లూబోస్ పి.హెచ్.డి. డిగ్రీతో మా ప్రాజెక్టులో చేరాడు. కొన్నేళ్లు నాదీ, అతనిదీ ఒకటే ఆఫీసు గది. ఇప్పటికీ అతని వయసు నలభై దాటదని నా నమ్మకం. అతను మాతో పనిచెయ్యడం మొదలుపెట్టిన తరువాతనే పెళ్లిచేసుకున్నాడు. నాలాగా వేరే దేశాన్నుంచీ పైచదువులకని అమెరికాకి వచ్చి పి.హెచ్.డి. చేసి ఇక్కడే స్థిరపడ్డాడు. స్లోవీనియా నించీ వచ్చినతను కొలంబియా దేశాన్నుంచీ వచ్చినామెను అమెరికాలో కలిసి పెళ్లిచేసుకోవడం! ఇక్కడ కాక ఇంకెక్కడా ఇంత సులువుగా సాధ్యం కాదేమో!
పి.హెచ్.డి. చేసి యూనివర్సిటీలో ఉపాధ్యాయ వృత్తిని చేపడితే అక్కడ వాళ్లని ప్రొఫెసర్లంటారు. అదే, ఇండస్ట్రీలో చేరితే వాళ్లని విషయ నిపుణు లంటారు (subject matter experts). అంతరిక్షంలోకి పంపే పరికరాలకు మాలిన్యం చేరి హాని కలిగించకుండా చూడడానికి అతని విషయ పరిజ్ఞానం అత్యంత అవసరం. నాసాలో పనిచేసే అందరికి లాగానే ఉద్యోగంలో ఇతని పరిజ్ఞానం గొప్పదని చెప్పడానికి కాదు ఈ పరిచయం. ఉద్యోగాన్నించీ ఇంటికి చేరిన తరువాత అతను పాల్గోనే అంశాలలో అతనికి సమయం ఎలా దొరుకుతుందనీ, శక్తి ఎలా వస్తుందనీ కలిగే ఆశ్చర్యాన్ని పంచుకోవడానికి మాత్రమే.
కొండ లెక్కడం దగ్గర మొదలెడతాను. అమెరికాలో ఉన్న యాభై రాష్ట్రాల్లోనూ సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో వున్న ప్రదేశాలకి చేరి ఆ రికార్డుని నమోదు చేసుకున్నవాళ్లకి ఒక క్లబ్ ఉన్నది. కొండలూ కోనలూ ఎక్కువగా ఉండే అమెరికాలో ఆ ఫీట్ చెయ్యడం అంత సులువయిన పని కాదు. ఉదాహరణకి, ఒక్క కొలరాడో రాష్ట్రంలోనే సముద్ర మట్టం కంటే కనీసం పధ్నాలుగు వేల అడుగుల ఎత్తు ఉన్న పర్వత శిఖరాలు పాతిక ఉన్నాయి. అక్కడికి చేరడం కాలినడకన మాత్రమే సాధ్యం. హవాయి రాష్ట్రంలోని మౌనా కియా శిఖరం పధ్నాలుగు వేల అడుగులకు దాదాపు రెండు వందల అడుగులు మాత్రం తక్కువ ఎత్తులో ఉన్నా గానీ, దాని మీద అబ్సర్వేటరీ ఉండడంవల్ల అక్కడికి వాహనం మీద చేరుకోవచ్చు. అయితే, అది అక్కడ పనిచేసే ఉద్యోగులు మాత్రమే చెయ్యగలిగిన పని. యాత్రికులు మాత్రం చివరి 4,600 అడుగుల ఎత్తునీ కాలినడకన మాత్రమే చేరుకోగలరు. కారు మీద తొమ్మిది వేల అడుగుల ఎత్తుకు త్వరగా చేరగలిగినా గానీ, అంత ఎత్తులో తక్కువగా లభించే ఆక్సిజన్ కి మానవ శరీరం అంత త్వరగా అడ్జస్ట్ కాలేదు. పొద్దున్న నాలుగు గంటలకి పర్వత పాదం దగ్గర మొదలుపెట్టి 2018 లో అతను ఒంటరిగా నడిచివెళ్లి శిఖరాన్ని చేరుకున్నాడు. పర్వత శిఖరాలమీద ఒంటరి నడక అతనికి అది మొదటిసారి కాదు. మేము 2017 లో హవాయి వెళ్లినప్పుడు ఆ ట్రెయిల్ మీద హైక్ చేద్దామనుకున్నాను గానీ కుదరలేదు. ఎంతో అనుభవమున్న అతనే అక్కడ గుర్తులు అంత స్పష్టంగా లేవని, ఎత్తుకు అడ్జస్ట్ కావడం కష్టమయిందనీ చెప్పిన తరువాత, భవిష్యత్తులో ఎప్పుడయినా గానీ ఒంటరిగా మాత్రం దాన్ని హైక్ చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను.
