అమ్మలో సగం.. నాన్నలో సగం ..
కలిసి అన్నగా అవతరించిన
అతడు అనురాగానికి మరో రూపం!
తమ్ముడిని ఆదరించే వేళ
అతడు తమ్ముడికి ఆత్మీయుడు!
చెల్లిని కంటికి రెప్పలా కాపాడే
అతడు చెల్లికి సదా సంరక్షకుడు!
అమ్మలోని వాత్సల్యాన్ని ..
నాన్నలోని లాలిత్యాన్ని..
పుణికిపుచ్చుకుని తోబుట్టువులకి
అతడు అనుక్షణం సన్నిహితుడు!
అమ్మలా లాలించగలడు..
నాన్నలా బాధ్యతలు అందుకుని
తన వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడగల ధీరుడు!
తమ్ముడు, చెల్లాయిల క్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతూ..
తన వాళ్ళ ఇష్టాలని సిద్ధింపజేయడమే..
తన లక్ష్యంగా కృషి చేయగలిగే మహోన్నతుడు.. ‘అన్న’!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.