వీడని నీడ
Be Roman when you are in Rome…
ఈ నానుడి ఎంతవరకూ నిజమో తెలియదు కాని తెలుగింటి సాంప్రదాయం, కమ్మటి తెలుగు భాష సౌరభం, ఆచార వ్యవహారాలు, మన కట్టు, బొట్టు, పిండి వంటలు… ఇవన్నీ నాకీ రోజున నింగిలో నక్షత్రాలయి ఒకనాటి అపురూప మధురానుభూతులుగా మిగిలిపోయాయి. జంట కవలల్లాంటి ఉభయ తెలుగు రాష్ట్రాల తలపు నన్నిప్పుడు కలలా మైమరిపిస్తుంది.
ఉదయం వేళలో కమ్మటి పెసరట్టు, ఉప్మా, ఫిల్టరు కాఫీలను ఇప్పుడు టోస్టెడ్ బ్రెడ్, ఎగ్ అండ్ బేకన్, ఫ్రూట్ జ్యూస్‌లు ఆక్రమించాయి. అన్నం, పప్పు, అప్పడం కూరలను పాస్తాలు, పిజ్జాలు, బర్గర్లు భర్తీ చేస్తున్నాయి. నా ఒక్కదాని కోసం వంట ప్రయత్నం అవసరమా అనుకుంటూ నలుగురితో నారాయణ అనే సర్దుబాటుతనం అలవాటై పోయింది.
పసితనం నుండీ నా తమ్ముడు లక్ష్మీ బాంబుల కోసం దీపావళిని, గాలిపటాల కోసం సంక్రాంతిని ఇష్టపడితే నేనెప్పుడూ వినాయకచవితిని ఇష్టపడేదానిని. అది నా ఇష్ట దైవం పండుగ. ఎంతో శ్రద్దగా ఉండ్రాళ్ళతో సహా అమ్మ చేసే అన్ని పిండివంటలతో నైవేద్యం పెట్టి, పాలవెల్లిని అందంగా అలంకరించి, నా పుస్తకాలన్నీ దేవుని సన్నిధిలో పెట్టి శ్రద్ధగా సాంప్రదాయబద్దంగా పూజ చేయటం నాకు వెన్నతో పెట్టిన విద్య. నా తమ్ముడు కూడా జంధ్యం లేని పంతులులా సిల్కు పంచె, కండువాలతో ముద్దొస్తూ పూజ శ్రద్ధగా చేసేవాడు. ఆ పూజ రోజున ఏ సబ్జెక్టు పుస్తకమయినా నా దగ్గర లేకపోతే, విఘ్నేశ్వరుని సన్నిధిలో స్థానం కోల్పోయిన ఆ సబ్జెక్టు ఇక ఆ సంవత్సరం నన్ను భూతంలా భయపెట్టేది. అంత పిచ్చిగా నమ్మేదానిని వినాయకుడిని. కాలంతో పాటు నమ్మకమూ పెరుగుతూ వచ్చింది.
వినాయకుని విగ్రహం కొనటానికి ఎన్నెన్ని బజార్లు తిరిగేదానినో… కనుముక్కు తీరు బాగా లేవని ఓ బొమ్మను, బొజ్జ, హస్తాలు సరిగ్గా చెక్కలేదని ఓ బొమ్మను, విగ్రహమంతా అందంగా వుండీ మొహంలో ఏదో లోపం వుందని ఓ బొమ్మను, అన్నీ బావున్నా వేసిన రంగుల కాంబినేషన్ బాగా లేదని ఓ బొమ్మను నిరాకరిస్తూ నచ్చిన వినాయకుని బొమ్మ కోసం ఓపికగా ఎన్నెన్ని కొట్లు తిరిగేదానినో.
ఓ సంవత్సరం అన్నీ బావున్న మంచి సైజులో వున్న బొమ్మ దొరికాక, ఎలుక మొహం ఏమిటో కళ తప్పి కప్పలా కురచగా కరుచుకుపోయినట్టనిపించింది.
ఇంకా నయం.. కొనేసాక చూసాను కాదు. వెంటనే వద్దని వెనక్కి ఇచ్చేసాను.
