20వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో పేరు పొందిన చిత్ర కళాకారిణి ఆమె.. తల్లి వారసత్వంతో ఐరోపా చిత్రకళారూపాలను తండ్రి వారసత్వంతో భారతీయ చిత్రకళారూపాలను అద్భుతంగా సృజించారు ఆమె. బాల్యంలోనే చిత్రకళ పట్ల ఆకర్షితురాలయ్యారామె. జీవితపు తొలిదశ ఐరోపాలో, మలిదశ భారతదేశంలో గడిపారు, అనేక విదేశాలను పర్యటించి విశ్వవ్యాప్త చిత్రకళారీతులను అవగాహన చేసుకున్నారామె. ఈమె సృజించిన భారతీయ కళాత్మక చిత్రాలు గాంధీ, నెహ్రులను ఆకర్షించాయి. కాంగ్రెస్ ప్రచారంలో భాగమయి స్వాతంత్ర్య పోరాటంలో స్థానాన్ని సంపాదించాయి. ఈమే అమృతా షేర్-గిల్.


ఈమె హంగేరి ఇండియన్. 1913 జనవరి 30వ తేదీన హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో జన్మించారు, తల్లి మేరి ఆంటోయినెట్ గొట్టెస్మాన్ హంగేరియన్, తండ్రి పంజాబీ సిక్కు ప్రభువు. ఇతను పంజాబీ, పర్షియన్, సంస్కృతం మొదలయిన భాషలలో పండితుడు. ఆయనే ఉమ్రాప్ సింగ్ షేర్ గిల్ – మజిథియా.
రాజా రంజిత్ సింగ్ మనవరాలు యువరాణి బాంబా నెదర్లాండ్స్ లో ఉండేది. ఆమెకి మేరి ఆంటోయినెట్ స్నేహితురాలు. మేరి యువరాణితో కలిసి భారతదేశానికి వచ్చారు. అప్పుడు మేరీకి ఉమ్రావ్ సింగ్ పరిచయమయ్యారు, ఈ పరిచయం పరిణయంగా మారింది.
అమృతా షేర్-గిల్ బాల్యం బుడాపెస్ట్‌లో గడిచింది. ఐదేళ్ళ వయస్సు నుండి బొమ్మలను గీయడం మొదలు పెట్టింది. తమ ఇంటి సేవకులకు రంగులు వేసి మేకప్ చేయించేది, వారిని మోడల్స్‌గా కూర్చోబెట్టి బొమ్మలు గీసేది.
హంగరీలో ఆర్థిక మాంద్యం ఏర్పడినపుడు వీరి కుటుంబం కూడా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. తత్ఫలితంగా భారతదేశానికి తరలివచ్చారు. సిమ్లాలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈమె మేజర్ విట్‌మార్ష్, బెవెన్ పటేమస్ల దగ్గర చిత్రలేఖన పాఠాలను నేర్చారు. అప్పుడప్పుడు ఇటలీ, ప్రాన్స్ దేశాలకు వెళ్ళి చిత్రలేఖన పాఠశాలలో చేరి మెలకువలను అభ్యసించారామె.
ప్రముఖ ఐరోపా చిత్రలేఖకులు పియరీ వైలెంట్, లూసీన్ సైమన్, బోరిసాస్లిట్ట్సీ, పాల్ సెజాన్, పాల్ గౌగ్విన్, అమెడాయో మొడిఛియాని మొదలయిన వారి శిష్యరికం చేశారు. అందుచేత ఈమె చిత్రించిన తొలిరోజుల నాటి చిత్రాలు పాశ్చాత్య రీతులను ఒడిసి పట్టుకున్నట్లు ఉంటాయి.
ఈ చిత్రాలలో ఐరోపాదేశాలలో తన జీవితం, తన సన్నిహితులు, సహోపాధ్యాయులు, ఆయాదేశాల వైవిధ్య భరిత అంశాలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. రంగుల పెయింటింగ్‌లో పరిణతిని సంపాదించారీమె.
