“ఏమిటీ మీ సమస్య…” అడిగాడు డాక్టరు.
“నాకు డిప్రెషను. ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి” అన్నాను.
“ఎటువంటి ఆలోచనలు…”
“నేను మీ క్లినిక్కి వచ్చానా ఒక్క పేషంటు లేడు. మీకు ఆదాయం లేకపోతే ఎలాగ బతుకుతారు. లక్షలు ఖర్చు చేసి చదివారు. చాలా డబ్బు వెచ్చించి హాస్పిటలు కట్టారు. దీని నిర్వహణ, ఎలక్ట్రిక్, ఫోను బిల్లులు ఎలా కడతారు. మీ భార్యాపిల్లలు ఏమిటి తిని బతుకుతారు. ఇలా వస్తుంటాయి…” అని డాక్టరు వైపు చూసాను.
ఇప్పుడాయన డిప్రెషనులో ఉన్నాడు…
“పద. పనయిపోయింది…” అన్నాను ఓం ని ఉద్దేశించి..
ఒక వికెట్ పడింది.. లేకపోతే కాస్త డోకేనో లేదో ఇంత పెద్ద స్పెషలిస్టు దగ్గరకు తీసుకొస్తాడా వెర్రి నాయాల. డాక్టరు డుమ్మారావు, సైకియాట్రిస్టు అన్న బోర్డు నియాన్ సైన్ అక్షరాలతో మెరిసిపోతుంది….
“ఇప్పుడెక్కడికి వెళదాం అంకుల్” అయోమయంగా అడిగాడు ఓం.
“అలా నడుచుకొంటూ పోదాం పద…” అంటూ ‘నీకూ నీ వారూ లేరు నాకూ నా వారూ లేరు….’ ట్యూను హమ్ చేస్తూ నడుస్తున్నాను.
అరగంట గడిచింది. నడుస్తున్న నేను ఆగాను. పెద్ద ఫంక్షను హాలది. మైకులో స్పీచ్ వినబడుతోంది. సామ్యుయేల్ స్మారక సభ అని బ్యానరు కనపడింది. దాని మీద దివంగతుడి ఫోటో, జనన, మరణ తేదీలు ఉన్నాయి. లోపలికి దారి తీసాం. కావల్సిన వాళ్లమనుకొని మమ్మల్ని రిసీవు చేసుకొని ప్రంట్ సీటులో కూచున్న ఇద్దరిని లేపి మమ్మల్ని కూచోబెట్టారు. సామ్యుయేల్ కాలేజీ లెక్చరరుగా పని చేసి ట్యుటోరియల్ కాలేజీలో పార్టు టైం జాబ్ చేస్తున్నాడు. పోయిన ఏనుగు చెవులు చాటంతవి. అతగాడి గుణగణాలు పొగుడుతూ మైకు అదరగొడుతున్నాడు ఒక మైకాసురుడు. వాడిని అలా వదిలేస్తే తారీఖు మారిపోయే అవకాశం ఉంది. నేను వేదిక పైకి ఎక్కాను. స్పీచ్ ఆగిపోయింది. మైకు దగ్గరగా నడిచాను. మైకాసురుడు మాయమయిపోయాడు.
“…సామ్లు మాష్టారు ఒక దొంగ, దోపిడీదారుడు. అతగాడికి నివాళులు ఎందుకు, నీరాజనాలేల?” చెప్పడం ఆపి సభను పరికించాను. సూది పడితే వినబడేటంత నిశ్శబ్దం రాజ్యం చేస్తుందక్కడ…
“మన మనస్సులు దొంగిలించి, మన ఆదరాభిమానాలు దోపిడి చేసి పరలోకానికి పోయాడు. ప్రభువు చెంత ప్రసన్నంగా పవళించి ఉన్నాడు…”
ఐదు నిమిషాల పాటు మోగిన చప్పట్లతో ఫంక్షను హాలు కంపించింది…
“మాష్టారుగారంటే పిల్లలకు ఒకటే భయం. ఇంట్లోవాళ్లకి ట్రీటుమెంటుకి డబ్బు అవసరమని విద్యార్థుల దగ్గర అప్పులు చేసేవాడు. అది గోడకు వేసివ లప్పం అయేది, దూరం నుండి మాష్టారు కనబడితే పక్క సందులల్లలోకి పారిపోయేవారు స్టూడెంటు పిల్లలు…” నేను పొగుడుతున్నానో తెగుడుతున్నానో సభాసదులకు ఒకంతట అర్థమయ్యేలోగా…
“ఆడంబరమంటే ఆమడ దూరాన ఉంటారాయన. అదుగో చూడండి… ఆయన ఆత్మ ఘోషిస్తుంది. ఈ ఆటాటోపం, సంతాప సభలు ఎంత మాత్రం వద్దని… సభ ఇంతటితో సమాప్తం…” అంటూ మరో మాటకు తావివవ్వకుండా బయటకు నడిచాను. నా వెనుకే పరిగెట్టుకొస్తున్న ఓం కి.. ‘రెండో వికెట్ పడింది’.
హోటలు చేరుకొనేసరికి విక్కీ కన్పించాడు. అతని చేతిలో టికెట్సు ఉన్నాయి.
“అంకుల్ రేపుదయం నుండి రైళ్లు నడుస్తున్నాయి” అన్నాడు.
ఆ మాట చెవిన పడడం లేటు, మరో మాట చెప్పకుండా మాయమయిపోయాడు ఓం.
“మీ కందరికీ నిండా సంతోషమప్పా..” ఇంకా మాతృభాష మరచిపోలేని విక్కీ ప్రశ్నకు “… ఆమ. రొంబ సంతోషమప్పా. సొల్లు..” అన్నాను.
పాదాభివందనం చేసాడు విక్కీ. నేను చేసిన ఘనకార్యాలు ఇంకా తెలియనట్లుంది..
షడ్రుచులు, నవరసాలతో కూడుకొన్న రావిగుడ యాత్ర చిరస్మరణీయం.
మర్నాడు అందరికీ గుడ్ బై చెప్పి బయల్దేరాం. కూలీ లగేజీ ఎక్కించాడు. ప్లాట్ఫామ్ మీదున్న మా అవిడ చేతిలో డబ్బెట్టి, కంపార్టుమెంటు నుండి దిగబోతున్న కూలీ నుద్దేశించి… “ఎక్కడకోయీ ప్రియతమా.. ట్రెయిను బయర్దేరబోతుంది” అని చెయ్యి పట్టి సీటులో కూలేసాను.
“బాగుంది సంబడం. అమ్మా పింకీ.. గోల్డీ… చాల్రోజుల తరువాత ఈయనకు తిరగబెట్టిందే పాడు జబ్బు” అని చెబుతూ, “ఈ మాత్ర వేసుకొని పడుకోండి” అని మా శ్రీమతి నా బెర్తు మీద కూచుంది.
రైలు ఎప్పుడు కదిలిందో తెలియదు. ఊరి శివార్లలో ఒడ్డులు ఒరుసుకొంటూ గలగల పారే సెలయేరును చూడలేకపోయాను. నా కోరిక తీరాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనా…
(సమాప్తం)
ఆనందరావు పట్నాయక్ పేరుపొందిన ప్రవాసాంధ్ర కథా రచయిత. రాయగడ అనగానే గుర్తుకొచ్చే ఏకైక కథా రచయిత. “అమూల్య కానుక”, “గురుదక్షిణ” వీరి కథా సంపుటాలు. ఇటీవల “ఆనందరావు కథలు” అనే సంపుటాన్ని వెలువరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™