మగ పిల్లాడైనా.. ఆడ పిల్లైనా..!!
కూతురైనా, కోడలైనా మొదటిసారి గర్భం ధరించినప్పుడు, అందరూ కోరుకునేది మొదట మగపిల్లవాడు పుట్టాలని. అంటే వంశోద్ధారకుడు పుట్టాలని కోరుకుంటారు, లేదా గతంలో కోరుకునేవారు. చివరికి ప్రసవించే తల్లులు సైతం ఇలాగే కోరుకునేవారు. ఇప్పటికీ అలా కోరుకునేవారు లేకపోలేదు. మొదటి సంతానం మగ పిల్లవాడినే కోరుకునే వారి సంఖ్య మన సమాజంలో ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్ల పుట్టగానే పెదవి విరిచే మహానుభావులెంతమందో! విచిత్రం ఏమిటంటే అందులో మళ్ళీ అలాంటివారు స్త్రీమూర్తులే! అందుకే కొందరు అనుభవజ్ఞులైన పెద్దలు చెబుతుంటారు, అదేమిటంటే, స్త్రీలకు స్త్రీలే శత్రువులు అని. ఇది వినేవారికి కాస్త వింతగానే ఉంటుంది. రేపటి సమాజ నిర్మాణానికి ఆడపిల్ల లేదా మహిళ యెంత అవసరమో ఆలోచించారా? అన్న భావన కూడా కలుగుతుంది. ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలు తీసుకువచ్చినా ఆడపిల్ల అని శాస్త్రీయంగానే తెలుసుకున్న తరువాత, ఆమె తల్లి గర్భంలో ఉండగానే బయట ప్రపంచం చూడకముందే అదృశ్యం అయిపోతున్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం. సాధారణ కుటుంబాలలో ఆడపిల్లను సురక్షితంగా పెంచి పెద్ద చేయడం కత్తి మీద సాము వంటిదే. పుట్టినప్పటి నుండి ఆడపిల్ల వృద్ధాప్యం వచ్చి చనిపోయేవరకూ వివిధ స్థాయిల్లో ఏదో రూపంలో మానసికంగానూ, శారీరకంగానూ హింసకు గురి అవుతునే వుంది. ఆడపిల్ల అంటే ఒక ఆటవస్తువు అయిపొయింది, అంగడి బొమ్మగా మార్చబడింది. సన్నిహితుల నుండే కాదు, సమాజం నుండి కూడా స్త్రీమూర్తికి రక్షణ లేకుండా పోయింది.
ఇలాంటి విషయాలే సాధారణ కుటుంబాలు ఆడపిల్లలను వద్దనుకోవడానికి ప్రధాన కారణం కావచ్చు. అందుకే ఉన్నవారికీ లేనివారికి కూడా ఆడపిల్లను పెంచి పెద్దచేసుకుని రక్షించుకోవడం పెద్ద సవాలుగా మారింది. అలాగే మగపిల్లలను ప్రత్యేకంగా తీసుకుని, వారిని ప్రత్యేకంగా పెంచుతూ, అతిగా గారాబాన్ని పంచుతూ, చివరికి ఏమి చెప్పినా వినిపించుకొని పరిస్థితికి తీసుకు వచ్చేదీ తల్లిదండ్రులే! ప్రతీదానికి ‘వాడికేంటి మగపిల్లాడు’ అని వెనకేసుకొచ్చే తల్లిదండ్రులు కూడా కోకొల్లలు. ఇలా తమ సంతానంలో ఒకరిని ఒకలా, మరొకరిని మరోలా పెంచడం వల్లనే అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయనేది పెద్దల మాట! పిల్లలను పెంచే విధానంలో, ఆడపిల్లలను ఒకలా, మగ పిల్లలను మరోలా పెంచే తల్లిదందండ్రుల అవగాహనా లోపమే దీనికంతటికి కారణం అని చెప్పక తప్పదు.
ఐతే అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభ చూపిస్తూ, సవాళ్ళను సైతం ఎదుర్కోగలిగే, శక్తి సామర్థ్యాలు కలిగిన అమ్మాయిలూ ఈ రోజున అకుంఠిత ఆత్మస్థైర్యంతో దైర్యంగా ముందుకు సాగిపోతున్నారు. ఇది చూసి తల్లిదండ్రులు సైతం హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు.
సాధారణంగా తండ్రులు ఆడపిల్లల పట్ల ఎంతో ప్రేమను కలిగి వుంటారు (ఎక్కడో కొద్దిమంది దీనికి భిన్నంగా వుంటారు – అది వేరే విషయం). అలాగే ఆడపిల్లలు కూడా. కేవలం ప్రేమగా ఉండడమే కాదు, మగపిల్లలను మించి పని చేయడానికి, బాధ్యతలను స్వీకరించి సక్రమంగా వాటిని నెరవేర్చడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. తల్లిదండ్రులను అసలు కష్టపడనివ్వడం లేదు. తల్లిదండ్రులకు ఒక రక్షణ కవచం లా తయారయ్యారు ఆడపిల్లలు. నేను చెబితే పొగుడుతున్నాను అనుకుంటారు గానీ, మా అమ్మాయి నీహార. కూడా అలాంటివారిలో ఒకరు.


