[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రచించిన ‘అవశ్యమనుభోక్తవ్యం..’ అనే పౌరాణిక కథని అందిస్తున్నాము.]


అయోధ్యాపురం. అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద చెరోవైపు కుర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు అజమహారాజు, ఇందుమతీ దేవి. గవాక్షంలో నుంచీ ప్రమదావనం లోని చెట్లు, కొమ్మలతో చల్లటి గాలి వింజామరల్లాగా వీస్తున్నాయి. గాలికి పూల పరిమళం గుభాళిస్తూ ఉన్నది. కొమ్మల్లో కుర్చుని ఉన్న పక్షుల కలకూజితాలు మధురంగా వినిపిస్తున్నాయి. ఇంతలో “మహారాణీ! యువరాజు దశరథుల వారు మీ దర్శనం కోసం వేచియున్నారు” వేత్రవతి వచ్చి చెప్పింది. “రమ్మను” అన్నది ఇందుమతి దేవి. కొంచెం సేపటి తర్వాత దశరథుడు లోపలికి వచ్చాడు. “అమ్మా నాన్నా! నమస్కారం” అన్నాడు.
“ధనుర్భాణాలు ధరించి ఎక్కడికి నాయనా బయలుదేరావు? వేటకేనా!” అడిగాడు అజమహారాజు.
“అవును నాన్నగారూ! ఈ వర్షఋతువులో వేటలకు వెళ్ళటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం కదా!”
“నాయనా! సర్వశాస్త్ర పారంగతుడవు అయ్యావు. సలక్షణమైన రాచకన్యలతో వివాహం కూడా అయింది. నువ్వు పట్టాభిషేకం చేసుకోవలసిన తరుణం ఆసన్నమైనది. ఇంకా వేటలు, వినోదాలు అంటూ కాలం వ్యర్థంగా గడిపితే ఎలా తండ్రీ!”
“మీరున్నారుగా నాన్నా! అప్పుడే నాకీ బరువు బాధ్యతలు ఎందుకు? కొంతకాలం నన్ను ఇలాగే ఉండనివ్వండి.” అడిగాడు.
అజమహారాజు నిట్టూర్చాడు. “నాయనా! సాధు జంతువులకు కీడు చేయవద్దు. క్రూర జంతువులను విడువవద్దు. ఋష్యాశ్రమాలలో క్రూరజంతువులైనా సాధువర్తనంతో జీవిస్తాయి. ఇవన్నీ జ్ఞప్తి యందుంచుకుని వర్తించు” అన్నాడు.
“అలాగే!.. అమ్మా! వెళ్లి వస్తాను”.
“క్షేమాన వెళ్లి లాభాన రా!” అన్నది ఇందుమతీ దేవి.
దశరథుడు తన మందిరంలోకి వచ్చాడు. భార్య కౌసల్య ఎదురువచ్చింది. “వేటకు వెళుతున్నాను కౌసల్యా!” చెప్పాడు. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించలేదు. “అలా ఉన్నావే దేవీ!” పరిశీలనగా చూస్తూ అడిగాడు.
“గడచిన రేయి నుంచీ నన్ను ఏవేవో దుస్వప్నాలు వెంటాడి వేధిస్తున్నాయి స్వామీ! నా మనసు ఆందోళనా భరితంగా ఉన్నది. మీరీ పొద్దు వేటకు వెళ్ళవద్దు” అన్నది కౌసల్య.
“కలలకు భయపడి కార్య విముఖుడు కావటం కాపురుష లక్షణం. తండ్రిగారు కూడా అంగీకరించారు. వీరపత్నివి. నేడింత బేలవైనావేం దేవీ? సందేహింపక చిరునవ్వుతో నన్ను సాగనంపు” ఆమె చిబుకం చూపుడు వేలుతో ఎత్తి కళ్ళల్లోకి గోముగా చూస్తూ అన్నాడు. కౌసల్య కళ్ళతోనే వీడ్కోలు చెప్పింది.
దశరథుడు మేలు జాతి అశ్వాన్ని ఎక్కి అటవీ మార్గం వైపు సాగిపోయాడు. దక్షిణాయనం ప్రారంభం అయింది. సూర్యుడి వేడి చల్లబడి దక్షిణ దిశకు మళ్లాడు. నల్లమబ్బులు ఏనుగుల గుంపుల్లాగా ఆకాశం అంతా నిండి మందగమనంతో కదులుతున్నాయి. లేళ్ళు, కప్పలు, చాతక పక్షులు సంతోషంతో పొంగిపోయాయి. నెమళ్ళు పురులు విప్పి ఆనందంతో నర్తిస్తున్నాయి.
