బాల్యం లోనే తల్లిదండ్రులను కోల్పోయి, సవతి తమ్ముళ్ళ పెంపకంలో చదువును అర్థాంతరంగా ఆపేసిందామె, అజాద్ హింద్ ఫౌజ్‌లో చేరడానికి వయసు సరిపోక, గాంధీజీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, ఉద్యమంలో భాగంగా పతాకావిష్కరణ పిలుపునందుకుని, ఆ ప్రయత్నంలోనే జాతీయ పతాకాన్ని చేతపట్టి ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం జేసిందా టీనేజ్ అమ్మాయి. ఆమే కనకలతా బారువా.
ఈమె 1924 డిసెంబర్ 22వ తేదీన నేటి అస్సోం రాష్ట్రంలోని జిల్లాలోని గోహ్పూర్లో జన్మించారు. తల్లి కర్ణేశ్వరి, తండ్రి కృష్ణకాంత బారువా. వీరి పూర్వీకులు చుటియా వాసల్ రాజవంశం వారు. అయినప్పటికీ ఆనాటికి సాధారణ వ్యవసాయ కుటుంబీకులు. ఈ దంపతులకు ముగ్గురమ్మాయిలు. ఈమె ఐదేళ్ళ వయస్సులోనే తల్లి, పదమూడేళ్ళ వయస్సులో తండ్రి మరణించారు. సవతి తల్లి పెంపకంలో సవతి తమ్ముళ్ళను చూసుకోవలసి వచ్చింది. ఈ కారణంగా 3వ తరగతి తోనే ఈమె చదువు ఆగిపోయింది. తాతగారు ఆలనా పాలనా చూసేవారు.
ఆ రోజులలో దేశమంతటా నిరక్షరాస్యులయిన ప్రజలను కవులు, గాయకులు తమ రచనలు, పాటలు, పద్యాలను దేశభక్తితో నింపి వినిపించి ఉర్రూతలూగించేవారు. నాయకులు వివిధ సమావేశాలలో తమ అద్భుతమైన వాక్చాతుర్యంతో విద్యావంతులనీ, నిరక్షరాస్యులనీ కూడా ఉత్సాహం ఉద్వేగాలలో ఓలలాడిస్తూ దేశభక్తి పూరితులను చేసేవారు.
ఇలా ఉత్తేజపరిచిన వారిలో అసోం జాతీయ నాయకులు కిరణ్ బాలాబోరా, అంబికా కాకతి ఐదేవ్ బాల బాలికలను స్వాతంత్ర్యోద్యమం వైపు మరలించారు.
కామ్రేడ్ బిష్ణు ప్రసాద్ రభా ప్రసంగాలు సభికులను విప్లవ మార్గం వైపు మళ్ళించేవి. ప్రముఖ రచయిత జ్యోతి ప్రసాద్ అగర్వారా వ్రాసిన పాటలు, కవితలు ప్రజలను ఉత్తేజ పరిచేవి.
వీరందరి సమావేశాలకు హాజరయి వివిధ రకాల భావాల సారాన్ని గ్రహించారామె. దేశానికి స్వాతంత్ర్యం ఎంత అవసరమో అవగాహన చేసుకున్నారు.
గాంధీజీ పిలుపును అందుకు అస్సాం ఈశాన్య భారతానికి చెందిన వేలాది మంది కార్యకర్తలు అన్ని ఉద్యమాలలో పాలు పంచుకుని భారత స్వాతంత్ర్యోద్యమాన్ని సుసంపన్నం చేశారు.
ఈమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వం లోని అజాద్ హింద్ ఫౌజ్‌లో చేరేటందుకు సుముఖతను వ్యక్తపరిచారు. కాని దాని నిబంధనలు మైనర్లను అందులో సభ్యురాలిగా చేర్చుకోవడానికి అంగీకరించవు. 17 ఏళ్ళ వయస్సు కాబట్టి కనకలత చేరలేక పోయారు. అయితే మనసుంటే మార్గముంటుందని పెద్దల ఉవాచ. ఈమెకు తన ఆశయం నెరవేర్చుకునే మార్గం కనిపించింది.
‘అస్సాం ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ’ వారు శాంతి బాహిని (శాంతిదళం)ని స్థాపించారు. అస్సాంలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుండి కొన్ని వేల మంది ఈ దళంలో సభ్యులుగా చేరారు. రాత్రిపూట గ్రామాలను కాపలా కాస్తూ కాపాడడం, నిరసనలకు పిలుపు అందినప్పుడు శాంతిని కాపాడడం ఈ దళసభ్యుల బాధ్యతలు. ఈ దళ సభ్యత్వానికి వయోపరిమితి లేదు. కనకలత దీనిలో సభ్యులయ్యారు.
1942లో బాపూజీ క్విట్ ఇండియా తీర్మానాన్ని చేశారు. వివిధ ప్రదేశాల కూడళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల దగ్గర పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ వారు, అంతే కాదు ‘DO OR DIE’ అని పిలుపు నిచ్చారు.
