ఈ రోజు మరో మంచి లఘు చిత్రం.సినిమాకి ఒక సూత్రం ఏ ఒక్క ఫ్రేం అనవసరంగా వుండకూడదు. వ్యర్థ పదం లేని కవితలా వుండాలి. ఈ రోజు నా డ్యూటీ లో భాగంగా కొన్ని మంచి చిత్రాలు చూసాను. కానీ అవి కథ మొత్తం చెప్పాల్సివచ్చే లఘు చిత్రాలు. బాగున్నా వాటి జోలికి పోలేదు. ఇప్పుడు ఈ లాస్ట్ అనడ్ హౌండ్ చూస్తుంటే కథ లాంటిదేమీ కనబడదు. మొదటి నాలుగు నిముషాలూ ఒక్కతే పాత్ర. చాలా చాలా నెమ్మది కథనం. ఆ తర్వాతి రెండు నిముషాల్లో మరో పాత్ర వచ్చినా కథనం ఇంకా నెమ్మదిగానే వుంది. ఏవో పాత “ఆర్ట్ ఫిలింస్” చూసి స్లో కథనం ఒక భూషణం అనుకుని ఎవరో కుర్ర దర్శకుడు ప్రయత్నిస్తున్నాడేమో అనిపించింది. కానీ కాదు. సినిమా మొత్తం అయ్యాక మరలా మొదటి ఆరు నిముషాలు చూసాను.వూరు చివర ఓ పెద్ద బంగళా. ఇంటికి దూరంగా వో పంప్ హౌస్. దాని ముందు కట్టేసిన ఓ కుక్క. ఆమె దూరంగా ఇంటికి తాళం వేయడం చూసి ఆ మగ కుక్క (దాని పేరు మహేష్) ఒక పక్క తోకాడిస్తూనే అరుస్తూ వుంటుంది. ఆ నడివయస్సామె వచ్చి కుక్క ముందు గిన్నె పెడుతుంది. అది సంతోషంగా తింటుంది. ఆ తర్వాత ఆమె తిరిగి ఇంటికి వెళ్ళి వంటగదిలో కెళ్ళి ఓ ప్లేట్ లో రెండు చపాతీలూ, ఇంత కూరా పెట్టుకుని హాల్లోకి వచ్చి గుండ్రటి (అవును గుండ్రటి) బల్ల మీద పెడుతుంది. వంట గది తలుపు గడియ వేసి. పక్కనే వున్న మరో గది తలుపు కూడా వేస్తుంది. కిటికీ కర్టెన్లు లాగుతుంది, ఆ కాస్త వెలుతురు కూడా రాదు. ఆ గదిలో వో అందమైన పైంటింగ్ వుంటుంది. దీపం సెమ్మె ముందు నిలబడ్డ ఓ స్త్రీ. ఆమె ఆ ఫ్రేం పక్కన మీట నొక్కగానే ఆ సెమ్మె వెలుగుతుంది. అదే బంగళా ఆవరణలో మనాడు ఉదయం దృశ్యం. పరదాలు తీస్తుంది. హాల్లో వో పక్క వున్న బన్సాయ్ మొక్కకి తీగలు కట్టి వుంటాయి, ఎదుగుతున్న చెట్టుకు అవసరమైనంత మేరా ఆ తీగలు మరింత బిగించుతుంది. గేట్ దగ్గర స్కూటర్ చప్పుడుకి కుక్క మొరగడం మొదలుపెడుతుంది. కిటికీ కిటికీ తెరిచి బయట చూస్తుంది.ఓ అబ్బాయి స్కూటర్ మీద వచ్చి ఆర్డరిచ్చిన సామాన్లు తెచ్చి ఇస్తాడు. ఒక్క ఆలివ్ ఆయిల్ లేదు, రేపు తెస్తానంటాడు. “సైరాట్” (అవును సైరాటే) చిత్రాన్ని మూడోసారి చూడటానికి వెళ్ళే తొందరలో వున్న అతన్ని కూర్చోమని చెప్పి లోపలినుంచి కేకు ముక్క తెచ్చిపెడుతుంది. తన కొడుకు పుట్టినరోజు అంటుంది. అమెరికా కొడుకా అని అడిగితే కాదు చిన్న కొడుకు అంటుంది. ఆ కుర్రాడికి ఏం మాట్లాడాలో తోచక వూరుకుండి పోతాడు. అతన్ని బయట వో నవారు మంచం మీదే కూర్చోబెట్టి వుంది.