[కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘భారతీయ ప్రేమ కథామాలిక’ అనే కథాసంపుటిని విశ్లేషిస్తూ ప్రొ. సిహెచ్. సుశీలమ్మ అందిస్తున్న వ్యాస పరంపర. ఇది మొదటి భాగం.]


‘ప్రేమ’ అనేది ఒక అపురూపమైన అద్భుతమైన భావన. రెండు మనసుల్లో జనించి ఒకే మనసుగా పరిణమించి, అన్యోన్యంగా పెనవేసుకుపోయే ప్రణయ దీపిక. ఆ దీపిక అనేక అజ్ఞాన తిమిరాలను అన్యాయాలను, అనుమానాలను, అభాండాలను, అపార్థాలను పటాపంచలు చేయాలి. చేసే శక్తి, సామర్థ్యం ‘ప్రేమ’ కు ఉంది, ఉంటుంది కూడా.
కానీ ఆధునిక సమాజంలో ప్రేమ అంటే స్త్రీ పురుష ప్రేమ – ముఖ్యంగా లైంగికపరమైన శారీరకమైనదే అనే భావనలో యువత అపోహ పడుతున్నారు. నిజం చెప్పాలంటే ఒక ‘కన్ఫ్యూజన్ స్టేజ్’లో ఉన్నారు. తమ వారిని ఒక గందరగోళ స్థితిలో పడేస్తున్నారు. దానికి తోడు ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఒక రోజు అని నిర్ణయించటం, రోజా పూలతో, ఖరీదైన బహుమతులతో ఒకరికొకరు ప్రేమను వెల్లడించటం.. చిత్ర విచిత్రంగా మారుతుంది.
రోమన్ మత బోధకుడు ‘వాలెంటైన్’. యుద్ధోన్మాదియైన చక్రవర్తి ‘క్లాడియస్’ ప్రేమ విరోధి. ప్రేమికులకు పెళ్ళిళ్ళు చేస్తున్న వాలంటైన్‌ను ఖైదు చేసాడు చక్రవర్తి. తన కూతురు కూడా అతన్ని అభిమానించడంతో అతనికి మరణశిక్ష విధించాడు. వాలెంటైన్‌ను సమాధి చేసిన ఫిబ్రవరి 14 న ‘ప్రేమికుల దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ పురాతన రోమన్ వేడుక ప్రపంచమంతా వ్యాపించి వెర్రితలలు వేస్తున్నది.
కానీ ఇటువంటి వాలెంటైన్లకు అసలైన ప్రేమ తత్త్వాన్ని నేర్పే ప్రేమస్వరూపులు నేటికీ భారతీయ తత్త్వంలో సజీవులై నిక్షిప్తమై ఉన్నారు. వారి ప్రేమ తాత్త్వికతే భారతీయ ప్రేమ కథామాలిక.
భారతీయ ప్రేమ కథామాలిక
కస్తూరి మురళీకృష్ణ ఎంతో ఆసక్తిగా, ఓపికగా భారతీయ పురాణాల్లో, ఇతిహాసాల్లో భాసిల్లుతున్న ప్రణయ స్వరూపుల గాథలను పాఠకలోకానికి తనదైన బాణీలో ‘భారతీయ ప్రేమ కథామాలిక’ లో గుదిగుచ్చి అందించారు.
స్త్రీ పురుషుల ప్రేమకు పునాది ‘అవగాహన, నమ్మకం’. ఇరువురి ఆలోచనలు ఏకోన్ముఖంగా కొనసాగటం ప్రేమ యొక్క ముఖ్యతత్వం. ఆ తత్వాన్ని పట్టుకోవడం అంత సులభమైనది కాదు. ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో యుగాలుగా గౌరవింపబడుతున్న ప్రేమికులు, అసలైన ప్రేమ తత్త్వాన్ని ప్రపంచానికి తెలియజేసినవారు ఉన్నారు. ప్రేమ పేరిట పెళ్లికి అతీతంగా, కుటుంబానికి వెలియై, ఒక ఉన్మాదంలో, స్వేచ్ఛ పేరిట, కళ్ళు మూసుకుని ప్రవర్తించే వారికి, అదే ‘ప్రేమ’ అనే పేరు పెట్టుకునే వారికి కనువిప్పుగా కొన్ని భారతీయ ప్రేమ గాథల్ని తెలియజేశారు మురళీకృష్ణ.
