[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]


మంచి దంతాల కోసం
ప్ర: డాక్టర్ గారూ.. నమస్కారం. సంచిక అంతర్జాల పత్రిక నాకు మీ ద్వారానే పరిచయం, సంచిక పత్రిక ద్వారా మా వంటి పాఠకుల దంతవైద్య పరమైన సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారని తెలిసి చాలా ఆనందమయింది. సంచికకు, మీకు ధన్యవాదాలు. ఇకపోతే నా (మా) సమస్య – మా అమ్మాయి ఇప్పుడు మూడునెలల గర్భిణీ. ఆమెకు పుట్టబోయే బిడ్డకు అందమైన పలువరుస రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – బి. కుసుమకుమారి, ఒంగోలు.
జ: చాలా మంచి సందేహం మీది. చాలామంది గర్భిణీస్త్రీలు తమకు పుట్టబోయే పిల్లలు అందంగా వుండాలని, వాళ్ళ పలువరుస అందంగా, ఆకర్షణీయంగా ఉండాలనీ కోరుకోవడం సహజం, అందులో ఎలాంటి తప్పులేదు.
అయితే, పుట్టబోయే పిల్లలు అందంగా పుట్టాలన్నా, వారి అవయవ నిర్మాణం సహజంగా ఉండాలన్నా, అలాగే పిల్లల దంతసౌందర్యం బాగుండాలన్నా, అనేక విషయాల మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో కొన్ని సహజమైనవి, కొన్ని మనం చేయదగ్గవి. ఇంకా విపులంగా చెప్పాలంటే, కొన్ని సహజమైనవి – అంటే జన్యుపరమైనవన్నమాట! కొన్ని వైద్యులు మార్చదగ్గవి, మరికొన్ని తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ సహజంగా కలిసొస్తేనే మనం అనుకున్న రీతిలో పిల్లలు పుడతారు. అలా జరగలేదు అంటే,పైన చెప్పిన ఏ స్థాయిలోనో లోపం ఉందని గ్రహించాలి.


ఇక అందమైన దంతాలు లేదా దంత సౌందర్యం విషయానికి వస్తే, తల్లి గర్భంలో బిడ్డ పిండ దశలో వున్నప్పుడే, దంతాలకు సంబందించిన పంటి మొలకలు వారి చిరు దౌడలలో ఏర్పడతాయి. వీటిని ‘టూత్ బడ్స్’ అంటారు. అయితే వీటికోసం పిండ దశలో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనవసరం లేదు.
స్త్రీలు గర్భం ధరించగానే, సహజంగా తరచుగా స్త్రీవైద్య నిపుణులను సంప్రదిస్తుంటారు. ఆ వైద్య నిపుణులు, గర్భంలో ఆరోగ్యంగా ఎదగడానికి తల్లి తీసుకోవలసిన పుష్టికరమైన ఆహారం విషయంలోనూ, వాడవలసిన అవసరమైన మందుల విషయంలోనూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ మార్గదర్శనం చేస్తుంటారు. అంటే మొత్తం బిడ్డ ఎదుగుదలకు ఇవన్నీ ఉపయోగపడతాయన్నమాట! ఇంతకుమించి మంచి దంతాలకోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటూ ఏమీ వుండవు. అంటే శరీరానికి అన్ని రకాల అవసరమైన పుష్టికరమైన ఆహారం, పాలు – పండ్లు స్త్రీవైద్య నిపుణుల సలహా మేరకు తీసుకుంటే సరిపోతుంది. జన్యుపరంగా సంభవించే (ముఖ్యంగా మేనరికాలు) అంగవైకల్యాలను ఎక్కువశాతం బిడ్డ పుట్టిన తర్వాతనే చేయదగినంత మేలు చేయవచ్చు. ముఖ్యంగా గ్రహహణం మొర్రె, చిన్ని దౌడ (మైక్రో ఘ్నాతిసం) వంటి దంత సంబంధమైన సమస్యలను బిడ్డ పుట్టి కాస్త పెరిగినప్పుడు మాత్రమే అనుకూలతను బట్టి శస్త్ర చికిత్స ద్వారా సరిచేయవచ్చు. బిడ్డ తొమ్మిది నెలలు తల్లి గర్భంలో పెరిగి, పుట్టిన సమయానికి ఆ చిన్ని దవుడల్లో పళ్ళు పైకి కనిపించవు. కానీ, దౌడ లోపల ఎదుగుదల దశలో ఉంటాయి. తల్లి బిడ్డకు స్నానం చేయించే సమయంలో వళ్ళు రుద్దినట్టే బిడ్డ దౌడలు కూడా మృదువుగా రుద్దాలి. అలా చేయడం మూలాన బిడ్డపుట్టిన ఆరవ నెలలో దౌడలో బయటికి పొడుచుకు వచ్చే పళ్ళు ఆరోగ్యంగా పటిష్టంగా ఉంటాయి. ఒక్కోసారి బిడ్డ పుట్టుకతోనే ఒకటి రెండు పళ్ళు దౌడలో ఉంటాయి. ఇవి పాలిచ్చే తల్లికి అసౌకర్యంగా ఉంటాయి. అంతమాత్రమే కాదు అలాంటి పళ్ళు పటిష్టంగా లేకపోవడం వల్ల బిడ్డకు తల్లి స్తన్యం ఇచ్చేసమయంలో పన్ను రాలి బిడ్డ గొంతులో అడ్డుపడి బిడ్డ ప్రాణానికే హాని కలుగవచ్చు. ఇటువంటి పళ్ళను ‘ప్రీ – డెసిడ్యూయస్ టీత్’ అంటారు. ఇలాంటి పళ్ళు పిల్లల దౌడలో కనిపిస్తే వెంటనే పిల్లల దంతవైద్యుని (పీడో డాంటిస్ట్) సంప్రదించి అలాంటి పన్ను తీయించేయాలి.


