[శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ రచించిన ‘ఆలంబన’ అనే కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ గారి తొలి కవితా సంపుటి ‘ఆలంబన’. ఇందులో యాభై కవితలున్నాయి.
“శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ అనుభవ శకలాల సమాహారమే ఈ ‘ఆలంబన’ కవితా సంపుటి. సహజంగా జీవితంలోంచి వచ్చేదే నిజమైన కవిత్వమని నిస్సంశయంగా చెప్పడానికి నిదర్శనమే ఈ కావ్యం” అని వ్యాఖ్యానించారు పుస్తక శిల్పి శ్రీ తాళ్ళపల్లి మురళీధర గౌడు.
***
“సృజనాత్మకు ప్రేరణనిస్తున్నది, ఆలంబనై ముందుకు నడిపిస్తుతున్నది” సాహిత్యమేనని చెప్తూ, ఆత్మపరిశీలన చేయించిందని అన్నారు ‘ఆలంబన’ కవితలో. చలం ప్రభావంతో రాసిన ‘మేల్ ఫెమినిస్ట్’ అనే కవితలో, చలం అసలైన స్త్రీ పక్షపాతి అంటూ వారిపై తన అభిమానాన్ని చాటుకున్నారు శాంతిశ్రీ.
నేటి తరపు ఆడపిల్లల ధైర్యాన్ని, తెలివిని, పని నైపుణ్యాలను సరళమైన పదాలలో వెల్లడించి, యువతులు నడుచుకోవాల్సిన పద్ధతి ఇదంటారు ‘కూతురు’ కవితలో. ‘ప్రశ్న’ చక్కని కవిత. మనిషి ఎదుగుదలకు ప్రశ్నే కారణమంటూ ప్రశ్నించటం ప్రాముఖ్యతని తెలిపారీ కవితలో.
‘మహానటి’ సినిమా చూసి, సావిత్రిని గుర్తు చేసుకుంటూ రాసిన ‘మహానటి’ కవితలో సావిత్రి నటనా కౌశలాన్ని మెచ్చుకుంటారు. చివరి దశలో ఆమె అనుభవించిన కష్టాలను తలచుకుని బాధపడతారు. స్నేహమనేది రాజకీయాలకు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అతీతంగా సూచించే కవిత ‘స్నేహం.. విలువ!?’. స్నేహబంధాలు జీవితాంతం నిలుపుకోవాల్సిన పెన్నిధులని వ్యాఖ్యానిస్తారు.
పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న స్వీడన్‌కు చెందిన చిన్నారి గ్రేటా తున్బర్గ్కు అండగా నిలవాల్సిన అవసరాన్ని ‘పుడమితల్లి పరిరక్షణ’ అనే కవితలో సూటిగా చెప్పారు. న్యూజెర్సీ లోని హడ్సన్ నది గురించి రాసిన ‘హడ్సన్ నది!’ అనే కవిత హడ్సన్ నదీ ప్రవాహాన్ని పాఠకుల కళ్ళ ముందు నిలుపుతుంది.
“పరిపూర్ణ స్త్రీమూర్తివయ్యే ఆరాటంలోనే/నీ జీవితం ముగిసిపోనివ్వకు” అంటూ ఆడవాళ్ళకు ఉపయుక్తమైన సూచనలు చేశారు ‘నారీ నినాదం!’ కవితలో. “దేవతామూర్తిని చేస్తారు నిన్ను/సాటి మనిషిగా గుర్తింపు కదా/ నువ్వు కోరుకోవాల్సింది” అంటారు.
‘ఆశావాది’ కవిత అత్యంత స్ఫూర్తివంతమైన కవిత. ఆశని ఎన్నడూ కోల్పోకూడదనే సత్యాన్ని చిన్న చిన్న పదాలతో, ప్రభావవంతంగా చెప్పారు కవయిత్రి. ప్రకృతి నేర్పే గొప్ప పాఠం ఏమిటో తెలుసుకోవాలంటే, ‘ప్రకృతి పాఠం’ కవిత చదవాలి.