అహల్య
ప్రపంచమంతా ఆక్షేపించే అహల్య వృత్తాంతంలో ఇంద్రుని కామం, గౌతముని శాపం, అహల్య స్థితి గురించి ఎంతో ఔన్నత్యంతో ఆలోచించారు మురళీకృష్ణ.
“మనసు ఉన్నది, అది ఆనందంతో నిండిపోవాలి. శరీరం ఉంది, సర్వసౌఖ్యాలు అనుభవించాలి”! కానీ ఇక్కడే ఒక ధర్మ సూక్ష్మము ఉంది. భగవంతుని సృష్టి ప్రేమమయం. ఆనందమయం. అందులో ప్రతి కణ కణము అందాన్ని చూడాలి. ఆనందాన్ని అనుభవించాలి. కానీ దేనికి మోహపడకూడదు, లొంగిపోకూడదు. సమస్త సృష్టిని ప్రేమించాలి. ఆత్మ సంగమం కావాలి. స్త్రీ పురుషుల శరీరాలు వేర్వేరు అయినా ఆత్మ ఒక్కటే. అది ప్రేమతో నిండిపోయి సంపూర్ణమవ్వాలి. ఇది గౌతముని తత్త్వం.
ప్రేమలేని కాంక్ష కేవలం జంతు సంబంధి అవుతుంది. ఇంద్రుని కాంక్ష అలాంటిదే. గౌతముడు క్షణికానందానికి లొంగేవాడు కాదు. యుక్తాయుక్త విచక్షణ కలవాడు. అందుకనే తప్పు చేసిన ఇద్దరిలో ఇంద్రున్ని శపించాడు. కానీ అహల్య – ఏ శరీరాకర్షణకు లొంగిపోయిందో ఆ శరీరమే కనిపించనంతగా ‘అచేతనంగా’ మానవ జీవితంలోని క్షణికత్వాన్ని అర్థం చేసుకుంటూ, అసలైన జ్ఞానాన్ని పొందమని చెప్పాడు. తాను తపస్సు చేసుకుంటూ, ఆమెనూ తపస్సులోకి వెళ్లి జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని (శాపం కాదు) ప్రసాదించాడు. అచేతనంగా ఉన్న అహల్య శ్రీరాముని రాకతో చైతన్యవంతమైంది. అంతేగాని అహల్య రాయిగా మారిపోయిందని, రాముడు పాద స్పర్శ సోకి నాతిగా మారిందనే సినిమా కబుర్లు వాల్మీకి రామాయణంలో లేవు.
సీత
అదే రామాయణంలోని సీతారాముల చరిత్ర భారతీయులకు ఆత్మ సమానమైంది. వారిరువురూ కలిసి ఉన్నదే తక్కువ కాలం. రాముడు అరణ్యవాసానికి వెళ్లాలని, భరతునికి పట్టాభిషేకం జరగాలని మాత్రమే కైక దశరథుని కోరింది. సీతా లక్ష్మణుల ప్రసక్తి ఆమె చేయనే లేదు. రాముడు లేని అయోధ్య తనకు అరణ్యతుల్యమని భావించి, అతనితోపాటు సీత కూడా అరణ్యాలకు బయలుదేరింది. అక్కడైనా అన్యోన్యంగా ఉండవలసిన పరిస్థితికి ఆటంకం కలిగి రావణాసురునిచే అపహరింపబడింది. రావణ వధానంతరం రామునితో ఆమె అయోధ్యకు చేరింది. కానీ లోకుల కాకుల ప్రేలాపన వల్ల మరల అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చింది. అయితే, రాముని హృదయం సీతకు తెలుసు. నిరంతరం ఆమె హృదయం రాముని స్మరిస్తూనే ఉంటుంది. రాముడు మనసా వాచా కర్మణా ఏకపత్నీ వ్రతుడు. అందుకే ఈనాటికీ పెళ్లి పత్రికలలో సీతారాముల కళ్యాణం చిత్రాన్ని వేసుకుంటున్నారు భారతీయులు. మనసా వాచా కర్మణా వారిరువుల హృదయాలలో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది. ప్రేమ అంటే ఒకరితో ఒకరు మాట్లాడకుండానే కంటిచూపులో, మనసులో ఉన్న భావాన్ని గ్రహించటం. అంత సాన్నిహిత్యం ఉండాలి అన్నదే సీతతత్వం. అప్పటికి ఇప్పటికీ సీతారాముల సంబంధం ప్రేమకు అసలైన నిర్వచనం.
