యానాం ఓ చిన్నపట్టణమే కావొచ్చు.. మారుమూల కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఓ భాగమే కావొచ్చు.. అయితేనేం శిఖామణి, దాట్ల దేవదానంరాజు వంటి కవితాశిఖరాలతో విలసిల్లే సిరుల జాబిల్లి యానాం. మార్చి 21వ తేదీన ప్రపంచ కవితాదినోత్సవాన్ని ముచ్చటగా మూడోసారి జరుపుకుంది…
యానాం సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నడుమ ప్రపంచ కవితాదినోత్సవాన్ని కవిసంధ్య సంస్థ నిర్వహించటమో విశేషం.. ప్రముఖ నాటక కళాకారులు వాడ్రేవు సుందరరావుగారు సేకరించిన రచయితలు కవుల చిత్రాలు చేతిరాతల ప్రదర్శన నిర్వహించారు.. రవీంద్రనాథ్ టాగోర్, స్వామి వివేకానంద, డా. బాబాసాహెబ్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, అరవిందుల వంటి దేశనాయకుల చేతిరాతలతోపాటు,విశ్వనాథ, ఆరుద్ర,గుంటూరు శేషేంద్రశర్మ వంటి గొప్పరచయితల చేతిరాతలను చూసే అరుదైన అవకాశం కల్పించారు వారు.
శ్రీశిఖామణీ, శ్రీ దాట్లదేవదానంరాజు మధునాపంతుల సత్యనారాయణగార్ల నేతృత్వంలోని కవిసంధ్య ఈ సందర్భంగా పానుగంటి వారి కుటుంబంతో కలిసి కవితల పోటీలు నిర్వహించటం మరోవిశేషం.. ఇదేరోజున తొమ్మిది మంది కవులు తమ కవితా సంకలనాల్ని మళ్ళీ మరోమారు ఆవిష్కరించుకున్నారు
ఉదయం సదస్సుకు శ్రీ శిఖామణి అధ్యక్షత వహించారు. కవిత్వానికి కట్టుబడి వచ్చిన కవిమిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు శిఖామణి…
మొదటి సెషన్లో ఇద్దరు వక్తలు ప్రసంగించారు.. వారిలో ఒకరు ప్రముఖ విమర్శకులు శ్రీ జి.లక్ష్మీ నరసయ్య మరొకరు స్థానిక విద్యావేత్త శ్రీమతి చిరంజీవినీకుమారి.
*కవులు,కవిత్వం లేని జీవితాన్ని ఊహించలేం*
-లక్ష్మీనరసయ్య
ప్రపంచ కవితా దినోత్సవంరోజున ప్రపంచం దృష్టిని యానంపై పడేలా చేస్తున్న కవిసంధ్య శిఖామణి, దేవదానంరాజు గారికి అభినందనలు. అందరూ భావిస్తున్నట్టు కవిత్వం ఆగిపోలేదు. కొత్తకవుల చేరికతో, కవిత్వానికి కార్యకర్తలు ఏర్పడటంతో మూడుపువులు ఆరుకాయలుగా విలసిల్లుతోంది. కవిత్వం రెక్కలు విప్పకుని సాహిత్యాకాశంలో విహరిస్తోంది. మనిషిలో సహజంగానే కవిత్వం దాగిఉంటుంది. అది అనేక సందర్భాలలో బయటకొస్తుంటుంది.. “Poetry stems from the habit if human being to express differently” ఈ అలవాటు మనిషికి ఉన్నంతకాలం కవిత్వం ప్రవహిస్తూనే ఉంటుంది. కొన్నిమాటలు చూడండి. “మబ్బుకు చిల్లులు పడ్డట్టు ఏమిటీ వర్షం”, “పట్నంలో బతకాలంటే ఒళ్ళంతా కళ్ళుండాలి”
పల్లెవాసుల పాటల్లో సామెతల్లో కవిత్వం తొణికిసలాడుతుంది. అందుకే శ్రమజీవులు ఉన్నంతకాలం కవిత్వం బతికేఉంటుంది. అందుకే పుస్తకంలో కనిపించే కవులేకాదు శ్రమజీవుల్నీ గుర్తించాలి. Poetry is there in Life and Nature.. You only need it.. ఇంకో కారణం చెప్పుకోవాలంటే మానవ ఉద్వేగాల్ని వ్యక్తీకరించగల వెసులుబాటు ఎక్కువ కవిత్వానికే ఉంది. ఒకసందర్భంలో వాల్మీకి సీతాకోకచిలుకలను వర్ణించటానికి ‘రాలిన రంగురంగుల పూలు మళ్ళీ చెట్లవైపు పరిగెడుతున్నాయే’ అంటాడు. ఇప్పటి కవులలో
శివారెడ్డి నుంచి శిఖామణి వరకు కవులందరూ అన్ని సందర్భాలను తమలోకి ఇముడ్చుకుని కవిత్వాన్ని అల్లినవారే… “సకల పురుష ప్రపంచాన్ని నీ అరచేతిలోకి తీసుకుని సాచి ఒక లెంపకాయ కొట్టు తల్లీ” అంటాడు శివారెడ్డి ఒకచోట.