అప్పటికి గంటన్నర నుండీ నా వెనకాలే సంచీ పట్టుకుని తిరుగుతున్న మావారు నీరసపడిపోయి “ఎలుకే కదే… వినాయకుడు రంగు రూపు బావున్నాడు కదా.. అడ్జస్టు అయిపోకూడదూ..” అన్నారు ఇంక నడవలేక.
“ఇంకా నయం… ఎలుకంటే స్వాములవారి వాహనమండీ.. అదెలా కుదురుతుంది” అన్నాను నేను.
“ఏదయినా, ఎలా వున్నా తరువాత నీళ్ళల్లో నిమజ్జనం చేసేదే కదా…” అంటూ నసిగారు ఆయన. గుడ్లురిమి చూసాను. వినాయకుని పైన నా వ్యామోహం తెలిసిన ఆయన కిక్కురుమనకుండా నాతో మరో నాలుగు బస్తీలు తిరిగారు.
ఎందులోనయినా సర్దుకుంటానేమో కాని నా గణేశుని విషయంలో కంప్రోమైజ్ అయ్యేది లేదు.
ప్రతి సంవత్సరం పూజా విధానం పుస్తకం నేనే చదవటం వలన దాదాపుగా ప్రార్థన, పత్రపూజ, అష్టోత్తరశతనామావళి, వినాయకుని దండకం, కథ, మంగళ హారతులు అన్నీ నా మెదడులో నిక్షిప్తమయిపోయాయి. అంచేత అనర్గళంగా చదివేయగలను. తెలుగు చదవలేని నా పిల్లలు, చదవటానికి ఇష్టపడని మా వారు, మా అమ్మ, జాతి మత భేదాలు లేని ఇరుగు పొరుగు ఆర్మీ వాళ్ళ పిల్లలు, అందరూ ఒబ్బిడిగా భక్తిగా మా పెద్ద హాలు నిండా కూర్చుంటే వినాయక వ్రత కల్పం పుస్తకం తాదాత్మ్యంతో లయబద్దంగా చదవటం ఒక అదృష్టంలా, అదొక దైవ సంకల్పంలా గర్వంగా ఫీలయ్యేదానిని. సుస్వరంలో లయబద్దంగా సాగే నా కంఠం కంచు మ్రోగినట్లు మైకు లేకుండానే ఇటు రెండిళ్ళలోనూ అటు రెండిళ్ళలోనూ వినిపించేది. కొందరు అలా నేను చదివిన కథ వినేసి నాలుగు అక్షింతలు నెత్తిన చల్లుకునేవారు.
అలాంటి నేను ఒకసారి వినాయకచవితి ముందు ఆస్ట్రేలియా బయిలుదేరాను. ఎటూ పండుగ ముందు వస్తున్నందుకు మా అమ్మాయి ఒక వినాయకుని చిత్రపటం, కథా విధానం పుస్తకం తీసుకు రమ్మంది. విగ్రహం కాకుండా చిత్రపటమేమిటని ఆశ్చర్యంగా అడిగాను.
“వినాయకుని పూజ క్యాలెండరుకి చేయరు… ప్రాణ ప్రతిష్ఠాపన, అర్చన, అభిషేకాలు విగ్రహానికి చేస్తారు..” కాస్త కోపంగానే అన్నాను.
“ఇమ్మిగ్రేషన్ మట్టి బొమ్మను అనుమతించరు… ఛాన్సు తీసుకోవటం ఎందుకమ్మా.. గోడకు తగిలించే/అంటించే వినాయకుని చిత్ర పటం తీసుకురా” అని అమ్మాయి సలహా ఇచ్చింది.
విఘ్నేశ్వరుని విగ్రహం తీసుకు వెళ్ళేది ఈ వినాయకుని భక్తురాలు… ఎవరు ఆటంకపరుస్తారో అదీ చూస్తాను అనుకున్నాను మనసులో.
అమ్మాయి మాట పెడచెవిన పెట్టి, ఏమైతే అయ్యిందని ధైర్యం చేసి, మంచి మేలిమి వర్ణాల కలయికతో అందంగా తీర్చిదిద్దినట్టున్న కళ్ళు, తొండం, బొజ్జ, చిట్టెలుకలతో, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కంటికింపుగా తయారైన గణపతిని ఒక చెకిన్ సూట్ కేసులో చుట్ట బెట్టుకుని ప్రయాణమయ్యాను.