ఆకాశవాణి-నిజామాబాద్ లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా (మొదటి పోస్టింగ్) శ్రీమతి నిహార కానేటి


మొదటి సంతానం (ఆన్షి)తో రచయిత కూతురు… నిహార, అల్లుడు….వినోద్ కుమార్ జోషి
నాకు నా పిల్లలిద్దరు నా కళ్ల యెదుట వుండాలని అనిపిస్తుంది. కానీ పిల్లల ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఉద్యోగం వేటలో అమెరికా వరకూ వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు మా అబ్బాయి రాహుల్ కానేటి. నేను దానికి ఒప్పుకోక తప్పలేదు. అందుకే మా అమ్మాయి మా బాధ్యతలు తీసుకుంది.


మొదటి సంతానం (ఆన్షి)తో రచయిత కూతురు… నిహార, అల్లుడు….వినోద్ కుమార్ జోషి
అది కూడా ఎక్కువకాలం సాగలేదు. పెళ్లి చేసి అమ్మాయిని అత్తగారింటికి పంపక తప్పలేదు. ఆ తర్వాత ఆమె ఆకాశవాణి -నిజామాద్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా చేరక తప్పలేదు. సంవత్సరం తర్వాత దేవుడు మా పట్ల దయ చూపించాడు, మా అమ్మాయికి ఆకాశవాణి-వరంగల్ కేంద్రానికి బదిలీ అయింది. అంత మాత్రమే కాదు వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రకారం ఇక్కడే మొదటి సంతానానికి జన్మనిచ్చింది. ప్రసవం హైదరాబాద్‌లో జరిగినా, మరుసటి రోజు నుండి నా దగ్గరే హన్మకొండలో వుంది. ఆమె మొదటి సంతానం ఆడపిల్లనే కోరుకుంది, భర్త కూడా కూతురే పుట్టాలని కోరుకున్నాడు. వారి కోరిక ప్రకారమే దేవుడు కరుణించి ఆడపిల్లను (ఆన్షి) వాళ్లకు ప్రసాదించాడు. నా ముద్దుల మనవరాలితో ఏకధాటిగా ఐదు సంవత్సరాలు, ఆనందంగా ఆదుకునే అవకాశం చిక్కింది. అనుకోని విధంగా ఇది నాకు దక్కిన అమూల్యమైన సమయం.


