పంధొమ్మిదివందల తొంభయ్యవ దశకం మొదలులో. స్పేస్ స్టేషన్‌ని లాంచ్ చెయ్యడానికి నాసా ప్రయత్నాలు చేస్తోంది. వ్యోమగాములని చంద్రమండలానికి చేరవేసిన అపోలో లాంటి మాడ్యూల్స్ ని నాసా ఏకబిగిన అంతరిక్షంలోకి పంపింది గానీ, ఇంత పెద్ద కట్టడాన్ని ఒకేసారి అంతరిక్షంలోకి పంపే వీలు లేదు. అందుకని చిన్న చిన్న భాగాలని లాంచ్ చేసి వాటిని అంతరిక్షంలో గుమికూడ్చాలి. అది కూడా వెంటవెంటనే కాదు, కొన్ని నెలల వ్యవధి తరువాత. గుమికూడ్చడంలో తరువాతి అంచెని చేరేదాకా అప్పటిదాకా తయారయిన భాగం నిలకడగా ఉండాలి. కొంతభాగం తయారయిన తరువాత పొడుగయిన చేతులున్న రోబోట్ సాయంతో కొత్తగా వచ్చిన విభాగాన్ని అప్పటికే తయారయివున్నదానికి జతకలుపుతారు. ఈ రోబోట్ చేతులు మన చేతులవంటివే. అయితే, మనకి రెండు చేతులుంటే దానికి ఒకటే చెయ్యి. అయితే, దాని భుజం రోదసిలో అప్పటికే కొంత తయారయివున్న భాగానికి జతచేసి ఉండడం వల్ల అది దేని నయినా చేత్తో కదపబోతే, దాని భుజం దేనికి కలిపి ఉన్నదో అది కూడా కదులుతుంది. అంటే, ఇది చెరువులో ఒక పడవలో కూర్చుని ఇంకో పడవని తాడుతో లాగితే జరిగేటటువంటి దన్నమాట. రోబోట్ తన చేతులతో పట్టుకుని కదిపే భాగం వేల కిలోల బరువుంటుంది. అందుకని రోబోట్ రెండు చివరలూ ఎంత కదులుతాయో, ఎలా కదులుతాయో ముందరే తెలుసుకుని, దాన్ని నియంత్రించేలా చూసుకోవాలి. అదుపు తప్పకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అప్పటిదాకా అంత సంక్లిష్ట మయిన కట్టడాన్ని అంతరిక్షంలో అసెంబుల్ చెయ్యలేదు. అసెంబుల్ చేసిన తరువాత దాని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదు. ఆ గుట్టుని సమీకరణాల ద్వారా విప్పడానికి ప్రయత్నించే కొందరిలో టెడ్ మార్డ్ఫిన్ ఒకడు.
మొదటి ఉద్యోగంలో పరిచయమయ్యాడు టెడ్. సహోద్యోగిగా కాదు, కస్టమర్‌గా. అతను పనిచేస్తున్న కంపెనీకి నేను పనిచేస్తున్న కంపెనీ సాఫ్ట్‌వేర్‌ని అమ్మింది. దాన్ని ఉపయోగించి స్పేస్ స్టేషన్ విడిభాగాలని ఆ రోబోట్ జతపరుస్తున్నప్పుడు ఆ సంక్లిష్ట మయిన కూర్పుల చలనాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం అతని ఉద్యోగ విధి. ఆ సాఫ్ట్వేర్ వాడుతున్నప్పుడు ఎదురయిన అర్థం కాని ఫలితాలకి వివరణని ఇవ్వడానికి మా కంపెనీ నన్ను పంపినప్పుడు టెడ్‌ని మొదటిసారి కలిశాను. నేనిచ్చిన వివరణని అర్థం చేసుకున్నాడు. తరువాత నేను అతను పనిచేస్తున్న కంపెనీకి మారి అతనితో ఒక ఏడాదిపాటు పనిచేశాను.
టెడ్ అప్పటికే పార్ట్ టైం మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి పి.హెచ్.డి. మొదలుపెట్టాడు. మాస్టర్స్ పూర్తిచేయ్యడానికే, సెమెస్టర్‌కి ఒక కోర్సు చొప్పున ఎనిమిది కోర్సులు చెయ్యడానికి నాలుగేళ్లు పట్టింది. పి.హెచ్.డి. కోసం మరికొన్ని కోర్సులు. ఈ సమయంలోనే అతనికి పిల్లలు పుట్టి పెద్దవాళ్లవుతున్నారు కూడా. అతని సలహా మీద, సిఫార్సు మీద అతను చదువుతున్న యూనివర్సిటీలో కొన్ని కోర్సులని బోధించాను. మేమిద్దరమూ కలిసి మొదలుపెట్టిన అంశంలోనే అతను ఇంకా ప్రగతి సాధించడానికి పూనుకున్నాడు.
