ఎన్నో ఆశలతో – ఎన్నెన్నో కలలతో,
కళకళలాడే వదనాలతో..
కళాశాలలో అడుగిడుతున్న-
విద్యాకుసుమాలు వాడిపోయేలా,
చదువుపై ఆసక్తి అడుగంటేలా,
వణికిస్తున్నదే ర్యాగింగ్ భూతం!!
చదువులతల్లి ప్రాంగణమే-
చాలించే జీవితానికి వేదికైతే,
తన పైస్ధాయిలోని మరో విద్యార్థే,
అందుకు కారణభూతమైతే-
ఆ విషాదాన్ని వర్ణింపతరమా??!!
బిడియం వదలి, అభయం పొంది,
పాత, క్రొత్తల కలయికతో సాగే,
విద్యార్థి అమూల్య జీవితానికి,
ఆత్మీయ సమ్మేళనం లాంటిదే,
దశాబ్దాలుగా సాగుతున్నర్యాగింగ్!!
కాలక్రమేణా గాడితప్పిన ర్యాగింగ్,
విశృంఖలతకు మారుపేరుగా,
వినలేని చేష్టలకు చిరునామాగా,
రూపుదిద్దుకున్న ఫలితమే,
నేడు విగతజీవులవుతున్న,
అమాయక యువతీ యువకులు!!
యాజమాన్యాల అంకితభావం,
ర్యాగింగ్ పట్ల అవగాహన,
పాలకుల కట్టుదిట్ట చర్యలు..
మొదలైన మార్పులతోనే..
విద్యార్థులకు సమాజం అందించే-
అమూల్యమైన భరోసా!!

సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్‌లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.
1 Comments
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ర్యాగింగ్ గురించి
కవిగా నీ స్పందన బాగుంది.సమస్యకు సరైన సమయంలో స్పందించిన వాడే కవి/రచయిత.
మంచి వస్తువును తీసుకుని కవిత్వం రాసిన నీకు ఆశీస్సులు, హృదయపూర్వక అభినందనలు/శుభాకాంక్షలు.
—డా కె.ఎల్.వి.ప్రసాద్
సికిందరాబాద్