మనవరాలు (ఆన్షి. నల్లి)తో రచయిత.
ఇప్పుడు మా అమ్మాయి హైదరాబాద్‌కు వెళ్ళిపోయింది. సహజంగా మనవరాలు కూడా వెళ్లిపోతుంది కదా! మళ్ళీ జీవితంలో శూన్యం ఏర్పడడం మొదలైంది. చెప్పలేనంత దిగులు ప్రారంభం అయింది. హైదరాబాద్ నుండి మా యోగ క్షేమాలను మా అమ్మాయి పర్యవేక్షిస్తూనే వుంది. మేము చేసుకోలేని కొన్ని పనులు అక్కడినుండి తెలిసినవారికి పురమాయిస్తూ ఉంది.
అత్తారింటికి వెళ్లినా కూతురు బాధ్యతలు ఆమె ఇప్పటికీ మరచిపోలేదు. అన్న బాధ్యతలను కూడా తానే తీసుకుని నిర్విఘ్నంగా మాకు అన్నీ సమకూరుస్తున్నది. నా కొడుకు నాదగ్గర లేడే.. అన్న ఆలోచన మాకు రాకుండా చేస్తున్నది. ఇంతకు మించి ఆడపిల్ల ఏమి చేయాలి? ఏ విషయంలో ఆడపిల్ల తక్కువ? అందుకే.. నా దృష్టిలో ఇద్దరి విషయంలో నాకు ఎవరైనా ఒకటే అన్న భావం మొదటి నుండి మనస్సులో నాటుకు పోయింది. అది నా కూతురి ద్వారా నిరూపితమైంది.


రెండవ సంతానం కోసం సీమంతం వేడుకలో కూతురు నిహారకు మిఠాయి తినిపిస్తున్న రచయిత, డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్.
ఇప్పుడు నా కూతురు రెండవసారి గర్భం దాల్చింది. కొద్దిరోజులు మాతో ఉండడానికి హన్మకొండ వచ్చింది. ప్రసుత పరిస్థితుల దృష్ట్యా ఆమెకు అతి తక్కువ స్థాయిలో సీమంతం జరిపించాం. ఈ సారికూడా ఆమె ఆడపిల్లనే కోరుకుంటున్నది. అది వాళ్ళ ఇష్టం. నేను మాత్రం ఈసారి మగ పిల్లవాడు పుడతాడనే ఆశాభావంతో ఉన్నాను, ఎందుకంటే ఒక ఆడపిల్ల వుంది కాబట్టి.


అమ్మమ్మ (పద్మావతి-విజయవాడ) ఆశీస్సులు అందుకున్న నిహార. కానేటి.
అయితే ఎవరు పుట్టినా సమానంగా ప్రేమించి పెద్దచేయగల నమ్మకం ఆత్మవిశ్వాసం, కన్న తల్లిదండ్రులకు ఉన్నప్పుడు ఈ సమస్య అసలు ఉత్పన్నం కాదని నా నమ్మకం.


సీమంతం…సంబరాలు భర్త, కూతురుతో నిహార. కానేటి.
భవిష్యత్ తరాలు ఇలా ఆడ, మగ అనే తేడా లేకుండా పెరగాలి. ఆడపిల్లకు మరింత ఆదరణ గౌరవం పెరగాలి. ముఖ్యంగా ఆడపిల్లల సంరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి. ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అన్నట్లుగా, ‘ఆడపిల్లలున్న ఇల్లు ఆనందాల హరివిల్లు’గా మారాలి.