అమ్మాయి పెట్టిన భయంతో ఇండియా నుండి మట్టి బొమ్మతో మన్ను తెస్తుందని ఎయిర్పోర్ట్ లో ఏ గొడవ ఎదుర్కోవలసి వస్తుందోనని ఆందోళనగానే వుంది.
అయినా నా స్వామి తనను తాను ఎలా గమ్యస్థానం చేర్చుకోవాలో ఆ మాత్రం ఎరుగడా అని ధీమా.
ఇమ్మిగ్రేషన్ చెక్ దగ్గర డిటెక్షన్ డాగ్‌ని పెట్టారు. ఆ శునక మహారాజును “జీవితమంతా నీ జాతికి ఎంతో సేవ చేసాను. కనికరించి నా దేవుడిని వదిలేయి” అని వేడుకున్నాను.
శునకం గారు మొదటి సూట్ కేసు చుట్టూ వాసనను ఎగ పీలుస్తూ రెండు ప్రదిక్షణలు చేసారు. వెంటనే అక్కడి స్టాఫ్ ఒకరు అనుమానంతో సూట్ కేసు తెరవమన్నారు.
గింజలన్నీ ఏరించి ప్యాక్ చేయించినప్పటికీ కొత్త చింతపండులో ఒక దిక్కుమాలిన గింజ వారి కళ్ళబడింది. ఆ గింజతో ఆస్ట్రేలియా నేలపైన చెట్టు మొలిపిస్తాననేమో వెంటనే ఐదు కేజీల చింతపండు చెత్త బుట్టలో పడేసారు.
డైరీ ప్రాడక్ట్లు తేవటం నిషిద్దమని కాచిన నెయ్యంతా నేలపాలు చేసేసారు.
స్వీట్ల డబ్బా పైన ‘మేడ్ విత్ ప్యూర్ ఘీ’ అన్న ఆంగ్ల వాక్యం పుల్లారెడ్డి స్వీట్లన్నింటినీ సర్వమంగళం చేయించేసింది.
అయినా నాకు కించిత్తు బాధ కూడా కలుగ లేదు. నా ఆలోచనంతా రెండో సూట్ కేసులో వున్న నా వినాయకుని గురించే. ఎలిఫెంట్ గాడ్ అంటూ పిల్లలు ఎదురు చూస్తున్న నా స్వామి విగ్రహం మటుకు పదిలంగా గమ్యం చేరాలని ఆ పూచీ ఆ స్వామికే అప్పగించేసాను.
శునకం గారు ఆ సూట్ కేసు వంక చూసీ చూడనట్టు ఓ లుక్కేసి తల తిప్పేసుకున్నారు. అంటే వారు ఆ సూట్ కేసుకి పచ్చ జండా ఊపారన్న మాట. ఇంక ఆ సూట్ కేసు తెరవ వలసిన అవసరం కలగలేదు.
ఆ పైన నన్ను నీడలా కాచే విఘ్నేశ్వరుడే స్వయంగా సూట్ కేసులో తనను స్కానర్ల బారిన పడకుండా కస్టమ్స్ క్లియరెన్స్ నుండి తప్పించుకుని ఎయిర్పోర్ట్ దాటేసాడు.
కస్టమ్స్ కళ్ళు కప్పి, సప్త సముద్రాలు దాటించి ఎంతో తెలివిగా ఆస్ట్రేలియాకి విగ్రహాన్ని తరలించేసిన నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు.
పిల్లలకు వినాయక జన్మ వృత్తాంతం, వినాయక శిరచ్ఛేదం, గజాననుడిగా రూపు దాల్చటం అన్నీ ముందుగానే ఆంగ్లంలో విశదీకరించి చెబుతుంటే సస్పెన్స్ త్రిల్లర్ స్టోరీలా వారు నోళ్ళు వెళ్ళబెట్టి విన్నారు. మరింత ఉత్సాహంగా పండుగ కోసం ఎదురు చూసారు.