మరీ ఎత్తయిన శిఖరాలని ఆరోహించాలంటే గుర్తులు అంత తేలికగా కనిపించవు – అక్కడికి వెళ్లాలని కూడా చాలా తక్కువమంది అనుకోవడం వల్ల. పైగా, అట్లాంటి చోట్ల వైర్లెస్ సిగ్నల్ కూడా ఉండకపోవచ్చు. వేరేచోట ఒకసారి నలుగురితో కలిసి వెళ్లిన లుబోస్ కి ఒంటరిగా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. కలిసి పడుకున్నప్పుడు మిగలిన వాళ్లు ఇతన్ని వదిలి ఎలా వెళ్లారన్న దానికన్నా ఆశ్చర్యపడవలసిన విషయం ఇతను ఒంటరిగా ఎలా క్రిందకి చేరుకున్నాడనే!
పర్వతాల్ని అతను ఎక్కడం పూర్తిచేసే ప్రయత్నాల మధ్యలో లూబోస్ ప్రతిరోజూ మైళ్లకి మైళ్లు పరుగెడుతుంటాడు. పెళ్లయిన తరువాత భార్యతో కలిసి అతను పాల్గొనని మరథాన్ (42.195 కిలోమీటర్ల దూరం) అమెరికాలో దాదాపు లేదని చెప్పవచ్చు. ఊరికేనే పాల్గొనడం కాదు. తన అంతకు ముందరి రికార్డుని అధిగమించే ప్రయత్నంలోనే అతనెప్పుడూ ఉంటాడు. వాషింగ్టన్లో ఉన్నప్పటిలాగే కాలిఫోర్నియాకి నివాసాన్ని మార్చిన తరువాత అక్కడ కూడా అతను ఈ పరుగెత్తే గ్రూపులలో ఉన్నాడు. ఇది కాక ఒక రోజు 100 కిలోమీటర్ల దూరాన్ని 14 గంటల 9 నిముషాల్లో నడిచాడు.
ఇవన్నీ ఒక ఎత్తు, వంటలో అతని ప్రావీణ్యం ఇంకొక ఎత్తు. తన గ్రాండ్ మదర్ రెసిపిలతో బాటు తను కొత్తగా చేసే వంటకాల వివరాలని కూడా అతను తన వెబ్ సైట్లో పెడుతుంటాడు. ఆ సైట్ కి పెద్ద ఫాలోయింగ్ ఉన్నది.
జీతం తీసుకుని చేసే ఉద్యోగం కాక ఆన్లయిన్లో కోర్సులని కూడా లూబోస్ చెబుతుంటాడు. సబ్జెక్టు అతని స్పెషాలిటీ అవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా – ఇండియాతో కలిపి – రిజిస్ట్రేషన్లు వున్నాయని చెప్పాడు. ప్రస్తుతం ఒక పాఠ్యపుస్తకాన్ని జూలై నెలాఖరు లోగా పూర్తిచేసే ప్రయత్నంలో ఉన్నాడు.
లూబోస్ మా ప్రాజెక్టులో పనిచేసేటప్పుడు ఒక కంప్యూటర్ ప్రోగ్రాంని తయారుచేసి, దీన్ని కోతి కూడా రన్ చెయ్యగలదు, వాడుకోండి, నా అవసరం మీకు ఇక లేదు, అని కాలిఫోర్నియా వెళ్లిపోయాడు. కొత్తప్రదేశాలని చూడాలని తహతహలాడు తూంటాడు. 2017 డిసెంబర్లో భార్యతో కలిసి ఇండియా నాలుగు మూలలా తిరిగి వచ్చాడు. అతని మాటల్లోనే ఆ వివరాలని చదివాలంటే, ఆ ఫోటోలు చూడాలంటే, అతని గూర్చి ఇంకా తెలుసుకోవాల నుంటే iamlubos.com కెళ్లండి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™