అమ్మ-అమ్మమ్మ లతో నిహార కానేటి.
రాబోయే రోజుల్లో అన్ని రంగాలలోనూ (ఇప్పటికే ఇది చూస్తున్నాం) ఆడపిల్లలు, మగ పిల్లలను అధిగమిస్తారనీ, దేశాభివృద్ధిలో వీరి సేవలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారతాయనీ నమ్మేవాళ్ళల్లో నేనూ ఒకడిని. ఆరోజు కోసం ఎదురు చూడవలసిందే..!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
31 Comments
గీతాచార్య
మంచి జ్ఞాపకాలు పంచారు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ.
శ్రీధర్ చౌడారపు
బాగుంది. సమాజంలోని చర్చించుకోవలసిన అంశాన్ని మీ వ్యక్తిగత విషయాలతో లంకె చేసి తెలియజేశారు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
సర్
ధన్యవాదాలు మీకు.
sagar
బాధ్యతలను బరువులా కాక, ఆనందంగ స్వీకరించేటపుడు ఆడ అయినా మగ అయినా సమానమే సర్. కాకపోతే అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిన తఫువాత ఆమె బాధ్యతలు రెట్టింపవుతాయు అన్నవిషయంలో సందేహమే లేదు. ఇక మీ విషయంలో అన్న దూరదేశంలో ఉన్నా మీ బాధ్యత తన కర్తవ్యంగ స్వీకరించిన నీహార గారు అభినందనీయులు. ఇక పుట్టబోయే బిడ్డవిషయంలో అందరికీ ఆనంద ఫలితమే రావాలని ఆశిద్దాం. మీరన్నట్లు అంతా పై వాడి దయ. నా తరపున పుట్టబోయే చిన్నారికి ఆశీస్సులు, నీహార మరియు జోషి గారికి శుభాకాంక్షలు తెలపండి సర్. రెండవసారి తాత కాబోతున్న మీకు శుభాకాంక్షలు సర్ .
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
సాగర్ నీ స్పందన కు ధన్యవాదాలు
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
తల్లిదండ్రుల యెడల ఆడ పిల్లలు ఎంత బాధ్యత కలిగి ఉంటారో ఉదాహరణ తో చక్కగా వివరించారు అన్నయ్య గారు
—జయ.అలెగ్జాండర్
అమెరికా.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలండీ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
చాలా బాగుంది uncle

—డా.వెన్నెల
చెన్నై.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ఏ ఇంటికైనా, ఒక పాప, ఒకబాబు అందం ! అలాంటివాళ్ళు చాలా అదృష్టవంతులు !
—–కోరాడ నరసింహారావు
విశాఖపట్నం.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
కోరాడ వారికి
ధన్యవాదాలు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Really great story with your personal experience. Congratulations sir
—Dr.D.Sujatha
Vijayawada.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Thank you somuch
Dr.Sujatha.
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి 111 బాగుంది సర్.మీరు రెండవ సారి తాత కాబోతున్న మీకు శుభాకాంక్షలు. అట్లాగే నిహారా కానేటి దంపతులకు శుభాకాంక్షలు సర్.మంచి జ్ఞాపకాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు డాక్టర్ గారు
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలు సర్ మీకు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
అబ్బా ఎంత శుభవార్త చెప్పారు సర్.ముందుగా మీకు మరోసారి తాతయ్య కాబోతున్నందుకు శుభాకాంక్షలు. చాలా సంతోషకరమైన విషయాన్ని పంచుకున్నారు మాతో.ఆన్షి హైదరాబాద్ వెళ్ళిపోయింది అని మీరు దిగులు పడే లోపు మిమ్మల్ని మరలా బిజీ చేసేందుకు ,బోలెడు ఆనందాన్ని పంచేందుకూ మరో బుజ్జి వారసులు రాబోతున్నారు.ఆడపిల్లను అమితంగా ప్రేమించే మీ ఇంట్లో ఇది ఎంత వేడుకను నింపిందో …మాకూ అంతే ఆనందాన్ని పంచింది.మీరు కోరుకునే విధంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిహారా గారికి శుభాకాంక్షలు.