కొంతకాలం తరువాత ఆమె మళ్ళీ స్వదేశానికి వచ్చారు. తన గమ్యం తన పని ఇక్కడే ఉందని ఆమెకి అన్పించేది.
ఈమె ప్రముఖ జర్నలిస్ట్ మాల్కం ముగ్జేరిడ్జ్ని కలుసుకున్నారు. పత్రికా రంగంలో ప్రవేశించారు. ది కలకత్తా స్టేట్స్‌మన్ పత్రికలో ఉపసంపాదకులుగా బాధ్యతలను నిర్వహించారు. చాలా సంపాదకీయ వ్యాసాలను పత్రికలో వ్రాశారు.
భారతీయ చిత్రకళలో మెలకువలను అభ్యసించేటందుకు వివిధ ప్రాంతాలను పర్యటించారు. ఈ పర్యటనలలోనే మొఘల్ చిత్రకళరీతులను, అజంతా చిత్రసౌందర్యాన్ని దర్శించారు. తన స్వదేశం కళాత్మకంగా ఎంత గొప్పదో అవగాహన చేసుకున్నారు.
ఆ తరువాత నుండి ఈమె మీద వివిధ భారతీయ చిత్రకళల ప్రభావం కన్పిస్తుంది. దేశంలోని విభిన్న ప్రాంతాలు, దేవాలయాలు, చిత్రకళా ప్రాముఖ్యత గల ప్రదేశాలను దర్శించి మెలకువలను అభ్యసించారు.
బ్రెడ్స్ టాయిలెట్, బ్రహ్మచారీస్, సౌత్ ఇండియన్ విలేజర్స్ గోయింగ్ టు మార్కెట్, విలేజ్ సేన్, ఇన్ ది లేడీస్ ఎన్‌క్లోజర్, సియస్టా, నైజాం నవాబ్ సాలార్జంగ్ చిత్రాలు ఈమె సృజనలో పేరెన్నిక గన్నాయి. ఇంకా తాహితియన్, రెడ్ బ్రిక్ హౌస్, హిల్ సీన్, ది బ్రెడ్ వంటి చిత్రాలకు గొప్ప పేరు లభించింది.
ఈమె భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ప్రముఖ బెంగాలీ, భారతీయ చిత్ర కళాకారులు గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, జైమినిరాయ్, అబయేంద్రనాథ ఠాగుర్ల ప్రభావానికి లోనయ్యారు. రంగుల ప్రయోగాన్ని అబయేంద్ర నుండి, మహిళల చిత్రాల చిత్రీకరణకు రవీంద్రనాథ్ ఠాగూర్ని అనుసరించారు.
ఈమె భారతీయ చిత్రకళలో పలు మార్పులను తీసుకొచ్చారు. ఆయిల్ పెయింటింగ్, భారతీయ సంస్కృతి సూక్ష్మాలు, భారతీయాత్మని నిక్షిప్తం చేసి చిత్రాలను చిత్రించారు. తనకి తనే భారతీయ ప్రజల జీవనవిధానాన్ని తన కాన్వాస్ ద్వారా వ్యక్తపరచాలని దిశానిర్దేశం చేసుకున్నారు.
ఈమె చిత్రాలు స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తిని కలిగించడం మరొక విశేషం. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత బ్రిటిష్ వారి పరిపాలనలో ముఖ్యంగా గ్రామీణ ప్రజలు పడుతున్న బాధలు ఈమె మనసును కరిగించాయి. గాంధీ మార్గం అనుసరణీయమని నిర్ధారించుకున్నారు. ఆయన సిద్ధాంతాలు, జీవనవిధానం ఆమెను అమితంగా ఆకర్షించాయి. ఈమె కళాఖండాలను గ్రామాల పునర్వవ్యవస్థీకరణలోను, జాతీయ పోరాట లక్ష్యాలను గ్రామాణ ప్రజలకు అందించడం లోను ఉపయోగించుకోవడానికి భారత జాతీయ కాంగ్రెస్ పూనుకోవడం గొప్ప విశేషం.
