కథ ఎలా చెప్పాలి, ఎవరు చెప్పాలి అనేవి కథకుడికి సవాల్ వంటివి. దీన్ని ఆధారం చేసుకునే రెండు రకాలైన కథన పద్ధతులు వచ్చినవి. మొదటిది సర్వసాక్షికథన పద్ధతి. దీనిని రచయిత చెప్పే పద్ధతి అంటారు. కథలోని సమస్తానికి కథకుడు సాక్షి. అన్నీ అతనికి తెలిసినట్లు కథ రాస్తాడు. కథలోని స్థలకాలాదులతో పాటు పాత్రల చలనం కూడా రచయితకు తెలిసి ఉండటంచే కథ సాఫీగా సాగుతుంది. అతడు, ఆమె అని సంబోధిస్తూ కథనం చేస్తాడు. దీన్ని ప్రథమపురుష కథనం అనవచ్చు. ఇంగ్లీష్‌లో థర్డ్ పర్సన్ నరేషన్ అంటారు. అందుకు భిన్నంగా రచయిత ఒక పాత్ర ద్వారానో, స్వయంగా తానే అయి “నేను”గా కథ చెబుతాడో దానిని ఉత్తమపురుష కథనం అంటారు. ఇంగ్లీషులో “ఫస్ట్ పర్సన్ నరేషన్” అంటారు. కేవలం సంభాషణలతోనే కథను నడిపే పద్ధతి కూడా ఒకటుంది. ఉత్తమపురుష కథనంలో తన అనుభవాన్ని చెప్పడం, ఇతరుల అనుభవాన్ని తనదిగా చేసుకొని చెప్పడం జరుగుతుంది. పాఠకుణ్ణి నమ్మించడానికి వీలైన మార్గం ఇది. “నేను” అనేవాడు కథకుడిగా ఉండి కథ రాయాలి. అంతేకాని పాత్రగా మారకూడదు. అంటే పరిశీలకుడిగా ఉండాలన్నమాట. ఈ విధానం సులువైనది. చాలా పరిమిత పరిధి కలిగినది. ఒక్కోసారి పాత్రగా మారి కూడా కథ చెప్పవచ్చు అది అర్థమయిన పాఠకుడు, ఇది రచయిత కథే అనుకొని చదువుతాడు. ఇలాంటి విధానంలో ఎక్కువ ఊహించి రాయలేము. తెలియని దాన్ని తెలిసినట్లుగా చెప్పలేము. మనకు మనంగా పరిమితి విధించుకోవడం వల్ల నేను అని కథ రాసినపుడు నేను ఎవరో ముందే చెప్పడం మంచిది.
రచయిత కథ లోపలి పాత్రగా కాకుండా, వెలుపల ఉండి, అన్నీ తెలిసినట్లుగా కథ రాస్తాడు. అతడు, ఆమె అనుకుంటూ, అందరి గురించి తెలిసినట్లు కథ చెపుతాడు. ఈ పద్ధతిని ప్రథమ పురుష పద్ధతి అంటారు. ఇంగ్లీష్‌లో “థర్డ్ పర్సన్ నరేషన్” అంటారు. కథకుడు అంతా తానై సర్వం తెలిసినవాడుగా చెపుతడు కనుక దీన్ని సర్వసాక్షి కథన పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో కథకుడికి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. అతని శక్తి మేరకు కల్పన చేసి రాయవచ్చు. రామాయణ భారతాలు సర్వసాక్షి కథనాలు. వ్యాసవాల్మీకాదులు తాము, భూతభవిష్యత్ వర్తమానాలు తెలిసిన వారిగా ఇతిహాసాల్ని రాసారు.
ఉత్తమపురుష కథకుడికి తెలిసింది తక్కువ. ఎంతవరకు రాయాలో తెలుసు. తరువాత జరిగేది తెలియదు. పరిమితుల మధ్య రాయడం సులువు కనుక కొత్త కథకులు మొదట్లో ఈ పద్ధతినే అనుసరిస్తారు. ప్రథమపురుష కథన పద్దతిలో రాసే కథకుడు ఎంత వరకు రాయాలో, ఏమి రాయాలో, ఊహించి రాయగలగాలి. అతడు జరిగిన దాన్నే కాక, జరగబోయేదాన్ని కూడా ఊహించి రాయాలి. హెలికాప్టర్లో ఆకాశ విహారం ఆనందాన్నిస్తుంది. పక్షి ఢీ కొడితే ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రయాణం ఎంత సున్నితమో అంత ప్రమాదకరము. ప్రథమపురుష కథనం కూడా అలాంటిదే. సంపూర్ణ స్వేచ్చ రచయితకుంటుంది. కథను ఏ వైపు తిప్పాలో, ఏ మేరకు నడపాలో, ఎక్కడ మలుపు నివ్వాలో, ఎలా ఘర్షణను పుట్టించాలో, ఏ సమయంలో సంభాషణల్ని జరపాలో, పాత్రలకు ఎలాంటి గుణగణాల్ని ఆపాదించాలో, ఎలాంటి ముగింపునివ్వాలో, అసలు ముగింపు ఇవ్వాలో వద్దో, ఇలాంటి స్వేచ్ఛ ప్రథమ పురుష కథనాన్ని ఎన్నుకున్న కథకుడికి ఉంటుంది. నిపుణుడైన పైలట్ హెలికాప్టర్‌తో విన్యాసాలు చేయిస్తాడు. తను తృప్తిపడి, ఇతరులను సంతోషపరుస్తాడు. ప్రథమపురుష కథకుని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఉత్తమ పురుష కథనంలో “నేను” పాత్ర చనిపోతే కథ ముగుస్తుంది. ప్రథమ పురుష కథనంలో ఒక పాత్ర చనిపోయినా, ఇంకో పాత్ర చేత కథ నడిపే వీలు కథకుడికి ఉంటుంది. భారతంలో భీష్ముడు ముఖ్యపాత్ర. అతడు పడిపోయాక కూడా భీకర యుద్ధం జరుగుతుంది. కథ నడుస్తుంది. ఇలాంటి కథలో, కథకుడు మధ్యలో దూరి వ్యాఖ్యానం చేసే అవకాశం ఉంటుంది. కాని అది స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే అవుతుంది. అంతా తెలుసు, అన్ని తెలుసన్నట్లుగా రాస్తే సర్వ సాక్షి కథన పద్ధతి. అంతా తెలిసున్నా కొంత మాత్రమే చెబుతారు కొందరు కథకులు. దానిని పరిమిత సర్వసాక్షి కథన పద్ధతి అంటారు.
ఒక పెద్ద చౌరస్తా ఫోటో ఒకటుంది. అందులో బస్సులు, కార్లు, రిక్షాలు, దుకాణాలు, పోలీస్, బిచ్చగత్తె, కాలినడక వారు ఇట్లా అనేకం ఉంది. అందరి గురించి, అంతా తెలిసినట్లు రాయడం సర్వసాక్షి కథనం (ప్రథమపురుష కథనం). అందులో నుండి బిచ్చగత్తెను మాత్రమే తీసుకొని, తెలిసినట్లు చెప్పడం పరిమిత సాక్షి కథనం. సర్వసాక్షి కథనంలో అన్నీ తెలిసినట్లు రాస్తే, ఉత్తమపురుష కథనంలో ప్రధాన పాత్ర తానే అయినట్టు, పరిమితులు విధించుకొని కథకుడు కథ రాస్తాడు.
(మరోసారి మరో అంశంతో)
డాక్టర్ బి.వి.ఎన్. స్వామి గారి పూర్తి పేరు భైరవి వెంకట నర్సింహస్వామి. కోహెడ మండలం వరికోలులో లక్ష్మిదేవి-అనంతస్వామి దంపతులకు 1964 డిసెంబర్ 16న జన్మించారు. సుప్రసిద్ధ తెలుగు కథకులు, పరిశోధకులు.
2000 సంవత్సరం నుంచి విస్తృతంగా రాయడం ప్రారంభించారు. 2004లో తన మొదటికథా సంపుటిని ‘నెలపొడుపు’, మరో కథా సంపుటి ‘రాత్రి-పగలు-ఒక మెలకువ’ను 2013లో ప్రచురించారు. ‘అందుబాటు’ అనే పేర వెలువరించిన పరిశోధక గ్రంథం 2005లో వచ్చింది. కథలపై విమర్శనా వ్యాసాలు ‘వివరం’ పేర 2011లో, ‘కథా తెలంగాణ’ పేరుతో వచ్చిన వ్యాసాలు 2014లో వెలువరించారు. వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాకుండా సాహిత్యపరంగా కళాహంస పురస్కారం, పివి నర్సింహరెడ్డి సాహిత్య పురస్కారం, బొందులపాటి సాహిత్య పురస్కారం వంటి అవార్దులు పొందారు. శ్రీకాకుళం కథానిలయంలో శ్రీ కాళీపట్నం రామారావు గారి సత్కారం కూడా పొందారు.
The writers broad analysis of story writing is good. Hope to write more articles on story writing.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™