మువ్వన్నెల నా మిత్రులు
సారే జహాన్ సె అచ్ఛా హిందూస్థాన్ హమారా…
సారే జహాన్ సె ఊన్ఛా తిరంగా జండా హమారా…
నా దేశ సమైక్యతకు నిలువెత్తు నిదర్శనం నా తిరంగా జండా..
నేషనల్ ఇంటిగ్రేషన్ అనే పదానికి అసలు అర్థం నా ముప్పయి ఏళ్ళ ఆర్మీ సర్వీసులో స్పష్టంగా చూసాను.
నిజానికి నేను చిన్నప్పటినుండీ ముస్లిం క్రిస్టియన్ల స్నేహాల మధ్యే పెరిగాను.
యాదృచ్చికమో, భగవద్సంకల్పమో తెలియదు గానీ ఇప్పటికీ ముస్లిం క్రిస్టియన్ల ప్రేమపూరిత సహాయ సహకారాల తోటే నా జీవితం పరిపూర్ణంగా సఫలీకృతం అవుతోంది.
ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అని నానుడి.
ఇక్కడ పెళ్ళంటే ఆడపిల్ల పెళ్ళని అర్థం..
సింగల్ మదర్‌కి ఒంటి చేత్తో కూతురి పెళ్ళి నిర్వహించటం నిజంగానే బృహత్కార్యం అనే చెప్పాలి. అందునా నేను వుండేది విదేశంలో.. పెళ్ళి స్వదేశంలో… పైగా ఒక పెళ్ళి కాదు. అల్లుడు సిక్కు మతస్థుడు అవటం వలన వాళ్ళ పద్దతిలో ఒక పెళ్ళి, మూడు ముళ్ళను, ఏడడుగులను నమ్మే మా హిందూ సాంప్రదాయ పద్దతిలో ఒక పెళ్ళి.
మా పద్దతిలో చేసే పెళ్ళి తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధిలో చేసుకోవాలని నా కూతురి ప్రగాఢ వాంఛ. హైదరాబాదులో లోకల్‌గా అయితే మాకున్న బంధు బలగంతో, స్నేహ సంబంధాలతో హాలు బుకింగ్, ఇతర ఏర్పాట్లు నాకు చాలా సులువు. కాని ఎన్నో నియమ నిబంధనలతో కూడుకున్న స్వామివారి సన్నిధిలో వివాహం చేయాలనుకున్న నా సంకల్పం నాలో వణుకు పుట్టిచ్చింది. తోడబుట్టిన వాడు గాని కట్టుకున్నవాడు గాని భుజాల పైన మోయాల్సిన మేరువు లాంటి బాధ్యతతో కూడిన అలవి కాని అనల్ప బరువు.
తిరుపతి పెళ్ళి కార్యానికి సంబంధించి గూగుల్‌లో నాకు దొరికిన నంబర్లన్నీ ప్రయత్నించాను. అలా ఫోనుల మీద ఆన్లైన్లో జరిగే పని కాదని అర్థమయ్యింది. నేను వెళ్ళ లేని పక్షంలో నాకు బదులు ‘నా’ అనుకున్న వారినెవరినైనా పంపితే తప్ప ఫోనులో జరగని పనులు. చెప్పలేని నిరాశానిస్పృహలు ఆవహించాయి. అమాంతం లేపనం ఏదో రాసుకునో రెక్కలేమైనా తొడుక్కునో తిరుమలలో వాలాలని నన్ను కాల్చేస్తున్న కోరిక. కాని ఎంత తపనగా వున్నా స్వయంగా వెళ్ళి అన్నీ చూసుకుని నిర్ణయం తీసుకోవటం అప్పటి నేనున్న పరిస్థితుల్లో జరిగే పని కాదు.
నాకు బదులుగా నా స్థానంలో ఏ బెస్ట్ ఫ్రెండ్, ఏ బ్లడ్ రిలేటివ్ అంత సమయం వెచ్చించి డెడికేషన్‌తో అంత పెద్ద బాధ్యత తీసుకుంటాడు…
మెదడు మొత్తం బ్లాంక్ అయిపోయింది.
వారణాసి పుణ్యమాని సిక్కుల పద్దతిలో పెళ్ళికి గురుద్వారా ఖాయం అయ్యింది.
ఈ తిరుపతి కార్యానికి పూనుకునే విశ్వేశ్వరుడెవ్వరు..?