“తన పురుషుడిపై నమ్మకం లేదంటే ఆ స్త్రీకి తన మీద తనకే నమ్మకం లేదని అర్థం. తనపై తనకు నమ్మకం లేని వారు ఎవరిని నమ్మలేరు. పచ్చకామెర్ల రోగి వంటి వారు. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కలిగి ఉన్న స్త్రీ మాత్రమే తన పురుషున్ని అర్థం చేసుకోగలుగుతుంది. అవి పుష్కలంగా ఉన్న పురుషుడే తన స్త్రీ గౌరవం పొందగలడు. అర్థం చేసుకోగలడు. అలాంటి స్త్రీ పురుషుల సంబంధమే ప్రపంచానికి అసలైన ప్రేమ స్వరూపాన్ని ప్రదర్శిస్తుంది” అని సీత చెప్పినట్లుగా మురళీకృష్ణ వివరిస్తారు.
రతీదేవి
పరమేశ్వరునికి పర్వతరాజ పుత్రికపై ప్రేమ జనించాలని మన్మథుడు తన పంచ బాణాలను ప్రయోగించి, హర నేత్రాగ్ని జ్వాలలో దగ్ధమై పోయాడు. పతి లేని జీవితం వ్యర్థమని రతీదేవి వగచింది, విలపించింది. నిజానికి మన్మథుని బాణాలు కలుగజేసేది ‘ప్రేమ’ కాదు. వాంఛ. అది అనర్థదాయకం. నియంత్రణకు లొంగని తీవ్రమైన వాంఛ. కానీ కోరిక ధర్మబద్ధమైనప్పుడే ప్రేమగా పరిణమిస్తుంది.
అటువంటి మన్మథుని కోసం రతీదేవి రోదించి రోదించి స్పృహ కోల్పోయేంత ప్రేమ ఉందా! అనే ప్రశ్న ఒక చిన్న పిట్ట ద్వారా వేయించి, సమాధానం వసంతునిచే సహేతుకంగా చెప్పిస్తారు మురళీకృష్ణ.
మన్మథుడు అంటే మనసులో మథనం కలిగించేవాడు. ఆ మథనంలో నుంచి వచ్చే హాలాహలం వంటిది లైంగిక వాంఛ. ఆ వాంఛను అదుపులో పెట్టుకుని మథనం కొనసాగిస్తే అమృతం లాంటి ప్రేమ లభిస్తుంది.
ఆ మథనంలో తోడవుతుంది రతీదేవి. ఆనందం లేని ప్రేమ అర్థవిహీనం. ఆ భావనే అనుచితం. ప్రేమలోని ఆనందం రతీదేవి. అందుకే మన్మథునితో రతీదేవి కూడితేనే ప్రేమ భావన సంపూర్ణమవుతుంది. అప్పుడే మనిషి అసలైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ ఆనందంలో బ్రహ్మసమానుడౌతాడు. ఎందుకంటే ఆనందమే బ్రహ్మ. వాంఛ స్థాయి నుంచి అమృతస్థాయికి ఎదగగలగటం పశుస్థాయి నుండి మానవుడిగా ఎదగటం లాంటిది.
పార్వతీదేవిని వివాహమాడిన ఆనంద క్షణంలో రతీదేవి నివేదనను అంగీకరించిన పరమేశ్వరుడు మన్మథుడిని తిరిగి చైతన్యవంతం చేసాడు. అతని ఈ నూతన స్వరూపాన్ని రతీదేవి మాత్రమే కనుగొనగలదు. ధర్మబద్ధమైన కామోద్దీపనకు, ప్రేమ భావనలకు, రతీ మన్మథులు ప్రతీకలయ్యారు. రతీ మన్మథులు కామదేవతలు కారు – ప్రేమదేవతలని గ్రహించాలి, దర్శించాలి. అదే భారతీయ ప్రేమ తత్త్వం.
మరికొన్ని భారతీయ ప్రేమ గాథలతో మళ్ళీ కలుద్దాం.
***


రచన: కస్తూరి మురళీకృష్ణ
ప్రచురణ: సాహితీ ప్రచురణలు
పుటలు: 248
వెల: ₹ 150/-
ప్రతులకు:
సాహితీ ప్రచురణలు,
33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ 520 004
ఫోన్: 0866-2436642/43
ఆన్లైన్లో:
https://www.amazon.in/Bharatiya-Prema-Kathamaalika-kasturi-Muralikrishna/dp/B084ZM6LHB