వర్షం ప్రారంభం అయింది. దశరథుడు కొంతసేపు కొండగుహలో తలదాచుకున్నాడు. ఆకాశంలో నుంచీ వాన జల్లులు జల్లులుగా కురుస్తూ ఉంది. వర్షం వెలిసింది. అడవి అంతా చన్నీటితో స్నానం చేసినట్లుంది. చెట్ల కొమ్మలు వానకు తడిసి గాలికి ఆటూఇటూ ఊగి పోతున్నాయి. పక్షులు తడిసి, బరువెక్కిన రెక్కలతో ఆ కొమ్మల మీద వాలుతున్నాయి.
దశరథుడు గుహలో నుంచీ బయటకు వచ్చాడు. సింహాలను, చిరుత పులులను వేట కోసం వెతుకుతున్నాడు. ఆయన బాణం సంధించాడంటే గురి తప్పటం ఉండదు. ఆ జంతువు నీల్గి చావవలసిందే! ఈ రోజు ఎందుకో చిత్రంగా ఒక్క క్రూరమృగం కూడా కనబడలేదు. బహుశా వాన జల్లుకు ఏ చెట్టు చాటునో, కొండగుహ లోనో తలదాచుకుని ఉంటాయి. చుట్టుపక్కల గమనిస్తూ మెల్లగా వెళుతున్నాడు. కొండల మీద నుంచీ నీటి ప్రవాహాలు అక్కడి మట్టితో కలిసి ఎర్రగా, తెల్లగా, దావాగ్ని భస్మంతో కలసి బూడిదరంగుతో, వంకర టింకరగా ప్రవహిస్తూ రకరకాల పాములు ప్రయాణిస్తున్నట్లు ఉన్నాయి.
చీకటి పడుతూ ఉంది. ఈ రోజు ఎలాగైనా ఒక్క జంతువునైనా వధించిన తర్వాతే వెళ్ళాలి అనుకున్నాడు. రాత్రివేళ నీరు త్రాగటం కోసం ఏనుగు గానీ, ఇంకేదైనా మృగంగానీ నదీతీరానికి వస్తుంది అనుకుంటూ విల్లు ఎక్కుపెట్టి ఒక రహస్య ప్రదేశంలో పొంచి కూర్చున్నాడు దశరథుడు. ఇంతలో దట్టంగా ఉన్న చెట్ల చాటు నుంచీ ఏనుగు నీరు త్రాగుతున్నట్లుగా బుడబుడమని శబ్దం వినిపించింది. ఆ శబ్దాన్ని లక్ష్యంగా చేసుకుని శబ్దభేది అస్త్రాన్ని ప్రయోగించాడు. నిశితమైన ఆ బాణం ఆయువుపట్టు మీద తగలటం చేత కాబోలు పొదల వెనకనుంచీ “అమ్మా!” అంటూ హృదయవిదారకమైన ఆర్తనాదం వినిపించింది. ఉలిక్కిపడ్డాడు దశరథుడు.
వడివడిగా అక్కడికి వెళ్లి చూశాడు. అక్కడ ఒక ముని బాలుడు బాణం గుచ్చుకున్న చోట రక్తం ధారగా ప్రహిస్తూ పడిపోయి ఉన్నాడు. అతడి కేశాలు చిందర వందరగా చెదిరి ఉన్నాయి. చేతిలోని జలపాత్ర దూరంగా పడి ఉంది. ఆ దృశ్యం చూడగనే నిశ్చేష్టుడయ్యాడు దశరథుడు. “నాయనా!” అంటూ బాలుడి దగ్గరకు వచ్చి నేలమీద మోకాళ్ళ మీద కూర్చున్నాడు. “రాజా! నేను ఏ జీవికీ హాని కలిగించకుండా కందమూలలతో కడుపు నింపుకుంటూ ఉండే ముని బాలకుడిని. నేను నీకేం అపకారం చేశాను? నా వంటివాడిని శస్త్రంతో వధించటానికి కారణం ఏమిటి? నన్ను చంపటం వలన నీకు కలిగే ప్రయోజనం ఏమిటి?” అన్నాడు.
“క్షమించు నాయనా! పొదచాటు నుంచీ బుడబుడ మని శబ్దం విని మృగమని భ్రమించాను. నేను మహాపాపిని. గురుద్రోహం కన్నా ఘోరమైన నేరం ఇది” అన్నాడు దశరథుడు చేతులు జోడిస్తూ. ఆయన కళ్ళ వెంట అప్రయత్నంగా కన్నీరు చెంపల మీదకు జారింది.