ఆ తిరుపతి వెంకన్న పైనే భారం వేసేసాను.
“ఏమి చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు స్వామీ… నా కూతురి కోరిక మేరకు తన వివాహం నీ సన్నిధిలో అంగరంగ వైభవంగా జరగాలి.. అది నీ పూచీ” ఆ శ్రీనివాసుని మనసారా వేడుకున్నాను. దయనీయత, మంకుతనం, బెదిరింపు, ప్రేమ, సరెండర్నెస్, నమ్మకం అన్నీ కలగలిసిన ప్రార్థన.
అంతే. ఆ లక్ష్మీవల్లభుడు తన నామధేయుడైన శ్రీధరుని రూపంలో సాక్షాత్కరించాడు.
అప్పుడప్పుడే శ్రీధర్ గారు మా ఇంట్లోకి అద్దెకు దిగారు. క్రిస్టియన్ మతస్థుడు. అప్పటికి నాకు ఇంకా అతనితో గానీ అతని ఫ్యామిలీతో గానీ పెద్దగా స్నేహం కూడా ఏర్పడనే లేదు. అతని నుండి అంత పెద్ద సహాయం అర్దించే, ఆశించే చనువు నాకు ఎంత మాత్రమూ లేదు.
ప్రతి నెల లాగే శ్రీధర్ గారికి ఇంటి అద్దె, ఇంటి మైంటేనెన్స్కి సంబంధించి రొటీన్ కాల్ చేసాను. మాటల సందర్భంలో మా అమ్మాయి పెళ్ళి గురించిన నా బాధను వెళ్ళగక్కాను.
అతను నన్ను ఆశ్చర్యపరుస్తూ “మీరేమి బాధపడకండి. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను” అన్నారు.
ఒక క్రిస్టియన్ మతస్థుడు తిరుపతి దేవాలయంలో పెళ్ళి ఏర్పాట్లు చేస్తాననటం నేను ఊహించ లేనిది. నిజం చెప్పొద్దూ అతని మాటలు పెద్ద జోకులా చాలా హాస్యాస్పదంగా అనిపించాయి నాకు. అఆలు తెలియకుండా కావ్యం అల్లినట్టు అందులో లోతుపాతులు తెలుసు కోకుండా ‘నేను చేస్తాను’ అనటం అతని అమాయకత్వానికి చిహ్నంలా అనిపించింది.
అయినా అతని నిష్కల్మషమైన స్వచ్ఛమైన మాటలకు “మీరు కొండంత బలాన్ని ఇచ్చే అంత పెద్ద మాట అన్నారు. అదే చాలు…” అన్నాను మనస్పూర్తిగా.
“మీరు పెళ్ళి ముహూర్తం తేదీ, సమయం, అతిథుల సంఖ్యా వివరాలు, వారికి దైవ దర్శన ఏర్పాటుకు కావలసిన ఆధార్ కార్డు వివరాలు అన్నీ ఇవ్వండి నాకు.” అన్నారు ధృఢoగా.
ఈజ్ హి రియల్లీ సీరియస్…
నోరెళ్ళబెట్టాను.
“నేను ఒకటి రెండు రోజుల్లో తిరుపతి వెళ్ళి అన్నీ కనుక్కుని మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తాను..” నా అపనమ్మకాన్ని పాలద్రోలుతూ మరింత నమ్మకాన్ని కలిగిస్తూ అన్నారు.
తన స్వంత వ్యాపారం వదిలి, ఏ సంబంధ బాంధవ్యాలు లేని నా కోసం, కేవలం నా పని మీద హైదరాబాదు నుండి తిరుపతి ప్రయాణం చేసేంత శ్రమ తీసుకోవటం అసలెలా సాధ్యం…
బట్ హి ఈజ్ స్టబ్బర్న్ అండ్ మెంట్ వాట్ హి సెడ్.
మానవత్వo అనే లక్షణమున్న ప్రాణి మానవుడు అని పిలవబడుతున్నాడో లేక మానవుడైనవాడిలో మానవత్వముoటుందో తెలియదు.
అసలు మానవుడు అనే పదం ముందు పుట్టిందో మానవత్వం అనే పదం ముందు పుట్టిందో తెలుసుకోవాలి నేను.
