ఇతిహాసాలు, పురాణాలలోని ప్రధాన పాత్రలను తీసుకుని విడిగా కథలు, నవలలు రాయడం మామూలే. చివరకు అప్రధాన పాత్రలైన తాటక, ఏకలవ్యుడు, అహల్య, రాధ, యయాతి లాంటి పాత్రలను ఆధారం చేసుకుని నవలలు, నాటకాలు రాయడం మొదలయింది. ఇవి ఎక్కువగా ఆయా కాలాలలో వెలువడిన వాదాలు, ధోరణులకు అనుగుణంగా వెలువడినవే కావడం గమనించదగ్గ విషయం. ఈ ధోరణి దక్షిణ భారతీయ భాషల్లో ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, కన్నడ భాష అగ్రస్థానంలో వున్నదనే చెప్పాలి. ఇరావతి కర్వే ‘యుగాంత’, భైరప్ప ‘పర్వ’, గిరీష్ కర్నాడ్ ‘అగ్ని-వర్ష’లతో పాటు హెచ్.జి. రాధాదేవి పంచకన్యలను తీసుకొని ఒక్కొక్కరి మీద విడిగా నవలలు రాశారు. అలాగే డాక్టర్ ప్రభాకర శిశిల గారు ‘మత్స్యగంధి’, ‘పుంస్త్రీ’ అనే నవలలను రాశారు. కన్నడంలో వచ్చిన ‘పుంస్త్రీ’ నవలను అదే పేరుతో తెలుగులో అనువదించిన వేలూరు కృష్ణమూర్తిగారు ఇప్పుడు దాన్ని పుస్తకంగా తీసుకువచ్చారు.
మహాభారత యుద్ధంలో శిఖండి వేసిన పదునైన బాణం భీష్ముడి ఛాతిలో గుచ్చుకోగా, దాని దెబ్బకు యుద్ధరంగం వీడాల్సి వస్తుంది. ఆ బాణం పెరికి వేస్తే భీష్ముడి మరణం తధ్యం. అందుకని వైద్యులు అది తీయకుండా మందులతో, లేపనాలతో అతని నొప్పిని తగ్గిస్తుంటారు. పడక మీది నుండే బాధను తట్టుకుంటూ యుద్ధరంగ విశేషాలను తెలుసుకుంటూంటాడు. తన పతనానికి కారణమైన అంబ మరుజన్మ దాల్చి శిఖండిగా వచ్చి ఉండవచ్చునన్న అనుమానం అతడ్ని పీడిస్తుంటుంది. దాంతో గత సంఘటనలు వెల్లువలా ముంచెత్తుతుంటే కళ్ళ ముందు జరిగే యుద్ధ సన్నివేశాలతో పోల్చుకొని విశ్లేషించడం కనిపిస్తుంది. ఏ హస్తినాపుర రాజ్యాన్ని నిలబెట్టడానికి బ్రహ్మచారిగా, రెండు తరాల చరిత్రకు సాక్షీభూతంగా నిలిచాడో అతని కళ్లముందే అది సర్వనాశనం కావడం చూడాల్సిరావడం విషాదం. మహాభారత యుద్ధ పరిణామాలను గతానికి వర్తమానానికి అన్వయిస్తూ భీష్ముడు ఒక హేతువాదిగా చేసిన విశ్లేషణలు ఈ నవలలో కనిపిస్తాయి.
అందులో కొన్ని:
మహాభారత యుద్ధంలో శిఖండి చాటునుండి అర్జునుడు వేసిన బాణం దెబ్బకు కూలిన భీష్ముడికి అర్జునుడే అంపశయ్యను ఏర్పాటు చేయడం, అర్జునుడు బాణం వేసి పాతాళ గంగతో భీష్ముని దాహం తీర్చడం లాంటివేవీ ఇందులో లేవు. చివరకు దుర్యోధనుని మరణాంతరం భీష్ముడు చనిపోవడానికి గాను తన గుండెలో గుచ్చుకున్న బాణాన్ని తీసివేయమని ద్రౌపదిని కోరడంతో నవల ముగుస్తుంది. ఇందులోని ప్రధాన పాత్రలు రెండు. ఒకటి ‘పుం’. అది భీష్మాచార్యులు. మరొకటి ‘స్త్రీ’. అది అంబ. ఈ రెండు ప్రధాన పాత్రల సంఘర్షణ నేపథ్యం నుండి మహాభారత యుద్ధాన్ని విశ్లేషించడం ఇందులో కనిపిస్తుంది. ఇంకో కోణంలోంచి చెప్పాలంటే అంబను నాయికగా చేసుకుని శిఖండి ‘పుంస్త్రీ’గా మారి భీష్ముని మరణానికి కారణమయ్యే వరకు జరిగిన సంభాషణలను ఇందులో వివరించడాన్ని మనం చూడవచ్చు. “మున్ముందు మరో జన్మ అన్నది ఒకటి వున్నట్లయితే అటు మగవాడూ కాని, ఆడది కానీ జీవిగా జన్మించి నిన్ను చంపుతా” అనే వాక్యంతో మొదలవుతుందీ నవల. చాలా అధ్యాయాలను ఇదే వాక్యంతో ముగించి కొత్త అధ్యాయాన్ని ఎత్తుకోవడం ఒక ప్రయోగంగా నిలిచిపోతుంది.
నవల చదువుతుంటే స్త్రీ స్వాతంత్ర్యం, సమానత్వం ఇలాంటి మాటలు చదువుతుంటే చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. అక్కడక్కడ వాడిన ‘ప్రభుత్వం’ అనే మాటకు బదులుగా ‘రాజ్యం’ అనీ, ‘జాతి వ్యవస్థ’కు బదులుగా ‘వర్ణ వ్యవస్థ’ అని వాడితే బాగుండేది. అలాగే కాశీలో ఉన్న అపరిశుభ్రత, అసహ్యతల గురించి మాట్లాడడం కూడా విచిత్రమే. ఇతిహాసాలను ఎంత తిరగరాస్తే మాత్రం స్థల కాలాలను పట్టించుకోకపోతే ఎలా?
డాక్టర్ ప్రభాకర శిశిల రాసిన ఈ కన్నడ నవలకు వేలూరి కృష్ణమూర్తి చేసిన అనువాదం బాగుంది. మొత్తానికి ఈ పుస్తకం ఉత్కంఠతో, ఆసక్తికరంగా చదివింపజేస్తుంది.
***
పుంస్త్రీ (నవల) కన్నడం: డాక్టర్ ప్రభాకర శిశిల అనుసృజన: వేలూరి కృష్ణమూర్తి పేజీలు: 200, వెల: ₹120/- ప్రతులకు: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్, ఫోన్ 040 – 27678430, ఇతర ప్రధాన పుస్తకకేంద్రాలు
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
గూఢచారి లాంటి The Wedding Guest
జీవన రమణీయం-85
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-11
నీలమత పురాణం – 52
మానస సంచరరే-30: మనసే అందాల బృందావనం!
All rights reserved - Sanchika™