21. మొగిలి వెంకటగిరి
4-2-19 ఉదయం ఫలహారాలయ్యాక 8-55కల్లా బయల్దేరాము. బెంగళూరు హైవేలో 23 కి.మీ. దూరం వున్న మొగిలి వెంకటగిరి రామాలయానికి.
9-45కి చేరుకున్నాము. బంగారుపాళ్యం దాటాక వున్నదీ కోదండ రాలయం. ప్రస్తుతం అర్కయాలజీ డిపార్టుమెంటు అధీనంలో వున్నది.




ఆలయ ముఖద్వారం చాలా పెద్దది. శిల్పకళ కొంచెం వున్నది. ఆలయం చిన్నదే. వెనక చిన్న ఉపాలయంలో నాగేంద్రుడు. పై కప్పులో ద్వాదశరాసులనుకుంటా.. శిల్పాలున్నాయి. అంత స్పష్టంగా కనబడలేదు.


అక్కడనుంచి మొగలి వెళ్ళాము. దాని గురించి కొంచెం విశదంగా రాయాలి. వచ్చే వారం చెబుతాను. ప్రస్తుతం మొగలి నుంచి వెళ్తుండగా పలమనేరు ముందు రోడ్డు మీద వున్న ఆంజనేయ స్వామిని దర్శించాము. దాని గురించి చెబుతాను.
22. శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం, పలమనేరు
మొగిలినుంచి వెళ్తుండగా రహదారి పక్కనే ఒక ఆంజనేయస్వామి ఆలయం చిన్నదే చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఆలయం పైన సీతా రామ లక్షణ సమేత ఆంజనేయస్వామి విగ్రహాలు. ఆలయం చిన్నదే. ఈ ఆలయం 750 సంవత్సరాల క్రితంది. చోళుల సమయంలోదిట. స్వామి వెనుక ఒక పెద్ద కొండరాయి.. గుండులాగా వుంది. వెనుక గుండులోంచి ఉద్భవించారుట స్వామి. ఉద్భవమూర్తి. తర్వాత ఈ ఆలయాన్ని సినీ నటుడు శివాజీ గణేశన్ కట్టించారుట. ఆంజనేయస్వామి పక్కనే శ్రీ సీతారామ లక్ష్మణులు పూజలందుకుంటున్నారు. చిన్న ఆలయమైనా శుభ్రంగా, చాలా అందంగా, సింధూర రంగుతో ఆకర్షణీయంగా వున్నది.






వచ్చే వారం మొగిలీశ్వరస్వామి గురించి చెబుతాను.
పలమనేరు:
అక్కడనుంచి పలమనేరులో శ్రీ మునిరత్నం రెడ్డి, రచయిత గారిని కలిశాము. ఆయనకి చిత్తూరు ఆలయాల చరత్ర అంతా కరతలామలకం. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం… కౌండిన్య కొండి లేక కురుడుమల అక్కడ వున్న కొండ. అక్కడ కౌండిన్య మహర్షి తపస్ససు చేశారు. అక్కడ పుట్టిన సెలయేరు ములబాగ నుంచి 10 కి.మీ. దూరంలో శ్రీనివాలపురం రోడ్ కర్ణాటకో కొండపైనుండి చుక్కలుగా కారుతుంటాయి. వర్షముంటే ధార ఎక్కువగా వుంటుంది. అంధ్ర ప్రదేశ్‌లో ప్రవహించి తమిళనాడులో అంతమవుతుంది. వర్షాభావంవల్ల జీవ నది కాలేకపోయింది. ఆ పరీవాహక ప్రదేశాలలో వున్న ఆలయాలు కౌండిన్య క్షేత్రాలు. ఇది వరకు ఇది జీవ నది. వర్షా భావం వల్ల ఆధార నదులు కుంచించుకు పోయాయి. ఇక్కడ ఎక్కువగా చాపలు నేసేవాళ్ళు.

శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.