అన్నట్టుగానే మరునాడే మరో స్నేహితుని తోడుగా తీసుకుని శ్రీధర్ గారు తిరుపతి వెళ్ళారు. నాక్కావాల్సిన తేదిలో లభ్యమయ్యే కళ్యాణ మండపాలన్నీ సర్వే చేసి, నాకు తిరుపతి నుండి వీడియో కాల్ చేసి అన్ని చూపించారు. నలభై మంది అతిథులకు అనుకూలమైన వసతి గృహాల ఎంక్వయిరీ చేసి, నాకు నచ్చిన రూములు బుక్ చేసారు.
డెకరేషన్, సన్నాయి, బాజా బజంత్రీలన్నీ మాటాడేసి, నేను ఇండియాలో ల్యాండ్ అయ్యేసరికి విఐపి దర్శనానికి కావలసిన ఎంపీ పత్రాలు, ఉత్తరాలతో సహా సిద్ధం చేసి ఉంచారు.
మరో మిత్రులు హైదరాబాదు నుండి తిరుపతికి రైలుకి రానుబోను ఏసీ టికట్లు బుక్ చేసి ఉంచారు.
శ్రీధర్ గారు తను చేసిన ఏర్పాట్లను సరి చూసుకునేందుకు పెళ్ళికి ఒక రోజు ముందుగానే మా కారులో తిరుపతి వెళ్ళిపోయారు. తిరుమలలో సకల సౌకర్యాలు సమకూర్చి తిరుపతి రైల్వే స్టేషనులో మమ్మల్ని రిసీవ్ చేసుకుని అక్కడి నుండి తిరుమలకు కార్లు మాటాడి సిద్దం చేసారు.
తిరుపతిలో పెళ్ళి కలగా మిగిలిపోతుందేమో వేరే ప్రత్యామ్నాయం ఆలోచించాలేమోననుకున్న నన్ను నా కల ఇంత సానుకూలంగా సాకారం అవటం ఆనందోత్సాహ దిగ్భ్రమలో ముంచెత్తింది. మహా యజ్ఞంలాంటి ఆడపిల్ల పెళ్ళి ఎలా చేయగలను అని దిగులుపడ్డ నేను ఒక ఆడపిల్ల తల్లిలా కలవరపడుతూ కాకుండా కేవలం ఒక అతిథిలా అందరితో పాటు ఆ వివాహోత్సవాన్ని ఎటువంటి టెన్షన్ లేకుండా ఆనందించాను.
నేను ఇండియాలో లేకుండానే ఒకటికి రెండు పెళ్ళిళ్ళు ఎంత ఘనంగా చేసాను అని అందరి ప్రశంసలూ అందుకున్నాను. ఆ ఘనతకు కారకులు, ఆ ప్రశంసలకు పాత్రులు నిజానికి నా వెనుక వున్న నా మిత్రులు.
అసలు అంతకు కొద్ది నెలల క్రితమే శ్రీధర్ గారు మా ఇంట్లోకి అద్దెకు దిగటం, ఇంత పెద్ద భారాన్ని తలపై వేసుకోవటం నా అదృష్టమో, దైవ సంకల్పమో లేక ఏ జన్మ ఋణానుబంధమో…
అలా శ్రీధర్ నా తొలి చూలు కడుపు పంటను కళ్యాణ మండపం ఎక్కించి తల్లిగా నా బాధ్యత తీర్చుకోవటానికి సహకరిస్తే యాకూబ్ నా కలల పంట నా తొలి కావ్య పుత్రికను ఆవిష్కారం గావించి నేను కూతురిగా మా అమ్మ ఋణం తీర్చుకునేలా చేసారు.
కవి యాకూబ్ కవిసంగమం రథసారథి. మహమ్మదీయుడు. నేను ఏవో నాలుగైదు కవితలు కవిసంగమం గ్రూపులో రాసి అప్పుడప్పుడే పరిచయమయ్యాను యాకూబ్ గారికి. బహూశా అప్పటికి అతనిని ఓ మూడు సార్లు చూసుంటాను.. మొదటిసారి ఓ కవిమిత్రుని కాఫీ డే ఇనాగరేషన్‌లో, రెండోసారి హైదరాబాదు బుక్ ఫెయిర్‌లో, మూడోసారి ఒక పాఠశాలలో కవిత్వ పఠనంలో.