బిడ్డకు రెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి పై దవుడ (మాక్జిలా)లో పది పళ్ళు,క్రింది దౌడలో (మాండిబుల్ ) పది పళ్ళు వస్తాయి. బిడ్డకు ఆరవ సంవత్సరం వచ్చేవరకు ఈ పాల పండ్లలో (డెసిడ్యూయస్ టీత్ /మిల్క్ టీత్) ఎలాంటి మార్పు ఉండదు. ఈ పళ్ళ దంతసంరక్షణ బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే. ఎందుచేతనంటే, రాబోయే స్థిర దంతాలకు ఇవి ‘పునాదిరాళ్ళు’ గా పనిచేస్తాయి.
~
పంటి రంగు ప్రహసనం
ప్ర: డాక్టరుగారూ.. నేను రోజుకు రెండుసార్లు దంతధావనం (బ్రషింగ్) చేస్తాను. కానీ, నా మిత్రుడు రోజుకు ఒకసారి మాత్రమే (ఉదయం) చేస్తాడు. అయితే నా మిత్రుడి పళ్ళు తెల్లగా మిల మిల మెరుస్తుంటాయి. నా పళ్ళు అంత తెల్లగా వుండవు. ఎందుచేతనంటారు? నా పళ్ళు కూడా మిత్రుడి పళ్ళలా తెల్లగా వుండాలంటే ఏమి చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. – రాజేంద్ర ప్రసాద్, ఏ. ఎస్. రావు నగర్, సికిందరాబాద్.
జ: రాజేంద్ర ప్రసాద్ గారు, చాలామందిలో ఉదయించే సందేహమే మీకు వచ్చింది. ఈ విషయంలో మీకు సందేహం రావడంలో తప్పులేదు. మనం తీసుకొనవలసిన జాగ్రత్తలు తీసుకున్నా మనం ఆశించిన విధంగా మన పళ్ళు లేనప్పుడు, ఇతరులతో పోల్చి చూసుకోవడం సహజం! అయితే కొద్దిగా దంతవైద్య విజ్ఞాన పరిజ్ఞానం ఉంటే ఇలాంటి అనుమానాలు లేదా సందేహాలు మన దరికి చేరవు. అందుకే,రెండుసార్లు దంతధావనం చేసి పళ్ళు ఎందుకు తెల్లగా కావడం లేదు? అనే సందేహాన్ని నివృత్తి చేసుకునే ముందు, పళ్ళు ఎందుకు రంగుగా మారతాయో తెలుసుకోవలసిన అవసరము ఉంది.
పళ్ళు – రంగుగా మారడానికి, తెల్లగా వుండకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో మొదటిది, సరిగా పళ్ళుతోముకొనక పోవడం. దీనివల్ల పాచి పదార్ధం (ప్లేక్/టార్టార్) పంటి పింగాణీ పొర (ఎనామిల్) మీద పేరుకుపోయి, పన్ను సహజ వర్ణాన్ని కోల్పోవచ్చు. ఇది తాత్కాలికమైనదే. దంతవైద్యుల ద్వారా ఇలాంటి రంగును ప్రత్యేక పరికరాల సహాయంతో (స్కెలింగ్) సహజ రంగును తెప్పించుకోవచ్చును. ఇది సరైన దంతధావన పద్ధతులు (టెక్నికల్ బ్రెషింగ్ మెథడ్స్) పాటించక పోవడం మూలాన వచ్చే సమస్య. ఈ సమస్యను, దంతవైద్యుల ద్వారా లేదా ఓరల్ హైజనిస్టుల ద్వారా పరిష్కరించుకోవచ్చు.


తర్వాత, కొన్ని మందులు వాడడం ద్వారా, లేదా జన్యుపరమైన సమస్యతో పళ్ళు రంగు మారవచ్చు, లేదా కొన్ని అలవాట్ల వల్ల (స్మోకింగ్/పాన్/గుట్కా వగైరా) ఇవి ఇంచుమించు స్థిరంగా ఉండిపోతాయి. ఇవి ఎలాంటి చికిత్సా విధానాలకు లొంగవు. లొంగినా తాత్కాలికం మాత్రమే అని గ్రహించాలి.
ఇలాంటి పంటిరంగులు పంటి పింగాణీ పొరలో అంతర్గతంగా విస్తరించడం మూలాన పళ్ళు అరగదీయడం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం అతి స్వల్పం. అందుచేత మన పంటిమీద రంగు ఎలావచ్చిందీ దంతవైద్యులు నిర్ణయిస్తారు. దాన్నిబట్టి చికిత్స ఉంటుంది.
అందువల్ల రోజుకు ఎన్నిసార్లు పళ్ళు తోమినా విషయం తెలుసుకొనకపొతే ప్రయోజనం ఉండదు. ఇక్కడ దంతధావనానికీ -పంటి రంగుకీ సంబంధము లేదన్నమాట!