దురదృష్టవశాత్తూ అతనూ, నేనూ పన్నెండు నెలల సహోద్యోగం తరువాత ఎవరి దోవన వాళ్లం వెళ్లవలసి వచ్చింది. అప్పటికే నేను అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎన్నోసార్లు దాటాను, అమెరికాలోనే తూర్పు తీరాన్నుంచీ పడమటి తీరానికి ప్రయాణం చేశాను గానీ టెడ్ మాత్రం మేరీలాండ్ లోనే పుట్టి, పెరిగి, మిసిసిపీ నదిని కూడా దాటలేదు. అలాంటిది, తప్పనిసరిగా ఉద్యోగ రీత్యా హూస్టన్‌కి బదిలీ అయ్యాడు. కుటుంబాన్ని ఉన్నచోటే ఉంచి, నెలకి రెండు వారాంతాలలో మాత్రమే ఇంటి మొహం చూడడం మాట అటుంచి, మతపరంగా అతను పాటించే శాబత్ (యూదు మతస్తులు శనివారం నాడు పాటిస్తారు) ని కూడా అక్కడ నిర్విఘ్నంగా అమలుజరపడం నాకిప్పటికీ స్ఫూర్తిదాయక మనిపిస్తుంది.
అతనికి పట్టిన రాహుకేతువులు రెండేళ్లలోనే వదలడం చేత ఇంటికి దగ్గరగా ఉండే ఉద్యోగంలో చేరాడు. అక్కడికి వారానికి అయిదుసార్లు ఇంటినించీ ట్రైన్లో గంటసేపు ప్రయాణం. ఆ సమయంలో అతను ఎంతో క్లిష్టమయిన సమీకరణాలని కనుక్కుని, నా పర్యవేక్షణలో తన డాక్టరేట్‌ని పూర్తిచేశాడు. ఆ డిగ్రీ సంపాదించడానికి అతనికి ప్రేరణ, తన తండ్రికి ఉన్న పి.హెచ్.డి. డిగ్రీని తనుకూడా సంపాదించాలన్న పట్టుదల. ఆ ప్రేరణలో నూరవ వంతయినా ఇంకెవరి కయినా ఉంటే, వాళ్లు కూడా అదృష్టవంతులే!
మేము ప్రచురించిన పరిశోధనా ఫలితాలను ఈనాటి రీసెర్చర్లు ఇంకా ఫాలో అవుతున్నారని, రిఫర్ చేస్తున్నారని ఈమధ్యనే తెలిసి ఇద్దరం సంతోషించాం.
వీటన్నిటికన్నా కూడా టెడ్ నాకు జీవితాంతం గుర్తుండిపోవడానికి కారణం ఒకటుంది. అది అతను చెప్పిన ఒక సంఘటనలో నన్ను నేను చూసుకోవడం.
ఒకసారి టీనేజర్ కొడుకుతో కలిసి టెడ్ రోడ్డుమీద నడుస్తుంటే, కొడుకు నాలుగడుగులు వెనగ్గా నడుస్తున్నాట్ట. “నాతోపాటు నడవవేం రా?” అని కొడుకు నడిగితే, టీనేజర్ల కుండే మిడిసిపాటుతో అతను, “నీతో కలిసి కనిపించడం నా కిష్టం లేదు!” అన్నాట్ట. కొడుకు అలా జవాబిచ్చినప్పుడు, “ఎంత ధైర్యం నీకు జన్మ నిచ్చిన తండ్రితో అలా అనడానికి?” అని తండ్రి కోపంతో అరవడమో, లేదా ఏమీ అనకుండా లోపల్లోపల పిసుక్కోవడమో మామూలుగా జరుగుతుంది. అలా కాకుండా, “నీతో కలిసి కనిపించాలని నాకు మాత్రం ఎందుకుంటుంది?” అని టెడ్ కొడుకుకి రిటార్టు నిచ్చానని టెడ్ చెప్పాడు. ఆ పిల్లాడు దాన్ని జన్మలో మరిచిపోలేడని నా నమ్మకం. అతని కొడుకు వయసులో నే నున్నప్పుడు రోడ్డుమీద మా నాన్న సైకిలు పట్టుకొని నడుస్తుండగా ఆయన పక్కన, కొంచెం వెనగ్గా నేను బిడియంగా నడవడాన్ని గుర్తుచేసి నా కించపడాల్సిన ప్రవర్తనని జన్మలో మరచిపోనీకుండా చేసినందుకు టెడ్కి నే నెప్పుడూ ఋణపడి వుంటాను. కొంచెం ఓదార్పు కలిగించే విషయం ఏమిటంటే, కనీసం ఒక రకమయిన టీనేజ్ ప్రవర్తన దేశకాలాలకి అతీతంగా మనుషుల్లో ఉంటుందని ఆనాడు నాకూ, ఇప్పుడు మీకూ తెలియడం!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™