“ఊరడిల్లండి మహారాజా! నేను ఈ అరణ్యంలో నా తల్లిదండ్రులతో నివసిస్తున్నాను. వారి దాహం తీర్చటానికై నీటికోసం వచ్చాను. వారు అంధులు, శక్తిహీనులు. నేను తమ దాహం తీరుస్తానని గంపెడాశతో ఉన్నారు. వారికి నీటిని అందించండి. ముందు బాణం పెరికివేయండి. ఇది నా దేహాన్ని అగ్నిలాగా దహించి వేస్తున్నది. నన్ను ఈ బాధ నుంచీ విముక్తుడిని చేయండి” అన్నాడు. అతడి శరీరం బాధతో మెలికలు తిరిగిపోతున్నది. నేలమీద అటూ ఇటూ పొర్లుతున్నాడు.
దశరథుడు దీనంగా అతడి వంక చూశాడు. బాణం తీసివేస్తే బాలుడు మరణిస్తాడు. తీసి వేయకపోతే మరణయాతన పడతాడు. “సందేహించకండి మహారాజా! నేను బ్రాహ్మణుడను కాను. వైశ్యునికి శూద్రస్త్రీ వలన జన్మించినవాడిని. నేను మరణించటం వలన మీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోదు. నా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. మాట్లాడలేక పోతున్నాను” అన్నాడు అతికష్టం మీద.
దశరథుడు మునిబాలుడి శరీరానికి గుచ్చుకున్న బాణాన్ని లాగివేశాడు. “పరమేశ్వరా!” అంటూ బాలుడు మరణించాడు. అతడి శరీరం అచేతనమైపోయింది. దశరథుడు విషాదంగా చూసి, జలపాత్ర అందుకుని నీరు ముంచుకుని భారంగా అడుగులు వేస్తూ అవతలకి వెళ్ళాడు. అక్కడ కొంత దూరంలో ఒక ఆశ్రమప్రాంతంలో ఇద్దరు వృద్ధ దంపతులు రెక్కలు తెగిన పక్షుల్లాగా కుర్చుని ఉన్నారు. వారి శరీరాలు శిథిల భవనాల్లాగా శుష్కించిపోయి ఉన్నాయి. వెంట్రుకలు జడలు కట్టుకుని ఉన్నాయి.
“నాయనా! దాహంతో మా గొంతులు ఎండిపోతున్నాయి. ఇంకా రాలేదేం! నదిలో జలకాలాడుతూ మర్చిపోయావా! లేక, నేనుగానీ, మీ అమ్మగానీ నీకు ఏదైనా అప్రియం చేశామని అలిగి ఉన్నావా! మా ప్రాణాలు అన్నీ నీమీదే పెట్టుకుని జీవిస్తున్నాం. జాగు చేయవద్దు” అంటున్నాడు ముని.
దశరథుడు మౌనంగా జలపాత్ర ఆయన చేతికి అందించాడు. ఆ చేతిని తడిమి చూసి, చేతికి ఉన్న పసిడి కంకణాలు చూసి “ఎవరు మీరు?” అని అడిగాడు.
“అయోధ్యా పురాధీశుడి కుమారుడను. నా పేరు దశరథుడు”
“అయ్యో! మీ వంటివారిని ఈ పనికి నియోగించాడా మా శ్రవణ కుమారుడు? ఏదో, బాల్యచాపల్యం చేత తెలియచేసి ఉంటాడు. మమ్మల్ని మన్నించండి”
“మన్నించ వలసిన వారు మీరు. నేను వేటకోసం వచ్చి పొదమాటు నుంచీ బుడబుడ మని శబ్దం విని, మృగమనే భ్రాంతితో బాణం వేశాను. అది తగిలి మీ కుమారుడు మరణించాడు. తెలియక చేసిన అపరాధం ఇది. నన్ను మన్నిస్తారో, శపిస్తారో మీ చిత్తం!” అన్నాడు దశరథుడు దోసిలొగ్గి ఆయన ముందు నిలబడుతూ.
“అయ్యో! హతవిధీ! ఎంత పని జరిగినది? నాయనా! మమ్మల్ని దుఃఖ సముద్రంలో ముంచిపోయావా!” అన్నాడు ముని.
