[శ్రీమతి లలితా చండీ రచించిన ‘కల్తీ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


కల్తీ రెండు అక్షరాల పదం
లోకంలో ఎన్నో కలుషితమై
విషయం విస్తృతమై విస్తరిస్తూ..
విషాదభరితమై వికటిస్తోంది
కలగలపులలో స్వచ్ఛత శూన్యమై
ఆరోగ్యం భంగమై
లాభం అనూహ్యమై..
జోడు అక్షరాలు కాగడలై
జగమంతా ప్రజ్వలిస్తున్నాయి.
సమ్మిళితం ఎప్పుడూ స్వాగతమే
మితంగా వుంటేనే మిత్రలాభం..
లేకుంటే జీవితమే దుర్భరం
మిశ్రితమే విషమైతే, అంతా విషాదమే
ఆహారంలో కల్తీ ఆరోగ్యానికి భంగం
ఆయుధాల లో కల్తీ దేశానికి భారం
ఔషధాలలో కల్తీ వైద్యానికి ప్రమాదం
స్నేహంలో కల్తీ నమ్మకానికి ద్రోహం
ప్రేమలో కల్తీ సంసారనికి శాస్తి
బాంధవ్యాలలో కల్తీ మమకారాలకు నాస్తి
కల్తీ లేనిదీ కానిదీ ఏదీ లోకంలో..

‘లలితా చండీ’ అనే కలం పేరుతో రచించే శ్రీమతి బి.లలితా కుమారి విద్యార్హతలు B.A, B.L. L.L.M, M.A జోతిష్యం (Phd). న్యాయవాద వృత్తిలో ఉన్నారు. సాహిత్యం ప్రవృత్తి.
‘సాహితీ రసజ్ఞ’ అనే పురస్కారం లభించింది.
చిన్నీలు కవితా సంపుటి.. మరియు త్వరలో ప్రచురణకు సిద్ధంమవుతున్న రెండు కవితా సంపుటాలు
1981లో డా. పోతుకూచి సాంబశివరావు గారి విశ్వసాహితీ సంస్థ ద్వారా కవిసమ్మేళనాల లోను అఖిల భారతరచయిత మహాసభలలో ఎన్నో సార్లు పాల్గొన్నారు. పలు పత్రికలలో కవితలు ప్రచురించ బడ్డాయి. లలితా భాస్కర దేవ్ అనే పేరుతో సాహితీ సిరికోన వాక్స్థలి పత్రికలో గత మూడు సంవత్సరాలుగా రాయడం ఒక అద్భుతమైన అనుభవం.
1 Comments
శ్రీధర్ చౌడారపు
కలగా పులగం గా ఉంది. కవితకు ఉండాల్సిన సరళత, భావంలో ఉండాల్సిన అదోలాంటి మార్మికత అగుపించలేదు. సరళ వచనం పాదాలలోకి అమరిపోయింది కానీ ఆత్మను పొందలేకపోయింది.
ఇంకాస్త శ్రమపడాలి మీరు…