1938లో విక్టోర్ ఈగాస్తో ఈమె వివాహం జరిగింది. కొంతకాలం గోరఖ్‌పూర్‌లో ఉన్నారు. 1941లో లాహోర్కి తరలి వెళ్ళారు.
తొలిరోజుల్లో ఈమె చిత్రాలు కొనుగోలు పెద్దగా జరగలేదు. కాని 2006లో ‘విలేజ్ సీన్’ 6.9 కోట్ల రూపాయలకు, 2021లో ‘ఇన్ ది లేడీస్ ఎన్‌క్లోజర్’ 37.8 కోట్ల రూపాయలకు అమ్ముడయి రికార్డులను సృష్టించాయి.
‘భారతదేశపు ఫ్రీగా కాహో’అని ఈమెను అభివర్ణించారు. పికాసో ఐరోపాకి చెందిన వారయితే నేను భారతదేశానికి మాత్రమే చెందిన దానిని అని చెప్పుకుని తన దేశభక్తిని చాటు కున్నారు. ఈమె 20వ శతాబ్దపు తొలి నాళ్ళలో గొప్ప అవాంత్ గార్డ్ మహిళా చిత్రకళాకారులలో ఒకరు. ఆధునిక భారతీయ చిత్రకళా మార్గదర్శి.
1941లో లాహోర్‌లో అతి పెద్ద చిత్రకళా ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి (లాహోర్ నగరం ఆ రోజుల్లో అఖండ భారతదేశంలో సాంస్కృతిక నగరంగా భాసించింది.) ఆ ప్రదర్శనలో పాల్గొనవలసిన అమృతా షేర్-గిల్ డిశంబర్ 6 వ తేదీన అనారోగ్యంతో మరణించి, కళాకారులకు తీరని వ్యథని మిగిల్చారు.
ఈమె చిత్రాలను న్యూఢిల్లీ లోని నేషనల్ గ్యాలరీ ఆప్ మోడరన్ ఆర్ట్‌లో దర్శించే భాగ్యాన్ని ప్రజలకు కల్పించింది భారతసాంస్కృతిక మంత్రిత్వశాఖ. జాతీయ సంపదగా ప్రకటించి గౌరవించింది.
23 మార్చి 1978 తేదీ న ‘HILL WOMEN’ అనే అమృతా షేర్-గిల్ చిత్రాన్ని రెండు రూపాయల విలువతో స్టాంపుగా విడుదల చేసి గౌరవించింది తపాలా శాఖ. స్టాంపు మీద ఆమె అందమైన చిత్రాన్ని కాకుండా కొండస్త్రీల చిత్రాన్ని ముద్రించడం ద్వారా ఆమె లోని చిత్రకళాకారిణిని అజరామరం చేశారు.


23-09-2022 న విడుదలైన అమృతా షేర్ గిల్ చిత్రించిన స్టాంపు బ్లాక్
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా ఈ వ్యాసం.
***
Image Courtesy: Internet

4 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఒక గొప్ప చిత్రకారిణి గురించి
చక్కగా రాసారు. మీ వివరణా విధానం
చదువరిని ఆపకుండా ముందుకు తీసుకు పోతుంది.
మీకు అభినందనలు.
—-డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ.
కొల్లూరి సోమ శంకర్
Chadivaanu..Amrita sher gil..gurinchi.. she is a great Artist n patriot..good thing..Stamp depicts her talent..
Alluri Gourilakshmi
కొల్లూరి సోమ శంకర్
Thank you madam. Through your post I came to know about a versatile woman painter of our country.
Nirmala jyothi, Tirupathi
C.Suseela
నాగలక్ష్మి గారు, అమృత షేర్ గిల్ గురించి చాలా వివరంగా చాలా చక్కగా వివరించారు. ఆమె దేశభక్తిని, ఆమెలోని చిత్రకళా కౌశల్యాన్ని, రెండు రూపాయల స్టాంపుతొ ఆమె చిత్రకళాకారిణిని, ఆమెను అజరామరం చేయటం ,చాలా అందంగా సాగిపోయింది, చదివించుకుపోయింది. మనఃపూర్వక అభినందనలు మీకు.