పాత చింత కవితా పచ్చడి:
అష్టావధానం పాత చింతకాయ పచ్చడి అని చాలామంది అభాండాలు వేస్తుంటారు. ఆధునిక యాంత్రిక సమాజంలో ఇవన్నీ హంబగ్ అని విమర్శిస్తారు. కంప్యూటర్ మెదళ్ళకు మించిన మెదడు అవసరం అవధానికి. కంప్యూటర్లో ఏ ఫైల్‌కు ఆ ఫైల్ విడిగా భద్రపరచబడినట్లు (save) అవధాని మెదడులో 8 కంపార్టుమెంట్లు ఉంటాయి. సమస్య మొదటి పాదం చెప్పగానే అవధాని దానిని తన మెదడు పొరలోని ఒక అరలో అమర్చుకుంటాడు. రెండో వరుసకు వచ్చినపుడు ఆ సేవ్ చేసిన matter బయటకు తీసి రెండో పాదం పూర్తి చేస్తాడు. మళ్ళీ దానిని అదే అరలో పడవేస్తాడు.
యువతకు ఏం లాభం?
ఇది మంచి ప్రశ్న. అష్టావధానంలో 8 అంశాలు. అవి విద్యార్థులకు ఎలా ఉపయోగకరాలో ఆలోచిద్దాం. పండితులు కాదలచుకొన్నవారు, కవితం ఆరంభించదలచుకొన్నవారు జాగ్రత్తగా పరిశీలించండి. సమస్యాపూరణ వల్ల భాషపైన పట్టు వస్తుంది. పదాన్ని ఎలా విరవాలో తెలుస్తుంది. ఉదాహరణకు ‘భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్‘ అనే సమస్యను నాకు నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ అవధానంలో ప్రముఖ పండితులు నవులూరు మాలకొండయ్య ఇచ్చారు (6-1-1974).
సరస్వతీదేవి అనుగ్రహంతో నేనిలా పూరించాను.
“వరముని కోటికెల్లరకు బాధలు గూర్చెడి రాక్షసాళినిన్
దురమున ద్రుంచినాడు; మది తుష్టిని గూర్చె నహల్యభామకున్
కరుణ యొకింతలేక సతిగాసిలజేసెడి నీచుడైన రం
భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్”
రంభరతుడు రావణుడు. ‘రం’ అనే అక్షరం కలపడంతో భావమే మారిపోయింది. ఇలాంటి చమత్కారాలు గమనించినప్పుడు యువకవులకు ఉత్తేజం కలుగుతుంది. అలానే ‘కలలో గర్భముదాల్చి కన్య ఇలలో కన్యాత్వమున్ బాసెగా!’ అనే సమస్య. పూరిపాకలలో అని పూరణ. ఇవి మెదడుకు పదను బెట్టే అంశాలు. చదివినా, విన్నా ఆనందం కలుగుతుంది.
ప్రాచీనులు:
ఈ అవధాన విద్య ప్రాచీన కాలం నుండి తెలుగునాట వ్యాప్తిలో వుంది. చరిగొండ ధర్మన్నను ప్రాచీనులు ముందుగా చెబుతారు. శతలేఖిన్యవధాన పద్యరచనా సంధాసురత్రాణ చిహ్నితనాముడు. వంద ఘంటాలకు పద్యం చెప్పగల సమర్థుడు. విక్రమార్క చరిత్ర వ్రాసిన జక్కన తాత పెద్దయ్య అనేక రకాల అవధానాలలో తాను దిట్టనన్నాడు. రామరాజభూషణుడు (భట్టుమూర్తి) – సకల భాషా విశేష నిరుపమానావధాన శారదామూర్తి. మరిగంటి సింగరాచార్యులు శతఘంటావధాన ప్రసిద్ధులు.


తిరుపతిలో త్రిగళావధాన సభా సత్కారం 2019
ఆధునికులు:
ఆధునిక కాలంలో పలువురు అవధాన విద్యను బహుళ వ్యాప్తం చేశారు. ‘అవధాన విద్య – ఆరంభ వికాసాలు’ అనే పరిశోధనా గ్రంథంలో డా. రాళ్లబండి కవితాప్రసాద్ అవధాన యుగ విభజన చేశారు.