విషయం తెలియక కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కువసార్లు తోమమని, గట్టిగా తోమమని సలహా ఇస్తుంటారు. అలాగే కొంతమంది తమ పళ్ళు తెల్లగా వుండాలని, హార్డ్ బ్రష్‌తో గంటలకొద్దీ పళ్ళు తోముతు అటు ఇటు తిరుగుతుంటారు. ఇటువంటి పనుల వల్ల పళ్లకు మేలుకంటే హాని ఎక్కువగా జరిగే అవకాశం వుంది. పంటిపై పొర అయిన ఎనామిల్ త్వరగా అరిగిపోయి, పంటి నరాలు బయటపడడం మూలాన, పళ్ళు ‘జివ్వు’మని గుంజే అవకాశం వుంది. చల్లని/పులుపు పదార్ధాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత సమస్యను దంతవైద్యుల దృష్టికి తీసుకువెళితే, ఏమి చేయాలన్నది వారు నిర్ణయిస్తారు. అసలు విషయానికి వస్తే తెలుపు రంగు పంటి ఆరోగ్యానికి సంకేతం కాదు. అది వారి.. వారి.. శరీర తత్వాన్నిబట్టి ఉంటుంది. అందరూ తమ దంతాలు అందంగా ఆకర్షణీయంగా ఉండాలనే కోరుకుంటారు. అలా సహజంగా కొందరికి మాత్రమే వీలు అవుతుంది. మిగతావారు కృత్రిమపద్ధతులతో తమ దంత సౌందర్యాన్ని కొంతలో కొంత మెరుగు పరుచుకోవచ్చు.
సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలిగాని, సమస్యను మరింత సమస్యగా మనం తయారు చేసుకోకూడదు. సొంత ఆలోచనలు పక్కన పెట్టి, నమ్మకమైన దంతవైద్యులను సంప్రదించి తగిన పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. తెల్లగా ఉంటేనే మంచిపళ్ళు అనుకోవడం కరెక్టు కాదు!
డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002
~
పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురవారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
9 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదక వర్గానికి
ఇతర సాంకేతిక నిపుణులకు
హృదయపూర్వక ధన్యవాదాలు.
——–డా కె.ఎల్.వి.ప్రసాద్
మోహన రావు
Dear Sir , మీరు start చేసిన దంత వైద్య లహరి , పాటకుల కు యెంత గానో వుపయోగపడనున్నది అని మొట్ట
మొదటిది అయిన నేటి సంచిక ద్వార తెలియు చున్నది . మీకు వున్న విశేష వైద్య పరిజ్ఞానము, అనుభవములను పది మందికి వుపయోగపడనున్నది. ఆలాగ వుపయోగపడ వలె అని, అటువంటి సేవా కార్యక్రమo చేపట్టిన మీకు అనేకానేక శుభ అభినందనములు. మరియు మీయొక్క కార్యక్రమం బాగుగా ముందుకు సా గాలి , వెళుతుoది , వెళ్లవలె అని హృదయపూర్వక ముగా వేడుకొంటూ . శుభాకాoక్షలు.
సర్వే జనాo సుఖినోభవంతు.
May God bless you .
నమస్తే
ధన్యవాదములు . అయ్యా .
మోహన రావు .
డా కె.ఎల్.వి.ప్రసాద్
మోహనరావు గారు
మీ సహృదయ స్పందన కు
హృదయపూర్వక ధన్యవాదాలు.
——డా కె.ఎల్.వి.ప్రసాద్.
ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
సమస్యలకు మీ సమాధానాలు దంత సంరక్షణ పైన అవగాహనను కలిగించేట్టుగా ఉన్నాయి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు
ధన్యవాదములు సోదరా.
————డా.కె.ఎల్.వి.ప్రసాద్.
Dr. Harika
Good morning sir,
Dantha Vaidhya Lahari is a great initiative which will be useful for many people to know and understand about various dental problems.
This will definitely help them recognize their own dental problems and realize about the importance of dental care & treatment .
Hat’s off to your patience and dedication towards creating awareness on oral and overall health.
Thank you sir.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Amma
Dr.Harika
Thank you so much.
—-Dr.klv prasad
Shyam kumar chagal
మంచి సమాచారం అందించారు. అవసరం అయినం త వరకూ చక్కని అవగాహన కల్పించారు. ధన్యవాదాలు Dr klv ప్రసాద్
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మిత్రమా.
——డా కె.ఎల్.వి.ప్రసాద్