నేను విదేశం వెళ్ళి పోయేప్పుడు అతను నాతో ఒకటే మాట అన్నారు…
“రాస్తూండండి… రాయటం మానవద్దు. ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్ల ఆస్తిపాస్తులు కూడబెట్టినా రేపు మనం పోయాక వాటి వలన మనకు ఎటువంటి గుర్తింపు కలగదు. అదే నాలుగక్షరాలు రాసి ఒక పుస్తక రూపంలో నిక్షిప్తం చేసి పోతే పది మందికి మనం పది కాలాలు గుర్తుండి పోతాము.”
అతని మాటలు అలాగే మదిలో పాతుకు పోయాయి. మస్తిష్కంలో ముద్రించుకు పోయాయి.
దేశ సరిహద్దులు దాటి వచ్చినా యాకూబ్ గారి మాటలు నా మనసులో నుండి చెరిగిపోలేదు.
ప్రామాణికంగా నిలబడి పోయేట్టుగా ఏదో ఒకటి రాయాలన్న తపన పెరుగుతూ వచ్చింది.
ఆ తపన నా తొలి మానస పుత్రి గా రూపు దాల్చింది.
రాయటం, పుస్తకంగా అచ్చు వేయించు కోవటం ఒక ఎత్తయితే, దాని ఆవిష్కరణోత్సవం నిర్వహించటం ఒక ఎత్తు. నేను తొలిసారిగా సాహితీ లోకానికి రచయిత్రిగా పరిచయం కాబోతోన్న సందర్భం అది. నాలో అంతుపట్టని మానసికోద్వేగం. కనీస అనుభవం లేని సమావేశం. నేనే కథానాయకినైన నా తొలి సాహిత్య సమావేశం. ఏర్పాట్లు చేయటానికి, దగ్గరుండి చూసుకోవటానికి ఫిజికల్‌గా నేను ఇండియాలో లేను.
తల మీద ఏదో పడిందని చెబితే నీ చేత్తోనే తీయమన్నట్టు నాకు ఏదోటి రాయమని సలహా ఇచ్చినందుకు గాను పరిహారంగా ఆ రాసిందేదో బయటకు తెచ్చే బాధ్యతను ధైర్యం చేసి నిర్మొహమాటంగా యాకూబ్ గారి నెత్తినే పెట్టేసాను.
ఒకటికి రెండుసార్లు రవీంద్ర భారతికి వెళ్ళి నాకు అనుకూలమైన తేదీలో హాలు బుక్ చేయటం నుండి, ఆహ్వాన పత్రికల అచ్చు, సమీక్షకుల, ముఖ్య అతిథుల నియామకం, నా తరపున అతిథుల పిలుపుల వరకూ తానే పూనుకుని తన ఇంటి పండుగలా, తన స్వంత పుస్తక ఆవిష్కరణలా బాధ్యతగా సతీ సమేతంగా నిలబడి, ఆది దంపతుల్లా దగ్గరుండి చూసుకుని కార్యక్రమం శుభప్రదం చేసి సాహితీ వనంలో నన్ను పటిష్టంగా నాటి, చిరస్థాయిగా నిలబెట్టారు.
ప్రతీ పరిచయం వెనుక ఒక కారణం వుంటుందేమో… లేకపోతే అసలు అతనితో నాకున్నది ఏపాటి పరిచయం. అతని అనుకోని పరిచయం నా అదృష్టమో లేక అది అతని సాహిత్యాభిమాన కారకమో..?
సాహితీవేత్తలంతా ఇంత నిస్వార్ధంగా నిష్కల్మషంగా వుంటే ఎంతమంది కవులు/రచయితలు వెలుగు చూడరు…?
వారణాసి తన పేరు మీద మా అమ్మాయి పెళ్ళికి గురుద్వారాను బుక్ చేయటమేమిటని అందరూ విస్తుపోయినా, శ్రీధర్ నా కూతురి తిరుపతి పెళ్ళి పనులకు అంత అంకితభావంతో ఎందుకు పూనుకున్నాడని బంధువులు చెవులు కొరుక్కున్నా, యాకూబ్‌కి నా పుస్తకం పట్ల ఎందుకంత ఇంట్రెస్ట్ అని సాహితీ మిత్రులు గుసగుసలాడినా… నాకు తెలిసిన నిజం ఒకటే.
మతానికి అతీతంగా మనుషుల్లో మిగిలి వున్న మంచితనం, మానవతా విలువలు.