–డి.నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలండీ
Rajendra+Prasad
Happy to know Nihara conceived second time. It’s natural to wish to have a boy this time being already blessed with girl. May God bless her according to his will. We also join you to feel the happiness sir
– RAJENDRA PRASAD
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Thank you
Prasad garu.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Iam very glad to know this,
Hearty congratulations to Nihara sister and to your family sir.
Undoubtedly the baby is fortunate enough to get your family.
Iam wishing Nihara sister a safe and happy pregnancy.
—Dr.Harika
Karimnagar.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Thank you Doctor.
శ్యామ్ కుమార్ చాగల్
ఒక సారి హాస్పిటల్ లో లేబర్ రూమ్ ముందు కూర్చున్న యువకుడిని అడిగాను “అమ్మాయ లేక అబ్బాయా ? ఇప్పడు .” అని.
అతను నాకేసి చూసి ” మొదటి సంతానం మగ పిల్లవాడు పుడితే ఇక రెండవ సంతానం అమ్మాయా అబ్బాయా అని టెన్షన్ ఉండదు “అన్నాడు.
ఇది మన దేశం లొ ప్రతీ వారి మానసిక పరిస్థితి.
అదేంటి ఎవరైనా సమానము అన్నారుగా !! అని నే అంటే సమాధానం గా ” అవును ఇద్దరూ సమానమే . అయితే అబ్బాయి పుడితే ఎక్కువ సమానం ” అన్నాడు నవ్వుతూ.
ఇంతకు ముందు కూడా రచయిత గారు ఈ విషయం గా ఒక చర్చ లేవదీస్తే తేలిందేమిటంటే కూతురు పుట్టుకతో బరువు భాద్యత పెరుగుతుంది , మన భారత దేశపు కాల మాన పరిస్థితుల్లో . రచయిత అన్నట్లుగా అసాంఘిక శక్తులనుండీ , సంప్రదాయ విరోధుల నుండీ దుష్ట శక్తులనుండీ కూతుర్లను కాపాడుకోవాలిసి రావటం మన దేశం లో వుండే దరిద్రం. పెళ్లి చేయటానికి అయ్యే ఖర్చు అదనపు బరువు. అంతే కాదు సున్నిత మనస్కురాలైన కూతురుని జీవితం మొత్తం మానసిక , ఆర్ధిక ధైర్యాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది .
భగవంతుడి దయ వలన కూతురు తల్లి తండ్రులకు వారి వృద్ధాప్యం లో తోడు గా నిలుస్తుంది. అయితే అది కూతురి యొక్క భర్త తోడ్పాటు ఉంటేనే .
కొడుకు లకు వుండే స్వతంత్ర ఆలోచనలు , విజ్ఞత తల్లి తండ్రులకు వరం. కోడలికి ఇష్టం వున్నా లేకున్నా సంఘం కట్టుబాట్లకు ఝడిసి లేదా ప్రేమ తో కొడుకు తల్లి తండ్రులకు చేదోడు వాదోడు గా వుండే సంభవం ఎక్కువ . ఇవన్నీ దృష్టి లో ఉండటం మూలాన కూతురు కంటే కొడుకు పుట్టాలని అందరూ కోరుకుంటారు. కూతురు విషయం లో డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ అదృష్టవంతుడనే చెప్పాలి. Ms. నీహార కు శుభాకాంక్షలు .
అభినందనలతో ..భవదీయుడు శ్యామ్ కుమార్ చాగల్
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
చాలా బాగారాసావు
మిత్రమా….ధన్యవాదాలు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
సమాజం దృష్టిలో తల్లిదండ్రుల పట్ల మగ పిల్లవాడు చూపిస్తున్నది బాధ్యతతో కూడిన కర్తవ్యం. తల్లిదండ్రులు కూడా తమ బరువు బాధ్యతలను తమ వారసుడే భరించాలనే పరంపరతో కొనసాగుతున్న సమాజం మనది. కొన్ని సందర్భాలలో అవగాహన రాహిత్యంతో ఇది ఇచ్చిపుచ్చుకునే వ్యాపార ధోరణిలా.. కనిపిస్తూందే తప్ప, ప్రేమానుబంధంతో స్వీకరించాలి , లేదా నిర్వహించాలనే ఆలోచన లోపించటం వలన మనస్పర్ధలు ,అపార్థాలు చోటుచేసుకునే సందర్భాలు కోకొల్లలు. అందుకే కాబోలు ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.
పెళ్లి అయిన తర్వాత ఆడపిల్ల “ఆడిపిల్ల” అయినప్పటికిని తను ఏమీ ఆశించకుండా ప్రేమానురాగాలతో తల్లిదండ్రుల పట్ల తను నిర్వర్తించే కర్తవ్యము మహోన్నతమైనది. ముఖ్యంగా మగపిల్లల నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రులకు కూతురు నుండి లభిస్తున్న ఆదరణ అమృతతుల్యం.!
—బి.రామకృష్ణా రెడ్డి
సికింద్రాబాద్
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
శుభోదయం సార్. ముందుగా మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరో కొత్త వ్యక్తి మీ మధ్యకు రాబోతున్నందుకు. నిహార వాళ్ళ ఆలోచనతో నేనూ ఏకీభవిప్తాను. మీరు కొంత మాకన్నా పెద్ద తరం కనుక బాబు కావాలనుకోవడం సహజం. ఈ రోజుల్లో ఆడపిల్లలే నయం సార్. అమ్మానాన్నలను అవసరానికి ఆదుకోవడంలో. నాకూ ఆడపిల్లలంటేనే ఇష్టం. అందరూ కాకపోవచ్చు కానీ నా ధృష్టిలో నేటి పుత్రుడు బతికి ఉండగానే పున్నామ నరకాన్ని సృష్టిస్తున్నాడు ఎవరైనా పరరవాలేదు అనుకుంటే ,ఆనందంగా ఆహ్వానించగలుగుతారు. ఆన్షికి ప్రత్యేక శుభాకాంక్షలతో…

