‘నిజాయితీ అనేది మనిషి బతుకులో అంతటా కనిపించాలి. అక్షరానికి అక్కర్లేదనుకునే మీలాంటి వాళ్ళంటే నాకసహ్యం’ ఎంత ఏహ్యభావనతో ఆ మాటన్నాడు-తన ఒక్కగా నొక్క కొడుకు-మధు! కణ కణ కాల్చిన కర్రువాత! |
‘ఇన్ని మాటలెందుగ్గానీ మా బతుకు మమ్మల్ని బతకనియ్యండి. మీదారి మీరు చూసుకోండి’. కోడలు ప్రమీల సూటిగానే చెప్పింది ఇల్లు ఖాళీ చెయ్యమని!
ఇది నిన్నటి ముగింపు.
మొన్న శనివారం ఉదయం నుంచి కాఫీ అందించటంతోనే విసుగు తుంపర మొదలైంది. చినుకులు… చాలానే టపటప రాలినై.
ఆ తర్వాత- స్కూల్లో నా పరువు పోతోంది. ‘ఏమిటే… మీ మాఁవ గారికి రోజూ ఇదే జాడ్యమే?” అని ఒకటే హేళన. అయినా, రోజూ దినచర్యలాగా, దైవకార్యంలాగా ఆ ‘ఫీచర్’లో అదే రాత… అదే రోత… అదే కుళ్ళు రాజకీయమేనా…?’ అని ఇంకొకరి నవ్వు. ‘కళ్ళకు ఎంతగా గంతలు కట్టుకున్న వెధవకైనా ఇంతటి ‘కాకా’ పనికిరాదు. ఇదెక్కడి న్యూసెన్స్. అందుకనే మేము ఆ పేపరు మానేశాము’ ఎన్నడూ ఎవరి గురించీ పల్లెత్తుమాట కూడా అనని కొలీగ్ సీత ఈసడింపు, నేను భరించలేకపోతున్నాను. స్కూలు వెళ్ళాలంటేనే…” ఆర్ధోక్తిలో ఆపింది ప్రమీల.
అప్పుడు – మధు వడగళ్ళు మొదలైనై. “అయినా వాడు విదిల్చే నాలుగు రాళ్లకోసం మనమెందుకు చెత్త రాయాలి? ఏ రాతరాసినా నిజాయితీ వుండాలి గదా! చెప్పండి నాన్నగారూ?’ ‘రాక్షసీ… నీ పేరు రాజకీయమా’ అని ఆదివిష్ణు ఎప్పుడో రాయనే రాశాడు. అదెప్పుడూ రాక్షసే. ఆత్మని చంపుకుని అక్షరాల్ని అమ్ముకోవాలా? అలా రాయడం సిగ్గనిపించట్లేదా?”
గుండె కలుక్కుమన్నది. అసలు ఆలోచనే స్తంభించింది.
“ఒక్కమాటడుగుతాను చెప్పండి. 365 రోజులూ-ఎవర్నో దూషించటం, మీ దృష్టితో ఆ దుర్మార్గపు పాత్రలకి రంగులేయటం, నిందించటం చేస్తుంటే- సైకో సోమాటిక్గా ఆ జబ్బు మీ వొంట జితించి పోవటం లేదూ-? దానితో మనసూ, దేహమూ కుళ్ళిపోదూ-?”
నా చెవులు వింటున్నా. కానీ అది అందుకోవటం లేదు. నాకు ఏదో అవుతోంది! చేష్టలు దక్కటం అంటే ఇదేనేమో!
