మరోరాత్రి చిలుక సారంగి కథను రాగలత, మహారాజులకు వినిపించ సాగింది
చీకటిని మించిన నల్లటి ఆ రూపాన్ని చూసి భయపడిపోయిన మనోరమ “బిడ్డా” అన్న ఆదరణ వాక్యాలు ఆమె నుంచి వినిపించడం వల్ల మరింత భయకంపిత అయింది. దయా పూరితంగా, మాతృమూర్తి సంబోధనలా, మధురంగా ఉన్న ఆ స్వరం “బిడ్డా! భయపడకు” అన్నది. “మీరందరూ బంగారు తల్లులు అమ్మా. మీ లాంటి ఉత్తమ సతుల వల్లనే లోకలింకా నిలిచి ఉన్నాయి. సూర్యచంద్రులు గతులు తప్పక క్రమపద్ధతిలో నడుస్తున్నారు. జీవనదుల లోని జలాలింకక, పంచభూతములు స్తంభింపక వున్నవి. మీరందరూ బంగారు తల్లులు. పరమ పావనులు. నా పేరు రోహిణి బేగం.మాది సింహళ ద్వీపం. ఒకప్పుడు ఆ ద్వీపానికి రాణిని కూడా. మా పూర్వీకులు ఈ అలకాపురి వంటి కొన్ని ముఖ్య నగరాలలో భవన నిర్మాణం గావించారు. నేను 80 ఏళ్ల వయసు వరకు మక్కా, మదీనా మొదలైన యాత్రాస్థలాలు దర్శించి ఆయా నగరాలలో మా పూర్వీకులు నిర్మించిన అద్భుత భవనాలను చూస్తూ, ఈ నగరానికి వచ్చి ఇక్కడ మా పూర్వీకులు నిర్మించిన ఈ భవనంలో దైవ సంకల్పానుసారం మృతినొందాను. ఇక్కడ నా కొడుకు, ఇంకా మరి కొందరు ఆత్మీయులు ఉన్నారు. ఈ భవనంలో నా మృతదేహాన్ని – ఇక్కడ, నీవు నిలిచి ఉన్న ఈచోట భూస్థాపితం చేసి, గోరీ కట్టారు. లాల్మియా నాకు కన్న కొడుకు అయినా, నిజం చెప్పాలంటే, మొదటి నుంచి మోసకారి గానే ఉన్నాడు. నా కూతురు కూతురితో పెళ్లి చేయడంతో నేను మహా పాపానికి ఒడిగట్టాను. వాడి మూలంగా ఆమె జీవితం దుఃఖ భాజనం అయిపోయింది. దానికి పరోక్షంగా నేనే కారకురాలి నయ్యాను. మీ భారత స్త్రీలందరూ బంగారు తల్లులు. పంచభూతములను శాసించగలరు. ఇది నేను తెలుసుకున్న సత్యం. నేను భూస్థాపితమైన ఈ గోరీలో నా కొడుకు నీకు అపకారం చేయ తలపెట్టాడని తెలుసుకొని నేను వచ్చాను. పరమేశ్వరుడు ధర్మ పక్షపాతి. కాల కర్మవశాత్తు కొన్ని ఇడుములు పడినప్పటికీ, సద్ధర్ములు ఎప్పటికైనా సురక్షితులే అవుతారు. దుర్మార్గుడైన లాల్మియా చావు భార్య చేతుల్లోనే ఉంది. వాడి కర్మ కొద్దిరోజుల్లో పరిపాకం అవుతుంది” అన్నది ఛాయా స్వరూపిణి. “నువ్వు ఇప్పుడు ఈ సొరంగంలోంచి వెళితే కుడి పక్కన సముద్రతీరము, ఎడమ పక్కకు వెళితే కళామందిర్ చేరుతావు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లు. ప్రాణాలను కాపాడుకో” అంటూ కొంత విభూతిని మనోరమ కిచ్చింది.
“దారిలో భయంకర శబ్దాలు వినిపించవచ్చు. భయపడకు” అని ఆమె చేతిలో విభూతి ఉంచి ఆ ఛాయాస్వరూపం చీకట్లో కలిసిపోయింది. కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ బిలమార్గంలో భయపడుతూనే మనోరమ నడిచి వెళ్ళసాగింది. అలా వెళ్లాక ఒక విశాలమైన గది లోనికి ప్రవేశించింది. అక్కడ తన అన్న మకరంద్, పురుష రూపంలో ఉన్న అవంతిని కలుసుకొని ఆనంద భరితం అయిపోయింది. ముగ్గురు తమ తమ అనుభవాలను ఒకరికొకరు చెప్పుకొని అక్కడ నుంచి బయటపడే మార్గాన్ని సమాలోచన చేయసాగారు.
అంతలో మాధురీ బేగం అక్కడకు వచ్చింది.
“జయంతుడా! నీవు చెప్పింది నిజం కాదు. లాల్మియా బ్రతికే ఉన్నాడు. తెల్లవారుజామున నాకు కల వచ్చింది. నా కల ఎప్పుడూ నిజమే అవుతుంది. వాడు ఏవో మాయోపాయాలు పన్ను తున్నాడు” అన్నది మాధురీ బేగం.