ఈ సమయంలో వీరికి స్ఫూర్తినిచ్చిన సంఘటన ఒకటి జరిగింది. అస్సాంలో పనిచేస్తున్న బ్రిటిష్ సైన్యం ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పింది. దీనికి కారణమయిన విప్లవ వీరుడు కుశాల్ కొన్వర్ ఉరి తీయబడ్డాడు. ఈ బలిదానం అస్సామీయులలో పగను రగిల్చింది.
1942 సెంప్టెబర్ 20వ తేదీన అస్సాం లోని గోహపూర్ పోలీస్ స్టేషన్లో పతాకాన్ని ఎగరేయాలని అస్సాం కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. కమిటీ సభ్యుల నేతృత్వంలో కార్యక్రమాన్ని నిర్ణయించారు. మొదటి వరుసలో పురుషులు, ద్వితీయ వరుసలో స్త్రీలను నిలబెట్టాలని నిర్ణయించారు. కాని కనకలతా అంగీకరించలేదు. ముందు వరుసలో స్త్రీలు కూడా ఉండాలని నిర్వాహకులను ఒప్పించారు. తను ముందు వరుసలో నిలబడ్డారు. వట్టి చేతులతో కాదు పతాకని చేతపట్టి,
నిరాయుధులైన వందలాది మంది బాలికలు, యువకులు, మహిళలు ఈమెని అనుసరించి ఊరేగింపులో పాల్గొన్నారు.
గోహ్పూర్ పోలీస్ స్టేషన్ అధికారి రెబాతి మహస్సోమ్ ఊరేగింపులో పాల్గొన్నవారిపై లాఠీఛార్జి, అవసరమైతే తుపాకి కాల్పులు జరుగుతాయని హెచ్చరించారు. కాని పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న ప్రజలు మడమ తిప్పలేదు. ముందుకే నడిచారు.
ఈ సమయంలో జరిగిన పోలీసు కాల్పులలో కనకలతా బారువా నేలకొరిగారు. కాని పతాకను నేలని తాకనివ్వ లేదు. ప్రక్కనే ఉన్న తోటి నాయకుడు ముకుంద కాకొటి చేతికందించి అశువులు బాశారు. 17 ఏళ్ళ వయస్సు లోనే జాతీయ పతాకను ఎగురవేయడానికి పూనుకుని ప్రాణత్యాగం చేసిన అతి పిన్న వయస్కురాలిగా కనకలతా బారువా అస్సాం జాతీయ పోరాట చరిత్రలో నిలిచి పోయారు.
ముకుంద కాకొటి కూడా వెంటనే మరణించారు. ఇంకా హేమకాంత బోరా, తులేశ్వర్ రాజోవా వంటి వారు గాయాల పాలయ్యారు. ఆ సాయంత్రానికి రాంపతి రాజోవా అనే వాలంటీర్ పోలీస్ స్టేషన్‌పై జెండాను ఎగరేశారు. మొత్తానికి పూనుకున్న కార్యక్రమాన్ని వాలంటీర్లు పూర్తిచేసి కనకలతా బారునా, ఇతర నాయకుల ఆత్మలకు శాంతిని కలిగించారు.
కనకలతా బారువా జ్ఞాపకార్థం 2021 అక్టోబర్ 13వ తేదీన ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేసి గౌరవించింది భారత తపాలాశాఖ. కాన్సిలేషన్ ముద్రలోను, కవర్ మీద ఎడమవైపున చేత జండాను పట్టుకుని ఎగురవేస్తూ గర్వంగా నిలుచున్న కనకలతా బారువా కనిపిస్తారు. ఆమె వెనుక జెండాలను పట్టుకుని అనుసరిస్తున్న స్త్రీపురుష వాలంటీర్లు కన్పిస్తారు.


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet

4 Comments
P.Usha Rani
యువ స్వతంత్రోద్యమ విప్లవకారిణీ కనక లతా బారువా గారి గురించి చాలా బాగా వివరించారు.ఆమె చేసిన త్యాగం చాలా గొప్ప త్యాగం.
కొల్లూరి సోమ శంకర్
Excellent essay on Kanakalataji..very tragic that she died young..
Thank you for sharing
A. RaghavendraRao
కొల్లూరి సోమ శంకర్
Athi chinna vayasulone enthati dhesa bhakti. Chaduvuthunte gundallo bhada, manasu vikalamaindhi madam. Veera kanyaku joharlu
నిర్మలజ్యోతి
డా కె.ఎల్.వి.ప్రసాద్
కుమారి కనకలత బారువా తన యవ్వన దశలోనే
దేశం కోసం దేశభక్తితో ఝండాను చేతబూని వీర మరణం పొందడం ,గుర్తుంచుకో దగ్గ విశయం.ఆనాటి యువత సైతం ఎంతో అంకి త భావం తో దేశం కోసం ప్రాణత్యాగం చెయ్యడం నేటి యువతకు స్పూర్తి నివ్వాలి.
విషయ సేకరణ చేసిన రచయిత్రి శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారికి హృదయపూర్వక అభినందనలు.
—-డాక్టర్ కె ఎల్వీ ప్రసాద్
సికిందరాబాద్.