“నాయనా! మీ అమ్మను, నాన్నను ఒంటరిగా విడిచి ఎలా వెళ్లావు? నీవు లేని మా జీవితం చంద్రికా విహీన శారదరాత్రి” అంటూ పొగిలిపొగిలి ఏడ్చింది మునిపత్ని.
“రాజా! మమ్మల్ని మా కుమారుడు పడిఉన్న చోటికి తీసుకువెళ్ళు. అతడి శరీరాన్ని కడసారిగా తడిమి చూసుకుంటాము” అన్నాడు తండ్రి. “రండి” అని అతడిని చెయ్యి పట్టుకుని లేవదీశాడు దశరథుడు. భర్త కర్ర పట్టుకుని ఆమె కూడా లేచింది. ఇద్దరినీ నడిపిస్తూ నదీతీరానికి తీసుకువచ్చాడు. అతడి చేతిని శ్రవణ కుమారుడి దేహం మీద ఆనించి చూపించాడు. ముని దంపతులు భోరున విలపిస్తూ ఆ శరీరం మీద పడ్డారు.
“నాయనా! ఇలా కటిక నేలమీద పడుకుని ఉన్నావేమిటి? నాతో మాట్లాడవేం? అమ్మ మీద అలిగావా! ప్రతిరోజూ ఉషోదయాన పురాణేతిహాసాలను వినిపిస్తూ ఉండేవాడిని. ఇక నుంచీ ఎవరు వినిపిస్తారు? నీ మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్న మాకు ఇక దిక్కేది?” అంటూ విలపించింది తల్లి.
“నేను కర్మానుష్ఠానాలు స్వయంగా నిర్వహింపలేని వాడిని. నువ్వు దగ్గరుండి నాకు స్నాన సంధ్యాదులు, అగ్నికార్యం నిర్వర్తించేవాడివి. నివ్వరి ధాన్యం సంపాదించి మా ఆకలి తీర్చేవాడివి. నీవంటి పుత్రుడికి దూరమైన మీ అమ్మను ఎలా ఓదార్చను?” అన్నాడు తండ్రి.
“అయ్యా! మీ ఇద్దరినీ మా రాజధానికి తీసుకు వెళతాను. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాను” అన్నాడు దశరథుడు.
“ఛీ! నా కన్నబిడ్డను పొట్టన బెట్టుకున్న నీ చేతి ఆహారం మాకు విషంతో సమానం. నా కడుపున చిచ్చు పెట్టిన నీవు తగినఫలం అనుభవించక తప్పదు” కోపంగా హీనస్వరంతో అరిచింది ఆమె.
“దేవీ! శాంతించు. ఈ రాకుమారుడు తెలిసి చేసిన అపరాధం కాదు. బుద్ధి పూర్వకంగా చేసి ఉంటే ఇంద్రుడు అంతటి వాడైనా పదవీ భ్రష్టుడు అయ్యేవాడు. ఈ మహాపాప కృత్యం గురించి స్వయంగా చెప్పాడు కాబట్టి ఈతడు క్షమార్హుడు” అన్నాడు.
“అనునయాలతో కన్నతల్లి గర్భశోకం చల్లారదు. ఇంక మేమిద్దరం జీవించటం కల్ల. రాజా! పుత్రశోకంతో మేమిద్దరం మరణించినట్లే నువ్వూ పుత్రశోకంతోనే మరణిస్తావు. ఇది తథ్యం. హా! కుమారా!” అంటూ ఆమె ఒరిగిపోయింది.
“అమ్మా! పుత్రులు లేక అల్లాడి పోతున్నాను. మీ వాక్కు వలన నాకు పుత్రసంతానం కలుగుతుంది అని తెలిసింది. మీరు నాకిచ్చింది శాపం కాదు, వరం” అంటూ చేతులు జోడించాడు దశరథుడు.
“భార్యను, ఒక్కగా నొక్క కుమారుడిని కోల్పోయి జీవించలేను. నాకు చితి పేర్చు. నా భార్యాబిడ్డలతో పాటు అగ్నికి ఆహుతి అవుతాను. నేను అంధుడను. ఈ ఒక్క ఉపకారం అయినా చేయి” అన్నాడు ముని. దశరథుడు మౌనంగా చుట్టుపక్కల ఎండిపోయిన కట్టెలు తెచ్చి చితి పేర్చి, అరణిని మథించి మంట రగిల్చాడు. ఆ చితిమీదకు మునిపత్నిని, బాలుడిని పడుకోబెట్టాడు. ముని కూడా దానిలో ప్రవేశించి అగ్నికి ఆహుతి అయిపోయాడు. దశరథుడు విషాదం నిండిన హృదయంతో వెనుదిరిగాడు. అతడి చెవిలో ఇంకా చితిమంటల చిటపటలు వినిపిస్తూనే ఉన్నాయి.