వారణాసి సత్సంప్రదాయ హిందూ బ్రాహ్మణుడు… శ్రీధర్ క్రిస్టియన్.. యాకూబ్ ముస్లిం…
మువ్వన్నెల మతాల ముగ్గురూ నా మిత్రులే..
మతమేదయినా భిన్నత్వంలో ఏకత్వానికి సంకేతంగా దర్పంతో నిటారుగా నిలబడే మువ్వన్నెల నా దేశ జండాకి వీరు ప్రతీకలు..
నేను గర్వపడే నా మిత్రులు…
సారే జహాన్ సె అచ్ఛా హిందూస్థాన్ హమారా…
సారే జహాన్ సె అచ్ఛా యే సున్హారే దోస్త్ హమారే…!
(మళ్ళీ కలుద్దాం)

ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
14 Comments
SHANKARMATHANGI1973@GMAIL.COM
Excellent.. మీ మంచితనం, మీ పట్టుదల కు.. మిత్రుల సహకారానికి.. అభినందనలు.. ఝాన్సీ గారు..
ఒక మంచి కార్యాన్ని..మంచి మనుషుల సహకారంతో.. సాధించడం.. చాలా ఆనందదాయకం.. విజయం అనేదానికి ఇదొక..మైలురాయి.. తీపి గుర్తులు..
Jhansi koppisetty
ధన్యవాదాలు శంకర్ గారూ…
కీర్తన'సీ'రామ్
మనిషా మానవత్వమా..ముందు ఎవరన్న
మీ ప్రశ్నకు నాకూ సమాధానం తెలియదు.
ఒక్కటి మటుకూ నిజం మనిషీ మానవత్వం
కవల పిల్లలై..ఖచ్చితంగా మతం కంటే
ముందే పుట్టుంటారు.
మీరు ఉదహరించిన శ్రీధరూ వారణాసీ యాకుబ్ గార్లు ఆ కోవకు చెందిన అవిభక్త కవలలు.
దయచేసి ఇటువంటి ఘటనలు మరిన్ని రాయమని మనవి.
Jhansi koppisetty
Yes what you said is true Ramesh garu.. thank you for your lovely response..
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ఝాన్సీ గారూ,
మీ..జ్నాపకాల్లోని మూడు అంశాలు చాలా గొప్పవి,ఆశ్చర్యాన్నీ కలిగించెవీ నూ
కొందరి మాట్లల్లోని మాధుర్యం ఎదుటి వారి చేత
అలాంటి సహాయాలు చేయిస్తున్డి.ఇవి బంధువులు
సైతం చేయలేని పనులు.మీ వ్యక్తిత్వం ఎలాంటి వారినైనా ఆకర్షిస్తుంది.
ఇక్కడ మతాలను గుర్తు చేసుకొవాలసిన అవసరం లేదేమో! మనిషి- మంచితనం గుర్తుంచుకున్టె చాలు నేమో అని నా అభిప్రాయం.
చాలా బాగా గుర్తు చేసుకున్నారు.మీకు అభినందనలు.
Jhansi koppisetty
మీ కొత్త మూల్న్యయమైన స్పందనకు ధన్యవాదాలు డాక్టరుగారూ


Sagar
స్నేహం ముందు మతాలు, కులాలు ఎందుకూ కొరగావు అని మీ రచన తెలుపుతుంది మేడమ్ . అటువంటి మిత్రులను పొందిన మీరు అదృష్టవంతులు. మీకు అభినందనలు మేడమ్ .
Jhansi koppisetty
అవునండీ సాగర్ గారూ మతాలతో నిమిత్తం లేని మానవత్వం మహోన్నతం..
పద్మాకర్
అమాయకత్వం, మంచితనం కొన్నింటిని సాధించిపెడతాయి.
Jhansi koppisetty
ధన్యవాదాలండీ పద్మాకర్ గారూ…
Sambasivarao Thota
Jhansi Garu!
Sridhar, Yaakoob gaarla vanti manchi Manasunna manushulu Meeku thaarasapadatam mee adrushtamgaa cheppukovatchu..
Baagundandi


Jhansi koppisetty
అవునండీ… స్నేహితుల విషయంలో మీ అందరినీ పొందిన నేనెప్పుడూ అదృష్టవంతురాలినే… Thank you Sambasiva Rao garu

rupasreedhar07@gmail.com
చాలా బావుంది మేడం


Jhansi koppisetty
Thanq