***
అలకాపురి అరుంధతీ రాజ్యంలోనిది. అమరావతి నగరాన్ని ముఖ్యపట్టణంగా చేసుకొని అమర్నాథ్ ఆ సర్వ సామ్రాజ్యాన్ని ఏకైక ఛత్రంగా పరిపాలిస్తూ, అలకాపురికి మాత్రం జలదీప్ అను రాజపుత్రుని ప్రభువుగా చేసి, అతని నుండి కప్పం గైకొంటున్నాడు. ఇంకా మరికొన్ని నగరాలకు కూడా వేరువేరు ప్రభువులను నియమించి సర్వ బాధ్యతలు తానే వహించి రాజ్యపాలన సక్రమంగా జరిపిస్తున్నాడు. ఆ మహారాజు నిర్ణయించుకున్న అధికాహారోత్పత్తి ప్రణాళికను అనుసరించి, రాజ్యంలోని వివిధ నగరాలకు సమర్థులైన వ్యవసాయ శాఖ ప్రముఖులను పంపుతున్న సమయంలో, యువరాజు అయిన మకరంద్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహంతో ఉన్న కారణం వల్ల మహారాజు అతనిని అలకాపురికి పంపుతూ, అక్కడ బంజరు భూములను పంట భూములుగా తయారు చేయటానికి ఒక ప్రణాళిక ఇచ్చాడు. అతనికి తోడుగా చెల్లెలు మనోరమను, బావమరిది తారనాథ్ను, రుద్రమ్మ అనే పరిచారికను కూడా పంపించి, ఎప్పటికప్పుడు వార్తలు తెలుపుతూ ఉండవలసినదిగా, అవసరమైనప్పుడు తమకు సామంతుడైన జలదీప్ సహాయ పొందవచ్చు అని చెప్పాడు. కానీ అలకాపురికి వచ్చిన తర్వాత మకరంద్ అవంతిని వివాహమాడటం జరిగింది. ఆ సమాచారం తండ్రిగారికి లేఖ ద్వారా తెలియజేశాడు. తండ్రికి స్వయంగా వెళ్లి మిగిలిన అన్ని విషయాలు చెప్పాలని మకరంద్, మనోరమ అనుకున్నారు.
ఆనాడు అలకాపురి రాజ్యసభలో ఒక హత్య విచారణ జరుగుతుందని తెలిసి ప్రజలు అక్కడకు చేరుకున్నారు. హరికథా కాలక్షేపం చేసే హరిదాసుని ఎవరో హత్య చేశారని ఆ విచారణ. కానీ విచారణలో హరిదాసు దొంగ హరిదాస్ అని తేలింది. ఆ గందరగోళంలో తారానాథ్తో పాటు కుంటి గురవయ్య, వైద్యుడు బాణంభట్టు చిక్కుకొని, విచారణ అనంతరం వదిలివేయబడ్డ సందర్భంలో, అనేక సంఘటనలతో ముగ్గురు మిత్రులుగా మారారు.
పక్షుల కిలకిల రావాలతో తెల్లవారిందని తెలుసుకొన్న చిలుక సారంగి కథ చెప్పటం ఆపింది. ఉత్కంఠగా వింటున్న రాజు గారు దీర్ఘంగా నిట్టూర్చి శయనాగారం వీడి వెళ్లారు.
చెలులకు ఏవో మాయ మాటలు చెప్పి రాగలత చిలకతో పాటు ఉద్యానవనంలోని మొగలి పొదల వద్దకు వెళ్లింది. పొదలోకి దూరిన చిలుక “మోసం.. మోసం” అని ఎలుగెత్తి అరవడంతో లోనికి తొంగి చూస్తూ “ఏమైంది” అని అడిగింది రాగలత. “అయ్యో. ఇంకేముంది. నా కళేబరం మాయమైంది. ఎవరో దుర్మార్గులు నాశనం చేశారు కాబోలు. ఏం చేయాలి” అన్న చిలక పలుకులు విని, దుఃఖంతో రాగలత “‘దుర్భేద్యమైన ఈ ఉద్యానవనం లోకి ఎవరూ రాలేరే! ఎలా కళేబరం మాయమైంది” అన్నది. “నిన్న మనం ఇక్కడికి వచ్చినప్పుడు నేను చిలుక రూపం వదిలి నిజ శరీరంలో ప్రవేశించడం, మనిద్దరం మహదానందంతో విహరించటం ఎవరో కనిపెట్టే ఉంటారు. వారే అసూయతో ఈ పని చేసి ఉంటారేమో” అని చిలుక విషాదంతో అన్న మాటలకి భయకంపితురాలైంది రాగలత. ప్రస్తుతం చేసేదేమీలేక చిలుకతో అంతఃపురానికి బయలుదేరింది రాగలత.
(జయదేవుని శరీరము ఏమైంది? శరీరం లభించకపోతే జయదేవ్ చిలుక శరీరంలోనే ఉండిపోవాల్సి వస్తుందా? లాల్మియా బ్రతికి వున్నాడని తెలుసుకున్న మాధురీబేగం తర్వాత ఏమి చేయ నిర్ణయించుకొంది?…… తరువాయి భాగంలో…!)
(సశేషం)
డా. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో పనిచేసి, ప్రిన్సిపాల్‌గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్‌గా, ఎడిటర్‌గా పని చేసారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ ల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనలపై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం అందుకున్నారు. అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష (పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు. విద్యార్థినులు చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం తన కెరీర్లో ఆమెకిష్టమైన పనులు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం సంతృప్తి కలిగించిందంటారు.
EXCELLENT
ఈ వారం కథాభాగం అద్భుతంగా ఉంది. 25 భాగాల అనన్య సామాన్యమైన సీరియల్ నవలని శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు గారు ఎంత కష్టపడి తన కల్పనాశక్తితో రచించారు!!! అదే విధంగా అంత బృహత్తర నవలని శ్రీమతి సుశీల గారు ఇంత సంక్షిప్తంగా మనకి అందిచడం వారి ప్రతిభా పాటవాలకి నిదర్శనం…పెమ్మరా జు. స్వర్ణ. విశాఖ
సమగ్రమైన రచన.అభినందనలు సుశీల గారూ
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™