—–డా.విద్యాదేవి
హన్మకొండ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు .
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
111వసంచిక బాగున్నది.ఇందులోని అంశాన్ని ఇంతకు ముందు సంచికలలో ఎప్పుడో చర్చించినట్టు నాకు యాది.పూర్వంకట్న కానుకలిచ్చి పెండ్లిచేయాల్సివస్తుందని ఖర్చుకు వెరచి ఆడపిల్లవద్దనుకునే వారేమో! కానిమహిళలకు స్వాతంత్ర్యం వచ్చింది ఆర్థికంగా వారు నిర్భయంగా పురుషులతోసమానంగా జీవించుతున్నారని అనుకుంటున్న ఈరోజుల్లో అమ్మాయినిprotect చేయటం కష్టంగా మారింది.తెల్లవారి లేస్తే ఎన్ని వార్తలో -ఈ విషయంలో. బహుశా అందుకే అమ్మాయిలు వద్దనుకుంటున్నరేమో! గౌరవ మైన ఉద్యోగాలూ చేసుకుంటూకూడా ఫస్ట్ తారీఖు రాగానే జీతం తెచ్చి తన చేతిలో పోయకుంటే చిత్రహింసలు పెట్టే పతి దేవులింకా వున్నారు. స్త్రీ పట్ల పురుషుని దృష్టి మారాలె.స్త్రీయే స్త్రీకి శత్రువనేమాట నిజమే కాని .శతాబ్దాల సంప్రదాయాల బలమైన ఒత్తిడి సమాజంలో ఉన్నదిగదా.ఎవరికి వారు స్వతంత్రంగా తమకునచ్చినట్లు బతకనీయదు సమాజం..అట్లా ఐతే బరితెగించిందనే పేరు పెడ్తరు..సంక్లిష్టమైన సమస్యగానే ఉన్నదింకా ఈవిషయమీనాటికీ చెప్తున్న దానికీ జరుగుతున్న దానికీ పొంతన కుదరటం లేదు.
మీ రు చక్కగా బ్యాలెన్స్ గా రాసినారు.
అభినందనలు
—నాగిళ్ళ రామశాస్త్రి
హన్మకొండ.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
ధన్యవాదాలండీ
శాస్త్రి గారు.
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Hi Doctor garu,
Please convey our congratulations to Chi Nihara & Mr Vinod.
My Son has 2 sons & daughter also has 2 Sons. Our desire/wish of having a grand daughter remained unfulfilled.
You are very lucky
—-Sri.Suryanarayana rao.
Hyderabad (USA)
ఎల్.వి.ప్రసాద్. కానేటి.
Thank you so much sir.