మళ్ళీ ప్రమీల “అసలు మీకీ రాతలూ, డబ్బూ ఎందుకూ? మీ డబ్బు పైసా కూడా మాకక్కర్లేదు. చూద్దామంటే మీ అవసరాలు తక్కువ. కాఫీ, సిగరెట్ వుంటే చాలు. మీకేలోటూ రాకుండా చూసుకునేందుకు మా సంపాదన ఎక్కీ తక్కీ. పైగా మాకూ ఏ పిల్లా పితుకూ లేదు. సంపాదించి కట్టుకుపోతామా? అసలు ఇన్నాళ్ళూ మీకు చెప్పని నిజం చెబుతున్నాను. వినండి – ఆ మధ్య ఒక రోజున యాదృచ్ఛికంగా ‘యూ ట్యూబ్’లో ఏదో సైట్ తగిలింది. మీ కాలమ్ మీద ఎవరో కామెంట్స్ రాస్తూ పోయారు. అన్నీ బండబూతులు. అమ్మ నాయనల్ని ఏకరువు పెట్టారు. నాకు కడుపు రగిలిపోయింది. అసహ్యంతో శరీరం దహించుకు పోయింది…” అని ఆగి “అసలా రాతలెందుకూ అని నా ప్రశ్న?” అంటూ మధువైపు చూసింది.
నేను నిరుత్తరుణ్ణయిపోయాను. ఇంతకంటే సిగ్గుచేటు ఏం వుంది? నిజమే… ఇద్దరూ-యథార్థమే చెప్పారు. ‘నేనన్నమాట’నే చెప్పారు.
ఠక్కున మనసు గతంలోకి జారింది.
ఆవేళ-హెయిర్ కటింగ్ సెలూన్లో-వెయిటింగ్. “ఈ ఎదవ ‘నేనన్నమాట’ అంటూ రాస్తా ఉంటాడు. గుడ్డికళ్ళనాయాలు… ఆడి నాయకుడొక్కడే దేవుడు! ఆ దేవుడికి ఈడి బజన. తమాషా ఏందంటే జనాల్నందర్నీ ఆడిలా అబద్దమాడీ, ఘోరాయేసీ బతకమంటాడు. ఆడికేదీ తప్పుకాదు. ఛా… ఛా… గడ్డికి కక్కుర్తి పడే మడుసులు…” బెంచీ మీద పేపరు చదువుతూ ఒక యువకుడి చీదరింపు.
మనసు నొచ్చుకుంది. కానీ… వెంటనే ఆ మాటల్ని దులపరించుకుంది. పెదవి విరుపుతో సరిపోయింది.
ఆ తర్వాత – ఒకరోజు-
ఏదో సాహిత్య సభకి పోతే వేదిక మీద ఓ పెద్దాయన మాట్లాడుతున్నాడు. “ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యాల్లో అతిపెద్ద దౌర్భాగ్యం మనుషులందరూ అమ్ముడుపోవడమే” అంటూ “కొంతమంది రాసే రాతలు చూస్తుంటే వాళ్ళెప్పుడూ పందిని నంది అనటానికే పుట్టారా? అనిపిస్తుంది. చివరికి బురదని మెచ్చి… మెచ్చి – ఆ మురిగ్గుంటలోనే దొర్లుతూ వుంటారు” తీవ్రస్థాయిలో గొంతు చించుకుంటున్నాడు.
నేను మళ్ళీ అదే నవ్వు నవ్వుకుంటూ బయటకి వచ్చేశాను.
ఓసారి పార్టీలో మిత్రుడు సురేశ్, “నేను పేపర్లు చదవను. ఎందుకంటే అవి ఇప్పుడు న్యూస్ పేపర్స్ కాదు కదా- నువ్వో మరోటో చెప్పే వ్యూస్ పేపర్సేగా” అంటూ జోక్ చేశాడు.
“ఇది మరీ అన్యాయంరా” అని భుజం తట్టి మాటని గాలికి వదిలేశాను.
నాలుగేళ్ళ క్రితం –
ఒక రోజు నిద్రలేచి ఇంకా పడకమీద ఉండగానే అన్నది శర్వాణి – ” ‘అని అనిపించుకో అత్తా’ అన్నట్టు ఆ ఛండాలపు రాత లెందుకూ ఎదుటి వాళ్ళచేత మాటల చెప్పుదెబ్బలు తినటమెందుకూ? చేసినంత కాలం గౌరవంగా ఉద్యోగం చేశారు. ఇప్పుడీ నీతిమాలిన రాతలెందుకూ?”
