“పదకొండు గంటలకల్లా వస్తాను, నన్ను వదిన దగ్గరికి తీసికెళ్ళూ” అంటూ పొద్దున్నే నా చిన్నప్పటి ఫ్రెండ్ వనజ ఫోన్ చేసింది. అదేవిటో నా ఫ్రెండ్స్‌కి కూడా వదిన అంత దగ్గరైపోయింది. “సంగతేమిటే అంటే వదినతో చెప్తానుగా” అంది. ఇంకేం చేస్తానూ.. దాన్ని వదిన దగ్గరికి తీసికెళ్ళేను.
అక్కడ అది వదినతో చెపుతుంటే తెలిసింది అసలు విషయం. నా ఫ్రెండ్ ఒక బొటెక్ నడుపుతుంది. నాణ్యమైన చీరలు, డ్రెస్సులు కొత్త డిజైనులు తీసుకొస్తుందని అందరి దగ్గరా గుడ్‌విల్ సంపాదించుకుంది. కానీ ఈమధ్య రెణ్ణెల్లనుంచి దాని బిజినెస్ దభాలున పడిపోయిందిట. కారణం వనజ షాప్‌కి కూతవేటు దూరంలో ప్రభావతి అనే ఇంకొకావిడ కొత్తగా షాప్ తెరిచిందిట. తెరవడం కాదిక్కడ అసలు విషయం, ఆవిడ సరిగ్గా వనజ అమ్మేలాంటి డిజైన్ల చీరలే ఇంతకన్న చాలా తక్కువ ధరలకి అమ్ముతోందిట. ఇంకేం.. సహజంగా జనాలందరూ ఆ షాప్ దారి పట్టారు. ఇప్పుడు వనజకి ఏం చెయ్యాలో తెలీక సలహా కోసం వదిన దగ్గర కొచ్చింది.
“కొత్తగా షాప్ పెట్టింది కనక జనాలు అలవాటు పడడం కోసం కాస్త లాభాలు తగ్గించుకుని అమ్మొచ్చు. కానీ మరీ అంత తక్కువ రేట్లతో నష్టాని కెందుకు అమ్ముతున్నట్టూ?” వదిన అడిగింది.
“అయ్యో వదినా, ప్రభావతేం తక్కువకి అమ్మటం లేదు. తను నాలాగా నిజాయితీతో అసలైన చీరలు తేవటంలేదు. అన్నీ డూప్లికేట్లూ, సెకండ్సూ తెస్తోంది. చీరల బిజినెస్‌లో ఎంతో అనుభవమున్నవాళ్లకే అసలేదో, నకిలీదేదో కనుక్కోవడం కష్టం. అలాంటిది, కొనుక్కునేవాళ్లకేం తెలుస్తుందీ! చవగ్గా వస్తున్నాయని జనాలందరూ అటే పోతున్నారు” అన్న వనజ మాటలకి
“పోనీ, నువ్వా సంగతి వాళ్లకి చెప్పొచ్చుగా” అంది వదిన.
“చెప్పేను వదినా, అయినా సరే అదేంటో అందరూ అటే వెళ్ళిపోతున్నారు” అంది వనజ.
“పోనీ నువ్వూ అలాంటి చీరలే అమ్మూ..” అన్న వదిన మాటలకి వనజ మొహం చిన్నబుచ్చుకుని, “అలా మోసం చేసేదాన్నయితే ఇంత గుడ్‌విల్ సంపాదించుకునేదాన్నా” అంది.
వదిన ఆలోచించింది. వనజ మోసం చేసి వ్యాపారం చేసుకోలేదు. కానీ పక్కనే షాప్ పెట్టిన ప్రభావతి ఆ పని సులువుగా చేసేసి, వనజ షాప్ కూడా మూసేయించే పరిస్థితి తేవొచ్చు. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తున్న వదిననే ఇద్దరం ఆతృతగా చూస్తూ కూర్చున్నాం.
“సరే, ఆలోచిద్దాం. ముందు కొంచెం కాఫీ తెస్తాను, తాగండి..” అన్న వదిన మాటలకి వనజ చటుక్కున లేచి నిలబడి, “కాఫీ మేవిద్దరం చేసి తెస్తాం, నువ్వు కాస్త ఆ ఆలోచనేదో గట్టిగా చెయ్యి వదినా.” అంటూ నన్ను కూడా దాంతో వంటింట్లోకి లాక్కుపోయింది.
మేమిద్దరం వదిన వంటింట్లో ఏవెక్కడున్నాయో చూసుకుని, కాఫీ చేసుకుని వచ్చేటప్పటికి వదిన కాళ్ళు ముందు టీపాయ్ మీద పెట్టుకుని, సోఫాలో వెనక్కి వాలి హాయిగా టీవీ చూస్తోంది. ఏదో గొప్పగా అలోచించేసి వనజ సమస్యకి పరిష్కారం చెపుతుందనుకుంటే వదిన అలా సీరియల్లో మునిగిపోవడం చూస్తే ఒకలాంటి అసూయ కలిగింది.
ముగ్గురం మౌనంగా కాఫీలు తాగాం. వనజ ఆతృతగా వదిన వైపే చూస్తోంది. వదిన నెమ్మదిగా అడిగింది.
“నీ షాప్‌కి వచ్చేవాళ్ళు ఎలాంటివాళ్ళు, ఆడవాళ్ళేనా, మగవాళ్ళు కూడా వస్తారా, ఉద్యోగస్తులా, గృహిణులా, స్టూడెంట్సా!”