ఆ కుర్రాడు వెళ్ళాక ఇద్దరు వస్తారు. అతను ఓ సబ్ ఇన్స్పెక్టర్. ఆమె ఒక కాన్స్టేబల్. ఇంత దూరం ఈ “బద్లాపుర్”కు (అవును బద్లాపుర్ పేరే) ఎందుకొచ్చారు, ఫోన్ చేస్తే సరిపోయేదిగా అంటుంది. చేసాము, మీరు ఫోన్ తీయలేదు అంటాడు. నిజమే. మొదట్లో ఆమె ఒక కొత్త (అవును ఒక కొత్త) మొక్కను నాటుతూ వుండగా ఇంట్లో లేండ్ లైన్ ఫోన్ రెండు సార్లు మోగడం దర్శకుడు చూపించి వున్నాడు. సరే మీ ఇద్దరిలో ఒక్కరు లోపలికి రావచ్చు అంటుంది. బయట ఆ నవారు మంచం మీద ఆమె కూర్చుంటే, సబ్ ఇన్స్పెక్టర్ లోపలికెళ్తాడు.ఆ నడివయస్సామె చిన్న కొడుకు, పేరు మనన్,(పేర్లన్నీ ఆలోచించి పెట్టారు) నాలుగేళ్ళుగా కనబడట్లేదు. పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. కానీ ఇప్పటి దాకా దొరకలేదు. ఇప్పుడు కూడా ఏవో వస్తువులూ, కొన్ని ఫొటోలు తీసుకు వచ్చాడీ కొత్త సబ్ ఇన్స్పెక్టర్. ఒక శవం ఫొటోలు, identification కోసం. ఆమెకు కోపం వచ్చి తిడుతుంది, మీరు మా అబ్బాయిని వెతకమంటే వెతకరు గాని ఏ శవం దొరికినా ఫొటోలు తీసుకుని వచ్చేస్తారు అంటుంది.ఇప్పుడు కథ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య సంభాషణా చాలా విలువైనవి. పంప్ హౌస్ లోపలి నుంచి గ్లాస్ పడిన చప్పుడు వినిపించి ఆ కాన్స్టేబల్ సబ్ ఇన్స్పెక్టర్ తో చెబుతుంది. లోపల ఎవరన్నా వున్నారా? అసలు ఏం జరుగుతోంది?
ఇది మాత్రం మీరే చూడండి. యూట్యూబ్ లో వుంది.కథ చెప్పడం లేదు కాబట్టి కొన్ని కొన్ని నేను చర్చించలేను. అయితే ధ్వని, మానసిక ఆవరణ, అలవాటు, నియంత్రణ, ఒంటరితనం తాలూకు భయం, బాన్సాయ్ చెట్టు, కుక్కకు కట్టిన చైను, వసారాలో వాల్చి పెట్టిన నవారు మంచం, పరదాలు, గుండ్రటి బల్ల లాంటివి ఈ కథకు సంబంధించినంతవరకూ వ్యాకరణాంశాలు. అవును, అనవసరమైన ఫ్రేమే ఏదీ లేదు ఇందులో. సాధ్యా సాధ్యాలు కాసేపు పక్కన పెట్టండి. తీరిగ్గా తర్వాత హిచ్కాక్ చిత్రం ఒకటి తలచుకుని, ఇష్టమనిపిస్తే దాన్ని మరలా చూడండి.మనం ఎవరన్నా తప్పిపోతే, లేదా కనిపించకపోతే పోలీసుకు ఫిర్యాదు చేస్తాము. లాస్ట్ కేస్. దొరికితే అది లాస్ట్ అండ్ ఫౌండ్ కేస్ అవుతుంది. లేదంటే లాస్ట్ అండ్ నాట్ ఫౌండ్ కేస్ అవుతుంది. కానీ ఈ చిత్రం లాస్ట్ అంద్ హౌండ్. అదేదో షెర్లాక్ హోంస్ హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ లాగా. ఏమిటో?సునందా లత్కర్ నటన బాగుంది. దర్శకుడు జగదీశ్ మిశ్రా, అతని టీం లో అందరూ కలిసి ఒక మంచి చిత్రాన్ని తయారు చేసారు. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. కొత్తగా షార్ట్ ఫిలింస్ తీయాలనుకుంటున్న వారికి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ లాంటి చిత్రం.~ ~యూట్యూబ్ లింక్:https://www.youtube.com/watch?v=5TD_2VOSw4s
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
చిత్రం చూడడానికి ఉత్సుకతరేపే పరిచయం. అది అంటే పరిచం ఎలా ఎంత ఏమిటి పరిచయం చేయాలో తెలిసిన పరిచయకర్త.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™