- నారాయణ భట్టు (1050) నుంచి 1850 వరకు ఆరంభ దశ
- 1850-1950 అవధాన వికాస దశ
- 1950-1985 అవధాన స్తబ్ధ దశ
- 1985 నుండి నేటి వరకు అవధాన పునర్వికాస దశ
“స్తబ్ధ దశలో ఆధునిక సాహిత్య ప్రచారం వల్ల, గేయ కవితల ప్రభావం వల్ల పద్యం వెనుకబడింది. పద్యం వ్రాసి, అవధానాలు చేయగల సమర్థులు కూడా ఈ విద్య పట్ల నిరాసక్తత చూపారు. అయినా శ్రీయుతులు సి.వి.సుబ్బన్న, పేరాల భరతశర్మ, బులుసు వేంకట రామమూర్తి, బేతవోలు రామబ్రహ్మం, ఆశావాది ప్రకాశరావు వంటి అవధానులు అవధాన విద్యా దీపాన్ని కొడిగొట్టకుండా నిలిపారు” అంటారు రాళ్లబండి.
19వ శతాబ్ది పూర్వార్థంలో తొలి అష్టావధానాన్ని మాడభూషి వారు, ఆ తరువాత కందుకూరి వీరేశలింగం, దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి, కాశీ కృష్ణాచార్య ప్రభృతులు అవధానం చేశారు. జంటకవుల యుగం ఆరంభమై తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవులు, వేంకట రామకృష్ణ కవులు స్పర్ధతో అవధానాలు చేశారు.
దేశభాషలందు తెలుగు లెస్స:
శ్రీకృష్ణదేవరాయలు – ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని లెస్సగా చెప్పాడు. తన భువన విజయ సభా భవనంలో అష్టదిగ్గజ కవులను పోషించి ఆశుకవితా ప్రదర్శనలు, కృతి సమర్పణలు ఘనంగా నిర్వహించిన రాజకవి ఆయన. అవధాన విద్య, జంటకవిత్వము – రెండూ తెలుగువారి సొత్తు. ఇతర భాషలలో ఇది లేదు. తరువాతి కాలంలో సంస్కృతం, హిందీ, కన్నడ భాషలలో ప్రయత్నాలు జరిగాయి. అయినా, అవి అంత ప్రాచుర్యంలోకి రాలేదు.
ప్రథమ శతావధాని:
నూరుమంది పృచ్ఛకులకు సమాధానాలు చెప్పడం శతావధానం. ప్రథమ శతావధాని కొలిచలమ మల్లినాథ సూరి – అని ‘అవధాన విద్యా సర్వస్వము’లో డా. రాపాక ఏకాంబరాచార్యులు సిద్ధాంతీకరించారు. ఈయన కాళిదాస రచనలకు వ్యాఖ్యానం రచించిన మల్లినాథ సూరికి తాత. రెండో ప్రతాపరుద్ర చక్రవర్తి సంస్థాన కవి. ప్రతాపరుద్ర చక్రవర్తిచే కనకాభిషేకం పొందిన ఘనుడు.
శత లేఖిన్యవధానం:
శత ఘంట కవనం వేరు; శతలేఖినీ అవధానం వేరు. శత ఘంటకవనంలో ధారణ వుండదు. శతలేఖినిలో ధారణ తప్పనిసరి. ఈ అంశాలను అవధాన విద్యపై పరిశోధన జరిపిన రాళ్లబండి కవితాప్రసాద్ దృవీకరించారు. విద్వాన్ మాడభూషి వెంకటార్యులు (19వ శతాబ్ది) నూజివీడు సంస్థాన కవి. ఆయన అష్టావధాన, శతావధానాలు అద్భుతంగా చేశారు. చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వద్ద విద్య నభ్యసించడానికి వెళుతూ పెంటపాడులో మాడభూషి వెంకటార్యులు అష్టావధానం చేస్తుండగా దివాకర్ల తిరుపతి శాస్త్రి అక్కడ ఆగి దానిని చూశారు. ఆ తరువాత చెళ్లపిళ్ల వెంకటశాస్త్రితో కలిసి తిరుపతి వేంకటకవులనే జంటకవుల పేర అవధాన జైతయాత్రలు చేశారు. అవధానాలకు సాహిత్యంలో శాశ్వత స్థానం కల్పించారు. ఆనాడు ఆంధ్రదేశంలో ఎక్కడ చూసినా కవులే, ఆశుకవులే, ఆంధ్ర దేశం కడుపు పండినదని వేలూరి శివరామశాస్త్రి ఒక పద్యం చెప్పారు.