తొలిసారి పరదేశంలో పిల్లలతో చవితి పూజను దిగ్విజయంగా చేయించాను. పిల్లల క్లాసు పుస్తకాలన్నీ పూజ దగ్గర పెట్టించాను. అయితే నేను కథ చదువుతుంటే అమ్మాయి ఆంగ్లంలో పిల్లలకు తర్జుమా చేయటం శివుని స్నేక్ గాడ్ అని వినాయకుడిని ఎలిఫెంట్ గాడ్ అని కథను ఆంగ్లంలో కథాకేళి ఆడించటం నన్ను చాలా బాధ పెట్టింది.
దిగులును దిగమింగుకుని పిల్లలతో శాస్త్రోక్తంగా పూజ చేయించాను. లయబద్దంగా దండకం ఆలాపిస్తుంటే అర్ధం తెలియకపోయినా పిల్లలు ఆనందపడ్డారు.
అలాగే అంతే పద్దతిగా గణేష నిమజ్జనం కూడా చేయాలని నిర్ణయించుకున్నాను.
కాని అమ్మాయి పగటి పూట నలుగురి ముందు గణేష నిమజ్జనం చేస్తే ఏమి విపత్తు వాటిల్లుతుందోనని చీకటి పడ్డాక చేయమన్నది.
స్వామిని వెలుతురులో ఆర్భాటంగా ఘనంగా కాకుండా చీకట్లో అక్రమంగా సాగనంపాల్సి రావటానికి చింతించాను.
నిర్విఘ్నంగా నిమజ్జనం చేసాను. అల్ప సంతోషిని… అర్ధరాత్రో అపరాత్రో మొత్తానికి నిమజ్జనానికి విఘ్నం కలగకుండా విఘ్నేశుడే కటాక్షించాడని తృప్తి పడ్డాను.
గణేష నిమజ్జనం చేసిన మూడో రోజున ఎఫ్బీలో అక్కడి రెసిడెంట్స్ గ్రూపులో నేను నిమజ్జనం చేసిన వినాయకుని బొమ్మ సాక్షాత్కరించింది.
ఏంటబ్బా అని అమ్మాయి మొబైల్లో ఆ పోస్టు చూసిన నా నోట మాట రాలేదు.
“ఇంద్రధనుస్సు వర్ణాలలో హేపీమాన్ను పోలిన ఈ విగ్రహం కుమేరా నది ఒడ్డున దొరికినది. హేపీమాన్ ఆకారానికి ఏనుగు తొండము కలిగిన, ఒక అడుగు ఎత్తు గల ఈ విచిత్ర విగ్రహమును పోగొట్టుకున్నవారు ఈ నంబరులో సంప్రదించగలరు… అనబెల్లా” అంటూ నా విఘ్నేశ్వరుని బొమ్మతో అనబెల్లా అనబడే ఆస్ట్రేలియా యువతి తన మొబైల్ నంబరు ఇచ్చింది.
ఆ పోస్టు చదివిన నేను శివనందనునికి వచ్చిన తిప్పలకు హతశురాలినయ్యాను.
పైగా వినాయకుడికి బ్యూటిపుల్, వెరీ యూనిక్, కలర్‌ఫుల్, క్యూట్ స్ట్రేంజ్ ఏలియన్ అంటూ ఆ పోస్టు కింద మళ్ళీ బోలెడు ప్రశంసలు, కమెంట్లు.
నా వినాయకుడిని సప్తసముద్రాలు దాటించి తీసుకువచ్చి ఓ చిన్న సెలయేటిలో దాచలేక పోయినందుకు ఎక్కడ లేని దుఃఖం కమ్ముకుంది నన్ను.
నా విఘ్నేశుడు ఆంగ్లేయుల ఇంట హేపీమాన్గా నామాంతరం చెంది స్థిరపడటం సహించలేక, మందిరంలో వుండాల్సిన వాడిని మద్యం గ్లాసుల మధ్య షో కేసుల్లో ఊహించలేక వెంటనే ఆ పోస్టులో ఇచ్చిన నంబరుకు అమ్మాయితో ఫోను చేయించాను.
ఒక విషయం మటుకు బాగా అర్ధమయ్యింది. Be Roman when you are in Rome అనే నానుడి ఊరికే రాలేదని….
(మళ్ళీ కలుద్దాం)

ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
24 Comments
Jhansi koppisetty
నా గొంతు విప్పిన గువ్వను ధారావాహికంగా ప్రచురిస్తున్న సంచిక సంపాదకులకు ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు


Nagalakshmidamaraju
వినాయకుడి గురించి, పూజ గురించి చాలా బాగా రాశారు. మొత్తానికి వినాయకుడు మీ దగ్గరకే వచ్చాడా….
Jhansi koppisetty
అవును నాగలక్ష్మిగారూ, నన్ను వదలటం ఇష్టం లేక తిరిగి తిరిగీ ఇంటికే వచ్చేసాడు…. ఇప్పటికీ పూజమందిరంలో కొలువై వున్నాడు


సిహెచ్.సుశీల
స్నేక్ గాడ్, ఎలిఫెంట్ గాడ్, చీకటిలో నిమజ్జనం…. హతవిధీ!
Jhansi koppisetty
హహహ….నిజమండీ సుశీలగారూ, నేనేమీ ఎగ్సాగిరేట్ చేయలా


పద్మాకర్
పిచ్చ కామెడీ పోస్టు. సీరియస్ మేటర్ తో.
Jhansi koppisetty
ధన్యవాదాలు పద్మాకర్ గారూ

Jogeswararao Pallempaati
చాలా గొప్ప అనుభవ సంఘటనమ్మా!
అసలుసిసలైన వినాయక వ్రతం …
“ఏ దేశమేగినా విగ్రహం ఎందుకాలిడినా పొగడరా ఆ తొండ బొజ్జ గణపయ్యను” అని
నిరూపించాడు, మీ ఇష్టదైవం! మా ఇంట్లో మా అమ్మాయి, వరలక్ష్మి ఇద్దరే పుస్తక పఠనం,
మేమంతా ఉండ్రాళ్ళూ, కుడుములూ, పూర్ణాలూ, పులిహోరా దండిగా తిని,
ఉదయం గారెలూ, సాయంత్రం పెరుగు గారెలూ తిని త్రేన్చడానికే పరిమితం!
అమెరికాలో రెండుసార్లు వినాయక చవితికి … నాదైన ప్రత్యేక ప్లాన్ తో మొదటిసారి …
ఇంటి వాటర్ ఫాల్లో నిమజ్జనం చెయ్యడం, రెండోసారి గుడి దగ్గర నీటి కొలనులో …
ఇండియన్స్ అంతా నిమజ్జనం చెయ్యడం చేశాం!
భలే వెరైటీ యధార్థ ఘటనని ఆసక్తికరంగా చెప్పారు, ధన్యవాదాలు!
శునకం ఎంత మంచి పని చేసిందో, మన తెలుగు సినిమాల్లో, మంచి పనుల్లా!
Jhansi koppisetty
ధన్యవాదాలు జోగేశ్వరరావుగారూ, అది ఆస్ట్రేలియాలో నా మొదటి వినాయకచవితి అనుభవం… ఇప్పుడు అలవాటు పడిపోయానులెండి అన్నింటికీ


రవిచంద్
తెలుగింటి సంప్రదాయ పండగను అస్ట్రిలియా లో ఉన్న మీ వాళ్ల తెలియచేసిన మీకు ధన్యవాదాలు… భక్తికి,పూజకి బాష అవసరంలేదు..భావం అర్ధం చేసుకుని ఆచార వ్యవహారాలను పాటిస్తే చాలు అనేదే నా అభిప్రాయం..ఇలాంటి తెలుగింటి పండుగలు ఇంకొన్ని కూడా అక్కడి వారికి చేయగలరు….తెలుగుని బాగా నేర్పించగలరు…
Jhansi koppisetty
ధన్యవాదాలు రవిచంద్ గారూ…
రవిచంద్
తెలుగింటి సంప్రదాయ ఇంకొన్ని కూడా అక్కడి వారికి నేర్పించగలరు….తెలుగుని బాగా నేర్పించగలరు
రవిచంద్
తెలుగింటి సంప్రదాయ పండుగలు ఇంకొన్ని కూడా అక్కడి వారికి నేర్పించగలరు….తెలుగుని బాగా నేర్పించగలరు
Sagar
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అనే గీతం గుర్తుకువస్తుంది మేడమ్ మీ రచనతో. మీరు భక్తిప్రతులతో తీసుకెళ్ళిన వినాయక ప్రతిమ అలా నిమజ్జనం కాకున్నా, మీ కర్తవ్యం మీరు చేశారు. మిగతా ఆ గణేషుడి దయ. మీరు వారానికి ఒకసారి విప్పుతున్న గొంతు. అపురూపం. మీకు ధన్యవాదములు మరియు అభినందనలు.
Jhansi koppisetty
ధన్యవాదాలు సాగర్ గారూ, ప్రతీ వారం క్రమం తప్పకుండా అభిమానంతో చదివి ప్రేమగా స్పందిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

Jhansi koppisetty
మీ స్పందనకు ధన్యవాదాలు రవిచంద్ గారూ

డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ..వినాయక విజయం
బాగుందండీ ఝన్సీ గారూ.
అభినందనలు.
Jhansi koppisetty
ధన్యవాదాలు డాక్టరుగారూ

Mannem sarada
హహ్హహా , భలే వుంది స్వామి ప్రయాణం. మొత్తానికి స్వామి మన ఇల్లు చేరేడా?
Jhansi koppisetty
హహహ…నిమజ్జనం చేసిన కుదరదని నన్నొదలనని తిరిగి ఇంటికి వచ్చేసాడక్కా


Sambasivarao Thota
Jhansi Garu!
Vinayaka vratham gurinchi chakkagaa vivarinchaaru..
Customs Clearance daggara mee anubhavaanni kalla mundu aavishkarinchaaru..
Chaalaa Baagundandi..
Meeku Abhinandanalu mariyu
Abhivandanalu
Jhansi koppisetty
ధన్యవాదాలు సాంబశివరావు గారూ

మొహమ్మద్. అఫ్సర వలీషా
మీ అనుభవాన్ని బాధను సంతోషాన్ని ఆవేదనను అన్నీ మిళితం చేసి చక్కని కధలా అల్లి ఆద్యంతం నవ్వు ల మయంగా వ్రాశారు నదిలో నిమజ్జనం చేసిన మీ ఆరాధ్య వినాయక స్వామి చివరకు మీ ఇంటి సుఖాంత తీరానికి చేరటం చాలా సంతోషాన్ని కలుగజేసింది ఝాన్సీ గారు ఆల్ ఇన్ ఒన్ అని నిరూపించారు ఈ ఎపిసోడ్ తో చాలా బాగా వ్రాశారు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు










మరోసారి మా కోసం విప్పబోయే మీ గువ్వ కోసం ఎదురు చూస్తూ శెలవు 
Jhansi koppisetty
Thank you for your lovely response వలీషా