అదే శిఖామణి ఒకచోట “ఎప్పుడూ నెత్తికెక్కికూచునే ఉత్తరమేకదా అని విప్పబోతే ఒక సంజాయిషీ వాక్యం కాళ్ళమీద జారిపడి గాయంచేసింది” అంటాడు. మనిషి స్వభావం గురించి శ్రీ శ్రీ అన్న మాటలు గుర్తుచేసుకోండి.”నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగెరితే నిబిడాశ్చర్యంతో వీరే,
నేలకు నే రాలితే నిర్ధాక్ష్ణణ్యంగా వీరే”
స్త్రీల గురించి చెబుతూ ఓ కవయిత్రి “పాలు విరిగిపోవటానికున్నట్టు
మనసు విరిగిపోవటానికి కూడా
మాత్రలుంటే ఎంత బావుండు” అంటుంది..
“వీరుడు విగ్రహాల్లో ఉండడు
ప్రజల్లో గుండెల్లో ఉంటాడు” అంటాడు ప్రసాదమూర్తి.
ఒక మంచి కవిత వచ్చిన ప్రతిసారీ నేల కొంచెం సాగుతుందంటాడో ఆంగ్ల కవి.
కవిత్వం లేని ఉద్యమాలులేవు. కవిత్వం లేని జీవితం లేదు..
అనంతరం మాట్లాడిన తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు చిరంజీవిని కుమారిగారు కవులు Poets are unacknowledged legislators అన్నారు.. ప్రపంచ చరిత్రలో సామాజిక, రాజకీయగతి ఎప్పుడు మలుపు తీసుకున్నా కవుల పాత్ర ఉంటుందన్నారు.
ఈరోజు కవిత్వం సోషల్ మీడియాలో ఉంది. యువత ఆదిశగా కదలాలన్నారు.
మరోవక్త మువ్వా శ్రీనివాసరావుగారు మాట్లాడుతూ “మీతో మీరుచేసే సంభాషణలో నిజాయితీ ఉంటుంది. దాన్ని పేపర్ మీద పెడితే అది కవిత్వమవుతుంది” అని సూచించారు.
ప్రముఖుల చిత్రాలను చేతిరాతలను ప్రదర్శించిన శ్రీ వాడ్రేవు సుందరరావు మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదనాన్ని వివరించి ఆకట్టకున్నారు..
కవి, కథకుడు శ్రీ దాట్ల దేవదానంరాజుగారు మాట్లాడుతూ “1999లో పారిస్‌లో యునెస్కో చేసిన తీర్మానంతో మార్చి 21వ తేది ప్రపంచ కవితాదినోత్సవంగా రూపుదిద్దుకున్నది. కవిత్వానికి కవిసంధ్య కేంద్రబిందువుగా నిలుస్తోంది. కవిత్వమే కాకుండా కవిత్వానికి సంబంధించిన వ్యాసాలూ, పెద్దల జయంతులు వర్ధంతులూ కవిసంధ్య ద్వారా జరుపుతున్నాం. వీటన్నింటి ద్వారా మంచి సాహిత్యం సృష్టించగలుగుతున్నామన్న తృప్తి మాకుంది” అన్నారు.