జీవిత భాగస్వామిని కోల్పోయిన స్నేహితురాలు తన అనుభవాలు పంచుకోగా, శాంతిశ్రీ వాటికి స్పందిస్తూ రాసిన ‘చిరుదివ్వె’ కవిత ఎంతో హృద్యంగా ఉంది. ‘బాంధవ్యాలు’ కవిత చదువరులను ఆత్మపరిశీలనకు పురిగొల్పుతుంది.
‘ఆరోగ్యం’, ‘వైద్యం’ కవితలు – ధనిక, పేదవారికి లభ్యమవుతున్న వైద్య సేవలలోని అంతరాలను ప్రశ్నిస్తాయి. ‘అసమానతలు’ కవిత అసహాయుల పట్ల సమాజపు తీరుని విమర్శిస్తుంది. స్నేహితురాలి మరణం చూసి చలించిపోయి రాసుకున్న కవిత ‘దీర్ఘ సుషుప్తి!’. మరణం పట్ల భారతీయ దృక్కోణాన్ని ప్రస్తావిస్తుందీ కవిత.
‘ఎంత బాగుండునో’ కవితలో కవయిత్రి ఊహించుకున్నవన్నీ సంభవిస్తే, నిజంగానే ఎంతో బావుంటుంది. జీవితాంతం మర్చిపోలేని తియ్యని జ్ఞాపకం అంటూ చిన్నతనం గురించి రాసిన ‘బాల్యం’ కవిత, పాఠకులను తమ బాల్యానికి తీసుకువెళ్తుంది.
ఏదీ పరాజయమో, ఏది విజయమో స్పష్టం చేస్తుంది ‘గెలుపు’ కవిత. సోషల్ మీడియా వేలం వెర్రిలో కొట్టుకుపోతున్న యువతని హెచ్చరిచి, సాటి మనుషులతో కబుర్లాడమనీ, వారి కష్టాలు/అవసరాలలో వీలైనంత సాయం చేయమని చెప్తుంది ‘మానవత్వం మరిచిపోకు’ కవిత.
ఎన్నో ఏళ్ళ తరువాత సొంతూరుకి వెళితే, పాత జ్ఞాపకాలేవీ మిగలకపోవడం బాధిస్తుంది. ‘మా ఊరి ప్రయాణం’ నోస్టాల్జిక్ పోయమ్. ‘నువ్వు నేను’ కవిత వృద్ధ దంపతుల ఆంతరంగిక ఆవేదనకి అద్దం పడుతుంది.
కోవిడ్ సమయంలో, కరోనా వల్ల ఆత్మీయులు మరణిస్తే, చివరి చూపుకు నోచుకోని రక్తసంబధీకుల ఆవేదనకి అక్షర రూపం ‘నాన్న కోసం..’ కవిత. వృద్ధాప్యం నుంచి జీవితపు చరమదశకు సాగే పయనం ఎలా ఉండాలో చెప్పిన కవిత ‘చివరగా..’
~
శాంతిశ్రీ గారి ఈ కవితా సంపుటిలో ప్రధానంగా కనిపించేది వస్తు వైవిద్యం! రెండోది చుట్టూ జరుగుతున్న సంఘటనల పట్ల స్పందన!
శాంతిశ్రీ గారి ఈ తొలి కవితా సంపుటిని ఆహ్వానిస్తూనే, అభినందిస్తూనే, ముందుమాటలో పలు చక్కని సూచనలు చేశారు ఎన్. వేణుగోపాల్. ఈ సూచనలు శాంతిశ్రీ గారికే కాదు, వర్ధమాన/నూతనల కవులందరికీ వర్తిస్తాయి.
***


రచన: శాంతిశ్రీ బెనర్జీ
ప్రచురణ: సూర్య ప్రచురణలు
పేజీలు: 130
వెల: ₹100.00
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
శాంతిశ్రీ బెనర్జీ
201, సాయి స్ల్పెండిడ్ అపార్ట్మెంట్స్,
జె.వి. కాలనీ, గచ్చిబౌలి
హైదరాబాద్ 500032
ఫోన్: 9871989360

కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.