ప్రముఖ రచయిత, పాత్రికేయులు, సీనియర్ సంపాదకులు శ్రీ జి. వల్లీశ్వర్ రచించిన ’99 సెకన్ల కథలు’ పుస్తకావిష్కరణ సభ 10 సెప్టెంబరు 2022 నాడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా – నారపల్లి లోని స్వాధ్యాయ రిసోర్స్ సెంటర్లో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 వరకూ జరిగింది. ఈ కథలు గతంలో సంచికలో సీరిస్‌గా ప్రచురితమయినాయి.


శ్రీ కస్తూరి మురళీకృష్ణ అతిథులను సభకు పరిచయం చేశారు. శ్రీ కోవెల సుప్రసన్నాచార్య తమ ప్రసంగంలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా విశ్వనాథను తలచుకుంటూ, వారి రచనా శైలిని ప్రస్తావిస్తూ – 99 సెకన్ల కథలకీ, విశ్వనాథ వారి చిన్న కథలకీ మధ్య సమన్వయాన్ని ప్రదర్శించారు.
వల్లీశ్వర్ గారి ధర్మపత్ని – ఓ రచయిత/పాత్రికేయుని భార్యగా కుటుంబంలో తన పాత్రని వివరించారు.
శ్రీ పాణ్యం దత్తశర్మ ఈ పుస్తకంలోని కథలను అద్భుతంగా విశ్లేషించారు. నేను కథలను సంక్షిప్తంగా పరిచయం చేశాను.
అనంతరం వల్లీశ్వర్ గారు ఈ కథలు రాయడానికి గల నేపథ్యాన్ని వివరించి, పాత్రికేయునిగా తమ అనుభవాలను ప్రస్తావిస్తూ తమ స్పందనని తెలియజేశారు.
శ్రీ కోవెల సంతోష్ కుమార్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రచయిత చతురోక్తులతో, భారతం నుంచి దత్తశర్మ గారు గానం చేసిన పద్యాలతో సభ ఆహ్లాదకరంగా సాగింది. చివరగా సంచిక – స్వాధ్యాయ రాబోయే కాలంలో చేపట్టబోయే సాహిత్య కార్యక్రమాల గురించి, సంచికలో ప్రచురించబోయే కొత్త రచనల గురించి శ్రీ కస్తూరి మురళీకృష్ణ వివరించాకా, సభ ముగిసింది.
***
వల్లీశ్వర్ గారి 99 సెకన్ల కథల గురించి నా సంక్షిప్త పరిచయం – ఇక్కడ అందిస్తున్నాను.
***


“అందరికీ నమస్కారం. ఈ రోజు ఆవిష్కరించుకుంటున్న ’99 సెకన్ల కథలు’ పుస్తకం లోని కథలు సంచికలో వెబ్ పత్రికలో ప్రచురితమవడం, అవి నేను ప్రూఫ్ రీడింగ్ చేసి, అప్లోడ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
శ్రీ వల్లీశ్వర్ సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు, సీనియర్ సంపాదకులు. వారి రచనలు నిశితంగా, సూటిగా ఉంటాయి.
ఈ పుస్తకంలోని కథలు నిడివిలో చిన్నవి కానీ ప్రయోజనంలో విస్తృతమైనవి.
సూక్ష్మంగా ఉంటూనే – ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని ప్రదర్శించే కథలివి.
సులువుగా చదివింపజేస్తూ, పాఠకులపై గాఢమైన ముద్రను వేస్తాయీ కథలు.
వ్యక్తిత్వ వికాస నిపుణులకి ఏ మాత్రం తీసిపోని విధంగా రచయిత ఎన్నో సమస్యలను – ఆచరించగలిగే పరిష్కారాలను ప్రస్తావిస్తారు.
దిగువ, ఎగువ మధ్యతరగతి వర్గాల, ధనికుల ప్రవర్తననీ, స్వభావాన్ని కథలలోని సన్నివేశాల ద్వారా, సంభాషణల ద్వారా అద్భుతంగా వ్యక్తీకరించారు.
మధ్య వయస్కులకు మేనమామలా, పిల్లలకు తాతగారిలా శేషయ్య గారి లాంటి వ్యక్తి అండ ఉంటే వారు తప్పటడుగు వేసే ప్రమాదమే ఉండదు.
తల్లిదండ్రులను, ఇతర పెద్దలను ఎలా గౌరవించాలో, తోబుట్టువులు, ఇతర బంధువులతో మసలుకోవాలో కథల్లోని పాత్రలు సమయోచితంగా చెప్తాయి.
పురాణేతిహాసాలు, భారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత వంటి గ్రంథాల లోని ధర్మసూక్ష్మాలను అందరికీ అర్థమయ్యేలా అరటి పండు ఒలిచి పెట్టినట్లు ఈ కథల ద్వారా చెప్పారు రచయిత.
పేదరికంలో ఎలా ఉండాలో, సంపద కలిగినప్పుడు ఎలా నడుచుకోవాలో కొన్ని కథలు చెప్తాయి.
ఏది నిజమైన భక్తో, ఏది ఆడంబరమో మరికొన్ని కథలు చెప్తాయి.
మనిషి ఎదిగే కొద్దీ, వినయంగా ఉండడం ఎంత అవసరమో ఈ కథల ద్వారా తెలుస్తుంది.
దుర్వ్యసనాలకి దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనతో అందరిని కలుపుకు పోతూ – తన పర భేదాలు చూపకుండా ఉంటే భూలోకమే స్వర్గమని ఇందులోని కథలు సూచిస్తాయి.
సమాజానికి మేలు కలిగించే కథల సంపుటికి ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.”

కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.