ఈ సందర్భంగా కవిసంధ్య 12వ బులెటిన్‌ని ఆవిష్కరించారు. అంతటితో ఉదయం సెషన్ పూర్తయింది.
ప్రపంచ కవితాదినోత్సవాన్ని ఘనంగా జరిపిన కవిసంధ్య సాహితీ సంస్థవారు 21 వతేదీనాడు భోజనానంతర కార్యక్రమంలో కవిత్వాంశాలపై గోష్ఠి నిర్వహించారు..
శ్రీవాడ్రేవు సుందర్రావు అధ్యక్షత వహించిన ఆ సదస్సులో శ్రీ రామతీర్థ, శ్రీ సీతారాం, శ్రీ ప్రసాదమూర్తి వక్తలు..
అధ్యక్షోపన్యాసంలో శ్రీ వాడ్రేవు సుందర్రావు ఏది కవిత్వం అన్న అంశంపై చక్కటి చర్చను లేవనెత్తారు.. నందికేశుడి అలంకారశాస్త్రాన్ని ఉటంకిస్తూ వారు ఆకాశంలో ఉండే చంద్రుడు, నక్షత్రాలు ఆ పరమేశ్వరుడికి అలంకారం అంటుందాలంకార శాస్త్రం ఆని వివరించారు. కవిత్వం ఒక ప్రత్యేక విభాగం అని నమ్ముతాం. నెమలి పురివిప్పి పారవశ్యంతో చేసే నాట్యం కవిత్వం… “ఎవరి హృదయం పరవశం చెంది ఉద్వేగాన్ని పొంది అనుభూతిని వ్యక్తపరుస్తుందో, మనసు అలౌకికమయిన ఆనందాన్ని పొందుతుందో అదే అసలయిన కవిత్వం” అని ఉద్వేగంగా ప్రకటించారు సుందర్రావు గారు.
*కవిత్వం ప్రజల మాతృభాష కావాలి*-రామతీర్థ
ప్రపంచకవిత్వం అనే అంశంపై ప్రసంగిస్తూ అనువాదకులు,రచయిత శ్రీ రామతీర్థ మాట్లాడుతూ 250 ఏళ్ళ కితంవరకూ గ్రీక్, లాటిన్, సంస్కృతం వంటి భాషలలో కవ్యాలుండేవి కానీ కథ కవిత్వం అని వేర్వేరుగా ఉండేవికాదు. నాటకాలు కూడా కవిత్వమే ఆ రోజుల్లో. షేక్స్పియర్ sonnets లేదా ఖండకావ్యాలు రాశాడు. ఆ ఖండ కావ్యరూపమే కథావస్తువుగా కవిత్వానికి ప్రేరణగా నిలిచింది. సుమతీశతకం వేమనశతకం ఆ ఘనతను సాధించాయి.
ఇక్కడో ఓ విషయం చెప్పాలి. కొలంబియా దేశం డ్రగ్స్ మాఫియా దేశంగా అపకీర్తిని మోస్తున్న సమయంలో అక్కడి యువతకోసం పొయిట్రీ ఫెస్టివల్ మొదలుపెట్టారు. 56 దేశాలనుంచి కవులను ఆహ్వనించారు. మెడినైన్ పొయిట్రీ ఫెస్టివల్‌గా ఎంతో ప్రాచుర్యం పొందింది. తరువాతి కాలంలో ఆదేశానికి alternate Nobel prize ఇచ్చారు. అందుకే కవిత్వం ఆరోగ్యకరమైన వ్యసనం. కవులదెప్పుడూ ప్రజాపక్షమే. ఆలోచనలను ప్రజాపక్షం చేయడమే కవిత్వం. అందుకే కవిత్వం ప్రజల మాతృభాష కావాలి..
*వస్తువు రూపం అవిభాజ్యాలు*-సీతారాం
వస్తువు రూపం అంశాలపై ప్రసంగిస్తూ ప్రముఖ విమర్శకులు శ్రీ సీతారాం మొదలుపెట్టడమే ఒక స్టేట్మెంట్తో మొదలుపెట్టారు.. తెలుగు కవిత్వంలో ఉన్నది రూపమే వస్తువు కాదు అన్న ఓ మిత్రుడి వ్యాఖ్య అది. దానిని విశ్లేషిస్తూ వెళ్ళారు. కవివేదన అనుభూతి సామాజిక వాస్తవమై పద్యంగా బయటకు వస్తుంది. ఇందు
కోసం మూడు కవితల సాయం తీసుకుని మరీ వివరించారు సీతారాం. మువ్వా శ్రీనివాస్ గారి కవిత అందులో ఒకటి.