అవధాన విద్య సాధించడం ఎలా?
చాలామంది అడుగుతుంటారు. సార్! అవధానం చేయాలి – అంటే నేర్పిస్తారా? ఇది వంశ పారంపర్యంగా వస్తుందా? పూర్వ జన్మ సంస్కారమా? గురుముఖంగా నేర్చుకోవచ్చా? భగవదుపాసనతో సాధ్యమా? దీనికేవైనా ఆయుర్వేద మందులున్నాయా? ఏ యూనివర్శిటీలోనైనా జ్యోతిషంలో వలె డిప్లొమా కోర్సు వుందా? ఆరు నెలల పాటు అభ్యాసం చేస్తే సిద్ధిస్తుందా? ఈ విషయాల మీద పరిశోధకులు, పండితులు సుదీర్ఘ చర్చల తరువాత చేసిన అంశాలను రాళ్లబండి కవితాప్రసాద్ ఇలా క్రోడీకరించారు తమ సిద్ధాంత గ్రంథంలో – (పుట 35).
“కవుల యందు పూర్వజన్మ సంస్కార విశేషం ఉంటుందనీ, అవధాన విద్య వంశపారంపర్యంగా రాదనీ, గురువు ద్వారా కొన్ని ఒడుపులు నేర్చుకోవచ్చు గాని, పూర్తిగా గురుముఖ లభ్యం కాదనీ, ఏకాగ్రతను మాత్రమే ఉపాసన చేయాలనీ, దాన్ని ఏ దేవత పేరుతోనైనా పిలువవచ్చననీ, ఔషధాలు బుద్ధి చురుకుదనం కలిగించడం వరకే ఉపయుక్తమవుతాయనీ, అభ్యాసం వల్ల సభాకంపం తగ్గి మనఃస్వాస్థ్యం మాత్రమే ఏర్పడుతుందనీ, కొన్ని సందర్భాలలో మాత్రం అవధాని క్షణకాల నిమీలిత నేత్రుడై ప్రార్థిత భావిక స్వప్నఫలాలను గ్రహింపగలడు – అని సవివరంగా చర్చించి నిరూపించారు.”


తిరుపతిలో త్రిగళావధాన సభా సత్కారం 2019
ఈ విషయాలు కాదనడానికి తగిన ఉపపత్తులేవీ లేవు. క్రీ.శ. 1285 నాటికే వివిధ రకాల అవధానాలు ప్రాచుర్యంలో ఉన్నట్లు జక్కన తాత పెద్దన స్పష్టం చేశాడు. అప్పటికే పోటీతత్వం వుండేది. 17వ శతాబ్ది నాటికి 20 రకాల అవధానాలున్నాయని గణపవరపు వెంకటకవి చెప్పాడు. ఈనాటికి అవి దాదాపు 50 రకాల సంఖ్యకు పెరిగాయి. ఇటీవలి కాలంలో త్రిగళావధానం పేర తెలుగు, అచ్చతెనుగు, సంస్కృతాలలో ఒకే వేదికపై అవధాన ప్రదర్శన మొదలైంది. ముగ్గురు అవధానులు మూడు భాషలలో పూరణలు చేస్తారు. 3 x 8 =24 మంది పృచ్ఛకులుంటారు.
(మళ్ళీ వచ్చే వారం)

డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
1 Comments
శతావధాని డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ
అవధాని మహోదయులు డా. రేవూరి అనంత పద్మనాభరావు గారికి నమస్కారం. అవధానం ఆంధ్రుల సొత్తు అంటూ… యువతకు అవధానం వల్ల కలిగే లాభాలను, ప్రాచీన ఆధునిక నేపథ్యాలను, అవధాన సాధనలో సాధకబాధకాలను మీ స్వీయ పూరణాలతో ఉదహరించారు. నవీన ప్రయోగమైనా త్రిగళావధానం విశేషాలు కూడా పంచుకున్నందుకు ధన్యవాదాలు.
వ్యాస పరంపరగా అవధాన విశేషాలను ప్రపంచానికి పంచుతున్న మీకు శుభాకాంక్షలతో…. శతావధాని డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ.