‘సంచిక’ను ఆదరించి ప్రోత్సహిస్తున్న పాఠకులందరికీ ధన్యవాదాలు. సమకాలీన తెలుగు సాహిత్యంలో ‘సంచిక’ అతి తక్కువ కాలంలోనే తనదైన ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రత్యేక స్థానాన్ని తనకంటూ ఏర్పాటు చేసుకుంది. ఇది కేవలం సహృదయులైన రచయితలు, ఉత్తమ పఠనాసక్తి కల పాఠకుల వల్లనే సాధ్యమయింది. ఇంకా పాఠకులను అలరించే వినూత్నమైన శీర్షికలతో తెలుగు సాహిత్యాభిమానులను విశేషంగా ఆకర్షించాలని ‘సంచిక’ నిరంతరం ప్రయత్నిస్తున్నది.
‘సంచిక’ను ఇతర పత్రికల నుండి వేరు చేసే ప్రధానాంశం – సృజనపై పరిధులు, పరిమితులు లేకుండా ఉండటం. రచయితలకు ‘సంచిక’లో పూర్తి రచనా స్వేచ్ఛ ఉంటుంది. ‘ఏదైనా రాయండి, ఎంతైనా రాయండి. కానీ ఇజాలు, వాదాల పంజరాలలో రచనలను బంధించకండి’ అన్నది ‘సంచిక’ అభ్యర్థన. అందుకే యువ రచయితల నుంచి ప్రఖ్యాతి పొందిన సీనియర్ రచయితల వరకూ అందరూ స్వేచ్ఛగా తమ రచనలను పంపిస్తున్నారు, సంచిక పాఠకాదరణను పెంచుతున్నారు.
ఆగస్టు 15 స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా ‘సంచిక’ రెండు సరికొత్త శీర్షికలను ప్రారంభిస్తోంది. దేశ విభజనకు దారి తీసిన పరిస్థితులను మూలాలతో చర్చిస్తూ విశ్లేషించే సరికొత్త శీర్షిక ఆగస్టు 14 సంచికతో ఆరంభమవుతున్నది. ఈ శీర్షికను ‘రామమ్ భజే శ్యామలం’ రచయిత కోవెల సంతోష్‌కుమార్ రచిస్తున్నారు. 1939లో సావిత్రీ దేవి రచించిన ‘A Warning to Hindus’ అన్న వ్యాస పరంపరను ‘భారతీయులకు ఒక హెచ్చరిక’ పేరిట పాణ్యం దత్తశర్మ అనువదించి అందిస్తున్నారు. ఈ శీర్షిక కూడా ఆగస్టు 14 సంచికతో ఆరంభమవుతుంది. ఈ రెండు శీర్షికలు కూడా సమకాలీన సమాజానికి అత్యంత ఆవశ్యకమైన సమాచారాన్ని, చేదు నిజాలను విశ్లేషణాత్మకంగా నిక్కచ్చిగా అందిస్తాయి.
యువ రచయితలను ప్రోత్సహించేందుకు ‘సంచిక’ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ కొందరు యువ రచయితల తీరు తెన్నులు, ఆలోచనా విధానం చూసిన తరువాత కాస్త నిరాశ కలిగిన మాట వాస్తవం. యువరచయితలలో పేరు సంపాదించి, అవార్డులు కొట్టేసి, సభలలో ఉపన్యాసాలిచ్చేయాలన్న తపన తీవ్రంగా కనిపిస్తోంది. కానీ నిజంగా కష్టపడుతూ, రచన కోసం తపిస్తూ, సాహిత్యంపై ప్రేమతో సృజన ఓ ఆత్మానందాన్నిచ్చే అనుభూతిలా భావిస్తూ రచనలు చేయాలన్న నిజాయితీ అధికులలో కనబడకపోవటం గమనించిన తరువాత ‘సంచిక’ ఓ నిర్ణయానికి వచ్చింది. సంచిక – స్వాధ్యాయ కలిసి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వారం వారం వెబ్ సమావేశాలు, కనీసం నెలకు ఒక ఆఫ్‌లైన్ సమావేశం నిర్వహించాలని నిశ్చయించింది. ఈ సమావేశాలలో సృజనాత్మక రచయితలు తమ సృజనాత్మక రచనా ప్రక్రియను వివరిస్తారు. ఏ రకంగా తమ రచనను అర్థవంతము, ఆకర్షణీయము చేస్తూ, సామాజిక ప్రయోజనము కలదిగా తమ రచనలను తీర్చిదిద్దుతారో వివరిస్తారు. వీటన్నిటినీ రికార్డు చేసి స్వాధ్యాయ యూట్యూబ్ ఛానెల్లో ఉంచటం ద్వారా, తరువాత ఈ ఉపన్యాసాలను పుస్తక రూపంలో అందించటం ద్వారా రచనలో నిష్ణాతులు రచనలు ఎలా చేస్తారో తెలుసుకునే వీలు కలుగుతుంది. అంటే ‘రచనలు ఇలా చేయండి’, ‘ఇలాగే చేయండి’, ‘ఇలా కూడా చేయండి’ అని సృజనాత్మక రచయితల రెక్కలను కత్తిరించే బదులు, ‘మేము రచనలు ఇలా చేస్తాం’ అని అనుభవజ్ఞులు తమ రచనానుభవాన్ని పంచుతారు. అది తెలుసుకుని తమ రచనా సంవిధానాన్ని తీర్చిదిద్దుకునేవారు తీర్చిద్దిద్దుకుంటారు. అంటే, రచన పట్ల ఆసక్తి కలవారిని కూర్చోబెట్టి ‘రచనలు ఇలా చేయండి’ అని నిర్దేశించే బదులు ‘మేము ఇలా రాస్తాం’ అని చెప్పటం వల్ల అవసరమైన వారికి మార్గదర్శనం లభిస్తుందని ‘సంచిక’ ఆలోచన. ‘భగవద్గీత’ బోధించినట్టు ఫలితం గురించి ఆలోచించకుండా తన కర్తవ్యం నిర్మోహంగా నిర్వహించటానికి ‘సంచిక’ ప్రయత్నిస్తోంది. మా ఇతర ప్రయత్నాల లాగే ఈ ప్రయత్నానికి కూడా సాహిత్యాభిమానుల ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నాము.
~
ఎప్పటిలానే వ్యాసాలు, ఇంటర్వ్యూ, కాలమ్స్, కథలు, కవితలు, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 ఆగస్టు 2022 సంచిక.
1 ఆగస్టు 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- కవి శ్రీ మువ్వా శ్రీనివాసరావు గారి అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
కాలమ్స్:
- సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…5 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
- సంచిక విశ్వవేదిక – 2021 ఆస్ట్రేలియా జనాభా గణన – తెలుగు వారి సంఖ్యా వివరాలు – సారధి మోటమఱ్ఱి
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- ఆగస్టు 2022- దినవహి సత్యవతి
వ్యాసాలు:
- నేను నవలలు ఎలా రాస్తాను? – డా. మధు చిత్తర్వు
- అమ్మ కడుపు చల్లగా -29 – ఆర్. లక్ష్మి
కవితలు:
- క్షమాపణల గంధపుగిన్నె – శ్రీధర్ చౌడారపు
- నిన్నటిదాకా శిలనైనా… – డా. విజయ్ కోగంటి
- పలకరింపు…!! – డా. కె.ఎల్.వి. ప్రసాద్
కథలు:
- వాళ్ళు అరుదు – గంగాధర్ వడ్లమాన్నాటి
- అంతర్మథనం – గోనుగుంట మురళీకృష్ణ
సినిమా/వెబ్ సిరీస్:
- గూఢచారుల జీవితచిత్రణ – ‘ది అమెరికన్స్’ – సినీ విశ్లేషణ – పి. వి. సత్యనారాయణరాజు
బాల సంచిక:
- అపురూప రాయి – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- ‘సిరికోన’ చర్చా కదంబం 13 – టీరత భారతం – డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
- రేపటి పౌరులు – గాడేపల్లి పద్మజ
- కోపూరి శ్రీనివాస్ స్మారక సింగిల్‌పేజీ కథల పోటీల ఫలితాలు ప్రకటన – చలపాక ప్రకాష్
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.
1 Comments
annapurna appadwedula
Namaste ! kotta ansaalu pravesa pettadam aanandakaram.
rachanalu merugu parachu kodaaniki nela nelaa meetingulu
pettadam …..entavaraku vupayogamo teliyadu…kaani andaroo
kalusukodam baguntundi. yuvataraaniki aasakti vuntundaa?
anedi teliyaali.
maa laanti rachaietalam kevalam nirantaram chadavadam appati rojullo letters raasukodam valana rachanalu cheyaalane aasakti
kaligindi. rachanalu prachuristunnaru kadaa ani chadavadam manaledu ippatikee. iete aakattukune ansaalu vunnappudu kottadanam vuntene chaduvutaamu.
ippudu vachhe writers merugga rayadaaniki aemi anusaristaaro
teliyadu.
chadavadame kaadu manchi kathaa chitraalu koodaa rachanalaku
manchi spoorti. ide naa nammakam.