*మాఊరిమర్రిచెట్టుమీద అర్ధరాత్రి మందారం పూసిందని ఖాకీలు కాలవలై ప్రవహించాయి
తుపాకీ గొట్టాలు తూరుపుమొక్కలని పసిగట్టాయి*
ఇక్కడ వస్తువేది రూపమేది అని ప్రశ్నించారు.
ఏతావాతా తేలేదేమిటంటే వస్తువు రూపం అవిభాజ్యాలు…
*ఈతరం కవికి వస్తుభేదంలేదు*-ప్రసాదమూర్తి
దృశ్యమానకవిత్వం భిన్న ధోరణులు అన్న అంశంపై ప్రసంగించిన కవి శ్రీ బి.వి.ప్రసాదమూర్తి 1200 సంవత్సరాల కితం చెప్పిన ఓ సూఫి కవి మాటలు ఈరోజు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
*అస్థిత్వం లోపల అస్థిత్వ రాహిత్యం నా సూత్రం
కోల్పోవటంలో కోల్పోవటం నామతం* అన్నాడా సూఫీకవి
మానవస్పందనలు తనకు తెలిసిన భాషలో వ్యక్తీకరించటమే కవిత్వం.. ఒకే వయసువాళ్ళు ఓకే విధంగా రాయటం లేదు. వయసు తెచ్చిన మార్పులతో తీవ్రత తగ్గించుకున్నవాళ్ళున్నారు.
అంతే తీవ్రంగా రాస్తున్నవారున్నారని ఉదాహరణలతో వివరించారు. అంతిమంగా ఈతరం కవి అన్నివస్తువులను స్వీకరిస్తున్నాడని అభిప్రాయపడ్డారు. వందలవేల రంగులు విప్పుకున్న హరివిల్లులా కవితా ప్రభంజనమిప్పుడు దశదిశలా అన్నారు. వస్తువు ఏదయినా హృదయానికి హత్తుకునే విధంగా చెప్పటమే కవి లక్ష్యంగా కనిపిస్తుందన్నారు.
మూడు ప్రసంగాలు ఆరోజు హాజరయిన సభికులపై చెరగని ముద్రవేశాయంటే ఆశ్చర్యం లేదేమో.
అనంతరం పానుగంటి వారి కుటుంబంతో కలిసి కవిసంధ్య నిర్వహించిన కవితలపోటీల విజేతలకు బహుమతులందచేశారు. శ్రీ చిన్నారి ఈకార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆ తర్వాత తొమ్మిది మంది కవి మిత్రుల కవితా సంకలనాలను మరోమారు ఆవిష్కరించారు.
చివరిగా యువకవిమిత్రుల కవిసమ్మేళనంతో ప్రపంచకవితా దనోత్సవం కార్యక్రమాలు సంపన్నమయ్యాయి
ఎందరో విద్యార్థులకు మార్గదర్శకంగానూ స్ఫూర్తిదాయకంగా నిలిచేలారూపొందించిన కవిసంధ్య శిఖామణి దేవదానంరాజు గారికి, వారి మిత్రబృందానికీ అభినందనలు.
సి. ఎస్. రాంబాబు పేరెన్నికగల కథా రచయిత. కవి. “పసిడి మనసులు” అనే వీరి కథా సంపుటి పలువురి ప్రశంసలు పొందింది.
మీ సాహిత్య సభా రిపోర్టు చదివిన తర్వాత అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయాము అనే బాధ ఒకవైపు ఉంటే, అన్ని విషయాలు అరటిపండు వలిచి పెట్టినట్లుంది ఈ రిపోర్టు, ఇంక వెళ్ళకపోతే పోయింది ఏముంది అన్న సంతృప్తి కలుగుతుంది.
బాగుందండీ రాంబాబుగారు మీ శైలి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™