ఆవేళ కూడా నవ్వి ఊరుకున్నాను. ఇవాళ తాను లేదు, కాలం చేసింది. అవును. ఆరోజు.. భార్య చెప్పినా తలకెక్కలేదు. జ్ఞానోదయం కాలేదు. కొడుకూ, కోడలూ నిలవేసి, కుళ్ళబొడిస్తే ఇప్పుడు కళ్ళు విచ్చుకున్నై. అంతరాత్మ మేలుకున్నది. నిర్ణయాన్ని కిరణప్రసారంగా అందించింది. క్షణంలో సగం సేపు… అంతే! ఛీ.. అనుకుంది – మనసు.
ఒకే ఒక్క రోజులో అన్ని వ్యవహారాలూ – బంధాలూ, బంధనాలూ…. పూర్తిచేసుకున్నాను.
జీవితమంటేనే మార్పుకదా! చదివిన చదువునంతా అటకెక్కించి, మురికి అంటించుకున్నా, ఇంకా బుర్రలోని కొన్ని సిద్ధాంతాల ఆకులు పచ్చగానే ఉన్నై.
తెలతెలవారుతోంది.
బయట బాగా ముసురు పట్టింది. నాలో లోపల మాత్రం మనసుతెర – ధవళస్వచ్ఛంగా ఉంది. నా రాతల్ని ఆపేస్తున్నానని చెప్పవలసిన వారికి చెప్పేశాను.
ఇంతమాత్రమే అయితే నా కథ మీకు చెప్పివుండేవాడిని కాదు. మహాప్రస్థానమేమోగానీ, నా ప్రయాణం మాత్రం అంతకుముందే ఉంది. యాక్టివోని పెట్రెలు తాగుడికి తృప్తి తీరనంతగా అలవాటు చేశాను.
జానపద కథల్లో రాజకుమారులు లోకాన్ని తెలుసుకోవటానికి వేషం మార్చి దేశం మీద పడ్డట్టు తిరుగుడే… తిరుగుడు….!
ఉదయాన్నే దేవాలయ దర్శనం… పూజారి తీర్థానికీ, ప్రసాదానికీ చేయి చాపటం, ప్రసాదం వద్దు, పదిరూపాయలివ్వమని ప్రసాదాన్ని విసురుగా నాపై విసిరిన బిచ్చగత్తె నుంచీ, మధ్యాహ్నం మేరేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో సర్టిఫికెట్ ఇవ్వటానికి పట్టే రోజుల లెక్కకి ‘మామూలు’ టారిఫ్ అంకెల్ని నోట్ చేసుకోవటం,
సాయంత్రం – లాక్ డౌన్ సేవలో “నోరు నాది. పేరు మీది” బాపతు ‘వితరణ పంపిణీ, నిలువెత్తు మహామహుల ఫ్లెక్సీల ఆవిష్కరణం;
పట్టాలు- చట్టాలు… చుట్టాలు… అడ్డమైన సడ్డాలు….. మార్కెట్ల దళారీలు… పార్కింగ్ అడ్డాల దందా… సంక్షేమం-చట్టుబండలూ, ఇసుకరీచ్లూ;
కరోనా తల్లిని రోగం నయమైనా ఇంటికి రావద్దనే సంతానం నైజం;
పరువు హత్యలూ; ప్రేమ హత్యలూ, చదువు ఆత్మహత్యలూ, నేరాలూ, ఘోరాలూ, ఇప్పుడు ఆ టాప్ ఆఫ్ ఆన్ దీజ్… లాకప్ డెత్‌లు..
ఓహ్…. అప్రత్యక్షంగా అనంతమైన దృశ్యాదృశ్యాలు… ఇరుకు మురికి గాథలు… అవును… నేను ఇప్పుడు మళ్ళీ పత్రికలో రాయటం మొదలెట్టాను.
