బాధ్యత సైతం నీమీదే వదిలేశాను. నన్ను క్షమిస్తావా?” అని చేయి పట్టుకొని అడగాలని అనిపించినా, ఆ అపరాధభావాన్ని కప్పిపుచ్చుకుంటూ మాటదాటవేసినప్పుడు కారబోయిన కన్నీళ్ళు అవి.
పదిహేనేళ్ళపాటు ప్రతి భావాన్ని పంచుకుంటూ, ప్రతి క్షణం చేదోడువాదోడుగా ఉంటూ గడిపినవాడు, తనకు దేవుడిచ్చిన తమ్ముడు, హోసే తనకి దూరమైనప్పుడు కలిగిన దుఃఖాన్ని నిర్వేదం కప్పేస్తే, వెలికి రావాలని కూడా తెలియక కళ్ళవెనుక దాగిపోయిన కన్నీళ్ళు అవి.
ఇక గంగారామ్ వల్ల కాలేదు. హోసే లాగా తనకి అనాథ మరణం వద్దు. ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో అన్న భయంతో, క్షణక్షణం జీవచ్ఛవంలా బ్రతకాలనిపించలేదు. “ఇక ఎక్కడికీ వెళ్ళను, నీతోనే ఉంటాను” అని భార్యకి చెప్పాలి. మనవలతో ఆడుకోవాలి. పిల్లలతో కూర్చొని నాలుగు మెతుకులు ఆనందంగా తినాలి. తన తల్లిలా పిల్లలకి దూరంగా ఆఖరిక్షణాలు గడపకూడదు.
ఎన్నో ఏళ్ళుగా గుండెలో గూడుకట్టుకున్న ఆవేదన ఈరోజు కట్టలు తెచ్చుకొని పొంగింది. కాసేపటికి కన్నీటి ప్రవాహం ఆగింది. మనసంతా ఆనందంతో నిండిపోయింది. నేటితో తనకి విడుదల. నిశ్చింతగా పోలీస్ స్టేషన్ వైపుకి అడుగులు వేశాడు. తనని జైల్లో పెట్టినా పర్వాలేదు. కనీసం ఇంకొన్నాళ్ళకి ఇంటికి పంపిస్తారు అన్న నమ్మకంతో నడకలో వేగం పెంచి, ఆనందంగా పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నాడు.