“మగవాళ్ళు ఎక్కువరారు వదినా. చాలామంది మా లొకాలిటీవాళ్ళూ, నా చుట్టాలూ, స్నేహితులే. ఉద్యోగస్తులకన్న గృహిణులు ఎక్కువొస్తారు.” అంది వనజ.
“అయితే ఒక పని చెయ్యి. నీ బొటెక్‌లో చీర ఎలా కట్టుకోవాలో చెప్పే ఒక సేల్స్ గర్ల్‌ని పెట్టు. చీరలతోపాటూ ఆక్సెసరీస్ కూడా పెట్టు. ఏ చీరకి ఏది మాచ్ అవుతుందో ఆమె చెప్పాలన్న మాట. అంతేకాదు, వీళ్ళకి కట్టి చూపించాలన్న మాట..”
అంటున్న వదినని మధ్యలో అపి, “అలాగ చేసేవాళ్లు పెద్ద పెద్ద షాపుల్లో ఉన్నారుగా, ఇందులో కొత్తదనమేముందీ?” అన్నాను నేను.
నన్ను కాస్త ఆగమని సైగ చేస్తూ,
“నువ్వు ఎవరో లోకల్ చానల్ వాళ్లకి ‘ఆడాళ్ళూ – ఆనందాలూ’ అనే ప్రోగ్రామ్ చెయ్యడానికి స్పాన్సర్ చేస్తున్నావనీ, దానికి ఎంట్రీ నీ షాప్‌లో కొన్న చీరల బిల్ చూపించాలనీ నీకు బాగా తెలిసిన ఇద్దరు ముగ్గురి దగ్గర వాళ్ళొక్కళ్ళకే చెపుతున్నట్టు చెప్పి, ఈ విషయం రహస్యంగా ఉంచమని చెప్పు. అందరికీ తెలిసిపోతే పోటీ ఎక్కువయ్యే ప్రమాదముందని హెచ్చరించు” అంది వదిన.
హమ్మ వదినా అనుకుంటూ అబ్బురపడిపోయేను.
“నేను అలా చెయ్యటంలేదుగా వదినా. వాళ్లకి అబధ్ధాలు చెప్పినట్టు అవుతుందేమో..” అంది వనజ.
“ఏమీ కాదు. అదీ చేసేద్దాం. అదెంత పని! లలితా సహస్రం చదివే గ్రూపులూ, వుమన్స్ ఎంపవర్మెంట్ గ్రూపులూ, కిట్టీపార్టీలూ లాంటివి ఎన్ని గ్రూపుల్లేవు! పది పదిమందిని ఒక గ్రూప్‌గా చేసేస్తే బోల్డు ఎపిసోడ్లు చెయ్యొచ్చు. బోల్డు లోకల్ చానల్స్ ఉన్నాయి. ఈ ఆడాళ్ల ప్రోగ్రాములు చెయ్యడానికి అందరూ రెడీయే. ఇట్టే చెయ్యొచ్చు. టివీ షోలో కనిపిస్తారంటే బోల్డుమంది ఆడాళ్ళు క్యూలు కట్టి మరీ వస్తారు నీ షాప్‌కి.” అన్న వదిన మాటలకి ఏం మాట్లాడలేకపోయింది వనజ.
వనజ సందేహం గమనించి వదిన “నీకెందుకు! అన్నింటికన్నా పవర్‌ఫుల్‌గా పని చేసేది ఒకటి చెప్పనా!” అంది ఊరిస్తున్నట్టు.
నేనూ వనజా కూడా అదేంటో అనుకుంటూ ఆతృతగా ముందుకి వంగాం.
“నువ్వు మల్లెమొగ్గలు సీరియల్లో వసుధ చీరలనీ, బంగారం సింగారం రియాలిటీ షోలో యాంకర్ శ్రీలత వేసుకున్న చుడీదార్ అనీ చెప్పెయ్యి. దెబ్బకి నీ షాప్ ముందు జనాలు క్యూలు కట్టేస్తారు” అన్న వదిన మాటలకి
“నిజంగా అలాంటి పబ్లిసిటీకి జనాలు వస్తారంటావా వదినా!” అంది వనజ.
“ఎందుకు రారూ! మా చిన్నప్పుడు వాణిశ్రీ చీరలూ, జయలలిత గాజులూ అంటూ అమ్మేవారు. ఎగబడి కొనుక్కునేవారు అందరూ. ఇప్పుడూ అంతే.. సీరియల్లో కట్టుకున్న చీర, వేసుకున్న గాజులూ, పెట్టుకున్న పెద్ద పెద్ద టిక్లీలూ, వేసుకున్న మాయనగలూ అంటే పరుగెత్తుకొస్తారు. నాదీ గారంటీ..” అన్న వదిన మాటలకి వనజ మొహం మందారంలా విచ్చుకుంది.
“వదినా, ఈ ఉపాయానికి కనక సేల్స్ పెరిగితే నీకో ఉప్పాడ చీర గిఫ్ట్‌గా ఇస్తాను..” అంది వనజ సంబరపడిపోతూ.
“నాదీ గారంటీ అన్నానుగా..” అంది వదిన ధీమాగా.
ఓ పదిరోజులు గడిచాయి. వనజ షాప్‌లో సేల్స్ మాట ఇంక చెప్పక్కర్లేదుగా.. వదిన గిఫ్ట్‌గా ఉప్పాడ చీర కొట్టేసిందంతే.
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™