తేడా అల్లా… ఆనాటిది వందిమాగధుల చెక్కభజన. జోగీ జోగడాల అలంకరణ… ఈనాటిది… కళ్ళారా చూస్తున్నదీ, వింటున్నదీ… అదే మీరన్నమాటనే ‘నేనన్నమాట’ని చేస్తున్నాను.
ఇప్పుడు నేనెటు నిలబడాలో నాకు అర్థమైంది. ఈమాట అంటుంటే శ్రీశ్రీ ‘కవి’కి ఇచ్చిన నిర్వచనం స్పురించింది. నిండుగా ఊపిరి తీసుకున్నాను. చాలా హాయిగా ఉంది!!

విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.
4 Comments
Valliswar
చాలా కాలం తరువాత ఒక పాత్రికేయుడిలో మానసిక సంఘర్షణ ఈ ‘ఆత్మ విముక్తి ‘ కథలో చదివాను.
నిజానికి ప్రతి పాత్రికేయుడిలో ఇలాంటి సంఘర్షణ వుంటుందని ఇప్పటికాలంలో చెప్పలేం. కాని అలాంటి సంఘర్షణ కొన్ని తేడాలతో పాత్రికేయుడిగా నేనూ అనుభవించాను.
ఈ కథలో …. ఆ సంఘర్షణ కాలంలో అతను ఎలా వున్నాడో, ఆ తరువాత ఎలా మారాడో చెప్పిన తీరు ఆ అలంకారాల్లో చూడండి:
యాక్టివోని పెట్రెలు తాగుడికి తృప్తి తీరనంతగా అలవాటు చేశాను.

…………
జానపద కథల్లో రాజకుమారులు లోకాన్ని తెలుసుకోవటానికి వేషం మార్చి దేశం మీద పడ్డట్టు తిరుగుడే… తిరుగుడు….!
………….
జీవితమంటేనే మార్పుకదా! చదివిన చదువునంతా అటకెక్కించి, మురికి అంటించుకున్నా, ఇంకా బుర్రలోని కొన్ని సిద్ధాంతాల ఆకులు పచ్చగానే ఉన్నై.
…………..
బయట బాగా ముసురు పట్టింది. నాలో లోపల మాత్రం మనసుతెర – ధవళస్వచ్ఛంగా ఉంది.
…………….
కస్తూరి మురళీ కృష్ణ
విహారి గారి “ఆత్మ విముక్తి” కథ ఎన్నో అక్షరాల లోతుల సారాంశం. ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదివి, ఆ మెలకువలు పసిగట్టాల్సిన కథాపాఠం.
విహారి గారికి అభినందనపూర్వక నమస్సులు.
ఎమ్వీ రామిరెడ్డి
కస్తూరి మురళీ కృష్ణ
విహారి గారి ఆత్మ విముక్తి అద్భుతం ..ఒక పరిణితి చెందిన కలం జాలువార్చిన ప్రత్యక్షరo ..అనుభూతి ప్రేరకమే ..పత్రికారoగo లోని ఒక కాలమిస్టు క్షీణ విలువల్నిన్చి ..పరివర్తన చెందడం కధాoశo అయినా ప్రతి వాక్యంలోనూ దర్శనమీచ్చే పలుకుబడులు ..అలంకారాలు అబ్బురమనిపిస్తాయి ..కధల గురువు గారికీ అభినందనలు ..అభివాదాలు !
శ్రీ కంఠ స్ఫూర్తి ..
ఘాలి లలితా ప్రవల్లిక
విహారి గారి ఆత్మ విముక్తి




చాలాబాగుంది .
జీవితమంటేనే మార్పుకదా! చదివిన చదువునంతా అటకెక్కించి, మురికి అంటించుకున్నా, ఇంకా బుర్రలోని కొన్ని సిద్ధాంతాల ఆకులు పచ్చగానే ఉన్నై.