***
దశరథుడు దుమ్ము కొట్టుకున్న శరీరంతో శోకిస్తూ నేలమీద చతికిలబడి కుర్చుని ఉన్నాడు. కౌసల్య, సుమిత్ర ఆయనని ఇరుపక్కలా పట్టుకుని వాళ్ళు కూడా నేలమీదే కూలబడి ఉన్నారు. కొంచెం దూరంలో మంత్రి సుమత్రుడు చేతులు జోడించి విషణ్ణవదనంతో నిలబడి ఉన్నాడు.
దశరథుడు “ఇప్పుడు నాకంతా గుర్తుకు వస్తున్నది కౌసల్యా! ఆనాడు మునిపత్ని శాపం వలననే ఈనాడు నా ప్రాణ సమానుడైన రాముడికి దూరమైనాను. సుమంత్రా! అడవులలో విడిచి వచ్చేటప్పుడు నా రాముడు నాకేమైనా చెప్పాడా?” అడిగాడు.
“తండ్రిగారికి తన నమస్కారాలు తెలియజేయమన్నాడు ప్రభూ!” అన్నాడు సుమంత్రుడు.
“ఆ సుగుణాభిరాముడిని చేజేతులా దూరం చేసుకున్న నిర్భాగ్యుడిని. కోటి జన్మలు ఎత్తినా అటువంటి పుత్రుడు మళ్ళీ నాకు కలుగుతాడా! కామానికి దాసుడనై కైకేయి చెప్పినట్లు విని ఈ అనర్థం కొని తెచ్చుకున్నాను. పున్నమి చంద్రుడి వంటి రాముడి ముఖాన్ని మళ్ళీ ఎన్నడు చూడగలుగుతానో కదా! కౌసల్యా! నా మనసు రాముడి కోసం పరితపిస్తూ ఉన్నది. అయినా కైకేయిని మాత్రం అనటం దేనికి? ‘అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ (చేసిన కర్మ శుభమైనా, అశుభమైనా అనుభవించక తప్పదు)’ అన్నట్లు ఇదంతా నా స్వయం కృతాపరాధం. నలుగురు బిడ్డలకు తండ్రినై యుండి ఒక్కరు కూడా దగ్గర లేకుండా పుత్రశోకం తోనే మరణిస్తున్నాను. రామా! లక్ష్మణా!” అంటూ నేలమీద ఒరిగిపోయాడు దశరథుడు. కౌసల్య సుమిత్రల తోపాటు అంతఃపురం అంతా ఘొల్లుమన్నది.

గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.
2 Comments
Dr. Kothari vani chalapati Rao
పురాణ కథ శీర్షిక బాగుంది. . కథ ఒక సోషల్ స్టోరీ చదువుతున్నట్టు అనిపించి ఆకట్టుకుంది. . కథా కథనం బాగుంది. . శ్రవణ కుమారుని కథ చాలాబాధాకరమైనది. విధి ఆడిన వింత నాటకం లో దశరథ మహారాజు దోషి అయినాడు. ఒక్కోసారి అనుకోని సంఘటనలు ఎలా జరుగుతుంటాయో కదా జీవితంలో అన్నది పురాణ కథలుకూ వర్తిస్తుంది. చక్కటి కథా కథనం. . అభినందనలు మురళీకృష్ణ గారూ. .

గోనుగుంట మురళీకృష్ణ
శీర్షిక, కథ బాగున్నదని చెప్పినందుకు ధన్యవాదాలండీ!…పౌరాణిక కథ అయినా మానవ జన్మ ఎత్తినందుకు మానవులు అనుభవించే కర్మఫలం దశరథ మహారాజు అంతటి వాడైనా అనుభవించవలసి వచ్చింది. …. శివధనస్సు రావణుడు ఎత్తలేకపోయాడు. సీత అవలీలగా ఎత్తింది బాల్యం లోనే!అలాంటి ఆమెకి రావణుని వధించటం చిటికెలో పని. కానీ మనిషిగా పుట్టింది కాబట్టి సాధారణ మానవ స్త్రీ లానే కష్టాలు స్వీకరించింది…కథ లోని అంతరార్ధం తెలుసుకుంటూ చదివినందుకు కృతజ్ఞతలు.